నా కాశీ యాత్ర-1
మా వియ్యంకులది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య పొరుగు
జిల్లా. వారు మా ఇంటికి వచ్చినప్పుడు కోస్తా మీదుగా తిరుపతి యాత్ర చేసాం. దానికి కృతజ్ఞతగా
వారు మమ్మలి వారింటికి రమ్మనమని, వస్తే వారికి దగ్గరగా ఉండే కాశీ, అయోధ్య
చూపుతామని చాలా సార్లు పిలిచినా కుదర్లేదు. చివరకు మార్చి 5, 2025 న మా రథం కదిలింది. మొదటగా ప్రయాగ రాజ్, తరువాత
వరుసగా వారణాశి, సారనాథ్, అయోధ్య, గోరఖ్‌పూర్, కుశీ నగర్‌లను చూసొచ్చాం. మధ్యలో
వచ్చిన హోళీ పండగ వియ్యంకుల ఊళ్ళోనే జరుపుకున్నాం. ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు
ప్రాంతాన్ని(నేపాల్‌కు దగ్గర) చూసే అవకాశం లభించింది. అయితే ఆదరాబాదరాగా కాకుండా నింపాదిగా 16 రోజులు అన్నీ తిరిగొచ్చాం.
మా యాత్రా
విశేషాలతో మిమ్మల్ని విసిగించే ప్రయత్నం కాదిది. మీకు ఇవన్నీ కొట్టిన పిండే. నేను ఒక జర్నలిస్టుగా నా పరిశీలనలో నాకు
కొత్తగా, విశేషంగా అనిపించినవి కొన్నయితే, కొన్ని భ్రమలు తొలగించేవి కాగా,
మరికొన్ని రాజకీయంగా, సామాజికంగా ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి పురిగొల్పేవి.. అయితే
ఇది కూడా క్లుప్తంగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా.....
1.
ప్రయాగ్ రాజ్
గంగ, యుమున,
సరస్వతి(అదృశ్య) నదుల సంగమ ప్రదేశం ఇది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతం
కాలక్రమంలో పాలకుల ఇష్టానుసారం పేర్లు మార్చుకుంది. నదీ ప్రవాహ గతి కూడా మారిందని
చరిత్రకారుల అభిప్రాయం. నివాస ప్రదేశం కూడా కాస్త అటూ ఇటూ మారిందట. హిందువులు, బౌద్ధులు,
జైనులు, మహమ్మదీయులు, క్రిస్టయన్ల(బ్రిటీష్) అడుగుజాడలతో ప్రభావితమయిన ప్రాంతం. మొన్న మొన్నటివరకు ఇలాహా
బస్, ఇలాహాబాద్, అలహాబాద్ గా ఉన్న ప్రాంతం2018నుండి యోగి ఆదిత్యనాథ్ హయాంలోనే
ప్రయాగ్ రాజ్ అయింది. (గతంలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు పేరు
మార్పుకు ప్రయత్నం జరిగినా అది అప్పుడు సాధ్యపడలేదు).
యాత్రా స్థలమే
అయినా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాని వెబ్ సైట్ల ద్వారా.... ప్రజలకు అందించే
సమాచారంలోకానీ, టూరిజం శాఖ ఇచ్చే దర్శనీయ ప్రదేశాల జాబితాలో కానీ కొన్ని కొత్తగా
కనిపిస్తే, కొన్ని ముఖ్యమైనవి అస్సలు కనిపించడం లేదు. అలా నెహ్రూ కుటుంబాలకు
చెంది, వారు దేశ ప్రజలకు అంకితం చేసిన స్వరాజ్ భవన్, ఆనంద్ భవన్‌లు అక్కడి అదృశ్య
సరస్వతీనదీలాగా వాటిలో ఎక్కడా కలికానికి
కూడా కనిపించడం లేదు. ఈ రెండు భవనాలతో స్వాతంత్ర్య సమరం తాలూకు చరిత్ర చాలా ముడిపడి
ఉన్నా మాయం చేసేసారు.
వేలఏళ్ళ చరిత్రకు అద్దం పట్టే అలహాబాద్ మ్యూజియం ఉందక్కడ. అది చూసి తీరాల్సిన ప్రదేశం. అక్కడ కూడా స్వాతంత్ర్య సమర చరిత్రను చూపే చిత్రాల్లో తప్పనిసరయిన ఒకటి రెండు చోట్ల మినహా నెహ్రూ కుటుంబం తాలూకు చిత్రాలు పెద్దగా కనిపించలేదు. ఉన్నా..నామమాత్రంగానే ...స్వాతంత్ర్య సమర వీరుల ప్రాధాన్యతా క్రమం మారింది.
కుంభమేళా ముగిసిన
వారం రోజుల తరువాత చేరుకున్న మేము అక్కడ త్రివేణీ సంగమంలో స్నానాలు చేసాం. ఆ
సందర్భంలో సేకరించిన సమాచారం ప్రకారం....
·
కుంభమేళాను సందర్శించిన వారిలో 60-70% మంది
రెండు తెలుగు రాష్ట్రాల వారు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వారు మాత్రమే.
·
మిగిలినవారిలో 80-90% నాగసాధువులను,
అఘోరీలను సందర్శించడానికి, వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి, వారి సంప్రదాయాల్లోకి తమ కుటుంబ సభ్యులను
చేర్చాలనే ఆరాటంతోవచ్చిన వారు(స్థానికులు, ఇరుగు పొరుగు రాష్ట్రాలవారు) ఉంటారు.
·
చాలా దేశాలనుంచి, ఇతర రాష్ట్రాలనుంచి
వచ్చినా... వారి సంఖ్య చాలా పరిమితం.
·
వెళ్ళేటప్పుడు రు.10, రు20ల నోట్లకోసం వారం
రోజుల ముందునుంచీ హైదరాబాదులో ఎంత ప్రయత్నించినా దొరకలేదు. బాగా తెలిసిన
వారున్నా....చివరకు బ్యాంకులు కూడా చేతులెత్తేసాయి. దానికి కారణం అక్కడకు పోయిన
తరువాత తెలిసింది. మా టూర్‌లో ఎక్కడికి పోయినా అంతా చిల్లరే చిల్లర. నలిగినవి,
తడిసి ఆరినవి, రంగులు వెలిసిపోయినవి.. ఇలా
·
కుంభమేళా సందర్భంగా చాలా ముందుగానే అక్కడ
అత్యధిక భాగం పడవలను, హోటళ్ళను లీజ్‌మీద తీసుకున్న వారు, తాత్కాలిక శిబిరాలవంటి
పనులు దక్కించుకున్న వారు ఎక్కువగా గుజరాతీయులట.
·
అయితే ఒక నావికుడి(అక్కడ పడవలను నావలు లేదా
నౌకలనీ, పడవ నడిపే వాళ్లని నావికులని అంటారు) కథనం ప్రకారం- ‘‘ఆ సమయంలో.. ఆ 45
రోజుల్లో అన్ని వర్గాలవారూ సమృద్ధిగా సంపాదించుకున్నారు. బాహర్‌వాలా(టీలు
ఫ్లాస్కుల్లో తెచ్చి అమ్మేవాడు)నుంచి, పూసలు, రుద్రాక్షలు అమ్మేవాళ్ళవరకు అందరం ఒక జీవితానికి సరిపడా సంపాదించుకున్నాం.
నా మటుకు నేను, నా కుటుంబం మొత్తం... ఒక
తరం హాయిగా గడపగలిగినంత సంపాదించాం.’’ అని
వివరించాడు ఒకింత గర్వంగా.(నావికులు...నది ఒడ్డున స్నానాలు కాకుండా..కొంత దూరం
నదిలోపలికి తీసుకు వెళ్ళి...సంగమ ప్రదేశ ప్రాంతంలో మునకలు(స్నానం) వేయించి తీసుకు
వస్తారు)
·
కుంభమేళాకు ముందు 60 పడవలు లీజుకు
తీసుకున్న ఒక వ్యక్తి ఆ 45 రోజుల్లో.. రు.40కోట్లు సంపాదించినట్లు ముఖ్యమంత్రి
ఆదిత్యనాథ్ స్వయంగా ప్రెస్ మీట్లో ప్రకటించారు. ( నావికుడి లెక్క కూడా...ఒక పడవకు
ట్రిప్పుకు రు.5వేలు, రోజుకు కనీసం 30 ట్రిప్పుల చొప్పున 45 రోజులకు లెక్క ఇంచుమించుగా అదే)
·
కుంభమేళా సందర్భంగా చేసిన ఏర్పాట్లు
అద్భుతం అనే విషయం అందరూ అంగీకరించారు.
·
కుంభమేళా చివరి రోజున..ఫిబ్రవరి 26న
మధ్యాహ్నం వరకు 63 కోట్లమంది సందర్శించినట్లు అధికారికంగా తెలిపిన అన్ని టీవీ
ఛానళ్ళు... అదే రోజు రాత్రికి 66.3 కోట్లని ప్రకటించాయి, అదీ అధికారికంగానే... ఎలా
!!!
·
ఈ సందర్భంగా విరాళాలుగానూ, పలు రూపాల్లో
కేంద్రంనుంచి భారీ సహాయంగానూ అందగా... అదనంగా మేళా ముగిసేనాటికి రాష్ట్ర ప్రభుత్వ
ఖజానా పొంగిపొర్లిందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
·
అసలు ఏ ప్రచారార్భాటం లేకపోయినా 30-40
కోట్లమంది (మారిన ఎలక్ట్రానిక్ యుగంలో) మామూలుగానే దీనికి వచ్చి ఉండేవారు.
·
అయితే రాజకీయ లక్ష్యాలతో (వ్యాపార దృష్టితో ఆర్థిక లక్ష్యాలతో కూడా)
మితిమీరిన ప్రచారం చేసినందువల్ల జనం ఎగబడ్డారు. ఎంతగా అంటే...ఆఖరి రోజున విమాన
టిక్కెట్టు 8/9 రెట్లు పెంచినా లెక్కచేయకుండా వెళ్ళారు.
·
రాజకీయ లక్ష్యం – అన్నది నా మాట కాదు.
స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, కొందరు కేంద్ర మంత్రులు
బహిరంగంగా చేసిన ప్రకటనల సారాంశం అదే.
§ కుంభమేళా
విజయాన్ని పార్టీ మంత్రులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి..(ఎలా
అంటే గంగాజల్ పంపిణీ, విజయంపై చిన్న పుస్తకాల పంపిణీ, ఎగ్జిబిషన్ల నిర్వహణ,
సాంస్కృతిక కార్యక్రమాలు, చివరగా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి వివరించాలి )– అని
ఇటీవల యోగి చేసిన ప్రకటన అన్ని పత్రికల్లో వచ్చింది
§ ప్రముఖ
విద్యాసంస్థల్లోని ఈవెంట్ మేనేజ్ మెంట్ కోర్సుల్లో కుంభమేళా నిర్వహణ – ప్రధాని
§ దేశ
ప్రజలంతా ఒక్కతాటిపై ఉన్నారని కుంభమేళా రుజువు చేసింది – బిజెపి కి చెందిన కేంద్ర,
రాష్ట్ర మంత్రులు.
(ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమం. ఇదే మొదటిదీ కాదు,
చివరిదీ కాదు. గతంలో చాలా కుంభమేళాలు దశాబ్దాలు, శతాబ్దాలుగా ఎటువంటి
ప్రచారార్భాటం లేకుండా విజయవంతంగా జరిగాయి కదా ! అంటే సరిహద్దుల్లో సైనికుల విజయాల్లాగే, అంతర్జాతీయ
క్రీడల్లో క్రీడాకారులు సాధించిన పతకాల్లాగే,
ఇస్రో శాస్తవేత్తలు సాధించిన అద్భుతాల్లాగే... దీని ఘనతను కూడా ఒక రాజకీయ
పార్టీ దాని స్వంత ఖాతాలోకి ఎక్కించడమే కదా !)
...................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి