
(గోరఖ్పూర్-యోగ విద్యా కేంద్రం)
(ప్రయాగరాజ్,
వారణాశి, అయోధ్యలతరువాత గోరఖ్‌పూర్ చేరుకున్నాం. అయోధ్యకు 135 కి.మీ దూరంలో ఉంది. ఈ
టూర్‌లో నేను ఎక్కువ ఆశలు పెట్టుకున్నది ఈ ఊరిమీదే. అందుకే రెండురోజులు ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నా.
లోగడ కావలికి చెందిన శ్రీరామదూత స్వామి వారి శిష్యులు వారి
మాసపత్రిక ‘వందేహం రామదూతం’ ప్రత్యేక సంచిక ప్రచురణలో నా సహాయ సహకారాలు
కోరినప్పుడు వృత్తి బాధ్యతగా ఆసక్తి పెంచుకుని కష్టపడి కొంత సమాచారాన్ని సేకరించి
‘మనకు దూరంగా బతుకుతున్న మన దగ్గరి బంధువులు’ పేరిట యోగులు, అవధూతలు, సిద్ధులకు
సంబంధించి ఒక వ్యాసాన్ని కూడా అందించాను. (లింకు కింద ఉంది). దానిలో గోరఖ్‌పూర్
ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది.
ఆ ఉద్దేశంతో నేరుగా వెడితే ఈ సబ్జెక్టుమీద చాలా
సమాచారం దొరుకుతుందని ఆశపడితే ...బాగా నిరాశ పరిచారు అక్కడి బాధ్యులు. లైబ్రరీకి
పంపారు. అక్కడ కేవలం అక్షరాలా నాలుగే నాలుగు పుస్తకాలు, వాటిలో మూడు హిందీలో, ఒకటి(ఫిలాసఫీ ఆఫ్ గోరఖ్‌నాథ్) ఇంగ్లీషులో ఉంటే
దానిని మాత్రం కొన్నా. అది సిద్దాంతాన్ని చర్చించిందే కానీ సామాన్య జనాలకు కావలసిన సమాచారమేదీ అందులో లేదు. అక్కడి లైబ్రేరియన్‌గా ఉన్న వ్యక్తిని
అడిగితే... మా వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ లైబ్రరీ ఉంది. దానిలో అన్నీ
ఉంటాయి-అన్నాడు. ఆ లింకు ఇప్పటికీ
తెరుచుకోలేదు. అమెజాన్‌లో కూడా వెతుక్కోమన్నాడు.
తెలుగునాట
...విద్యానాథ్, గోపీనాథ్, ద్వారకానాథ్, శ్రీనాథ్... ఇలా నాథ్ లు చాలా మంది
కనిపిస్తారు. వీరు నాథ్ సంప్రదాయానికి చెందినవారా..ఏమో వారికే తెలియదు. నా
స్నేహితుల్లో ఒకరిద్దరు మాత్రం వారి తల్లిదండ్రులు గోరఖ్‌పూర్ వెళ్ళివస్తుండేవారని
చెప్పారు. వీరికి ఆ సాంప్రదాయానికి సంబంధం ఉందా లేక కేదార్‌నాథ్, బదరీనాథ్ వంటి క్షేత్రాల పేర్లు, దేవుళ్ళ పేర్లుగా భావించి బాగుందని
పెట్టుకున్నారా... నాకైతే తెలియదు. అనుభవజ్ఞులు కానీ పండితులు కానీ చెప్పాలి. ఆ
దృష్ట్యా నేను సేకరించిన సమాచారాన్ని కొంత విపులంగా ఇస్తున్నా....)
గోరఖ్‌పూర్
- ఐరావతీ నదీ(రాప్తీ)తీర పట్టణం. ఇక్కడ
గోరఖ్‌నాథ్ ఆలయంతో సంబంధమున్న మఠాలు, ఆలయాలు.,
సంస్కృత విద్యా పీఠంతో సహా పలు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, గోశాలలు, యాగశాలలు
మొత్తం 52 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. చాలా మటుకు విద్య, వైద్యం ఉచితం. అన్న
ప్రసాద వితరణ కూడా మధ్యాహ్నం, రాత్రి ఉంటుంది. కులం, వర్గం, ధనిక, పేద అనే తేడా
లేకుండా ...మనోవాంఛలతో, ముఖ్యంగా సంతాన యోగం కోసంఉత్తర భారతం నుండి నేపాల్ నుండి
కూడా హిందూ భక్తులు పెద్దఎత్తున ఇక్కడికి వస్తుంటారు. వివాహ నిశ్చితార్థాలు కూడా
భక్తులు ఇక్కడే చేసుకోవడానికి ఇష్టపడతారట. పిల్లల తలనీలాలు కూడా సమర్పించుకుంటారు.
టూరిస్టుబస్సుల్లో వచ్చి ఇక్కడే వండుకుని, స్నానశాలల్లో స్నానాదికాలు ముగించుకుని,
కఠోరమైన ఉపవాసాలతో ఆలయ దర్శనం చేసుకుంటారు. ఆలయ పరిసరాల్లో మాత్రం చాలా హోటళ్ళు...
ప్యూర్ వెజిటేరియన్..అన్న బోర్డులు పెట్టుకుని... ఉల్లిపాయ,
ఎల్లిపాయ(వెల్లుల్లి)లు కూడా లేకుండా భోజన ఏర్పాట్లు చేస్తుంటాయి.
శివుడు
యోగస్వరూపునిగా కనిపించే గోరక్షానాథ్ మందిరంలో అత్యంత నియమనిష్ఠలతో పూజాదికాలు
నిర్వహిస్తుంటారు. అఖండ జ్యోతి, అఖండ ధునా ఉన్నాయి అర్థరాత్రి దాటిన తరువాత
ఒంటిగంటకల్లా మహంతుల ప్రతినిథులుగా పూజార్లు శుచీ శుభ్రతలతో ఆ ప్రాంగణంలోని గురువుల విగ్రహాలతోపాటూ...అన్ని ప్రతిష్ఠిత దేవతామూర్తుల(లోపల
దుర్గా మందిర్, హనుమాన్‌జీ మందిర్ వంటివికూడా ఉన్నాయి) పూజలకు సిద్ధంగా ఉంటారు. వేకువఝూమున 3
గంటలకు ముందే నిర్మాల్యం తొలగించడం వంటివన్నీ పూర్తి చేసుకుంటారు. అక్కడినుంచి
ఉషోదయం వరకు శ్రీనాథ్ కు, ఇతర దేవీదేవతలకు అభిషేకాలు, హారతులు, ఘంటలు-డమరుకనాదాలతో
మంత్రాలు సుస్వరంతో పలుకుతూ పూజలు చేస్తారు. గోరఖ్‌పూర్‌లో ఈ పూజలు ముగిసే
సమయానికి ఈ మందిరాలతో సంబంధమున్న తులసీపూర్(ముజఫర్ నగర్) దేవీపాటన్
మందిర్లో పూజలు ప్రారంభమవుతాయి. అవి ముగిసే సమయానికి దాంజ్ఞ్ లో(నేపాల్) పూజలు మొదలవుతాయి. అంటే ఈ మూడుచోట్ల 24 గంటలు నిర్విరామంగా పూజాదికాలు జరుగుతూనే ఉంటాయి.
గోరఖ్‌పూర్‌లో
పూర్వోత్తర్ రైల్వే(ఈశాన్య రైల్వే) ప్రధాన కార్యాలయం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన
నగరాలకు రైళ్ళున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకూ బస్సు సౌకర్యం ఉంది. విమానాశ్రయం
ఉంది. గోరఖ్‌పూర్ నుంచి 60 కి.మీలలో కుశీనగర్ వస్తుంది. ఇది బుద్ధుడి మహాపరినిర్వాణ ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు పవిత్రంగా భావించే నాలుగు ప్రదేశాల్లో ఇది ఒకటి.మిగిలిన మూడు లుంబిని(జన్మస్థలం), బుద్ధగయ(జ్ఞానోదయం అయిన ప్రదేశం), సారనాథ్(కాశీ దగ్గర...మొదటి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం). గోరఖ్‌పూర్ నుంచి మరో దిశలో 90 కి.మీలలో నేపాల్ (అంతర్జాతీయ) సరిహద్దు పట్టణం సునౌలీ వస్తుంది.. నేపాలీయులు దీన్ని బేలాహియా అంటారు. గోరఖ్‌పూర్ నుంచి లుంబినీ ప్రాంతానికి రోడ్డు మార్గంలో 2గంటల్లో చేరుకోవచ్చు. నేపాల్‌లో ప్రవేశించడానికి వీసా అక్కర్లేదు గానీ పాస్‌పోర్టు తప్పనిసరి.
చరిత్ర
క్రీ.పూ.
6వ శతాబ్దంనాటి మగధ సామ్రాజ్యంలోని 16
మహాజనపదాల్లో గోరఖ్‌పూర్ ఒకటి. తరువాత
వచ్చిన మౌర్య, శృంగ, కుషాణ్, గుప్త, హర్ష సామ్రాజ్యాల్లో కూడా ఇది ఒక
భాగంగా ఉంది. గోరఖ్‌పూర్ జనపదంలోకి ప్రస్తుతం ఉన్న మహరాజ్‌గంజ్, కుశీ
నగర్, దేవరియా, అజంగఢ్, మావు, బల్లియా, నేపాల్ తెరాయ్
లోని కొన్ని భాగాలు వస్తాయి.
గోరఖ్‌నాథ్
11వ శతాబ్దానికి చెందిన వాడని ఒక వాదన కాగా త్రేతాయుగంలో తపస్సు చేసుకున్నట్లు
ఆధారాలున్నాయని వారి ప్రచారసామాగ్రిలో ఉంది. దీని ప్రకారం ... సామ్రాట్ అశోక్,
కనిష్కుడు, హర్షుడికాలాల్లో దేశ ప్రతిష్ఠ ఎలా ప్రపంచవ్యాప్తమయిందో అలాగే విక్రమ
శకం 8వ శతాబ్దానికి ముందే నాథ్ పంథా(సంప్రదాయం) ద్వారా యోగ ను అనేకులు సాధన
చేసేవారట. మహమ్మద్ ఖిల్జీ, తరువాత ఔరంగజేబు వంటి వారు గోరఖ్‌పూర్ ఆలయాలను ధ్వంసం
చేసారనీ... విక్రమ శకం 19వ శతాబ్దంలో మహంతుల నుంచి ప్రస్తుత యోగి ఆదిత్యనాథ్
(ముఖ్యమంత్రి) వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి జీర్ణోద్ధరణ అద్భుతంగా చేసి సర్వాంగ
సుందరంగా తీర్చిదిద్దారని వారి అధికారిక సమాచారం. 2014లో తన గురువు అవైద్యనాథ్ మరణం తరువాత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ మఠానికి మహంత్(ప్రధాన పూజారి)గా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు.
నాథ్
సంప్రదాయం
గోరఖ్
నాథ్ ప్రవేశ పెట్టిన నాథ్ సంప్రదాయంలో నాథ్ ఒక యోగి. దర్శనీయోగి లేదా కన్‌ఫట్ యోగి
అనే పేర్లతో వ్యవహరిస్తారు. యోగి లక్ష్యం –
నాథ్ లేదా స్వామి కావడం.. ప్రకృతిని జయించినప్పుడే అది సాధ్యం అవుతుంది. అలా
కావాలంటే... నైతికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా క్రమశిక్షణతో జీవితం గడపాలి.
అన్ని విషయాల్లో నియంత్రణ సాధించాలి. అంటే అన్ని సిద్ధులను బాహ్యంగా, ఆంతరంగికంగా,
అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు భవ బంధాలు, కష్టసుఖాలకు అతీతంగా ఉండగలుగుతాడు.
ఈ
సంప్రదాయంలోని యోగులు, సిద్ధులు అడుగుపెట్టని చోటు భారతదేశంలోనే లేదు.. 15వశతాబ్దంనాటి
హఠయోగ ప్రదీపిక, 17వ శతాబ్దం నాటి శివసంహిత, ఇదేకాలానికి చెందిన ఘేరండ సంహితలు హఠ యోగాన్ని లేదా హఠవిద్యను విపులంగా
తెలియచేసాయి. గోరక్షానాథ్ రాసిన ‘గోరక్ష సంహిత’ నుకూడా కొందరు పండితులు ఈజాబితాలో చేర్చారు.
దీనికి
కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఎవరూ చూడకుండా, వినకుండా ఉండడానికి శివుడు
ఒక ఒంటరి దీవిని ఎంచుకుని హఠయోగ రహస్యాలను పార్వతీదేవికి ఏకాంతంలో బోధిస్తాడు.
అయితే ఇదంతా ఒక చేప నిశ్చలచిత్తంతో విని సిద్ధపురుషునిగా మారుతుంది. ఆయనే
మత్స్యేంద్ర నాథుడు. ఆయన తన శిష్యుడు గోరక్షానాథ్‌కు, చౌరంగి
అనే మరొక కాళ్ళూచేతులూ లేని వ్యక్తికి బోధిస్తాడు. ఇక ఆ తరువాత గురుశిష్యపరంపరలో
చాలామంది హఠ యోగులు దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. అయితే దీనికి అధిక
ప్రజాదరణ కల్పించిన ఘనత మాత్రం గోరక్షానాథ్‌దే. ఆయన దీని మీద చాలా గ్రంథాలు
రాశారు. అవి..గోరక్ష సంహిత, సిద్ధ సిద్ధాంత పద్ధతి, గోరక్షాటక, యోగ మార్తాండ, యోగ
చింతామణి. వీటిలో సంస్కృతంలో వెలువడిన సిద్ధసిద్ధాంత పద్ధతి గ్రంథంలో ‘అవధూత’ అంశానికి సంబంధించి చాలా సమాచారం ఉందట.
హఠయోగ
సంహిత,
ఘేరండ సంహితల్లో 35మంది అద్భుత హఠయోగసిద్ధుల
ప్రస్తావన ఉంది. వారిలో ఆదినాథ్, మత్య్సేంద్రనాథ్, గోరక్షానాథ్ ఉన్నారు. అంతేకాక షట్కర్మ, ఆసన,
చక్ర, కుండలిని, బంధ,
క్రియ, శక్తి, నాడి,
ముద్రలతోపాటూ ఇతర అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంది. అవధూత
పంథాలో నాథ్ సంప్రదాయం ఉంది. ‘అవధూతగీత’ దీనిని విపులంగా
చర్చించింది. గోరక్షానాథ్, మచ్ఛేంద్రనాథ్ లను టిబెట్ బౌద్ధగ్రంథాలు ‘మహాసిద్ధులు’గా, అనంత శక్తిమంతులుగా కీర్తించాయి.
నాథ్‌లలో
ఆదినాథ్ అంటే మహాశివుడు. మహాదేవుడే తొలి నాథ్. నవనాథ్‌లు గురుపరంపరలో
తొమ్మిదిమంది. దత్తాత్రేయ మహర్షితో ఈ సంప్రదాయం మొదలవుతుంది. 1.మత్స్యేంద్రనాథ్ 2. గోరక్షానాథ్
(గోరఖ్ నాథ్) 3. జలంధర్ నాథ్ (జన్ పీర్) 4. కనీఫ్ నాథ్ 5. గెహనీ నాథ్ (గైబీ పీర్) 6.భార్తరీ నాథ్ (రాజా భార్తరీ) 7. రేవణా నాథ్ 8.
చార్‌పతినాథ్ 9. నాగ్ నాథ్ (నాగేష్ నాథ్).
వీరిని నవ నారాయణులని కూడా అంటారు. ప్రాపంచిక కార్యకలాపాల పర్యవేక్షణకు
శ్రీకృష్ణుడు నవ నారాయణులను పిలిచి వారితో నాథ్ సంప్రదాయాన్ని ప్రారంభింపచేసాడని
మరొక కథనం.
నాథ్
సంప్రదాయం..గురుశిష్య పరంపరానుగతంగా కొనసాగుతుంది. గురువు నుండి దీక్ష
తీసుకున్ననాటి నుంచే ఈ సంప్రదాయంలో చేరినట్లు లెక్క. గురువు శిష్యుడి శరీరాన్ని
తాకి తన ఆధ్యాత్మిక శక్తిలో కొంత భాగాన్ని మంత్ర సహితంగా ధారపోస్తాడు.తద్వారా
కొత్తగా నాథ్ అయిన శిష్యుడికి కొత్తపేరు పెడతారు. ఈ ప్రక్రియలో గురుశిష్యులు
దిగంబరులుగానే ఉంటారు. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత జీవితాంతం అతను
నాథుడే.దాన్ని స్వయంగా వదిలించు కోలేరు. వేరొకరికి అప్పగించడంకూడా కుదరదు.
నాథ్
సంప్రదాయాన్ని కూడా 12 పంథాలుగా విభజించారు. 1. సత్య నాథ 2. ధరమ్‌నాథ 3. దారియానాథ
4. ఆయినాథ 5. వైరాగ కీయా 6. రామాకే 7.కపిలాని 8. గంగానాథీ 9.
మన్నాథీ 10. రావల్‌కే 11.పావాపంథ్ 12.పాగ్‌లా పంథీ. మరో వర్గీకరణ ప్రకారం
మచ్ఛీంద్రనాథ్, ఆదినాథ్, మీనా నాథ్,
గోరఖ్‌నాథ్, ఖపర్‌నాథ్, సత్‌నాథ్, బాలక్‌నాథ్, గోలక్
నాథ్, విరూపాక్ష్‌నాథ్, భర్తృహరినాథ్,
ఐనాథ్, ఖేచార్‌నాథ్, రామచంద్రనాథ్
అని ఉంది.
యోగవిద్య
‘‘అణుయుగంలో యోగవిద్య(ముఖ్యంగా క్రియాయోగం) గురువు మార్గదర్శకత్వంలో సాధన చేయ వలసిందే తప్ప అచ్చులో వచ్చింది చదువుకుని సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించడానికి వీలుకాదు’’ అంటాడు పరమహంస యోగానంద తన ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకంలో.
మనకు దూరంగా
బతుకుతున్న మన దగ్గరి చుట్టాలు(సిద్ధులు, అవధూతలు, నాగసాధువులు...)
https://rajabhayya.blogspot.com/2025/01/blog-post.html?spref=tw
...........
నా కాశీ యాత్ర - 1 (ప్రయాగ రాజ్‌లో...రాజకీయం)
https://rajabhayya.blogspot.com/2025/04/1.html?spref=tw
నా కాశీ యాత్ర-2 (వారణాశిలో.. అయోమయం)
https://rajabhayya.blogspot.com/2025/04/2.html?spref=tw
నా కాశీ యాత్ర-3 (అయోధ్యలో... అపచారం)
https://rajabhayya.blogspot.com/2025/04/3.html?spref=tw
నా కాశీ యాత్ర-4 (స్మశాన భస్మంతో కాశీలో హోళీ...)
https://rajabhayya.blogspot.com/2025/04/4.html?spref=tw
నా కాశీ యాత్ర-6 (గీతా ప్రెస్-గోరఖ్‌పూర్)
https://rajabhayya.blogspot.com/2025/04/6.html?spref=tw
నా కాశీ యాత్ర-7(ధన్యవాదాలు)
https://rajabhayya.blogspot.com/2025/04/7.html?spref=tw
...................