నా కాశీ యాత్ర-3

 


మా వియ్యంకులది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  అయోధ్య పొరుగు జిల్లా. వారు మా ఇంటికి వచ్చినప్పుడు కోస్తా మీదుగా తిరుపతి యాత్ర చేసాం. దానికి కృతజ్ఞతగా వారు మమ్మలి వారింటికి రమ్మనమని, వస్తే వారికి బాగా దగ్గరగా ఉండే కాశీ, అయోధ్య చూపుతామని చాలా సార్లు పిలిచినా కుదర్లేదు. చివరకు మార్చి 5న రథం కదిలింది. మొదటగా ప్రయాగ రాజ్, తరువాత వరుసగా వారణాశి, సారనాథ్, అయోధ్య, గోరఖ్‌పూర్, కుశీ నగర్‌లను చూసొచ్చాం. మధ్యలో వచ్చిన హోళీ పండగ వియ్యంకుల ఊళ్ళోనే జరుపుకున్నాం. ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని ప్రప్రథమంగా చూసే అవకాశం లభించింది. అయితే ఆదరాబాదరాగా కాకుండా నింపాదిగా 16 రోజులు అన్నీ తిరిగొచ్చాం.

మా యాత్రా విశేషాలతో మిమ్మల్ని విసిగించే ప్రయత్నం కాదిది. మీకు ఇవి కొట్టిన పిండే. 

ఒక జర్నలిస్టుగా నా పరిశీలనలో నాకు కొత్తగా, విశేషంగా అనిపించినవి కొన్నయితే, కొన్ని భ్రమలు తొలగించేవి కాగా, మరికొన్ని రాజకీయంగా, సామాజికంగా ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి పురిగొల్పేవి..

అయితే ఇది కూడా సాధ్యమయినంత క్లుప్తంగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా.....ప్రయాగ్ రాజ్, కాశీ.. తరువాత....

 

3. అయోధ్యలో బాలరాముడి... కాదుకాదు..

‘షా’యోధ్యలో ‘మోదీ’ రామ్ లల్లా దర్శనం

 

...అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే... ఆగమ శాస్త్రాలు చెప్పాయి, పండితులు చెప్పారు, పీఠాధిపతులు తప్పు అన్నారు, అయినా ఆలయ నిర్మాణం  పూర్తికాకముందే ... మూలవిరాట్ గుళ్ళో చేరిపోయాడు. ఎన్నికలు తరుముకొస్తుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు !!! అసలు పాత మసీదు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్నదే అందుకు కదా ! మరి కనీసం ప్రాణప్రతిష్ఠ అయినా ఆగమ శాస్త్ర ప్రకారం జరిగిందా ???  అంటే జరిగింది... షా శాస్త్రం ప్రకారం మోదీ చేతులమీదుగా జరిగిపోయింది...కారణం .. వారు చెప్పిందే చరిత్ర, ప్రవచించిందే వేదం.... చేసినదే శాసనం కనుక. (ఇతర మతాల్లో ప్రార్థనా మందిరాలు, ధ్యాన మందిరాలు తదితర నిర్మాణాలు ఉంటాయి. అక్కడ దేవుడు ఉండడు. ఉంటాడన్న భావన వ్యాపించి ఉంటుంది. కానీ హిందూ దేవాలయాల్లో దేముడు ఉంటాడు...  ఆగమ శాస్త్ర ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది కనుక.. ఈ వాదాన్ని చట్టాలు కూడా అంగీకరిస్తున్నాయిగా. మరి అయోధ్యలో దేముడు ఉన్నట్లా, విగ్రహం మాత్రమే ఉన్నట్లా ?)

ఇక ఉత్తర భారత ఆలయానికి... దక్షిణ భారతం నుండే శిల్పి ఎంపిక ఎందుకు జరిగింది !!! అంటే ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ లోకి దక్షిణాన్ని వ్యూహాత్మకంగా లాక్కురావడానికి జరిగిన ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. ... రామేశ్వరంలో ఉపవాస దీక్ష లాగా...

అంతకుముందు అయోధ్యలో ఆలయం నిర్మాణంలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాం. ఇప్పుడూ వెళ్ళాం. ప్రతి 10 అడుగులకు... అక్షరాలా పది అడుగులకొకసారి సెక్యూరిటీ చెకింగ్... అది కూడా నిషిద్ధ ప్రాంతంలోకి వెడుతున్న వారిని తనిఖీ చేసినట్లు... నఖశిఖ పర్యంతం పరీక్షలు(బెల్టు, వాచీలు కూడా నిషిద్ధం) జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న స్థితినిబట్టి లెక్కగడితే పూర్తికావడానికి మరో రెండు మూడేళ్ళు పట్టవచ్చు. కానీ అధికారిక ప్రకటనల ప్రకారం ఏప్రిల్లో... అంటే ఈ నెలలోనే పూర్తవుతుందట.

ఇక్కడా అంతే... దోపిడీ. ..దర్శనానికి కూడా. కుంభమేళా ముగిసిన నెలరోజుల తరువాత... అంటే గత వారం వెళ్ళివచ్చిన వారి అనుభవాల ప్రకారం... ఊరి శివార్లలోనే క్యాబ్‌లను, టాక్సీలను, టూరిస్టు బస్సులను  ఆపేస్తారు. అక్కడినుంచి ఆటోకు మనిషికి రు.300-400 ఇచ్చుకోవాలి. మళ్ళీ దర్శనానికి 4-5 గంటలు. అదే బిజెపి నెట్‌వర్క్ లోని పార్టీలు, సంస్థలు, సంఘాలు, శాఖలవారికి ... ముందుగా స్లాట్ కేటాయిస్తారు. ఆ స్లాట్‌లో వెడితే ఐదు నిమిషాల్లో దర్శనం. వాళ్ళ వాహనాలు నేరుగా గుడి గేటుదాకా పోవచ్చు.

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్ఫూర్తి పొంది అమలు చేస్తున్న వాటిలో కొన్ని :-

·        గోవిందా గోవింద నినాదాల్లాగా... క్యూలైన్లలో ‘జై శ్రీరామ్’

·        మూలవిరాట్ దగ్గర ఒక్క క్షణం ఆగకుండా లాగేయడం

·        దాసోహమన్న పీఠాధిపతులకు, మఠాధిపతులకు ఆశ్రమాల ఏర్పాటుకు స్థలం

·       వెయ్యిరూపాయలు కనుక వీల్ ఛైర్ ఏర్పాటు చేసే దళారీ కిస్తే పావుగంటలో ప్రత్యేక దర్శనం(ఒక్కరికి మాత్రమే- అయితే అడ్డగించిన వారికి  వృద్ధులమనో, రోగులమనో చెప్పుకుంటుండాలి).

·   సెలబ్రిటీలు, ప్రముఖులకు, బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి స్థలాలు. (అమితాబ్ బచ్చన్ తండ్రి పేరిట నెలకొల్పిన ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక సూట్ ఉంది. మరో సూట్ నిర్మాణానికి అనుమతి పొందారు)

కాశీలో లాగానే ఇక్కడా అంతే... చుట్టూ అరకిలోమీటర్ పరిధిలో అవే ఇరుకు సందులు, కిక్కిరిసిన గల్లీలు, ఓపన్ గా ఉండే సైడ్(మురికి) కాల్వలు, మార్గదర్శనం చేసే ఆలయ సిబ్బందికానీ, డైరెక్షన్ బోర్డులు కానీ మృగ్యం. ఇక అక్కడి ఆలయ  నిర్మాణ సామాగ్రిని చూస్తే... కరెన్సీ కట్టలు కాదు బంగారపు ఇటుకలు కరిగించి పోస్తున్నట్లు కనిపిస్తాయి. అయితే దీనికి నిధులు ఆలయ ట్రస్టు నుంచి అనుకుంటా. మరి ఆ ట్రస్టుకు అందే నిధుల మీద ఆడిట్ ఉందో లేదో తెలియదు.

అయోధ్యకు భక్తులను ఆకర్షించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ తెచ్చేసారు. కాశీ, ప్రయాగ భక్తులను ఇక్కడికి తీసుకురావడానికి అయోధ్య, కాశీ, ప్రయాగ.. సర్క్యులర్ రైల్వే ప్రతిపాదనలు చురుగ్గా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా అయోధ్యకు దారితీసే మార్గాలన్నీ ఇప్పటికే మెరిసిపోతున్నాయి. ఇంకా అభివృద్ధి పరుస్తారట. కాశీ ప్రయాగలు మున్ముందు కనుమరుగయినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

సనాతన ధర్మం, సిక్కిజం కలిసిన చోటు

రామజన్మభూమిని రక్షించాలని  శ్రీగురు గోవింద్ సింగ్ ఆజ్ఞాపించిన పిమ్మట నిహాంగుల దళం మొగలాయీలతో వీరోచితంగా పోరాడిందని, ఇప్పటికే ఆ పవిత్రభూమిని పలువురు సిక్కు గురువులు సందర్శించారనీ, హిందువులు, సిక్కుల ఆత్మీయ బంధానికి  ఈ ప్రాంతం సజీవ సాక్ష్యమని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అంతకుముందే వ్యాఖ్యానించారు.

..........


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...