ఆంధ్రలో పేర్ని నాని-రవీంద్రనాథ్ ఎపిసోడ్...
దిగజారుడు రాజకీయాలలో ఇవే చివరివా..?
...చివరివే... అని గుండెమీద చెయ్యేసుకుని చెప్పగలిగిన తెలుగువాడు ఒక్కడూ
కనిపించడు. ఇవే చివరివయినా కాకపోయినా- ఇంతకంటే నికృష్టస్థాయి రాజకీయం ముందున్నదని
చెప్పడానికి కూడా ఏ ఒక్క తెలుగువాడూ వెనకాడడు.
మరి ఈ జీడిపాకం సీరియల్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తూ పోతుంటే... రేపు ఆ పాత్రల్లో మన
పిల్లలు, వారి పిల్లలు కూడా కనిపిస్తారు కదూ !!!
అమ్మో, మన పిల్లలా ??? ఆ బురదలోనా... ఆ పెంటకుప్పల్లోనా ???
అలా జరగకూడదనుకుంటే... దీనిని పూర్తిగా చదవండి. కొత్త విషయాలేవీ చెప్పడం లేదు. మీరు మరిచిపోయినవి, మరుగునపడినవే... మరో మారు గుర్తు చేస్తున్నా... భయపడకండి. పైపైనే .. అదీ వీలయినంతగా కుదిస్తా....
మూలాల్లోకి ఒక్కసారి తొంగి చూద్దామా !
25 ఏళ్ళ వెనక్కి... ఫ్లాష్
బ్యాక్.... తెలుగు నాట... ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాల తరహా గూండాగిరీ,
తిట్లు అప్పుడు లేవు. కానీ అంతకుముందు
సీన్ మరోరకంగా ఉండేది. ఫ్యాక్షన్ రాజకీయాలు.. అవి ఎక్కడో ఎప్పుడో జరుగుతుండేవి. ఎక్కడ
జరిగినా... దాని మూలాలు ఒకటి రెండు జిల్లాల్లో కనిపించేవి. తరువాత వెన్నుపోటు
రాజకీయాలతో నైతికంగా కిందకు జారడం మొదలయింది. మీడియాలో విలువలు(తిరోగమనంలోఉన్నవి) చాలా స్పీడ్‌గా
పతనం కావడం కూడా అప్పటినుంచే అనుకోవచ్చు.
ఇలా సాగిపోతున్న రాజకీయాన్ని ఒక కీలకమలుపు తిప్పింది తెలంగాణ ఉద్యమం.
ఇక్కడ రాజకీయాలకు, ఉద్యమానికీ మధ్య ఉన్న సన్నటి రేఖను జాగ్రత్తగా గమనించండి.
1969లో ఉద్యమం ఒక ఆకాంక్షతో, ఒక లక్ష్యంతో
మొదలయింది. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పెట్టి ఉద్యమానికి రాజకీయ
సారథ్యం వహించిన తరువాత ఉద్యమం ఆయన చెప్పుచేతల్లోకి పోయింది... దాని తీవ్రతను
కోల్పోయింది. 2000 తరువాత ఉద్ధృతం అయిన రెండోదశ ఉద్యమం కూడా అదే లక్ష్యంతో, అదే ఆకాంక్షతో మొదలయి... ఫక్తు
ఉద్యమ లక్షణాలతోనే సాగింది. అయితే 1969 నాటి పీడకల దృష్ట్యా... రాజకీయ సారథ్యం పట్ల ఉద్యమకారుల్లో భయాందోళనలు, అనుమానాలు నెలకొనకుండా ఉండడానికి కాసింత మార్పు జరిగింది.
2000 తరువాత - తెలంగాణ రాష్ట్ర
సమితి అని రాజకీయపార్టీగా పెట్టినా...కేసిఆర్ తనది ఉద్యమపార్టీ అని
ప్రకటించుకుని... ఉద్యమానికి సమాంతరంగా నడుపుతూ వచ్చాడు. అంటే ఉద్యమ సారథ్యం
ఉద్యమకారుల చేతుల్లోనే ఉంచి.. దానికి మద్దతుగా ఉంటూ రాజకీయంగా కెసిఆర్ తన బలం
పెంచుకుంటూ పోయాడు. చివరకు క్లయిమాక్స్ లో (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం
అవుతున్న సమయంలో) అంతా కలగాపులగం చేసి లక్ష్యం సాధించేసాం కాబట్టి ఉద్యమ పార్టీ ఇక
రాజకీయ పార్టీ అని ప్రకటించేసి... సమాంతరంగా నడిచిన ఉద్యమానికి, దాని సారథులకు మరో
ఉనికి లేకుండా కనికట్టు చేసేసాడు.
మరి ఈ విషయం ఉద్యమ సారథులకు తెలియదా ?
వారు అలా అకస్మాత్తుగా ఎలా తప్పుకున్నారు ?
ఎందుకు మౌనం దాల్చారు ?
ఇవేమీ బేతాళ ప్రశ్నలు కావు.
అయితే కాస్త లోతుల్లోకెళ్ళి చూడాల్సి ఉంటుంది....
అంత వీజీ కాదు: ఒక బహిరంగ సభ పెట్టాలంటేనే ఒక రాజకీయ పార్టీకి ఖర్చు
లక్షల్లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే కదా ! మరి అటువంటిది ఒక ఉద్యమాన్ని
అన్ని రోజులు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు బతికించాలంటే దానికెన్ని నిధులు
కావాలి ! ఉద్యమం అంటేనే ప్రాణాలకు తెగించి
పోరాడే వందలు, వేల కార్యకర్తలు, గొడవలు, అల్లర్లు, అరెస్టులు, కోర్టులు, హింస,
దౌర్జన్యం, ఆస్పత్రులు... కనీసంలో కనీసం
అరెస్టయిన కార్యకర్తల్ని బెయిలిచ్చి విడిపించడం కూడా చాలా పెద్ద తలనొప్పి
వ్యవహారం, పొద్దున లేచిన దగ్గరనుండీ అంతా ఖర్చే... నిధులొక్కటే కాదు, పోలీస్
స్టేషన్లు, కోర్టులు, ఆస్పత్రుల చుట్టూ తిరగడాలూ... చాలా శ్రమతోకూడిన వ్యవహారం కదా
! ... అని చెప్పి మధ్యమధ్యలో విరామం ఇస్తూ ఆడుతూ, పాడుతూ సాగదీసేది కూడా కాదు... పైగా బలంగా ఉండే ప్రభుత్వం, పాతుకుపోయిన
రాజకీయ పార్టీలతో పోరాటం..
నిత్యాగ్నిహోత్రంలాగా సాగాల్సిందే...
దారి మళ్ళింపు : ఈ
విషయంలో పూర్తి అవగాహన ఉన్నవాడు కేసిఆర్. అదీగాక అప్పటివరకు చరిత్రలో జరిగిన చాలా
ఉద్యమాలను కాచివడబోసి వాటిలో మెళకువలన్నిటినీ ఆకళింపు చేసుకున్నవాడు. అందుకే
ఉద్యమానికున్న ఈ బలహీనతను తనకు అనుకూలంగా
మార్చుకోవడంమీద దృష్టి పెట్టాడు, స్వచ్ఛందంగా వచ్చే విరాళాలతోపాటూ, ఉద్యమాన్ని
సాకుగా చూపి వ్యాపారులను, పెట్టుబడిదారులను బెదిరించి వసూలు చేసిన నిధులను తన
రాజకీయపార్టీకి మళ్లించాడు. నిజానికి ఉద్యమం తాలూకు జెఏసీల ఖాతాల్లోకి
వెళ్ళాల్సినవి ఇవి.
అయినా ఉద్యమకారులకు అనుమానం రాకుండా...తనను వేలెత్తి చూపడానికి
అవకాశం ఇవ్వకుండా... ఉద్యమం ఖర్చు భరిస్తూనే, ఉద్యమకారుల ఆస్పత్రి, కోర్టు, పోలీస్
స్టేషన్ వ్యవహారాలు, జరిమానాలు, జామీనులు తదితరాలు చూడడానికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగం ఏర్పాటు చేసాడు ఈ
నిధులతో.. దీనితో ఉద్యమకారులకు కార్యాచరణలో వెసులుబాటుతో పాటూ మరింత భరోసా దొరికింది.
కానీ వాళ్ళు అప్పుడు గుర్తించనిది... వసూళ్ళు ఏ స్థాయిలో... ఖర్చు ఏ స్థాయిలో
ఉన్నాయి..అన్న విషయం .. అసలు అడిగే ధైర్యం వారికి నైతికంగా లేకుండా చేసాడు. ఉద్యమ సారథుల
సంగతి తెలియదు కానీ గంపగుత్తగా ఉద్యమకారులంతా... కేసిఆరే ఉదారంగా తమ ఖర్చులన్నీ భరిస్తున్నాడనుకుని... విపరీతమైన కృతజ్ఞతా భావంతో పిచ్చి అభిమానం పెంచుకున్నారు. అందుకే క్లయిమాక్స్ లో ... అదీ కూడా అందరూ విజయం
తాలూకు మత్తులో, జోష్ లో ఉన్నప్పుడు ఇక ఉద్యమ పార్టీ అవసరం లేదంటూ ఉద్యమాన్ని హూష్
కాకీ చేసి, కీలకంగా పనిచేసిన ఉద్యమ సారథులను.. వాడేసిన నిరోథ్ ల్లాగా ముక్కు మూసుకుని దూరంగా విసిరేసి, తన రాజకీయ పార్టీకే అన్ని రకాల క్రెడిట్ అధికారికంగా దక్కేట్లు
చూసుకున్నాడు. (గమనిక – తెలంగాణ రాష్ట్రం
ఏర్పాటులో కేసిఆర్ శ్రమను, చొరవను, వ్యూహాల్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఆయన లేకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాకారమయ్యేది కాదు. అది వేరేగా ప్రస్తావించుకోవాల్సిన విషయం)
బులెట్ దిగిందా ? లేదా ?
జబ్బు దేనితో తగ్గిందనేది ఎవడికి కావాలి ? మూలికలతోనా, మంత్రాలతోనా, మందులతోనా... దేనితోనయినే ఏం...దేనితో తగ్గిందో అదే
మందు. పోరాటం చేస్తున్నప్పుడు... ఏ వ్యూహం
అయితే ఏం ... లక్ష్యం నెరవేరిందా లేదా ... అన్నంతవరకే... అది నైతికమా, అనైతికమా అని ఆలోచించి ఎవరూ
మార్కులేస్తూ కూర్చోరు కదా... ఇది కేసిఆర్
తన వ్యూహాల అమలులో పాటించిన సిద్దాంతం. బహిరంగంగానే మీడియాకు, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మెడలో పలుపుతాడు వేసి దొడ్లో కట్టేసుకున్నాడు. దానితోపాటూ, తెలంగాణ రక్తం
వారిలో ప్రవహిస్తూన్నప్పటికీ సమైక్యవాదం వినిపిస్తున్న తెలంగాణ ప్రముఖులను వ్యక్తిగతంగా
బెదిరించి నోరు మూయించడం(దాశరథి రంగాచార్యలాంటి వారే లబోదిబోమన్నారు) వంటి వ్యవహారాల
వరకూ ఒక ఎత్తయితే...
కాంగ్రెస్, బిజెపి లాంటి జాతీయ రాజకీయపార్టీలకు చెందిన రాష్ట్ర నాయకుల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న
సమైక్యవాదులను దారికి తెచ్చుకోవడం మరో ఎత్తు. ఒక
ప్రాంతీయ పార్టీ నాయకుడికి అది అంత సులభం కాదు. దానికి కెసిఆర్ అనుసరించిన అద్భుత వ్యూహం
ఒకటి ఉంది... ఏ ఇతర రాజకీయ పార్టీలుకానీ, నాయకులు కానీ పెట్టే బహిరంగ సభలను,
ప్రెస్ మీట్లను ఉద్యమకారులతో అడ్డుకునేటట్లు చేసాడు. ఆ నాయకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా
‘జైతెలంగాణ’ అనిపించేటట్లు చేసాడు. ఈ
వ్యూహం ఎంతగా సక్సెస్ అయిందంటే వారు బహిరంగ సభలు, ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా భయపడే
పరిస్థితి సృష్టించాడు.
ఇవిగాక ఆంధ్ర దోపిడీ, తెలంగాణ నష్టాలకు సంబంధించి ఏవి నిజాలో, ఏవి
అబద్ధాలో తెలియనంతగా ఉద్యమకారుల చేత ఏవో గణాంకాలతో, ఏవో ఫొటోలు, ఛార్టులు, చారిత్రక సమాచారం జోడించి పత్రికా ప్రకటనలు, ఇంటర్వ్యూలు,
పదేపదే ఇప్పించేవాడు. తనూ అలాగే మాట్లాడేవాడు.
ఏ ఆంధ్ర నాయకుడయినా, ఏ ఆంధ్ర మేధావి అయినా ఆ గణాంకాలు తప్పు అని చెబుతూ ఒక్క ప్రకటన ఇస్తే చాలు... దానిని ఖండిస్తూ తన పార్టీ నాయకులు, ఉద్యమ సారథులు పలువురి చేత
ప్రతి రోజూ పదేపదే వందల ప్రకటనలు గుప్పించేవాడు. (అలాగే ఓటర్ల జాబితానుంచి పేర్లను పెద్ద
సంఖ్యలో గల్లంతు చేసే వ్యూహం కూడా.)
అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించే భావన ఎక్కడా కలికానికి కూడా కనబడకుండా కట్టుదిట్టం చేసిన వ్యూహం ఇది. అంతవరకు ఓకే.
అయితే అప్పుడు ఉద్యమం అవసరాల రీత్యా సృష్టించి విజయవంతంగా అమలుచేసిన ఆ వ్యూహాలు... ఉద్యమం లేనప్పుడు కూడా అవే ... అలాగే చెల్లుబాటు అవుతాయా...???
తడిగుడ్డలో రాళ్ళు పెట్టి కొడితే...
... రాళ్ళు కనిపించవు. పైకి కనిపించేది గుడ్డ మాత్రమే...కానీ కనిపించని రాళ్ల దెబ్బ మాత్రం గట్టిగా తగులుతుంది.
ఈ వ్యూహాలన్నీ విజయవంతం ఎలా అయ్యాయి !!!
కేవలం పైకి కనిపించిన కేసిఆర్ వ్యూహరచనతో
కాదు. వీటిలో అనైతికమైనవి కూడా చాలా ఉన్నప్పటికీ... అన్ని వ్యూహాల విజయం వెనుక తెలంగాణ ఉద్యమ బలం ఉంది. కానీ ఈ విషయం క్రమేణా అందరూ మర్చిపోయారు... చివరకు
కేసిఆర్, ఆయన పార్టీ కూడా. అధికారంలో ఉన్నా,
లేకపోయినా .. ఆ బలం తమ బలమే అనుకున్నారు. ఇప్పటికీ అలాగే అనుకుంటున్నారు. అహం బ్రహ్మస్మి లాగా... నేనే తెలంగాణ, నన్ను తిడితే, నా వాళ్లను
తిడితే తెలంగాణను తిట్టినట్టే ...అంటుా తెలంగాణ సమాజం తాలూకు హక్కు మాకే భుక్తం అనే
భ్రమల్లో ఉంటూ ఆ మేరకు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు.
భ్రమల్లో ఉన్నారని ఎలా చెప్పొచ్చు... ఆ పార్టీ నాయకుల ప్రసంగాల్లో- ప్రతి 10 మాటల్లో 8మాటలు ఈ వైఖరిని
చూపుతుంటాయి. వీరి హక్కు భుక్తం మాట
దేముడెరుగు... అప్పుడు ఉద్యమ సందర్భంలో విజయవంత మయిన వ్యూహాలన్నీ ... ఇప్పుడు జాతికి అంకితమయి పోయాయి. అంటే ఎవరికి వారు తమ స్వంతం చేసేసుకున్నారు. ఆ గట్టున ఉన్న
తెలుగుదేశం, వైఎస్ ఆర్ సిపి, ఇతర పార్టీలు కూడా ఇప్పటికీ ప్రత్యర్థులమీద ఈ వ్యూహాలనే కాస్త అటూఇటూగా మార్చి
అమలు పరుస్తుండడంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది.
రాజకీయ జాడ్యం
చివరకు ఇది రాజకీయ జాడ్యంగా మారింది. ప్రాంతీయ పార్టీలద్వారా మరింతగా వ్యాపిస్తున్నది. సర్వసాధారణంగా అయితే జాతీయ పార్టీల ఆర్ధిక
స్తోమతు, పార్టీ నెట్‌వర్క్ ముందు ప్రాంతీయ పార్టీలు నిలవలేవు. కానీ ప్రాంతీయ పార్టీల బలం అంతా ప్రాంతీయ భావోద్వేగాలే. వాటి ముందు ఎంత బలమున్న
జాతీయ రాజకీయ పార్టీలు కూడా నిలబడి నెగ్గుకు రావడం కష్టం. అందుకే ప్రాంతీయ పార్టీల
బాధ భరించలేక, మరో విధంగా గట్టెక్కలేని కొన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల స్థాయికి
దిగజారి పోరాడుతూ వాటి ఉనికిని అవి కాపాడుకుంటున్నాయి. అలా దిగజారలేని జాతీయ
పార్టీలు మనుగడకోసం
గిలగిలాకొట్టుకుంటున్నాయి.
ప్రాంతీయ పార్టీలవల్ల ప్రయోజనం పావుశాతం అయితే ప్రమాదం ముప్పావుశాతం
అని చెప్పొచ్చు. (తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్రల్లో ఏం జరుగుతున్నదో ఒక్కసారి చూడండి). సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే... ప్రాంతీయ
పార్టీలకు ‘ఇంటి విషయం’ మొదటి ప్రాధాన్యత, అంటే ఊరు ఎలా పోయినా ఫరవాలేదు, ‘‘ఊరి సంగతి’’ తరువాత చూసుకోవచ్చు-అనుకుంటాయి. అదే జాతీయ పార్టీలకయితే ‘‘ఊరి సంగతి’’ మొదటి ప్రాధాన్యత, తరువాతే ‘ఇంటి విషయం’ అంటాయి. ఊరు బాగుపడితే మన ఇల్లు
బాగుపడినట్టేననేది వాటి సిద్ధాంతం.
ఓ సినీ కవి చెప్పినట్లు.. . అందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలంటే
జాతీయ పార్టీల ప్రాధాన్యత పెరగాలి. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ... ప్రాంతీయ
పార్టీలు బలపడుతున్నాయి, జాతీయ పార్టీలు వీటితో నెగ్గుకురాలేక కిందామీదా
పడుతున్నాయి.
ఈ పరిస్థితి మారాలంటే...???
మరో తుఫాన్, లేదా మరో భయంకరమైన వరద వస్తేగానీ ఈ మురికి కొట్టుకుపోదు.
అప్పటివరకు మూసీ రివర్ ఫ్రంట్ అనే కోడిని... ముందున్న
కొక్కానికి వేలాడదీసి, దానిని మానస సరోవరం
అనుకుని మురిసిపోతూ-( కోట శ్రీనివాసరావు పాత్రలాగా)- ముక్కు మూసుకుని మూసీ కాల్వల్లోనే
మునకలేస్తూ తరిద్దాం.
అలా జరగకూడదనుకుంటే... విస్తృత దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని
చూస్తే.... జాతీయ పార్టీలను బలపరచడమే మార్గం.
ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిందే... కానీ జిల్లా స్థాయి వరకే వాటిని పరిమితం చేయాలి. అది
మన చేతుల్లోనే ఉంది.
-ములుగు రాజేశ్వర
రావు
....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి