సమాజంలో కుక్కల మీద పరస్పర
విరుద్ధ అభిప్రాయాలుంటాయి... విశ్వాసానికి, విధేయతకు,
సాహసానికి, భద్రతకు, తోడుకు,
హద్దుల్లేని ప్రేమకు, వాసనలు
పసిగట్టే నైపుణ్యానికి అది ప్రతీక అని కొందరు భావిస్తే... విశ్వాసరాహిత్యానికి, క్షుద్రశక్తుల సంబంధమైన వాటికి,
నీచ ప్రవృత్తికి, బానిస మనస్తత్వానికి చిహ్నం
అని మరికొందరు ఛీ కొడతారు.
వాచ్‌డాగ్
ఆఫ్ ది నేషన్... అని వింటూంటాం... అధికారంలో ఉన్నవారిపట్ల
ఒక కన్నేసి ఉంచడానికి కొన్ని వ్యవస్థలు ఉంటాయి... వాటిని వాచ్‌డాగ్ కమిటీ
అని.. వాచ్‌డాగ్ కమిషన్ అనీ... రకారకాలుగా వ్యవహరిస్తుంటాం.
మీడియాలో....
సంప్రదాయ మీడియాలో(పత్రికలు, న్యూస్ ఛానళ్ళు) తరచుగా... వాచ్‌డాగ్
జర్నలిజం, పెట్‌డాగ్/ల్యాప్ డాగ్ జర్నలిజం, ఎటాక్
డాగ్స్ అనీ ... ఇలాంటి పేర్లు తారసపడుతుంటాయి...
వాచ్ డాగ్ జర్నలిజం: అవినీతి, అక్రమాలను ధైర్యంగా బయటపెట్టడాన్ని, పరిశోధనాత్మక జర్నలిజాన్ని ఈ పేరుతో పిలుస్తుంటారు... ఈ జాతి లక్షణం ఇప్పుడు దాదాపు అంతరించే దశకు చేరుకున్నది.
పెట్ డాగ్ (పెంపుడు కుక్కలు) జర్నలిజం : యజమానుల
స్వార్థ ప్రయోజనాలకు సహకరించడం, అధికార పార్టీల వారికి, రాజకీయ
నాయకులకు, కార్పొరేట్ సంస్థలకూ తోక ఊపడం దీని లక్షణం. ఇవ్వాళ
దీనిదే రాజ్యం.
ఎటాక్ డాగ్స్ ఇన్ జర్నలిజం: మనం
న్యూస్ ఛానళ్ళలో చూస్తుంటాం. ఒక ప్రముఖుడితో ఇంటర్వ్యూ లేదా చర్చ నడుస్తుంటుంది...
ప్రశ్నలు అడిగేవాడు రెచ్చిపోయి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటాడు. అవతలివాడిని దేనికీ
జవాబు పూర్తిగా చెప్పనివ్వడు.. పోలీసు ఇంటరాగేషన్ లాగా.... తను ఆశించే జవాబు
రాబట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇటువంటి సందర్భాల్లో దీనిని వాడతారు. నిమిషానికి
40 సార్లు తిట్టుకుంటూ కూడా ప్రేక్షకులు ఇష్టంగా చూసి
ఆనందించేవి ఇటువంటివే...
మాస్ హిస్టీరియా...
మనుషులు నివాసం ఉండే ప్రతిచోటా.. ప్రతి ఊళ్ళో, ప్రతి వీథిలో
... కుక్కలు అనివార్యంగా కనబడుతుంటాయి. వీటిలో వీథి కుక్కలు, పెంపుడు
కుక్కలు కూడా ఉంటాయి. పెంపుడు కుక్కలు కేవలం యజమాని కనుసన్నల్లో తిరుగుతుంటాయి...
కానీ వీథి కుక్కలు అలా కాదు... అవి గుంపులు, గుంపులుగా
తిరుగుతుంటాయి. ప్రతి గుంపుకు ఒక పరిధి ఉంటుంది. ఒక పరిధిలో ఉండే ఒక గుంపు
చెల్లాచెదురుగా అక్కడొకటీ, ఇక్కడొకటీ పడుకొని లేదా తిరుగుతూ
ఉంటాయి. వీటిలో ఏదో ఒక కుక్క ఉన్నట్టుండి ‘భౌ’, ‘భౌ’ అని అరుస్తుంది. అది దేన్ని చూసి లేదా
దేనికోసం అరుస్తున్నదో పట్టించుకోని మిగిలిన కుక్కలు కూడా అవి ఉన్న చోటినుంచే ‘భౌ’, ‘భౌ’ అని శ్రుతి కలుపుతాయి. అప్పటికీ
మొదటి కుక్క అదే పనిగా అరుస్తుంటే... ఇక తప్పదనుకుని మిగిలినవి కూడా లేచి దుమ్ము
దులుపుకుని వీరావేశంతో మొదటి కుక్క అరిచిన దిశగా ఉరుక్కుంటూ పోయి
మొరుగుతుంటాయి. నిజానికి వాటికి అర్థం కాదు దేనికోసం మొరుగుతున్నాయో !..
ఈ బలగం భరోసా చూసుకుని మొదటి కుక్క మరింత రెచ్చిపోయి... ఇంకా ముందుకు ఉరికితే ఇవి కూడా విసుగూ విరామం లేకుండా మోర ఎత్తి భయంకరంగా అరుస్తూ దాని వెనకే పోతాయి. అవసరమయితే కరిచినంత పనిచేస్తాయి. కానీ ఇవి చీకాకు పుట్టించేటట్లు అరిచే కుక్కలే కానీ వీటికి కరిచే చొరవ, సాహసం ఉండవు. అక్కడ ఏమీ లేక, ఎవరూ కనపడక ఏదోభ్రమలోనో, భయం కొద్దో మొదటి కుక్క అరిచినట్లు అనిపిస్తే... కాసేపాగి మిగిలినవన్నీ... తలలు దించుకుని తోకలు స్లోమోషన్లో ఊపుకుంటూ వాటివాటి స్థానాలకు వెళ్లి పడుకుంటాయి. వీటివల్ల మనకు వెంటనే పెద్దగా హాని లేకపోయినా... ప్రశాంతత కరువవుతుంది. వాటి సంఖ్య పెరిగితే మాత్రం... తప్పనిసరిగా అది పెను ప్రమాదమే.
సోషల్ మీడియాలో కూడా....
మాస్ హిస్టీరియా డాగ్స్ : సోషల్ మీడియాలో కూడా అచ్చం ఇదే సీన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. మాస్ హిస్టీరియాతో ఉంటాయి కాబట్టి వీటిని మాస్ హిస్టీరియా డాగ్స్ అనవచ్చు. ఈ లక్షణాలున్న వారు ఒక సిద్దాంతానికి కానీ, కులానికి కానీ, మతానికి కానీ, వర్గానికి కానీ, అభిమాన హీరోలకు, రాజకీయ నాయకులకు గానీ విధేయత చూపుతుంటారు. కొందరు స్వతంత్రంగా వ్యవహరించినా... చాలామందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులు లేదా ఇతరత్రా ప్రోత్సాహకాలు సమకూరుతూ ఉంటాయి. వీరి పోషణ, నిర్వహణ సువ్యవస్థితం అయి ఉంటుంది. సోషల్ మీడియా వేదిక ఉచితం కావడంతో వందల్లో, వేలల్లో, లక్షల్లో సభ్యులు ఈ వ్యవస్థల పరిధిలో పనిచేస్తున్నారు.
ఎక్కడో ఎవరో ఒక పోస్ట్ పెడతారు... దానిలోని మంచీ చెడూలనూ విశ్లేషించే ఓపిక, సహనం, సామర్ధ్యం, వివేకం, పరిపక్వత ఏవీ ఉండని మాస్ హిస్టీరియా జాతి వాడి పరిమిత బుద్ధికి అది తమకు వ్యతిరేకమనిపిస్తుంది. అంతే .... వారిని తిడుతూ దానికి రిప్లయి పెడతాడు. క్షణాల్లో ఆ గుంపులోని మిగతావారు అలర్ట్ అయిపోతారు. ఒకడు చరిత్ర తవ్వుతాడు. మరొకామె తిట్లు అందుకుంటుంది. మరో పెద్దమనిషి తనకు తెలిసిన పురాణాల దుమ్ము దులుపుతాడు. ఇవేవీ తెలియని వాడు బూతులతో విరుచుకుపడతాడు. వీరు ప్రత్యర్థులపై విరుచుకుపడడానికి, రాచి రంపాన పెట్టడానికి అవసరమయిన పచ్చి దగాకోరు, నీచనికృష్ట సమాచారం - ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రూపంలో వీరికి క్షణాల్లో అందుతుంటుంది. పనికొచ్చే సరుకు లేకపోయినా, విషయ పరిజ్ఞానం లేకపోయినా, అసలు లోకజ్ఞానం లేని ప్రతివాడూ కూడా ఈ గుంపులో మేధావిలా చెలరేగిపోతుంటాడు. సభ్యసమాజం జీర్ణించుకోలేనంత జుగుప్సాకరమైన బూతులతో విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి... వారి రింగు/గ్రూపు లీడర్ల ఆశీస్సులు, రక్షణ ఉంటాయి. నిజాలు నిలదొక్కుకునే అవకాశం ఇవ్వకుం డా అబద్ధాల వరదలో కొట్టుకుపోయేటట్లు చేయడంలో.... సుశిక్షితులైన కార్యకర్తలలాగా రేయింబవళ్ళు పనిచేస్తుంటారు.
మామూలుగా అయితే వీథికుక్కల మొరుగుడుకు విసిగిపోయి సింహాలు కూడా పక్కకు తప్పుకుంటాయి... మాస్ హిస్టీరియా డాగ్స్ లక్ష్యం కూడా ఇదే... కానీ కొన్ని సింహాలు వెనకడుగు వేయవు... ఓపిగ్గా వీరి అబద్దాలను ఉతికి ఆరివేయడం మొదలుపెట్టగానే... ఒక్కొక్కటిగా ఈ కుక్కలు తోకముడుస్తాయి. వీరి భావజాలంతో ఏకీభవిస్తూ... ఉబుసుపోక కబుర్లతో అక్షరాల గారడీల్లో ఆరితేరిన ... చెయ్యి తిరిగిన రచయితలకు ఇక్కడ ఫాలోయింగ్ ఎక్కువ.
సంప్రదాయ మీడియాలో సమాచారం ఒక వైపునుంచే ప్రవహిస్తుంది. అంటే
పత్రికలు, న్యూస్ ఛానళ్ళు సమాచారాన్ని, వ్యాఖ్యానాలను, విమర్శలను జనం మీద కుమ్మరిస్తుంటాయి. జనం స్పందన ఏమిటన్నది వాటికి వెంటనే
కానీ, ఆ తరువాత కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉండదు. అదే
సోషల్ మీడియాలో అయితే సమాచారం, స్పందనలు, ప్రతిస్పందనలు, వ్యాఖ్యానాలు, వివరణలు,
సంజాయిషీలు, విమర్శలు... అన్నీ రెండు వైపుల
నుంచి.. రియల్ టైంలో ప్రవహిస్తుంటాయి. అదీ పైసా ఖర్చు లేకుండా. అందువల్ల సామాజిక మాథ్యమాలకు ఆదరణ అధికం, చాలా వేగంగా వ్యాపిస్తూ పోతుంటుంది(వైరల్).
ఇదీ అసలు రహస్యం ?
ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్(AI)... కృత్రిమ మేధ... ఇది అత్యంత అధునాతనంగా దూసుకుపోతున్నది. వర్తమానమే కాదు భవిష్యత్తు కూడా దీనిదేనట. దీనికి ఉన్న ఒక విశిష్ట లక్షణం ఏమిటంటే... స్పెల్లింగ్ తప్పుతో ఒక పదాన్ని అందరూ ఎక్కువగా ఉపయోగించే కొద్దీ... AI దానినే సరైన స్పెల్లింగ్‌గా ఆమోదించి వ్యాపింప చేస్తుంది. అలాగే ఒక తప్పుడు వార్త కూడా.... ఫలానా రాజకీయ నాయకుడి తండ్రి ఫలానా వాడు కాదనీ, ఫలానా రాజకీయ నాయకుడి డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ అని బోగస్ సాక్ష్యాలతో... ఎక్కువ సార్లు సోషల్ మీడియాలో వ్యాపింపచేస్తే చాలు... దానికి అనుకూలంగా కథనాలతో AI (GROK/ Chatbot) మరికొన్ని లక్షల రెట్లు ఎక్కువగా వ్యాపింప చేస్తుంది. సాంకేతికంగా... ప్రోగ్రామింగ్ భాషలో GROK అర్థం -...తక్షణావసరాలకు అత్యధిక సమాచారాన్ని దాని మెమొరీలోకి ఎక్కించడం- అని... అంటే మనం విత్తనం ఏదేస్తే. .. దానికి తగ్గ పంటే వస్తుంది. వ్యావహారికంగా చెప్పాలంటే... నిజం గడపదాటేలోపల అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చేటట్లు చేయడానికి దీనిని ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఈ పనిలో చురుగ్గా ఉన్నవి... మాస్ హిస్టీరియా డాగ్స్. ఇప్పుడు రాజకీయ పార్టీలు కోట్లు కుమ్మరించి నడిపే అబద్ధాల ఫ్యాక్టరీలన్నీ ఇదే బాపతు జాతికి..అంటే మన వీథికుక్కల జాతి లక్షణాలకు చెందినవి.
ఇక్కడ కూడా వాచ్ డాగ్స్ : సోషల్
మీడియాలో ఎక్కువగా కనిపించే మరో జాతి... వాచ్ డాగ్స్. ఇది
సంప్రదాయ మీడియాలో(పత్రికలు, న్యూస్ ఛానళ్ళలో) అంతరించిపోతున్నా... ఇక్కడ
మళ్లీ ప్రాణం పోసుకుంటున్నది. వీరికి చైతన్యం ఎక్కువ. సామాజిక బాధ్యత కూడా ఎక్కువ.
ఆలోచనల్లో, ఆచరణలో పరిపక్వత ఎక్కువ. సోషల్ మీడియా విశ్వసనీయత
కూడా వీరివల్లే పెరుగుతుంటుంది. ఎక్కడయినా అక్రమాలు, అవకతవకలు
కనిపిస్తే చాలు లేదా తప్పుదోవ పట్టించే వార్తలు, కథనాలు
కన్పిస్తే చాలు... నిస్వార్థంగా నలుగురి దృష్టికీ తెచ్చి అందరినీ అప్రమత్తం
చేస్తుంటారు. వీరు పనిచేసే పద్ధతిని సిటిజన్ జర్నలిజం అని కూడా అనవచ్చు.
తాజా ఉదాహరణ: హైదరాబాదులో
ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం పౌరులు ట్రాఫిక్ నియమాలను
పాటించకపోవడంవల్లేనని పోలీసులు భావించారు. కానీ వీథికో పోలీసును ఉంచలేరు కదా ...
అందుకని ఒక వాట్సాప్ నంబరు ఇచ్చారు. మీ దృష్టికి ఇటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు వస్తే
వెంటనే ఫొటో తీసి(కోర్టు ముందు నిరూపించే సాక్ష్యంకోసం) వివరాలతో పంపండి-అని
జనాన్ని కోరారు. గత ఆర్నెల్ల కాలంలో ఈ సాక్ష్యాల
ఆధారంగా 18 వేలకు పైగా కేసులను నగర పోలీసులు నమోదు చేసారు. రు.75 లక్షల మేర
జరిమానాలు విధించారు. అదీ సిటిజన్ జర్నలిజం ప్రభావం.
గుర్రపుడెక్కలాగానే .......
ఈ సిటిజన్ జర్నలిజానికి ఊపిరిపోస్తున్న సోషల్
మీడియాను సరిగా ఉపయోగించుకుంటే, వాచ్ డాగ్స్ ను సరిగా ప్రోత్సహిస్తే... పత్రికలు, వార్తా ఛానళ్ళు పాడయిపోతున్నాయని మనం బాధపడే
అగత్యం ఉండదు. మన తప్పుల్ని మనం ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ మంచి సమాజాన్ని ఆవిష్కరించుకోవచ్చు. అలాగే మాస్ హిస్టీరియా డాగ్స్ ను ఎక్కడికక్కడ నిరుత్సాహ పరచడం కూడా అంతే
అవసరం(బాధ్యతగా మునిపిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేసి మన వీథి కుక్కలను పట్టించినట్లు). లేక పోతే ‘గుర్రపుడెక్క’ మొక్కల్లాగా..
నిజాలను ఎక్కడా కనపడనీయకుండా మొత్తం కమ్మేసుకుపోతాయి.
-ములుగు రాజేశ్వర రావు
అద్భుతమైన విశ్లేషణ గురువు గారూ! హృదయపూర్వక అభినందనలు..
రిప్లయితొలగించండిధన్యవాదాలు మిత్రమా.... ఇక్కడ అందరం శిష్యులమే... నిత్య విద్యార్థులమే....
తొలగించండి