ఓట్ల దొంగతనమా ! ! !
- 1
ఇప్పుడు దేశమంతటా ఓట్ల దొంగతనం మీద చర్చ రాజుకున్నది... ఇంకా కొంతకాలం ఈ మంటలు చెలరేగుతుంటాయి... ఇప్పుడే మొదలయింది కాబట్టి... దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకుని ఉంటే... ఆ చర్చమీద మనకు ఒక అవగాహన ఏర్పడి ఉంటే... మనం కూడా సరైన వాదనలు వినిపించవచ్చు... అటు కానీ .. ఇటు కానీ...
నేను 2018లో, 2023లో జరిగిన ఎన్నికల సమయంలో... భారత ఎన్నికల సంఘం తాలూకు రాష్ట్ర కార్యాలయంలో మీడియా విభాగంలో పనిచేసా... దానికి ముందు- జర్నలిజానికి తోడు, ఎన్నికల సంఘం తాలూకు పుస్తకాలను తెలుగులోకి అనువదించిన అనుభవం ఉంది. మరీ లోతుగా కాకపోయినా, నా అవగాహన మేరకు నేను తెలుసుకున్న విషయాలను ఇక్కడ మీ ముందుంచుతున్నా... సమగ్రంగా ఒకే వ్యాసంగా అయితే పెద్దదయి మీకు చదవడం ఇబ్బంది. కాబట్టి... చిన్నచిన్నవిగా వీలయినన్ని ఇస్తూ పోతా... వాటిలో ఓటరు జాబితా వంటి అంశాలే కాకుండా, ఇవిఎంల ద్వారా ఓటింగ్ జరిగేటప్పుడు దొంగ ఓట్లు ఎలా పడే అవకాశం ఉంది ? అధికార పార్టీతో ఎన్నికల కమిషన్‌కు ఉండే అక్రమ, సక్రమ సంబంధాలు, ఎన్నికల కమిషన్ లో జరిగే అవినీతి కథలు... ఇలా చాలా చెప్పాలనుకుంటున్నా... అదీ నాకు తెలిసినంత వరకు...
నేను మిస్సయిన సమాచారం మీరూ తెలుపవచ్చు... నా తప్పులేవయినా ఉంటే సరిదిద్దవచ్చు... అంతే తప్ప... దీనిలో అర్థంపర్థంలేని వితండ వాదనలు, ఏదో ఒక పార్టీని నెత్తినెత్తుకుని అవాకులు చెవాకులు పేలడాలూ వంటివి మాత్రం చేయకండి...
పాత
చింతకాయ పచ్చడి :
ఆగస్టు 7, 2025న ‘ఓట్ల దొంగతనం’ అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు
కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నాయి.. ప్రతి ఎన్నికలో... ఇవి అందరికీ
అనుభవైకవేద్యమే...చాలా మంది బాధితులు కూడా. అసెంబ్లీ ఎన్నికలో ఉపయోగించుకున్న ఓటు, మరో కొద్దినెలల్లోనే జరిగిన
పార్లమెంటు ఎన్నికలకు మాయమయి పోవడాలు,
చచ్చిన వాళ్ళు బతికినట్లు, బతికిన వాళ్ళవి చచ్చిన(డిలీట్) జాబితాలో చోటు చేసుకోవడాలూ,
ఒక వ్యక్తికి చాలా చోట్ల ఓట్లు ఉండడాలు, ఒక కుటుంబంలో అందరికీ ఓటర్
కార్డులున్నా... పోలింగ్ సమయంలో కొందరివి
గల్లంతు కావడాలు, ఒకే ఇంటి నంబరుతో చాలా ఓట్లు, ఓటరు కార్డుమీద ఇతరుల ఫొటోలు...
ఇలా...
రాహుల్ గాంధీ చేసిన 5 ఆరోపణలు కూడా ఇవే. డూప్లికేట్ ఓట్లు, నకిలీ లేదా దొంగ చిరునామాలు, ఒకే ఇంటి నంబరు మీద చాలా ఓట్లు(50, 100, 150..) ఉండడం, తప్పుడు ఫొటోలు, ఫారం-6 దుర్వినియోగం. తన ఆరోపణలకు బలం చేకూర్చడానికి ఒక నియోజకవర్గాన్ని శాంపుల్ గా తీసుకుని శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ధారించుకున్న సాక్ష్యాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. బెంబేలెత్తిన ఎన్నికల సంఘం... ఒక స్వతంత్ర, రాజ్యాంగ వ్యవస్థగా దాని మీద ఆరోపణలు, అనుమానాలు వస్తున్నప్పుడు..ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం... ఫిర్యాదులను వాటి ఫార్మాట్ లలో ఇవ్వాలని రాహుల్ గాంధీని పదేపదే డిమాండ్ చేయకుండా, తప్పయితే జైలుశిక్ష ఉంటుందనీ హెచ్చరించకుండా... వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే హుందాగా ఉంటుంది. ఇదే ఫిర్యాదు ప్రధానో లేక ఏ కేంద్రమంత్రో, ఏ అధికార పార్టీ ప్రతినిధో చేస్తే అప్పుడు కూడా ఎన్నికల సంఘం ఇలానే అంటుందా ?...
2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తన నియోజకవర్గంలో 15 వేల ఓట్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో 950 ఓట్లుంటే, ఓటర్ల జాబితాలో అవి1650 ఓట్లకు ఎలా పెరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అప్పుడే ఫిర్యాదు చేసాననీ, ఇప్పటి సిఇఓకు కూడా కంప్లయింట్ చేసానని బిజెపి పార్లమెంటు సభ్యుడు ఎం.రఘునందన్ రావు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం చివరి దశలో ... కొత్త రాష్ట్రం ఆవిర్భావ సమయంలో ఎన్నికలకు ముందు... ఆంధ్రావాళ్ళ ఓట్లు, సమైక్యవాదులుగా గుర్తించిన తెలంగాణావాసుల ఓట్లు ... ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున గల్లంతయినట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఇక మర్రి శశిధర్ రెడ్డి అయితే ఓటర్ల జాబితామీద చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రతిసారీ చాలా ఫిర్యాదులు చేస్తుంటారు.
ఈ ఓట్ల దొంగతనం నిజమేనా !!!
నిజమే అయితే ఎందుకు జరుగు తున్నది ?
ఎలా జరుగుతున్నది !!!
ఓటర్ల జాబితాలో అవకతవకలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజింవచ్చు
1. కాకతాళీయంగా లేదా నిర్లక్ష్యంతో జరిగేవి
2. ఉద్దేశ పూర్వకంగా జరిగేవి.
రెండోదే ఎక్కువ అభ్యంతరకరం, నేరం కూడా. అయినా దాని బీజాలు మొదటి దానిలో
ఉంటాయి. అందువల్ల దానిని క్లుప్తంగా చూద్దాం...
ఓటర్ల జాబితా : ఇదే తొలి దశ. ఎన్నికలకు ఇదే కీలక, మౌలిక డాక్యుమెంట్. కొన్ని వేల
కోట్ల రూపాయలు ఖర్చుచేసి జరిపే ప్రతి ఎన్నికకూ ఇదే ఆధారం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసి తమ తరఫున ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుని పంపాలంటే... ఈ జాబితా ఆధారం
మీదే మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా ఆధారపడి ఉంది... అటువంటి ఆధారశిల మాత్రం- అట్టడుగున
పనిచేసే బిఎల్‌ఓ స్థాయినుండి కేంద్ర ఎన్నికల సంఘంలోని ఉన్నత స్థాయి అధికారి వరకు నిర్లక్ష్యానికి
గురవుతుంటుంది. ఎన్నికల ప్రక్రియ మొదలయిన దగ్గరి నుండీ అందరూ దీనిని గురించే
మాట్లాడుతుంటారు...అంతే తప్ప దాని కచ్చితత్వాన్ని గురించి పట్టించుకోరు....
సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందామో చూపడానికి... ఆధార్ కార్డ్, మొబైల్ బ్యాంకింగే సాక్ష్యం. అయినా ఓటర్ల జాబితా రూపకల్పన పద్ధతి70 ఏళ్ళ కింద ఎలా ఉందో ఇప్పటికీ దాదాపు అలాగే ఉంది. ‘మీ ఓటు మీ హక్కు’ అంటూ ఊదరగొట్టడానికి... కోట్ల రూపాయలు రకరకాల ప్రచారం మీద, కొత్త కొత్త యాప్ ల మీద ఎన్నికల సంఘం ఖర్చు పెడుతుంది తప్ప ఎన్నికలు త్వరలో లేదా ఐదేళ్ళకు ఒకసారి రావడం ఖాయం అని తెలిసినా... చివరి నిమిషం వరకూ ఓటరు జాబితా ప్రక్షాళన గురించి పట్టించుకోరు. (చేర్పులు, మార్పుల గురించి మాట్లాడడం లేదు. జాబితాలో వివరాలు వాస్తవాలేనా, ఏదయినా తప్పు సమాచారం ఉందా...వంటివి)
ఎన్నికల సంఘంలో అత్యంత తక్కువ స్థాయి అధికారి బిఎల్ ఓ (బూత్ లెవల్ ఆఫీసర్). ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో గరిష్ఠంగా 1500 ఓట్లుంటాయి. ఆ పరిధిలో పనిచేసే బిఎల్ ఓ స్వయంగా ఇంటింటికీ వెళ్ళి కొత్త ఓటర్ల నమోదు, అప్పటికే ఉన్న ఓటర్ల సమాచారం స్వయంగా పరిశీలించి వాస్తవాలతో నివేదికలు పంపితే... పైన సూపర్‌వైజర్, ఎఇఆర్ఓ, ఇఆర్‌ఓ, డిఇఓల తనిఖీలన్నీ పూర్తి చేసుకుని తుది జాబితా రాష్ట్ర సిఇఓకు చేరుకుంటుంది.
అయితే అస్త్యవస్తాలకు బీజాలు బిఎల్‌ఓ స్థాయిలోనే పడతాయి. స్వయంగా గడపగడపకూ పోరు, పోయినట్లు రికార్డులు చూపుతారు. చాలా చోట్ల ఔట్ సోర్సింగ్ సిబ్బందిని లేదా తాత్కాలికంగా అందుబాటులో ఉండే వారిని పంపి మమ అనిపిస్తారు. ఒక కుటుంబంలో వీరు వెళ్ళినప్పుడు ఒకరో ఇద్దరో ఉంటారు... మిగతా వారి గురించి ఆ కుటుంబ సభ్యులు ఏది చెబితే అది రాసుకుపోతారు. వెరిఫై చేసుకోరు. ఇంట్లో ఆ సమయంలో లేని వారి లేదా ఇతర దేశాల్లో సెటిలయిన వారి వివరాల గురించి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేదా ఇతరత్రా డాక్యుమెంట్లు అడిగి తెప్పించుకుని తనిఖీ చేయవచ్చు. అవి చేయరు. ఆ ఇంటి నంబరు మీద నమోదయిన ఓటర్లలో -చనిపోయినవారు, ఇల్లు మారినవారు, నకిలీ ఓటర్ల వాస్తవ సమాచారాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోరు. (ఫిర్యాదులు అందినప్పుడుకూడా పైనుంచి కింది దాకా అందరూ బిఎల్‌ఓ నే అడుగుతారు. అతను ఎంత చెబితే అంత... సిఇఓ కు నేరుగా ఫిర్యాదులు అంది గొడవ జరిగేటట్లుంది అన్నప్పుడు పైఅధికారులు స్వయంగా వెళ్లి చూసి నివేదికలు పంపుతారు. ఎన్నికల సమయంలో అధికార పక్షం వారు తప్ప, సెలబ్రిటీలు తప్ప మరే నాయకుడు ఫిర్యాదు చేసినా అందరూ తేలిగ్గా తీసుకుంటారు. (మీ ఓటు చెక్ చేసుకోండి అంటూ ఇంకా చాలా హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఇచ్చినా అవి కంటితుడుపే).
-ములుగు రాజేశ్వర రావు
(ఉద్దేశపూర్వకంగా ఓట్ల దొంగతనం ఎలా జరుగుతుందో తదుపరి వ్యాసంలో
చూద్దాం)
భారత ఎన్నికల సంఘం ప్రధాన నినాదం ఏమిటంటే....
“No Voter to be left behind”
“అర్హుడైన ఏ ఒక్క పౌరుడూ తన ఓటు హక్కు కోల్పోవకూడదు’’
భారత పౌరుడయి ఉండి, 18 ఏళ్ళు నిండి సదరు పోలింగ్ కేంద్రం
పరిధిలోశాశ్వతంగా లేదా తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారు ఓటరుగా నమోదుకు అర్హులు..
అన్నది మౌలిక సూత్రం.
ఆచరణలో ఇది ఎంత ఉదాత్తంగా ఉంటుందో చూడాలంటే...
ఇల్లే ఉండాల్సిన అవసరం లేదు, ఫుట్‌పాత్‌ల మీద, షెడ్లలో ఉంటూ జీవనం గడుపుతున్న వారు కూడా నివాసంతాలూకు రుజువు లేకపోయినా ఓటరు జాబితాలో చేర్చడానికి అర్హులే. వారున్న ప్రాంతాన్ని బిఎల్‌ఓ సందర్శించి (రెండు మూడు సార్లు) వారు అక్కడే ఉంటున్నట్లు నిర్ధారిస్తే చాలు.. అలా ఫారం – 6 ద్వారా వారిని ఓటరుజాబితాలో చేరుస్తారు.
క్రమం తప్పకుండా నిద్రకు బసకు వచ్చిపోయేవారు కూడా అర్హులే... వారు అక్కడే ఉండి వంట చేసుకుంటున్నట్లు లేదా తింటున్నట్లు కూడా రుజువులు పనిలేదు. మధ్య మధ్యలో అక్కడ నిద్రించకపోయినా... ఆ వ్యక్తి సదరు ప్రదేశంలోనే ఎక్కువ సార్లు నిద్రిస్తున్నాడని రూఢి అయితే చాలు... వారూ అర్హులే.
నివాస ధృవీకరణ లేకపోయినా సెక్స్ వర్కర్లు కూడా అర్హులే... బిఎల్‌ఓ వ్యక్తిగతంగా సందర్శించి నిర్ధారిస్తే చాలు. వారూ ఓటర్లవుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి