భజన చేసే విధము తెలియండీ ....

  

భజన చేసే విధము తెలియండీ..

ఓ సోషల్ మీడియా జనులార మీరూ..

నిజము కనుగొని మోదమందండీ...

...   ...

జ్ఞానులనుకొని ఎగిసి పడకండీ..

ఓ సోషల్ మీడియా జనులార మీరూ..

జ్ఞానులనుకొని ఎగిసిపడి

అజ్ఞానములను బట్టబయలు చేసుకోకండీ...

*    *    *

  

గాడిదలూ, గుర్రాలూ....

పహల్ గాఁవ్ లో ఒక దుర్ఘటన జరిగింది. ఇది కేవలం రాజకీయపరమైనదే కాకుండా, మతమౌఢ్యం కూడా దీనిలో ఇమిడి ఉంది. సర్వ సాధారణంగా ఇటువంటివి జరిగినప్పుడు అది కూడా మనం బాధితుల పక్షాన నిలబడినప్పుడు మతాభిమానం సహజంగానే బుసకొడుతుంది. అయితే దానిని నియంత్రించుకుని... మొదటగా బాధితులకు సాంత్వన చేకూరుస్తూ మొత్తం దేశ ప్రజలు వారికి అండగా నిలబడడం మొదటి కర్తవ్యమయితే...ఇటువంటి రాక్షస చేష్ఠలు మరో మారు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అంతే ప్రాధాన్యతతో చేపట్టవలసిన బాధ్యత.

 అయితే  ఈ రెంటినీ పక్కనబెట్టి... ముష్కరులతో సమానంగా .. నిజానికి అంతకంటే కూడా రెచ్చిపోయి మతమౌఢ్యాన్ని ప్రదర్శించడంవల్ల గాడిదలకూ, గుర్రాలకూ తేడాలేకుండా పోతున్నది.

 *    *    *

 అంత ప్రళయాలేవీ అక్కర్లేదు....

‘‘మతములన్నియు మాసిపోవును

జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును.....’’

లోకంబులు లోకేశులులోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెంజీకటి.... అంత స్థాయిలో ప్రళయాలేవీ రానక్కర లేదు. ఒక మోస్తరు భూకంపం, ఒక సునామీ, ఆకస్మికంగా అర్థరాత్రి విరుచుకుపడిన వరద చాలు.... మన కళ్ళముందే మతాలన్నీ మాసిపోయి... ఆత్మజ్ఞానం నిలిచి వెలగడానికి.

 *    *    *

 ఏ మతం కూడా నూటికి నూరుపాళ్ళూ పర్ఫెక్ట్ కాదు... అని రూఢీగా చెప్పడానికి... ప్రతి మతంలో పుట్టుకొచ్చిన కుంపట్లే ప్రబల సాక్ష్యం. ఒక కుంపటి మరో కుంపటిని ఒప్పుకోదు.

ఇస్లాంలో- షియా, సున్నీలు ;

క్రైస్తవంలో -రోమన్ కాథలిజం, ఈస్టర్న్ ఆర్థొడాక్స్, ప్రొటెస్టంటిజం ;

బౌద్ధంలో- థెరవాడ, మహాయాన, వజ్రయాన ;

 జైనంలో- శ్వేతాంబరులు, దిగంబరులు ;

సిక్కిజంలో ఖల్సా, నాంధారీ, నిరంకారీ, నిహాంగ్(దళ్ ఖల్సా) వగైరా వగైరా...

 

 ఇక మన కింది నలుపెంతో.....

 హైందవంలో వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, గాణపత్యులు, కాపాలికులు...ఇంకా చాలా శాఖలున్నాయి. ఒకటంటే మరొకదానికి నిప్పులో ఉప్పే...ఎంతగా అంటే...

రామజన్మభూమి కోసం బాబ్రీ మసీదును కూలగొట్టి రామ మందిరాన్ని నిర్మించుకున్నట్లే... భారతదేశం మొత్తం మీద ఎన్నో  శివాలయాలను వైష్ణవాలయాలుగా, వైష్ణవాలయాలను శివాలయాలుగా... ఇక తామేమీ తక్కువకాదన్నట్లు బౌద్ధులు, జైనులు వీటిని వారి ఆలయాలుగా మారిస్తే, ప్రతీకారంగా వారి స్థూపాలు, ఆలయాలు శైవ, వైష్ణవ, శక్తి మందిరాలుగా... మారిపోవడం  ... ఇదే కదా తవ్వే కొద్దీ రాశులుగా రాశులుగా కనబడే మన చరిత్ర.. ఘన చరిత్ర.

 కేవలం శైవ మత దురభిమాని లేదా కేవలం వైష్ణవ మత దురభిమాని మతోన్మాది అయినప్పుడు

 శైవాన్ని, వైష్ణవాన్ని, శాక్తేయాన్ని... ఇలా అన్నింటిని అభిమానించేవాడు  సెక్యులరే అవుతాడు... 

అంటే లౌకిక వాదే... అదేదో అంటరాని పదం కాదు.

 దీనిని మర్చిపోయి ఇతర మతాలమీద దాడి చేసే ముందు ... తాలిబన్లు, రజాకార్లకంటే మనం ఎంతో మెరుగు అని చెప్పుకోవడానికి... ఎంతో కొంత మంచి చేయడానికి ...మనం సర్వోత్తములం అని చెప్పుకోవడానికి ఏం చేస్తున్నాం ???

*    *    *

అసలు మతం, కులం ఆధారంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనకూడదని, ప్రచారం చేయకూడదన్న ఎన్నికల  మౌలిక నియమావళికి ప్రతి ఎన్నికల్లో పాతరేస్తాం.  ఆ పాతర సక్రమంగా వేయడానికి మన మనుషులను అక్కడ నిలబెడతాం. అయినా కోర్టులు అడ్డొస్తున్నాయని వాటి కాళ్ళూ చేతులు కట్టేసి  నడిబజార్లో, నగ్నంగా నిలబట్టి బండ బూతులు తిడతాం.

*    *    *

ఇటువంటివే ప్రాంతీయాభిమానం, భాషాభిమానం కూడా. మనం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ అన్ని హక్కులు పొందవచ్చు. మన ప్రాంతంలోమటుకు ఇతరులకు  నోరెత్తే స్వేచ్ఛ కూడా ఇవ్వం. మేం అధికారంలో ఉన్న రాష్ట్రంలో మా భాష ను నిర్బంధంగా ఎక్కిస్తాం. ఇతర రాష్ట్రాల్లో అలా చేస్తే తాట తీస్తాం... ఇదేం ధోరణి ???

*    *    *

అందువల్ల కులాభిమానం, మతాభిమానం  మన కుటుంబాలకే పరిమితం చేసుకుందాం.  అలా అందరూ చేసేవిధంగా పోరాడదాం. ప్రభుత్వాలలోకి, పాలనలోకి అవి రాకుండా జాగ్రత్తపడదాం. రాజులయినా, మంత్రులయినా, రాజకీయ దురంధరులయినా, వారి తైనాతీలయినా  కుల, మత, ప్రాంత, భాషా రాజకీయాలు చేస్తే నరికి పోగులు పెడదాం.

*    *    *

ఏ ఇతర మతంలో లేనిది... కేవలం సనాతన ధర్మంలో విశిష్ఠంగా కనబడేది... ప్రశ్నించడాన్ని ప్రోత్సహించడం.  తప్పు ఎవరు చేసినా అస్మదీయులు చేసినా, తస్మదీయులు చేసినా ... ప్రశ్నించగలగాలి. అస్మదీయులను ప్రశ్నించకపోగా భజనలు చేస్తూ వెనకేసుకొచ్చేవాడికి... సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు కూడా ఉండదు.

-ములుగు రాజేశ్వర రావు

.......

 

 

2 కామెంట్‌లు:

  1. ఇంత వివరణాత్మకంగా ఎవరూ రాయలేదు.అందరిని తీవ్రంగా ఆలోచింప చేశఈవిషయం.ఆచరణలో కూడా పెట్టాలి.
    చాలా చాలా బాగుంది

    రిప్లయితొలగించండి

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...