నా కాశీ యాత్ర-4

 


మా వియ్యంకులది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  అయోధ్య పొరుగు జిల్లా. వారు హైదరాబాదులో మా ఇంటికి వచ్చినప్పుడు కోస్తా మీదుగా తిరుపతి యాత్ర చేసాం. దానికి కృతజ్ఞతగా వారు మమ్మలి వారింటికి రమ్మనమని, వస్తే వారికి బాగా దగ్గరగా ఉండే కాశీ, అయోధ్య చూపుతామని చాలా సార్లు పిలిచినా కుదర్లేదు. చివరకు మార్చి 5న రథం కదిలింది. మొదటగా ప్రయాగ రాజ్, తరువాత వరుసగా వారణాశి, సారనాథ్, అయోధ్య, గోరఖ్‌పూర్, కుశీ నగర్‌లను చూసొచ్చాం. మధ్యలో వచ్చిన హోళీ పండగ వియ్యంకుల ఊళ్ళోనే జరుపుకున్నాం. ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని చూసే అవకాశం లభించింది. అయితే ఆదరాబాదరాగా కాకుండా నింపాదిగా 16 రోజులు అన్నీ తిరిగొచ్చాం.

మా యాత్రా విశేషాలతో మిమ్మల్ని విసిగించే ప్రయత్నం కాదిది. మీకు ఇవి కొట్టిన పిండే. 

ఒక జర్నలిస్టుగా నా పరిశీలనలో నాకు కొత్తగా, విశేషంగా అనిపించినవి కొన్నయితే, కొన్ని భ్రమలు తొలగించేవి కాగా, మరికొన్ని రాజకీయంగా, సామాజికంగా ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి పురిగొల్పేవి.. 

అయితే ఇది కూడా సాధ్యమయినంత క్లుప్తంగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా.....  వారి హోళీ పండుగ

 

4. హోళీ ఉత్తర భారతంలో భిన్నంగా.. కాశీలో విభిన్నంగా

హైదరాబాదులో, తెలంగాణలో హోళీ ఆడతాం, పండుగ జరుపుకుంటాం.అయితే ఎక్కడో అంతరాంతరాల్లో ఇది మన పండుగకాదు, ఉత్తరాదివారిదన్న భావన కదులుతుంటుంది. అక్కడి వారు చెప్పిన దానిని బట్టి మనం జరుపుకునే హోళీపై ..రాజస్థానీయుల, అంటే మార్వాడీల ప్రభావం ఎక్కువ-అని.

వసంతరుతువు రాకకు సూచనగా దేశంలోని చాలా ప్రాంతాల్లో  పవిత్రంగా హోళీ పండుగను జరుపుకుంటారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే అయోధ్య పరిసరాల్లో ఒకలాగా, మధురలో ఒక లాగా, వారణాశిలో మరో రకంగా జరుపుకుంటారు. మధురలో రాధాకృష్ణుల ప్రేమను తెలుపుతూ ఫిబ్రవరిలో వచ్చే వసంత పంచమినుండి హోళీ పున్నమ్ వరకు హోళీ కేళి జరుపుకుంటారట.. చాలా హృద్యంగా ఉంటుందట.

మేం జరుపుకున్న ఊళ్లో అయితే...ఇంచుమించు ఆ ప్రాంతమంతా... హోళీ ముందు రోజు అర్థరాత్రి...హోళికా దహనం ఉంటుంది. అక్కడికి ఆడవారు పోరట. పొద్దున్నే మగవాళ్లు వెళ్ళి అక్కడ భస్మాన్ని నుదుటిపై పులుముకొని దగ్గర్లో ఉన్నఆలయాలకు వెళ్ళి అక్కడి దేవతా మూర్తులకు కూడా పులిమి... కొంత ఇంటికి తెచ్చి ఆడవారికిస్తారు. వారు దానికి గులాల్ కలిపి పూజా మందిరంలో చల్లుతారు. ఆ తరువాతే ఒకరికి మరొకరు గులాల్ పూసుకుంటూ సంబరాలు మొదలవుతాయి. దీనిని ఛోటీ హోళీ అని రంగ్ వాలీ హోళీ అని కూడా అంటారు.

ఆ సాయంత్రం.. ఇక్కడ తెలంగాణలో దసరా నాడు  బంధుమిత్రులను  కలిసి వెండిబంగారం (జమ్మి ఆకు) ఇచ్చిపుచ్చుకున్నట్లుగానే... అక్కడ అందరూ ఒకరింటికి మరొకరు పోయి కలిసి మిఠాయిలు పంచుకుంటారు. వీటిలో హోళీ సందర్భంగా తప్పనిసరిగా చేసే స్వీటు గుజియాలు (కజ్జికాయలు).

దక్షిణాదిన కామదహనం జరుపుకుంటాం. శివుడు మూడో కన్ను తెరవడంతో కాముడు భస్మమవుతాడు. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో... హోళికను దహనం చేస్తారు. హోళిక హిరణ్యకశిపుడి సోదరి.  అన్న ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడిని చంపడానికి ఆ బాలుడిని ఒళ్లో పెట్టుకుని అగ్నిప్రవేశం చేస్తుంది. అగ్ని వల్ల ఎటువంటి హాని కలగకుండా వరం పొందానన్న ధీమాతో దూకుతుంది. కానీ అగ్నిదేవుడు  ఆ రక్షణ కవచాన్ని ఆమెకు ఉపసంహరించి, ప్రహ్లాదుడికి ఇవ్వడంతో... ఆమె అగ్నికి ఆహుతవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఇది చెడుపై మంచి సాధించిన విజయంగా హోళికా దహనం  జరుపుకుంటారు.

కాశీలో మశానా హోళీ...

కాశీలో ఫాల్గుణ శుక్ల ఏకాదశినాడు మొదలవుతుంది. దీనిని రంగ్ భరీ ఏకాదశి అని కూడా అంటారు. మణికర్ణికా ఘాట్ దగ్గరలోని కీనారామ్ ఆశ్రమం/మహాశంశాన్  నాథ్ మందిర్ లో మహా హారతి ఇచ్చిన తరవాత అక్కడి నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.  ‘ఖేల్ మశానే మేఁ హోళీ దిగంబర్’ అన్న నినాదాలు మారుమోగుతుండగా... పుర్రెలు, కపాల మాలలు ధరించిన నాగసాధువులు, అఘోరాలు ఒళ్ళంతా చితి భస్మాన్ని పులుముకుంటూ వెదజల్లుకుంటూ పెద్ద ఊరేగింపుగా బయల్దేరతారు. ఈఏడాది మార్చి 11న ఇది జరగగా దాదాపు 5 లక్షలమంది భక్తులు పాల్గొన్నారు.

వివాహానంతరం మహా శివుడు పార్వతిని  మొదటిసారి రంగ్ భరీ ఏకాదశి నాడు తన ఇంటికి... కాశీకి కాపురానికి తీసుకువస్తాడు. దీనిని గౌనా అంటారు. అంటే పునఃసమాగమం. ఆ ఆనందంలో శివుడు  నాట్యం చేస్తాడు. ఆ మరునాడు భూతగణాలకోసం శివుడు మణికర్ణికా ఘాట్‌కు పులిచర్మం, కపాలమాలలను ధరించి వచ్చి చితాభస్మాన్ని పులుముకుని వాళ్ళతో కలిసి నృత్యం చేస్తాడని బాబా మహా శంషాన్ మందిరం మేనేజర్ గుల్షన్ కపూర్ చెప్పాడు.  ఈ సంబురాలు హరిశ్చంద్రఘాట్ దగ్గర ముగుస్తాయి.( ఈ రెండు ఘాట్‌ల వద్ద నిత్యం పచ్చి శవాల దహనం జరుగుతూనే ఉంటుందట. ఇప్పటివరకు అలా జరగని రోజులేదంటారు స్థానికులు)

దీనినే అక్కడ మశాన్ హోళీ అని, భభూత్ హోళీ అని కూడా అంటారు. ఇది కేవలం కాశీకే పరిమితం. మరో కథనం ప్రకారం యమ ధర్మరాజును ఓడించిన దానికి గుర్తుగా దీనిని జరుపుకుంటారని అంటారు. చావును ఆనందంగా ఆహ్వానించే ప్రదేశమని కాశీని మోక్షపురం అని కూడా పిలుస్తారట.

.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...