ఎండావానాలాగా .....
2025 మార్చి 6నుండి 19వతేదీ వరకు ... ప్రయాగ్ రాజ్‌తో మొదలైన యాత్ర వారణాశి, సారనాథ్, అయోధ్య, బస్తీ, గోరఖ్‌పూర్, కుశీనగర్‌తో ముగిసింది. ఇప్పటి వరకు ఇచ్చిన విశేషాలను చదివి స్పందించిన బంధుమిత్రులు, సామాజిక మాధ్యమాల స్నేహితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
🙏
ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో జరిగిన ఈ యాత్రలో సర్వసాధారణంగా అన్ని చోట్లా నాకు విశేషంగా కనబడిన మరికొన్ని అంశాలను క్లుప్తంగా ప్రస్తావిస్తా.
ü దక్షిణ
భారత దేశంలో శాలివాహనశకం క్యాలండరును అనుసరిస్తే, ఉత్తర ప్రదేశ్‌లో దీనితో పాటూ ఎక్కువగా
విక్రమశకం క్యాలండరును అనుసరిస్తారు. (భారత ప్రభుత్వం మార్చి 22, 1957 నుండి ధార్మిక
అవసరాలకు శాలివాహన శకం క్యాలండరును, అధికారిక కార్యక్రమాలకు గ్రిగేరియన్
క్యాలండరును పరిగణనలోకి తీసుకుంటున్నది)
ü ఉత్తర
భారతదేశంలో ఎక్కువగా మాట్లాడేది హిందీ అయినా తూర్పుఉత్తర ప్రదేశ్‌లో స్థానిక భోజ్‌పురి
మాట్లాడతారు. అది కూడా హిందీయే ... కానీ యాసతోపాటూ కొన్ని పదాలు వెంటనే అర్థం కావు. (గోరఖ్‌పూర్ లో 51.3.%
భోజ్‌పురి, 46.48% హిందీ, 2.02% ఉర్దూ మాట్లాడతారు). బస్సులమీదా, దుకాణాలు, గుళ్ళూగోపురాల
పేర్లన్నీ హిందీలోనే ఉంటాయి. ఇంగ్లీష్ ఎక్కడా కనబడదు.
ü వారణాశిలో
బనారస్ పాన్(కిళ్ళీ) చాలా ప్రఖ్యాతి చెందినదే అయినా అక్కడ ఉన్నప్పుడు తెలియలేదు. తరువాత తెలిసింది. రుచి చూడలేకపోయా.
ü దక్షిణభారతం
కాఫీకి, ఉత్తర భారతం టీకి అని ఒకప్పుడు అనేవారు. ఇప్పుడు మన దగ్గర చాయ్ దుకాణాలు
అడుగడుగుకూ కనిపిస్తాయి. అక్కడ అన్ని ఊళ్ళు తిరిగినా... ఏ ప్రాంతంలో అయినా చాయ్ కావాలంటే (కాఫీ ఎలాగూ దొరకదు)... ప్రయాసపడి
చాలా దుకాణాలు, హోటళ్ళు దాటుకుంటూ వెడితే ఒక చాయ్ దుకాణం ఉంటుంది. అక్కడ మనం చాయ్
ఆర్డరిచ్చిన తరువాత పాలు కాచడం, అల్లం దంచడం మొదలవుతుంది. కుల్హడ్(మట్టి
గ్లాసులు)లలో ఇస్తారు. బహుశా పాలు బాగా చిక్కగా ఉంటాయనుకుంటా... రుచి మార్వాడీ ఇలాచీచాయ్ లాగా అమోఘం అనలేం
కానీ... బాగుంటుంది..మట్టి వాసనతో...
ü దక్షిణ
భారత దేశంలో మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఉడిపి, తాజ్, కామత్ వంటి ... అంటే ఆ
స్థాయి రెస్టారెంట్లు ఎక్కడా కనిపించలేదు. కట్టెల పొయ్యి ముందువైపు, కస్టమర్లు కూర్చునే
భాగం వెనక వైపు ఉండే టైపు హోటళ్లే కనిపిస్తాయి, వెజ్ కయినా నాన్ వెజ్ కయినా....
సంపన్నులయినా, మధ్యతరగతి అయినా, పేదలకయినా అన్నీ అవే.(నేను చూసిన పరిమిత
ప్రాంతంలో).
ü శాకాహారం తాలూకు
ఐటమ్స్... ఇళ్ళల్లో అయినా, హోటళ్ళలో అయినా... ఎక్కువగా కనిపించేవి- కచోరీలు,
స్టఫ్డ్ పూరి/చపాతీలు...ఆలూ కర్రీతో, లేదా బెండకాయ సాగన్‌తో, సాగ్‌పైతా దాల్(మెంతి,
పాలకూర పప్పు), దాల్ తడ్ఖా.. స్వీట్లలో భుజియా(కజ్జికాయలు), పేటా(గుమ్మడి) ప్రత్యేకం ,...దూధ్ పేడా,
గులాబ్ జామూన్ మామూలే. ఆలుగడ్డ తాలూకు ఐటమ్స్ తప్పనిసరిగా ఉంటాయి... ఇంటాబయటా
ఎక్కడయినా... ప్రతిరోజూ...
ü ఉత్తర ప్రదేశ్‌లో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 19 విమానాశ్రయాలున్నాయి. మరో 5 రాబోతున్నాయి.. (గోరఖ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఢిల్లీనుండి రోజూ ఒకే ఒక విమానం వచ్చిపోతుంటుంది).
ü దేశంలో
అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. నార్త్ సెంట్రల్ రైల్వే,
ఈశాన్య రైల్వే, ఉత్తర రైల్వే డివిజన్ ప్రధానకేంద్రాలున్నాయి. 9,617 కి.మీ
రైల్వేలైను ఉంది. దేశంలో ఇదే అతి పెద్దది.
ü ఉత్తర ప్రదేశ్‌లో 12,490 బస్సులున్నాయి. మన ఆటోల్లో ముగ్గురికి పరిమితం. అక్కడ ఎక్కువ భాగం బ్యాటరీ ఆటోలు...వెడల్పు మన ఆటోలో మూడు వంతులు ఉంటుంది. నలుగురు ప్రయాణించవచ్చు.
ü చాలా చోట్ల
ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో అక్కడ రూల్స్ ఎవ్వరూ పాటించరు. అవి ఉంటాయని బహుశా పోలీసులకుకూడా
తెలియదేమో అన్నట్లుగా ఉంటుంది. (మన పాతబస్తీలోలాగే). నోరున్నవాడిదే (కండబలం/ధనబలం ఉన్నవాడిదే)
రాజ్యం.
ü ఎక్కువ విద్యా
సంస్థలున్న రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 6 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(వివి),
34 రాష్ట్ర వివి, 35 ప్రయివేటు వివి, 8 డీమ్డ్ వివి, 12 పరిశోధనా సంస్థలు, ఐఐటి, ఐఐఎం
వంటి 12 ఉన్నత విద్యా సంస్థలు, ప్రముఖ ఇంజనీరింగ్,
ప్రఖ్యాత మెడికల్ కళాశాలలు... ఇలా చాలా ఉన్నాయి,
ü మౌలిక సౌకర్యాలు, విద్యా సంస్థలు ఇంతగా అభివృద్ధి చెందిన ఒక ప్రముఖ రాష్ట్రం, రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన రాష్ట్రంలో... వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నేను తిరిగిన అన్ని ప్రదేశాల్లో ఎక్కువగా కనిపించాయి. .. దీనికి గోరఖ్‌పూర్ ఎక్స్ ప్రెస్ ఒక ప్రబల సజీవ ఉదాహరణ. దీనిలో అత్యధిక శాతం ప్రయాణికులు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధికోసం వచ్చిపోయే అక్కడి నిరుద్యోగులు, చిరుద్యోగులు, వలస కార్మికులే.
అటు(ఉత్తరప్రదేశ్, బీహార్‌ల వైపు) వెళ్ళే రైళ్ళు, బస్సుల ప్రయాణికులకు వారి బంధువులు ఒకటికి వందసార్లు హెచ్చరికలు చేస్తుంటారు(దారిదోపిడీలకు సంబంధించి)... అలాగే మా వాళ్ళు మాకూ చేసారు.
ü కొందరిని
పలకరించా... కర్నూల్లో కేక్ మాస్టర్ గా ఉద్యోగంలో చేరబోయే ఒక యువకుడు చెప్పిన
మాట..‘మాదగ్గర రు.10వేలు ఇస్తారు. కర్నూల్లో భోజనవసతులు ఇచ్చి రు.30వేలిస్తారు.
విజయవాడలో కూడా ఇంతే.. అయితే ఇంకొంత ఎక్కువే వస్తుంది అక్కడయితే...’
ü మరో
ముస్లిం యువకుడిని పలకరిస్తే... హైదరాబాదులో సెలూన్ లో పనిచేస్తాడట. ‘‘జీతం ఇచ్చి
పర్శంటేజీ ఇస్తారు ఇక్కడ. అక్కడ(గోరఖ్‌పూర్ లో) మాకు జీతం ఒక్కటే అదీ తక్కువే. పర్శంటేజి
ఇవ్వరు..’’ అన్నాడు.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఆగ్రా హేర్ కటింగ్ సెలూన్ పేరుతో వాళ్ళు సొంతంగా సెలూన్లు కూడా నడుపుతున్నారు.
ü ఆశ్చర్యం
ఏమిటంటే... స్వరాష్ట్రంలో ఉపాధి దొరకక దూరప్రాంతాల్లో ఉంటున్నా.... వీరెవరూ భార్యాబిడ్డలతో
బయటి రాష్ట్రాల్లో సెటిల్ కావడానికి ఇష్టపడడం లేదు.
ü ఉన్నఊళ్ళో కాస్తోకూస్తో పొలం ఉంటుంది. పొలంపనులన్నీ ఇంటి ఆడవాళ్లు చూసుకుంటారు. పని వేటలో మగవాళ్ళు
ఢిల్లీ, బొంబాయి, బెంగళూరు, హైదరాబాదు వంటి ప్రదేశాలకు వెడతారు. పండగలకు, పబ్బాలకు వెళ్ళి కుటుంబాలతో
గడుపుతారు.
..........................
నా కాశీ యాత్ర - 1 (ప్రయాగ రాజ్‌లో...రాజకీయం)
https://rajabhayya.blogspot.com/2025/04/1.html?spref=tw
నా కాశీ యాత్ర-2 (వారణాశిలో.. అయోమయం)
https://rajabhayya.blogspot.com/2025/04/2.html?spref=tw
నా కాశీ యాత్ర-3 (అయోధ్యలో... అపచారం)
https://rajabhayya.blogspot.com/2025/04/3.html?spref=tw
నా కాశీ యాత్ర-4 (స్మశాన భస్మంతో కాశీలో హోళీ...)
https://rajabhayya.blogspot.com/2025/04/4.html?spref=tw
నా కాశీ యాత్ర-5 (నాథ్ సంప్రదాయం)
https://rajabhayya.blogspot.com/2025/04/5.html?spref=tw
నా కాశీ యాత్ర-6 (గీతా ప్రెస్-గోరఖ్‌పూర్)
https://rajabhayya.blogspot.com/2025/04/6.html?spref=tw
...................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి