గీతా ప్రెస్-గోరఖ్‌పూర్
(గీతా ప్రెస్ అంటే గోరఖ్‌పూర్, గోరఖ్‌పూర్ అంటే గీతా ప్రెస్.. అంతటి ఖ్యాతి దానిది...అందుకని నేను గోరఖ్‌పూర్ పర్యటనమీద ఎక్కువ అంచనాలు పెట్టుకున్నా. అయితే అంతకంత నిరుత్సాహపడాల్సి వచ్చింది.
కారణం-నా ఫస్ట్ లవ్ జర్నలిజం కాగా, నా సెకండ్ లవ్ ప్రింటింగ్ ప్రెస్. 1923నుండి అలుపన్నది లేకుండా నడుస్తున్నగీతా ప్రెస్ విషయంలో నా ఆసక్తి... కేవలం వారి ప్రచురణలమీద మాత్రమే కాదు. టెక్నికల్‌గా, ఆర్థికంగా ఆ సంస్థ అప్పటినుంచి ఇప్పటివరకు అభివృద్ధి చెందిన పరిణామ క్రమం- ఆ క్రమంలో వ్యవస్థాపకుల స్వీయ అనుభవాల మీద కూడా...
నా అంతరంగాన్ని
ఇంతకంటే స్పష్టంగా ఇంగ్లీషు, హిందీల్లో
ఒకటికి పదిసార్లు వందరకాలుగా అక్కడి మేనేజర్‌కు మొరపెట్టుకున్నా. ‘‘అటువంటి
సమాచారమేదీ మా దగ్గర లేదు. చెప్పగలిగిన వారూ లేరు’’.. అని అంతే స్పష్టంగా
ప్రకటించి..నా ఉత్సాహం మీద నీళ్ళుకుమ్మరించేసాడు.
తరువాత కలుగుల్లో ఎలుకలా దూరి వెతికితే ఆ మేనేజరు నిస్సహాయతకు జవాబు దొరకడమే కాదు, ఆ సంస్థ, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఉన్నతాశయాలు, సమున్నత భావాలు ఒక్కొక్కటిగా తెలిసాయి... అవే ఇవి)
(గీతా ప్రెస్ పరిణామక్రమం వివరించే పుస్తకం ఒకటి ఉందని తెలిసింది. అయితే దానిని గీతా ప్రెస్ ప్రచురించలేదు. వారికి వారి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎవరో అభిమాన ప్రచురణకర్త దీనిని ప్రచురించారట. ఆ ప్రచురణకర్త చిరునామా దొరకడం లేదు)
ఆ గీత... భగవత్ + గీత
ఆ సమున్నతాశయాలు
ఆవిష్కరించే ముందు- గీతా ప్రెస్ హ్రస్వ రూపం, విశ్వ స్వరూపం రెండూ క్లుప్తంగా
చూద్దాం. మార్చి, 2024 వరకు అందిన గణాంకాల ప్రకారం గీతా ప్రెస్ ఇప్పటివరకు 94.78 కోట్ల పుస్తకాలను (మాసపత్రిక కాపీలతో సహా) అమ్మింది. దీనిలో 16.21 కోట్లు భగవద్గీత కాపీలుకాగా, 11.73
కోట్లు గోస్వామి తులసీదాస్ (రామచరిత మానస్ రచయిత) రచనలు. 11కోట్ల పుస్తకాలు
పిల్లలకు నైతిక విలువలు బోధించేవి. ఇవన్నీ సంస్కృతంతో సహా14 భాషల్లో ప్రచురించారు. హిందూ మత గ్రంథాల
ప్రచురణ సంస్థల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది.
కరోనా
మహమ్మారి ప్రపంచ మార్కెట్లను కుదిపేసినా, సోషల్ మీడియా కచ్చకొద్దీ సంప్రదాయ మాధ్యమాల మార్కెట్లను తొక్కేస్తున్నా, జిఎస్‌టీలు, నోట్ల రద్దు వంటివి స్టాక్ ఎక్ఛేంజీల్లో
ప్రకంపనాలు సృష్టిస్తున్నా.... గీతా ప్రెస్ గ్రాఫ్ నిబ్బరంగా అలా పైపైకి పోవడం అందర్నీ
ఆశ్చర్య చకితుల్ని చేసింది. అమ్మకాలు
2016లో-రు.39కోట్లు, 17లో రు.47 కోట్లు, 18లో రు.66కోట్లు, 19లో రు.69 కోట్లు,
2021లో రు.78 కోట్లు. ఇక వీరు ప్రచురించే కళ్యాణ్ మాస పత్రిక ప్రస్తుతం 1.6 లక్షల కాపీలు ముద్రిస్తున్నారు. దీనికి 21 హోల్‌సేల్ దుకాణాలున్నా, చిల్లర దుకాణాలు ఐదుకు మించి
లేవు. 43 రైల్వే స్టేషన్లలో మాత్రం స్టాల్స్ ఉన్నాయి.
ఇంత తక్కువ నెట్‌వర్క్ తో అంతటి అఖండ
విజయానికి కారణం – ఇది లాభాపేక్షలేని ధార్మిక సంస్థ. కాగితం, ముద్రణ వ్యయం ఎంత ఎక్కువగా
ఉన్నా... దానిలోని విలువైన సనాతన ధర్మ సమాచారం అందరికీ చేరవేయడానికి పుస్తకాలను చాలా
చౌకగా అమ్ముతారు. ఇక సేల్స్ ప్రమోషన్, మార్కెటింగ్ వ్యూహాలు, పబ్లిసిటీ బడ్జెట్లు
ఏవీ ఉండవు. నోటి ప్రచారం మీదే ఆధారపడతారు(అంటే ఒకటి కొని నచ్చినవారు మరికొంతమందికి
చెప్పడం ద్వారా జరిగే ప్రచారం). వారి పాలసీ ప్రకారం అడ్వర్టయిజ్మెంట్లు తీసుకోరు,
వేసుకోరు. విరాళాలకు కూడా ఆమడ దూరం. ఇతరుల నుంచి ఏ రూపంలో కూడా ఆర్థిక సహాయం తీసుకోరు. మరి అలా చేస్తే నష్టాలు రావా ??? .... రాక
ఎక్కడికి పోతాయి !!! మరి ఆ లోటు భర్తీ ఎలా
అవుతుంది ? అంటే వీరు నిర్వహించే ఇతర వ్యాపారాల లాభాలను దీనికి మళ్ళిస్తారు. ఇంతకూ ఆ
వ్యాపారాలేమిటో తెలుసా !!! గీతా వస్త్ర విభాగ్ ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం, గీతా
ఆయుర్వేద ద్వారా ఆయుర్వేద మందుల అమ్మకాల్లో వచ్చిన లాభాలే ఆ లోటు పూడుస్తున్నాయి.
వస్త్ర వ్యాపారి, ఆధ్యాత్మికచింతనా పరుడు కీ.శే. జయాదయాళ్‌జీ గోయెంద్‌కా 1923లో కలకత్తాలో ‘గోవింద్ భవన్ కార్యాలయ’ పేరిట ఒక ధార్మిక ట్రస్టు ఏర్పాటు చేసి హిందూ మతానికి సంబంధించిన పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు.. మరీ ముఖ్యంగా భగవద్గీతను ఇంటింటికీ చేర్చాలన్న తపనతో ప్రచురణలు మొదలుపెట్టారు. రు.600లు పెట్టి ఒక ముద్రణా యంత్రాన్ని కొని ప్రెస్ ప్రారంభించారు. అయితే ఆశించినంత ఆదరణ రాకపోవడంతో గోరఖ్‌పూర్‌లో 1927లో రు.10ల అద్దెకు ఒక ఇల్లు తీసుకుని ప్రెస్‌ను అక్కడికి మార్చారు. తరువాత భాయీజీగా అందరికీ తెలిసిన మరో సాహితీవేత్త హనుమాన్ ప్రసాద్‌జీ పోద్దార్ కళ్యాణ్ పత్రికకు శాశ్వత సంపాదకుడిగా చేరారు.
వీరి
సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2021 సంవత్సరానికి
‘గాంధీ శాంతి బహుమతి’కి గీతా ప్రెస్‌ను ఎంపిక చేసింది. అయితే అవార్డు
అందుకుంటాంగానీ దానితోపాటూ వచ్చే కోటి రూపాయల నగదు బహుమతి తీసుకోవడానికి మాత్రం ససేమిరా అన్నారు.
కారణం – విరాళాలు ముట్టకూడదనేది వారి విధానం కనుక.
ఉదయం
9గంటలకు ప్రెస్ తెరుస్తారని తెలిసి ఆ సమయానికి చేరుకున్న మమ్మల్ని అక్కడి దృశ్యం మరింత
ఆకర్షించింది. కార్మికులు, ఉద్యోగులు ఓ 15 నిమిషాలు చెప్పులొదిలేసి నిష్టతో ప్రార్థనలు
చేసిన తరువాత వారివారి పనుల్లో దూరారు. వందేళ్ళు దాటినా.. గీతా ప్రెస్, అధునాతన సాంకేతికతను ఒడిసి పట్టుకుంటూ దాని లక్ష్యాలను సులభంగా (ఆర్థిక ఇబ్బందులనుగురించి
ఆలోచించకుండా) సాధిస్తున్నది. దీని వెబ్‌సైట్ ద్వారా వీరి ప్రచురణలు కొనవచ్చు. కొన్ని
రకాల పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు. మరికొన్ని ఉచితంగా వినవచ్చు. ఇ-బుక్స్
ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి బహుళ జాతీయ మార్కెటింగ్ (ఆన్‌లైన్) వ్యవస్థల
ద్వారా ప్రపంచంలోని హిందువులకు మత గ్రంథాలను (క్లాసిక్స్ తో సహా) అన్ని భారతీయ
భాషల్లో, అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం వీరి వద్ద అమూల్యమైన 3500 రాతప్రతులు, వంద భగవద్గీత భాష్యాలున్నాయి.
(గీతా ప్రెస్ ఆర్థిక సమస్యలతో మూతపడిందనే ఒక వార్త సామాజికమాథ్యమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఈ విషయాన్ని మేనేజర్ దగ్గర ప్రస్తావిస్తే... 2000వ సంవత్సరంలో కార్మికులు జీతాలు పెంచమని డిమాండ్ చేస్తూ సమ్మె చేసారు. అప్పుడు 11రోజులు మూతపడింది. ఆ సమస్య అప్పుడే పరిష్కారమయింది. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు ఏ సమస్యా లేదు. ప్రెస్ సజావుగా నడుస్తున్నది ..అని వివరించారు.)
లీలా చిత్రమందిర్
గీతాప్రెస్
పై అంతస్థులోని పెద్ద హాలులో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసారు. కంటికి పండగే. ఇది
మిస్ కాకూడదు. భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి ఒక తైలవర్ణ చిత్రం. రామ, కృష్ణుల లీలావిలాసాలను తెలిపే 684 చిత్రాలు. ... అన్నీ ప్రముఖ చిత్రకారులవే. అవి ఎంతగా జీవం
పోసుకున్నాయంటే... ప్రతి చిత్రం దగ్గర కొన్ని నిమిషాలు ఆగిచూస్తుంటే... మిగిలినవి మిస్
అవుతామేమోనన్న ఆత్రుతలో అయిష్టంగానే ముందుకు కదలక తప్పని పరిస్థితిలో ఉంచుతాయవి.
.......................
ప్రెస్ ముఖద్వారం
చూడండి....ప్రఖ్యాత ప్రాచీన దేవాలయాలు గుర్తొచ్చే విధంగా తీర్చిదిద్దారు. ముందు కనిపించే
స్తంభాలు ఎల్లోరాను, కృష్ణార్జునుల రథం ఉన్న వృత్తం అజంతా గుహలను, పైన శిఖరం దక్షిణ
భారతదేశంలోని మీనాక్షీ దేవాలయ గోపురాన్ని గుర్తుకు తెస్తాయి.
లీలా చిత్రమందిర్
(దీనిలో గీతా ప్రెస్ తొలి ముద్రణా యంత్రాన్ని కూడ చూడవచ్చు)
నా కాశీ యాత్ర - 1 (ప్రయాగ రాజ్‌లో...రాజకీయం)
https://rajabhayya.blogspot.com/2025/04/1.html?spref=tw
నా కాశీ యాత్ర-2 (వారణాశిలో.. అయోమయం)
https://rajabhayya.blogspot.com/2025/04/2.html?spref=tw
నా కాశీ యాత్ర-3 (అయోధ్యలో... అపచారం)
https://rajabhayya.blogspot.com/2025/04/3.html?spref=tw
నా కాశీ యాత్ర-4 (స్మశాన భస్మంతో కాశీలో హోళీ...)
https://rajabhayya.blogspot.com/2025/04/4.html?spref=tw
నా కాశీ యాత్ర-5 (గోరఖ్‌పూర్)
https://rajabhayya.blogspot.com/2025/04/5.html?spref=tw
నా కాశీ యాత్ర-7(ధన్యవాదాలు)
https://rajabhayya.blogspot.com/2025/04/7.html?spref=tw
...................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి