నా కాశీ యాత్ర-6 (గీతా ప్రెస్)

 

గీతా ప్రెస్-గోరఖ్‌పూర్

(గీతా ప్రెస్ అంటే గోరఖ్‌పూర్, గోరఖ్‌పూర్ అంటే గీతా ప్రెస్.. అంతటి ఖ్యాతి దానిది...అందుకని నేను గోరఖ్‌పూర్ పర్యటనమీద ఎక్కువ అంచనాలు పెట్టుకున్నా. అయితే అంతకంత నిరుత్సాహపడాల్సి వచ్చింది. 

కారణం-నా ఫస్ట్ లవ్ జర్నలిజం కాగా, నా సెకండ్ లవ్ ప్రింటింగ్ ప్రెస్. 1923నుండి అలుపన్నది లేకుండా నడుస్తున్నగీతా ప్రెస్ విషయంలో నా ఆసక్తి... కేవలం వారి ప్రచురణలమీద మాత్రమే కాదు. టెక్నికల్‌గా, ఆర్థికంగా ఆ సంస్థ అప్పటినుంచి ఇప్పటివరకు అభివృద్ధి చెందిన పరిణామ క్రమం- ఆ క్రమంలో వ్యవస్థాపకుల స్వీయ అనుభవాల మీద కూడా...

నా అంతరంగాన్ని ఇంతకంటే స్పష్టంగా ఇంగ్లీషు, హిందీల్లో  ఒకటికి పదిసార్లు వందరకాలుగా అక్కడి మేనేజర్‌కు మొరపెట్టుకున్నా. ‘‘అటువంటి సమాచారమేదీ మా దగ్గర లేదు. చెప్పగలిగిన వారూ లేరు’’.. అని అంతే స్పష్టంగా ప్రకటించి..నా ఉత్సాహం మీద నీళ్ళుకుమ్మరించేసాడు.

  తరువాత కలుగుల్లో ఎలుకలా దూరి వెతికితే ఆ మేనేజరు నిస్సహాయతకు జవాబు దొరకడమే కాదు, ఆ సంస్థ, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఉన్నతాశయాలు, సమున్నత భావాలు ఒక్కొక్కటిగా తెలిసాయి... అవే ఇవి)

(గీతా ప్రెస్ పరిణామక్రమం వివరించే పుస్తకం ఒకటి ఉందని తెలిసింది. అయితే దానిని గీతా ప్రెస్ ప్రచురించలేదు. వారికి వారి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎవరో అభిమాన ప్రచురణకర్త దీనిని ప్రచురించారట. ఆ ప్రచురణకర్త చిరునామా దొరకడం లేదు)

ఆ గీత... భగవత్ +  గీత

ఆ సమున్నతాశయాలు ఆవిష్కరించే ముందు- గీతా ప్రెస్ హ్రస్వ రూపం, విశ్వ స్వరూపం రెండూ క్లుప్తంగా చూద్దాం. మార్చి, 2024 వరకు అందిన గణాంకాల ప్రకారం గీతా ప్రెస్ ఇప్పటివరకు 94.78  కోట్ల పుస్తకాలను (మాసపత్రిక కాపీలతో సహా) అమ్మింది. దీనిలో 16.21 కోట్లు భగవద్గీత కాపీలుకాగా, 11.73 కోట్లు గోస్వామి తులసీదాస్ (రామచరిత మానస్ రచయిత) రచనలు. 11కోట్ల పుస్తకాలు పిల్లలకు నైతిక విలువలు బోధించేవి. ఇవన్నీ సంస్కృతంతో సహా14 భాషల్లో ప్రచురించారు. హిందూ మత గ్రంథాల ప్రచురణ సంస్థల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది.

కరోనా మహమ్మారి ప్రపంచ మార్కెట్లను కుదిపేసినా, సోషల్ మీడియా కచ్చకొద్దీ సంప్రదాయ మాధ్యమాల మార్కెట్లను తొక్కేస్తున్నా, జిఎస్‌టీలు, నోట్ల రద్దు వంటివి స్టాక్ ఎక్ఛేంజీల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నా.... గీతా ప్రెస్ గ్రాఫ్ నిబ్బరంగా అలా పైపైకి పోవడం అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది.  అమ్మకాలు 2016లో-రు.39కోట్లు, 17లో రు.47 కోట్లు, 18లో రు.66కోట్లు, 19లో రు.69 కోట్లు, 2021లో రు.78 కోట్లు. ఇక వీరు ప్రచురించే కళ్యాణ్ మాస పత్రిక ప్రస్తుతం 1.6 లక్షల కాపీలు ముద్రిస్తున్నారు.  దీనికి 21 హోల్‌సేల్ దుకాణాలున్నా, చిల్లర దుకాణాలు ఐదుకు మించి లేవు.  43 రైల్వే స్టేషన్లలో మాత్రం స్టాల్స్ ఉన్నాయి.

ఇంత తక్కువ నెట్‌వర్క్ తో అంతటి అఖండ విజయానికి కారణం – ఇది లాభాపేక్షలేని ధార్మిక సంస్థ. కాగితం, ముద్రణ వ్యయం ఎంత ఎక్కువగా ఉన్నా... దానిలోని విలువైన సనాతన ధర్మ సమాచారం అందరికీ చేరవేయడానికి పుస్తకాలను చాలా చౌకగా అమ్ముతారు. ఇక సేల్స్ ప్రమోషన్, మార్కెటింగ్ వ్యూహాలు, పబ్లిసిటీ బడ్జెట్లు ఏవీ ఉండవు. నోటి ప్రచారం మీదే ఆధారపడతారు(అంటే ఒకటి కొని నచ్చినవారు మరికొంతమందికి చెప్పడం ద్వారా జరిగే ప్రచారం). వారి పాలసీ ప్రకారం అడ్వర్టయిజ్మెంట్లు తీసుకోరు, వేసుకోరు. విరాళాలకు కూడా ఆమడ దూరం. ఇతరుల నుంచి ఏ రూపంలో కూడా ఆర్థిక సహాయం తీసుకోరు. మరి అలా చేస్తే నష్టాలు రావా ??? .... రాక ఎక్కడికి పోతాయి !!!  మరి ఆ లోటు భర్తీ ఎలా అవుతుంది ? అంటే వీరు నిర్వహించే ఇతర వ్యాపారాల లాభాలను దీనికి మళ్ళిస్తారు. ఇంతకూ ఆ వ్యాపారాలేమిటో తెలుసా !!! గీతా వస్త్ర విభాగ్ ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం, గీతా ఆయుర్వేద ద్వారా ఆయుర్వేద మందుల అమ్మకాల్లో వచ్చిన లాభాలే ఆ లోటు పూడుస్తున్నాయి.

వస్త్ర వ్యాపారి, ఆధ్యాత్మికచింతనా పరుడు కీ.శే. జయాదయాళ్‌జీ గోయెం‌ద్‌కా  1923లో కలకత్తాలో ‘గోవింద్ భవన్ కార్యాలయ’ పేరిట ఒక ధార్మిక ట్రస్టు ఏర్పాటు చేసి హిందూ మతానికి సంబంధించిన పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు.. మరీ ముఖ్యంగా భగవద్గీతను ఇంటింటికీ చేర్చాలన్న తపనతో ప్రచురణలు మొదలుపెట్టారు. రు.600లు పెట్టి ఒక ముద్రణా యంత్రాన్ని కొని ప్రెస్ ప్రారంభించారు. అయితే ఆశించినంత ఆదరణ రాకపోవడంతో  గోరఖ్‌పూర్‌లో 1927లో రు.10ల అద్దెకు ఒక ఇల్లు తీసుకుని ప్రెస్‌ను అక్కడికి మార్చారు. తరువాత భాయీజీగా అందరికీ తెలిసిన మరో సాహితీవేత్త హనుమాన్ ప్రసాద్‌జీ పోద్దార్ కళ్యాణ్ పత్రికకు శాశ్వత సంపాదకుడిగా చేరారు.

వీరి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2021 సంవత్సరానికి  ‘గాంధీ శాంతి బహుమతి’కి గీతా ప్రెస్‌ను ఎంపిక చేసింది. అయితే అవార్డు అందుకుంటాంగానీ దానితోపాటూ వచ్చే కోటి రూపాయల నగదు బహుమతి తీసుకోవడానికి మాత్రం ససేమిరా అన్నారు. కారణం – విరాళాలు ముట్టకూడదనేది వారి విధానం కనుక.

ఉదయం 9గంటలకు ప్రెస్ తెరుస్తారని తెలిసి ఆ సమయానికి చేరుకున్న మమ్మల్ని అక్కడి దృశ్యం మరింత ఆకర్షించింది. కార్మికులు, ఉద్యోగులు ఓ 15 నిమిషాలు చెప్పులొదిలేసి నిష్టతో ప్రార్థనలు చేసిన తరువాత వారివారి పనుల్లో దూరారు. వందేళ్ళు దాటినా.. గీతా ప్రెస్, అధునాతన సాంకేతికతను ఒడిసి పట్టుకుంటూ దాని లక్ష్యాలను సులభంగా (ఆర్థిక ఇబ్బందులనుగురించి ఆలోచించకుండా) సాధిస్తున్నది. దీని వెబ్‌సైట్ ద్వారా వీరి ప్రచురణలు కొనవచ్చు. కొన్ని రకాల పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు. మరికొన్ని ఉచితంగా వినవచ్చు. ఇ-బుక్స్ ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి బహుళ జాతీయ మార్కెటింగ్ (ఆన్‌లైన్) వ్యవస్థల ద్వారా ప్రపంచంలోని హిందువులకు మత గ్రంథాలను (క్లాసిక్స్ తో సహా) అన్ని భారతీయ భాషల్లో, అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం వీరి వద్ద అమూల్యమైన 3500  రాతప్రతులు, వంద భగవద్గీత భాష్యాలున్నాయి.

(గీతా ప్రెస్ ఆర్థిక సమస్యలతో మూతపడిందనే ఒక వార్త సామాజికమాథ్యమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఈ విషయాన్ని మేనేజర్ దగ్గర ప్రస్తావిస్తే... 2000వ సంవత్సరంలో కార్మికులు జీతాలు పెంచమని డిమాండ్ చేస్తూ సమ్మె చేసారు. అప్పుడు 11రోజులు మూతపడింది. ఆ సమస్య అప్పుడే పరిష్కారమయింది. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు ఏ సమస్యా లేదు. ప్రెస్ సజావుగా నడుస్తున్నది ..అని వివరించారు.)

లీలా చిత్రమందిర్

గీతాప్రెస్ పై అంతస్థులోని పెద్ద హాలులో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసారు. కంటికి పండగే. ఇది మిస్ కాకూడదు. భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి ఒక తైలవర్ణ చిత్రం. రామ, కృష్ణుల లీలావిలాసాలను తెలిపే 684 చిత్రాలు. ... అన్నీ  ప్రముఖ చిత్రకారులవే. అవి ఎంతగా జీవం పోసుకున్నాయంటే... ప్రతి చిత్రం దగ్గర కొన్ని నిమిషాలు ఆగిచూస్తుంటే... మిగిలినవి మిస్ అవుతామేమోనన్న ఆత్రుతలో అయిష్టంగానే ముందుకు కదలక తప్పని పరిస్థితిలో ఉంచుతాయవి.

.......................


ప్రెస్ ముఖద్వారం చూడండి....ప్రఖ్యాత ప్రాచీన దేవాలయాలు గుర్తొచ్చే విధంగా తీర్చిదిద్దారు. ముందు కనిపించే స్తంభాలు ఎల్లోరాను, కృష్ణార్జునుల రథం ఉన్న వృత్తం అజంతా గుహలను, పైన శిఖరం దక్షిణ భారతదేశంలోని మీనాక్షీ దేవాలయ గోపురాన్ని గుర్తుకు తెస్తాయి.

లీలా చిత్రమందిర్ (దీనిలో గీతా ప్రెస్ తొలి ముద్రణా యంత్రాన్ని కూడ చూడవచ్చు)

..............

నా కాశీ యాత్ర - (ప్రయాగ రాజ్‌లో...రాజకీయం)

https://rajabhayya.blogspot.com/2025/04/1.html?spref=tw

 నా కాశీ యాత్ర-(వారణాశిలో.. అయోమయం)

https://rajabhayya.blogspot.com/2025/04/2.html?spref=tw

 నా కాశీ యాత్ర-(అయోధ్యలో... అపచారం)

https://rajabhayya.blogspot.com/2025/04/3.html?spref=tw

 నా కాశీ యాత్ర-(స్మశాన భస్మంతో కాశీలో  హోళీ...)

https://rajabhayya.blogspot.com/2025/04/4.html?spref=tw

 నా కాశీ యాత్ర-5 (గోరఖ్‌పూర్)

https://rajabhayya.blogspot.com/2025/04/5.html?spref=tw

నా కాశీ యాత్ర-7(ధన్యవాదాలు) 

https://rajabhayya.blogspot.com/2025/04/7.html?spref=tw

...................

ఆది శంకరుడు ఎప్పటివాడు !!!



ఆది శంకరుడు ఎప్పటివాడు !!!

ఎన్ని మఠాలు... ఎప్పుడు పెట్టాడు !!!

....ఒక ప్రామాణిక పరిశోధన/ప్రయత్నం

 

శతాబ్దాలు, సహస్రాబ్దాల తరబడి అల్లకల్లోలంగా సాగిన భారతీయ జీవనగమనంలో- సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగాలపరంగా ఏకత్వాన్ని ప్రవచించి, ఆచరించి, సాధించి  సమాజమంతటా ఒక క్రమానుగతిని,  ఉన్నంతలో ప్రశాంతతను సిద్ధింపచేసిన బహుముఖ ప్రజ్ఞావంతుడు –ఆది శంకరాచార్యులు.

ఆయన జనన మరణాలు, మఠాలస్థాపన, శంకరవిజయాలవంటి జీవిత చరిత్రలకు సంబంధించిన వివరాలు ... సువిశాల భారతదేశంలో, హైందవ సమాజంలో మొదటినుంచీ వివాదాలబారిన పడుతూనే ఉన్నాయి.  మతపరంగా కానీ, ప్రభుత్వపరంగా కానీ దీనిపై స్పష్టత తేవడానికి, జనసామాన్యంలో గందరగోళం తొలగించడానికి గతంలో అసలు ప్రయత్నాలు  జరగలేదా ???

అది జరిగింది1988లో...

అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ‘రాష్ట్రీయ శంకరజయంతి మహోత్సవ్’ ను నిర్వహించడం ద్వారా శంకరాచార్యుల వారికి ఘనంగా నివాళి అర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు రాజీవ్ గాంధీ అధ్యక్షతన ఒక జాతీయ సంఘం ఏర్పడింది. శంకరుల సిద్ధాంతాలు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలపై  ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు నిర్వహించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ- సాంస్కృతిక విభాగం, విశ్వవిద్యాలయ విరాళాల సంఘం(యుజిసి)లు ఉమ్మడిగా ఈ బాధ్యతను నిర్వర్తించాయి. ఈ సెమినార్లలో జరిగిన చర్చలు, తీర్మానాలను క్రోడీకరించి ప్రచురించారు. అంతటితో తృప్తిపడకుండా ... ఇవి ఆధునిక సమాజానికి ఎలా ఉపయోగపడగలవో .. అలా వాటిని అన్వయిస్తూ ప్రజలకు సులభంగా అర్థమయ్యేవిధంగా ఒక పుస్తకంగా తీసుకువస్తే బాగుంటుంది – అని సమన్వయ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఈ బాధ్యతను ప్రముఖ సంస్కృత పండితుడు, అడయార్ లైబ్రరీ, రీసెర్చి సెంటర్‌కు చెందిన గౌరవ ప్రొఫెసర్ డా. ఎస్. శంకరనారాయణన్‌కు అప్పగించారు. ఆయన సెమినార్ల తాలూకు సమాచారాన్ని వడగట్టడమే కాక, స్వంతంగా సశాస్త్రీయంగా పరిశోధన చేసి.. ఒక పుస్తకం నమూనా ప్రతిని సిద్ధం చేసి  1990లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. దీనిని ప్రభుత్వం  మళ్ళీ ఒక నిపుణుల కమిటీకి నివేదించింది. అది క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ దానిని పుస్తకంగా ప్రచురించడానికి  ఆమోద ముద్ర వేసింది. అదే ‘SRI SANKARA’ పుస్తకం.

ప్రభుత్వం దీని ముద్రణకు ఆర్థికంగా సహకరించింది.  అంతర్జాతీయ దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలు శ్రీమతి రాధా బర్నయిర్, మైలాపూర్ శ్రీరామకృష్ణ మఠ్ అధ్యక్షులు స్వామి స్మరణానందజీలు ‘ముందుమాట’ రాసారు. 1995లో దీనిని మొదటిసారిగా ప్రచురించారు.

-ములుగు రాజేశ్వర రావు

rrmulugu@gmail.com

...................

(ముందే ఒప్పుకుని ఉన్న కొన్ని పనుల వత్తిడి కారణంగా ఈ పుస్తకంలోని ప్రస్తుత చర్చనీయాంశాలను  వెంటనే అందించలేకపోతున్నా. వీలు చిక్కినప్పుడు ఆ పని చేస్తా. ఈలోగా ఈ పుస్తకం అందుబాటులో ఉన్నవారు లేదా సేకరించుకోగలిగినవారు ఆ పనికి పూనుకోవడానికి వీలుగా ఈ వివరాలు ఇస్తున్నా.)




Title :  SRI SANKARA

Tag line: HIS LIFE, PHILOSOPHY AND RELEVANCE TO MAN IN MODERN TIMES

Author: DR.S.SANKARANARAYANAN

Publisher/Distributor:  

THE  ADAYAR  LIBRARY  AND  RESEARCH CENTRE, MADRAS

………..

(మీ అభిప్రాయాలు/వ్యాఖ్యలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో  పెట్టండి.  అందరూ చూస్తారు)

వాటీజ్ దిస్ పంచకట్టు వెంకయ్యాజీ !!! అండ్ వెంకీ మామాశ్రీ !!!




తెలుగు భాష
సంస్కృతులకు సంబంధించి ... అసిధారావ్రతంలాగా అనునిత్యం ప్రవచించే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి తెలుగు ఐకాన్గా ముద్ర పడినా... ఆయన వస్త్ర ధారణ మాత్రం దానికి భిన్నంగా ఉంటున్నదని చెప్పడానికి  కించిత్ బాధగా ఉంది. ఆయన ధరించే అడ్డపంచ దానికి ప్రధాన కారణం



ఇదే మన తెలుగు సంప్రదాయం అంటూ రామరాజ్  ద్వారా అన్ని ప్రచార మాధ్యమాల్లో కోడై కూస్తున్నారు మన  హీరో వెంకటేశ్. వీరు కట్టే పద్దతిలో దీనిని అక్షరాలా అడ్డపంచ... అనే అంటారు. తమిళనాడు సమీప ఆంధ్ర జిల్లాలయిన చిత్తూరు, కడప, నెల్లూరుల్లో దీని ప్రభావం ఎక్కువ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదటినుంచీ మద్రాసులో పాతుకుపోయి, తరువాతి కాలంలో అక్కడినుండి తరలినందువల్ల వారు, వారి కుటుంబాల్లో అత్యధిక భాగం తమిళ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు. తమిళనాడు, కేరళ, కొంతమేర కర్ణాటకను మినహాయిస్తే... దాదాపు భారతదేశం అంతటా, మరికొన్ని పొరుగు దేశాల్లో కూడా(శ్రీలంక తప్ప) ధోతీలాగా పంచకట్టే పద్ధతే వాడుకలో ఉంది. కట్టడంలో కొద్దిపాటి తేడాలుండొచ్చేమో కానీ... పద్ధతి మాత్రం ధోతీదే.

సంస్కృత పదం ‘ధౌత’ నుండి ధోతి, ధోవతి అయింది. ఇదే తెలుగులో మనం చెప్పుకునే పంచె... పంచ.. అంటే ఐదు గజాల ఏకవస్త్రం. . దీనిలో రెండు ధోవతులు కలిసి ఒకటిగా ఉంటాయి.  కత్తిరింపులు, కుట్లు ఆచార విరుద్ధం కాబట్టి... దీనిని వైదిక కార్యక్రమాల్లో సంప్రదాయవాదులు ఏకవస్త్రంగానే ఉపయోగిస్తారు. దీనిని మనం దానాలప్పుడు, దక్షిణలప్పుడు ‘పంచెలచాపు’ అని వ్యవహరిస్తుంటాం. ఖర్చుకు భయపడి ఇప్పుడు ఒక ధోవతితోపాటూ పైపంచె లేదా తుండు(టవల్) కలిపి పెడుతున్నారు.

నడుము దగ్గరనుంచీ పాదాలదాకా కాళ్ళను చుట్టి కట్టేది – అడ్డపంచె. మలయాళంలో ‘ముండు’ అనీ, తమిళనాడులో ‘వేష్ఠి’/వేట్టి అని అంటారు. అలాకాక ఒక అంచును కాళ్ళ మధ్యలోనుంచీ వెనకకు తీసుకుని గోచీలాగా ధరించేది ..ధోతీ. ఇదే శాస్త్ర సమ్మతం. అన్ని శుభ, అశుభ కార్యాల్లో నిక్కచ్చిగా పాటించే పద్ధతి. దీనితోపాటూ ఎడమ భుజంపై కండువా లేదా ఉత్తరీయం కూడా ఉండాలి. భారతీయ సంప్రదాయంలో.. ముఖ్యంగా మన తెలుగునాట  పురుషుల సంప్రదాయ వస్త్రధారణ అంటే ఇదే.



మన తాతలుముత్తాతలుతండ్రులు ఇలాగే కనిపించినా.... మన ఆచార వ్యవహారాలుసంస్కృతుల గురించి పట్టణాలునగరాల్లో మనం ఎక్కువ మాట్లాడతాంసుద్దులు కూడా చెబుతాం. కానీ మనం ఛస్తే పాటించం. నోరు తెరవకపోయినాతెలుగునాట...ఆచరించి చూపేదితరాల తరబడి మన సంస్కృతులను మోసుకు తిరుగుతున్నది మాత్రం  పల్లె ప్రజలు. ..జానపదులు... ఆదివాసులు... గిరిజనులే. గ్రామాల్లో గంగిరెద్దుల వారినుంచీ ఊరిపెద్దల వరకూ  అన్ని కులాల్లోవృత్తుల్లో మగవాళ్లు  విధిగా రోజూ ధోతీనే ధరిస్తారు. తెలంగాణలో ఇది ఆదిలాబాదు నుండి హైదరాబాదు శివార్లవరకూ ప్రస్ఫుటంగా కనపడుతుంది.



అచ్చ తెలుగు వస్త్రధారణకు అద్దం పట్టేవిధంగా ..... ధోవతి  కడితే ఇదిగో ఇలా కట్టాలి అని ఒక అక్కినేని ఒక యస్వీఆర్ఒక రాజశేఖర్ రెడ్డిఒక చాగంటి... వంటి ప్రముఖులు ఆచరణలో...  ప్రజల మధ్యలో తిరుగాడుతూ  చూపి యువతరం వారికి స్ఫూర్తిని కలిగిస్తుంటారు. దీనిని మతంతో ముడిపెట్టడంకన్నా. తెలుగు జాతికిమన దేశ వాసులకు గుర్తింపు తెచ్చే పెట్టే పద్ధతి అనడం సమంజసం. (గాంధీతాత  కొల్లాయిగుడ్డతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాడు మనకు). ఆంధ్రాకట్టు పేర మనం పాటించే  పద్ధతి ఇటీవల కొన్ని ఫ్యాషన్ షోలలో కూడా (ఇటలీ) పలువురి ప్రశంసలను అందుకుంటున్నది. ఆశ్చర్యకరంగా ఈ మధ్య పెళ్ళిళ్ళలో యువత... స్పెషల్ అట్రాక్షన్‌గా... మూకుమ్మడిగా పంచలు ధరించివచ్చి హడావుడి చేస్తున్నారు. తెలియక, చెప్పేవారు లేక వారు అడ్డ పంచలే మన సంప్రదాయం అనుకుంటున్నారు.  

అడ్డపంచ కట్టుకోవడానికి ఎక్కువ శ్రమక్కరలేదు. కానీ ధోవతి కట్టుకోవడానికి  మాత్రం కొద్దిగా సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇప్పటి తరానికి లేకపోవడంతో రెడీమేడ్ ధోవతులు వచ్చేసాయి... పెళ్ళికొడుకులు కూడా...  పాంట్లల్లోలాగా కాళ్లు దూర్చేసి  ధోవతుల్లో తేలుతున్నారు. మరింత సౌలభ్యంకోసం ధోతీ ధారణను యుట్యూబ్ లో కూడా నేర్పిస్తున్నారు.

రాజకీయ నాయకులు, సినిమా హీరోలు,  ఇతరత్రా జనసామాన్యాన్ని ప్రభావితం చేయగల వారికి ఒక విన్నపం... అయ్యా ! మీరు ధోవతులు కట్టకపోయినా ఫరవాలేదు గానీ, అడ్డపంచెలు కట్టుకుని, చుట్టుకుని తిరుగుతూ.. వేదికలెక్కుతూ... ఇదే తెలుగు సంస్కృతి ...అని మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించకండి.

కొసమెరుపు : జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.... తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఒక కార్యక్రమానికి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులో లేదా న్యాయవాదులో వెళ్ళారు.. ఎలా వెళ్ళారు !!! .. వారి పద్ధతి ప్రకారం అడ్డ పంచెలు కట్టుకుని మరీ వెళ్ళారు. అక్కడి క్లబ్ డ్రెస్ కోడ్ ప్రకారం ... అది నిషిద్ధం.. కాబట్టి  వారిని వెనక్కి తిప్పి పంపేసారు.

తమిళ సంస్కృతి మీద, భాష మీద ఇటువంటివి  సూక్ష్మాతిసూక్ష్మంగా జరిగినా... ఎప్పటిలాగే... వారి మానంమీద దాడి జరిగినట్టు... రెప్పపాటులో మొత్తం సమాజం తిరగబడింది. అంతే వెంటనే ... తమిళ పంచెకట్టుపై వారి రాష్ట్రంలో ఎక్కడ నిషేధం ఉన్నా... వాటిని తొలగించడమే కాదు, అభ్యంతరం చెప్పినా, ఆక్షేపించినా... ఏడాదిపాటు జైలుశిక్ష, రు.25 వేలు జరిమానా, సదరు సంస్థల లైసెన్సుల జప్తు వంటి పలు చర్యలకు అవకాశం కల్పిస్తూ.... జయలలిత శాసనసభలో ఆగమేఘాలమీద బిల్లు పెట్టి ఆమోదింప చేసింది.

సంక్రాంతి శుభాకాంక్షలతో.... మీ

-ములుగు రాజేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్


..........

(మీ అభిప్రాయాలు/వ్యాఖ్యలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో  పెట్టండి.  అందరూ చూస్తారు...

ఈ బ్లాగులో కూడ శాశ్వతంగా ఉండి... తెరిచిన ప్రతిసారీ అలరిస్తుంటాయి.)




  గీతా ప్రెస్-గోరఖ్‌పూర్ (గీతా ప్రెస్ అంటే గోరఖ్‌పూర్, గోరఖ్‌పూర్ అంటే గీతా ప్రెస్.. అంతటి ఖ్యాతి దానిది...అందుకని నేను గోరఖ్‌పూర్ పర్యటనమ...