నా కాశీ యాత్ర-2

 మా వియ్యంకులది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  అయోధ్య పొరుగు జిల్లా. వారు మా ఇంటికి వచ్చినప్పుడు కోస్తా మీదుగా తిరుపతి యాత్ర చేసాం. దానికి కృతజ్ఞతగా వారు మమ్మలి వారింటికి రమ్మనమని, వస్తే వారికి బాగా దగ్గరగా ఉండే కాశీ, అయోధ్య చూపుతామని చాలా సార్లు పిలిచినా కుదర్లేదు. చివరకు మార్చి 5న రథం కదిలింది. మొదటగా ప్రయాగ రాజ్, తరువాత వరుసగా వారణాశి, సారనాథ్, అయోధ్య, గోరఖ్‌పూర్, కుశీ నగర్‌లను చూసొచ్చాం. మధ్యలో వచ్చిన హోళీ పండగ వియ్యంకుల ఊళ్ళోనే జరుపుకున్నాం. ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని చూసే అవకాశం లభించింది. అయితే ఆదరాబాదరాగా కాకుండా నింపాదిగా 16 రోజులు అన్నీ తిరిగొచ్చాం.

మా యాత్రా విశేషాలతో మిమ్మల్ని విసిగించే ప్రయత్నం కాదిది. మీకు ఇవి కొట్టిన పిండే. 
ఒక జర్నలిస్టుగా నా పరిశీలనలో నాకు కొత్తగా, విశేషంగా అనిపించినవి కొన్నయితే, కొన్ని భ్రమలు తొలగించేవి కాగా,
మరికొన్ని రాజకీయంగా, సామాజికంగా ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి పురిగొల్పేవి..
అయితే ఇది కూడా సాధ్యమయినంత క్లుప్తంగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా.....
1. ప్రయాగ్ రాజ్ తరువాత....



 2. వారణాశి (కాశి)

హైదరాబాద్, ఢిల్లీతో సహా మహమ్మదీయులు పాలించిన అన్ని ప్రదేశాల్లో లాగానే వారణాశి, అయోధ్యల్లో కూడా గల్లీలు(ఇరుకు సందులు)ఎక్కువ. చివరకు కాశీలో బాబా విశ్వనాథ్ మందిరం లోపల కొద్ది భాగం మినహా... ఆలయానికి ప్రవేశించే దారులన్నీ ఇరుకే.  ఆ సందుల్లో ...దర్శనానికి వెళ్ళే క్యూలు ఉంటాయి. అవి  ఎటునుంచి ఎటుపోతాయో తెలియదు. అంత కిక్కిరిసిన గొందుల్లో స్థానికులు, స్థానిక వ్యాపారులు స్కూటర్లమీద డబుల్స్, ట్రిబుల్స్ అది కూడా యాక్సిలేటర్ రైజ్  చేసుకుంటూ దూసుకుపోతుంటారు. క్యూలైన్లను నియంత్రించే దేవస్థానం సిబ్బందికానీ, భద్రతా సిబ్బంది కానీ, స్వచ్ఛంద కార్యకర్తలు కానీ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర తప్ప మరెక్కడా కనపడరు. ఆటోలు, రిక్షాలు, పాలు,పూలు,పళ్ళ వ్యాపారుల లూటీ నిరాటంకంగా సాగుతుంటుంది. దర్శనాలు చేయించే దళారులు ..ఓపెన్‌గానే .. టిక్కెట్ కౌంటర్ల దగ్గర భక్తులతో బేరసారాలు నడుపుతుంటారు.. అదీ పోలీసుల సమక్షంలోనే.

గర్భగుడికి ఇంతకుముందు ఒకే ద్వారం ఉండేదట. దానిని పెంచి నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలు ఏర్పాటు చేసారు. ప్రతి ద్వారంనుంచి లోపలివైపుకు ఇత్తడి దోనెలు ఏటవాలుగా ఉంటాయి. భక్తులు గర్భగుడి బయట గడప దగ్గర ఆగి చేతిలో పట్టుకొచ్చిన చెంబెడు నీళ్లను కానీ పాలను కానీ, పూలను కానీ  ఆ దోనె మీది నుంచి జారవిడవాలి.  అవి నేరుగా వెళ్ళి శివలింగంమీద పడతాయి. అదే దర్శనం. అక్కడే దణ్ణం పెట్టుకుని వచ్చేయాలి. క్యూ గర్భగుడి దగ్గర నాలుగుగా చీలుతుంది కాబట్టి... అంతకుముందుకంటే నాలుగో వంతు సమయంలో ఇప్పుడు దర్శనం పూర్తవుతున్నది.

స్పర్శ దర్శనం: టిక్కెట్ కొనికానీ లేదా వేకువ ఝామున 3 గంటలకు కానీ వెడితే ఇత్తడి దోనెల ద్వారా కాకుండా నేరుగా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అదీ కొన్ని సెకన్లలోనే. (విఐపిలకు కూడా ఇదే దర్శనం)

అన్నపూర్ణా దేవి : కాశీ అంటే ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మే. అయితే బహుశః ఇది మన తెలుగు రాష్ట్రాలవాళ్ళకేనేమో. స్థానికులకు, ఉత్తర భారతీయులకు అక్కడే  అన్నపూర్ణా దేవి ఆలయం ఉందని కానీ, కొద్ది దూరంలో విశాలాక్షి గుడి ఉందని కానీ, కాలభైరవుడి దర్శనం తరువాతే విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలన్న మన నమ్మకాలు వారికి తెలియవు. బాబా విశ్వనాథ్ దర్శనం కాగానే సంబంరంతో సంతృప్తితో వెళ్లిపోతారు. బయట బాబా దర్శనానికి గంటలు పట్టే క్యూలైన్లు ఉన్నా..... అక్కడే కొలువై ఉన్న ఆ అమ్మవార్ల దగ్గర ఒకరిద్దరు తప్ప భక్తులు పెద్ద సంఖ్యలో కనిపించరు, 

కానీ ఆశ్చర్యం.. వారాహీ మాత ఆలయం. మన కాశీయాత్రీకుల మాటల్లో సహజంగా చాలా తక్కువగా పేరు వినిపించే దేవత ఈమె. ఎప్పుడు చూసినా కిటకిటలాడుతుంటుంది క్యూలైన్. పొద్దున 4 గంటలకు పోయి క్యూలో నిలబడితే ఉదయం 9గంటలకు దర్శనం అయిందని తోటి యాత్రికులు చెప్పారు. అక్కడా అంతే.  క్యూలు ఎంతకీ కదలవు. నియంత్రించే ఆలయ సిబ్బంది జాడ దొరకదు.

ఆలయాల నిర్వహణ సరిగా లేకపోవడంతో.... మన ప్రణాళిక పనిచేయదు. అది  క్షేత్రం కాబట్టి... అక్కడ అడుగుపెట్టినప్పటినుంచి దానిని వదిలేవరకూ మన కదలికలన్నీ దైవాధీనంగా ఉంటాయనుకోవడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు.


గంగా హారతి : నిజంగా చూడదగిన దృశ్యమే అయినా... ఎక్కడ, ఎప్పుడు ఉంటుందనేది కాశీలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికీ అయోమయమే. చాలామందికి అసలు అదొకటి ఉంటుందని తెలియదు. అశి ఘాట్‌లోనే కాక మరో ఘాట్‌లో కూడా హారతులు ఇస్తారు.  పడవల్లోనుంచి కూడా చూడవచ్చు. .. ఇతరత్రా ఆలోచనలు లేకుండా చూస్తే పరవశింప చేస్తుంది. 

కానీ నేను కొద్దిగా తేడా... కారణం అక్కడ .. చాలా తేడాలు నాకు కనిపించడమే. ఇది కాశీ విశ్వేశ్వర క్షేత్రం, శైవ క్షేత్రం. ఇచ్చే హారతి గంగమ్మకు.. అదీ షోడశోపచారాలలో భాగంగా... అయితే మధ్యలో కీర్తనలు మాత్రం రామాయణ, భాగవతాల్లోంచి రాముడు, కృష్ణుడిమీద... 

అఫ్‌కోర్స్..అది మనకు అనవసరమైన విషయం.  అద్వైతాన్ని అందుకే శంకరాచార్యుడు కాలికి బలపం కట్టుకుని  ఇక్కడంతా తిరిగి చెప్పాడు కదా...అని సరిపెట్టుకుందామంటే... మధ్యమధ్యలో అనూహ్యంగా ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు. గంగామాయీ కీ జై, హర్ హర్ గంగే, హరహర మహదేవ్..అన్నవి ఎప్పుడో తప్ప వినబడలేదు... ఇక్కడే కాదు బాబా విశ్వనాథ్ దర్శనం క్యూలలో కూడా  ఒకడు ‘జైశ్రీరామ్’  అంటాడు.. మరుక్షణం విశ్వనాథ్ బాబా చెవులు కూడా చిల్లులు పడేలా ‘జైశ్రీరామ్’ అంటూ అన్ని క్యూలు  మోర ఆకాసానికెత్తి అరిచేస్తాయి. అయోధ్యలో అంటే రామాలయం కాబట్టి ఎలాగూ తప్పదు. ... కానీ అద్వైతం అక్కడ కనిపించదు, హరహర మహదేవలు అక్కడ వినిపించవు.

అంటే రాజకీయ నినాదాన్ని చాలా తెలివిగా గర్భగుళ్ళల్లోని దేముళ్ళకు కూడా కళ్ళకు గంతలు కట్టి, చెవుల్లో పువ్వులు పెట్టి....  భక్తుల గుండెలోతుల్లోకి  జొప్పించేస్తున్నారన్నమాట !

ప్రధానమంత్రి స్వంత నియోజకవర్గం కాబట్టి... అద్భుతంగా అభివృద్ధి చేసారని ప్రచారం జరిగింది ప్రపంచమంతా. ఇదే అంతటా వైరల్ అవుతుంటుంది. వాస్తవం ఏమిటంటే... కాశీ విశ్వేశ్వరుడి మందిరానికి అరకిలోమీటర్ పరిధిలో  కూడా సైడు(మురికి)కాల్వలు బహిరంగంగానే కనిపిస్తుంటాయి. అక్కడే కాదు.. కాశీ పట్టణం అంతటా. 

లోకల్ టూరిజం ప్యాకేజిలో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం ఉంటుంది. దానిలో తెలుగు డిపార్ట్ మెంట్ కూడా ఉంది. అదెలా ఉన్నా కనీసం ఆలయం చూడొచ్చని మురిసిపోతాం. కానీ నేరుగా తీసుకెళ్ళి ఆ ప్రాంగణంలోనే ఉన్న ఆలయానికి తీసుకెడతారు. బయటినుంచి అద్భుతంగా గోపురాలు, ఆలయం కనిపిస్తుంటుంది.లోపల శివలింగం దిక్కూమొక్కూ లేకుండా ఉంటుంది. అక్కడ భక్తులు నేరుగా వెళ్ళి మొక్కుకునే సదుపాయం ఉన్నా... పూజలవంటివి చేయడానికి కానీ, ఆ ఆలయంగురించి చెప్పడానికి గానీ అక్కడ దాని తాలూకు వారెవరూ ఉండరు.

.........



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...