‘‘ఔను సార్.. మీరు మళ్ళీ రావాలి ... మీ అభిమానులం చాలా మందిమి మీకోసం
ఎదురుచూస్తున్నాం సార్... మీరు మా అభిమాన నాయకుడు సార్.. ఉద్యమ కథానాయకుడిగానే కాదు, ప్రజానాయకుడిగా మీరంటే మాకు పిచ్చి అభిమానం
సార్...’’
...దాదాపుగా
సగం తెలంగాణ సమాజం అంతటా మనసు పొరల్లో గుసగుసలాడుతున్న భావన ఇది.
మరి నిన్నమొన్న ఎలక్షన్లో అంత తుక్కుగా ఓడించినా...
ఇంకా ఆయనను జనం అభిమానిస్తున్నారంటారా ???
* * *
ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే ముందు ఒక విషయంలో మనం స్పష్టత
తెచ్చుకోవాలి. కథానాయకులు వేరు, రాజకీయ నాయకులు వేరు, ప్రజానాయకులు వేరు... ఇలా
చాలామంది ఉన్నా... ప్రజానాయకుల తరగతికి చెందిన వారు చాలా చాలా అరుదుగా
ఉంటారు.
ప్రజానాయకులంటే నా దృష్టిలో... ప్రజలతో సులభంగా కనెక్ట్ అయిపోవడం, తన ప్రసంగ ధాటితో ప్రజలను సమ్మోహన పరచడం, చెరువులో చేపలా జనంలో దూసుకుపోవడం, ఎంత నియంతగా ఉన్నా సమయ సందర్భాలను బట్టీ మానవత్వాన్ని
ప్రశంసనీయంగా ప్రదర్శించడం, కళాత్మక హృదయం కలిగి ఉండడం, వారి మాట వినాలనీ, చూడాలని జనం తహతహలాడిపోవడం..అలా... ప్రజలకు నచ్చడం,
వారు మెచ్చడం.... ఎన్టీఆర్, ఇందిరాగాంధీలు ఈ
కోవకు చెందినవారే. వీరిద్దరిదీ కేసిఆర్ కంటే ఎక్కువ రేంజ్... వారు కూడా
వ్యక్తిగతంగా ఏ సంక్షోభం ఎదురయినా... మరెక్కడా చెప్పుకోకుండా నేరుగా జనం లోకి
దూకేసి వారితోనే చెప్పుకోవడానికి ఇష్టపడేవారు... ఈ చివరి అంశం ఒక్కటే కేసీఆర్
బలహీనత... విజయోన్మాదంలో ఉన్న హుషారు... ఆయన వైఫల్యంలో చూపడు. చేతులెత్తేస్తాడు. కాళ్లుబారజాపేస్తాడు. శ్రీఆంజనేయం, వీరాంజనేయం అంటూ స్తుతించాలి. అప్పుడు తన శక్తి తాను తెలుసుకుని విజృంభిస్తాడు.
అటువంటి సందర్భాల్లో... ధూపం వేయగల జయశంకర్ సారులాంటి వారు లేకపోవడం
ఇప్పుడు ఆయనకు మైనస్ అయింది.
చంద్రబాబు నాయుడు, పి.వి.నరసింహారావు లాంటి వాళ్లు... రాజకీయ నాయకులు, వ్యూహకర్తలు,
మ్యానిపులేటర్లే గానీ ప్రజానాయకులకోవలోకి రారు. మోదీ - సమ్మోహన
పరిచే ప్రజానాయకుడేగానీ, ఆయన మాటలు వింటూంటే... కొత్త సిటీలో
ఆటో ఎక్కి... డ్రయివర్ను అనుమానిస్తూ దిక్కులు చూస్తూ పోతున్నట్లు ఉంటుంది. ఎక్కడో
నరాలు భయంతో మెలికలుపడుతుంటాయి, ఎక్కడికి చేరుకుంటామో
అర్థంకాక గుండె లయతప్పుతున్నట్లు ఉంటుంది.
కేసీఆర్ సార్ !
మిమ్మల్ని ప్రజలు మొన్న ఓడించిది మీమీది ద్వేషంతో కాదు.. మీరు చాలా
వర్గాల ప్రజల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసినందువల్ల, ... దానికంటే కూడా మీరు ఎవరికీ అందుబాటులో లేకపోవడంవల్ల... మీనుంచి రూపాయి ఆశించినవాడికి ఐదురూపాయలు
అప్పనంగా ప్రకటిస్తూ ... మీమీద ఆయా వర్గాలవారి అంచనాలు పెంచి వారిని నిరాశపరచడం
వల్ల... అన్నిటికీ మించి మీ కంటే మీ పార్టీ నాయకులకు మమ్మల్ని, మా సమస్యల్ని పట్టించుకునేంత తీరిక లేకపోవడం
వల్ల.... అది ధర్మాగ్రహమేకానీ ద్వేషం మాత్రం కాదు సార్...
మీరు కూడా మనకెదురులేదన్న ధీమాలో... తిక్కగా వ్యవహరించినా జనం
మిమ్మల్ని గుడ్డిగా అభిమానించారు... అనడానికి
ఆర్టీసి సమ్మె ఒక మంచి ఉదాహరణ. అన్నిరోజులు సమ్మె చేసి అంతమంది కార్మికులు
చనిపోతున్నా... మీరు సంస్థను నిర్వీర్యం చేస్తూ వారిని మరింత కుంగుబాటుకు గురి
చేసినా... ముగింపు దశలో ఒక్కసారిగా వారిని మీరు దగ్గరకు తీసుకుని ఓదార్చి, వరాల జల్లు కురిపించిన మరుక్షణం వారు అంత పెద్ద
క్షోభను ఒక్కసారిగా మర్చిపోయి మిమ్మల్ని ఆకాశానికెత్తారు కదా... అప్పుడు మీరూ
మురిసిపోయారు కదా !!!
ఇప్పుడు మీకు కొరుకుడు పడనిది రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు.
తిరుగులేకుండా దూసుకుపోతున్న మీకు ఇన్నాళ్టికి మీ వ్యూహాలను, మాటలను పుణికిపుచ్చుకుని అచ్చం మీలాగే పోతుండడంతో... మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమే. అయినా...ఇది కాంగ్రెస్ పార్టీ
మీది అభిమానంతో జనం తెచ్చుకున్న ప్రభుత్వం కాదు కదా సారూ....
తండ్రి కొడితే తల్లి ఒళ్ళో తలదాచుకున్నట్టు అక్కడికి పోయారు.
వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద ప్రేమ, అభిమానం ఉందో లేదో తెలియదు కానీ ప్రజలకు ఆయన మీద
ద్వేషం మాత్రం లేదు. సానుభూతి ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. కారణం – ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాకుండా తికమకపెడుతున్న
విషయం... కాంగ్రెస్ పార్టీ నాయకుల
వ్యవహారం. అసలిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా ? అని జనం రోజూ ఆశ్చర్యపోతున్నారు. నిజ్జంగా కాం గ్రెస్సే
అయితే సిఎం సీటు కింద పొద్దున లేచిన దగ్గరనుంచీ ఎవడి కుంపటి వాడు రాజేస్తుండాలి కదా... అది లేకపోగా ఆ సఖ్యత, ఐక్యత
చూసి అవాక్కవుతున్నారు. అందరూ అనుమానిస్తున్నదేమిటంటే... రేవంత్ పక్కలో పాములు
పెట్టుకుని పడుకుంటున్నాడు.. పాపం.. అని సానుభూతి...
సారూ... దాని సంగతి పక్కనబెట్టండి.. గుళ్ళల్లో, యాగాల్లో పూజలు చేసేటప్పుడు మీరు సతీసమేతంగా అమితమైన
భక్తిప్రపత్తులతో కార్యక్రమాలను జరిపిస్తుంటే... జనం రెప్ప వాల్చకుండా వారి
చుట్టాలను చూసినట్లు చూస్తుండేవాళ్ళు. ఇక మీ మాటలు.. ఒకసారి తూటాల్లా, ఒకపరి సుగంధ పుష్పాల్లా... మధ్యమధ్యలో నవ్వులజల్లులు చిలకరిస్తూ, మీ పార్టీ నాయకుల మీదా, ప్రత్యర్థుల మీద మీరు
చెణుకులు విసురుతూ... అది ప్రెస్ మీట్ కావచ్చు, బహిరంగ సభ
కావచ్చు.. చిన్నా పెద్దా అందరూ పనులు మానుకుని టీవీల ముందు
చేరి మాయాబజార్ సినిమా చూస్తున్నట్లు మీ
వాక్చాతుర్యానికి ఆనందంతో మెలికలు తిరిగిపోతూ వాళ్ళల్లో వాళ్లే తలచుకుని తలచుకుని
నవ్వుకుంటూండేవాళ్ళు. ‘ఆంధ్రావాలా భాగో’ అన్నా,
తోటి ప్రత్యర్థి రాజకీయ నాయకులను సన్నాసులన్నా, ‘పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోచమ్మ కొడతది’ అని సామెతలు గుప్పించినా.. మీ శత్రువులతో సహా అందరూ తేలిగ్గా తీసుకుని
ఆనందిస్తూండేవారు.
‘తెలంగాణ పునర్నిర్మాణం’ అని
మీరు రోజుకోరకంగా చిటికెల పందిరి వేసి చూపుతున్నా, అరచేతిలో
స్వర్గాన్ని అలవోకగా దించేస్తున్నా... రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర
సమస్యలపట్ల మీకున్న అవగాహన, తపన తలచుకుని పొంగిపోతుండేవారు.
మీ తరువాత వారసులుగా ఎదుగుతున్న మీ కుటుంబ సభ్యులను కూడా ఆదరించారు
కదా సారూ. ఒక రాజకీయ కుటుంబం అంటే.. ‘‘ చూడండి.. ఆ ప్రేమ, ఆ అనురాగాలు, ఆ ప్రతిభ .. పులి కడుపున పులులే పుడతాయి’’ అని
ముచ్చటపడిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పోల్చుకుని పిసరంత
మార్కులు మీకే ఎక్కువ వేస్తుండేవాళ్ళు. మీమీద మీకు కూడా ఎంతగా నమ్మకం
ఎక్కువయిపోయిందంటే... ‘‘సోనియా సరైన సమయంలో రాహుల్‌కు
పట్టాభిషేకం చేయలేదు’’ అని కామెంట్లు కూడా వదిలారు. కానీ
మీరు పెట్టుకున్న పట్టాభిషేక ముహూర్తానికి ప్చ్..ఎదురుగాలి
తగిలింది. మన చేతుల్లో ఉండదు కదా సారూ....
ఎప్పుడో చిన్న ‘జంప్’
చేయబోయి వెంటనే కాలు వెనక్కి తీసుకున్న మీ మేనల్లుడు ... మీరు
పెట్టిన అన్ని అగ్నిపరీక్షల్లో అత్యంత సమర్ధుడిగా గోల్డ్ మెడల్ తెచ్చుకుంటున్నా..
మీరింకా అనుమానిస్తూనే ఉన్నారు. ఆ మేనల్లుడుకూడా చంద్రబాబంత ఓపికగా ఉంటూ పార్టీమీద
పట్టు సడలకుండా చూసుకుంటున్నాడు.
మిమ్మల్ని చూడాలనీ, మీ
మాట వినాలని అందరూ తహతహలాడుతున్నారు. మీరేమో బయటికి రాకుండా ప్రజానీకాన్ని నిరాశపరుస్తూ...
జనం ముందుకు మీ కుటుంబ సభ్యులను వదులుతున్నారు. మీరు లేకుండా వారిని చూస్తుంటే... పులివేషాలు, వీథిబాగోతాలు
చూస్తున్నట్లుంది. పక్కన చేరిన జనం కూడా తప్పనిసరి
తద్దినానికి వచ్చిన భోక్తల్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళే ఒకప్పుడు మీవెంట
నడిచినప్పుడు పోటీలుపడి గొంతుచించుకునే వాళ్ళు. ఇప్పుడు సంతాపసభల్లో
కూర్చున్నట్లు కూర్చుంటున్నారు.
కేసీఆర్ సార్ !!!
తెలంగాణ సమాజానికి పుట్టుకతో వచ్చిన ఒక ప్రత్యేక గుణం ఉంది. వారు
ఒకపట్టాన ఎవర్నీ నమ్మరు. నమ్మితే గుడ్డిగా నమ్ముతారు... అవసరమయితే ప్రాణం కూడా
తృణప్రాయంగా వదిలేస్తారు. ఈ విషయం మాకంటే మీకే ఎక్కువగా తెలుసు. కానీ మీకు
తెలియనిదేమిటంటే...
వాళ్ళు మిమ్మల్ని ఇంకా అభిమానిస్తున్నారు సార్, నమ్ముతున్నారు కూడా. ఆ అభిమానం, నమ్మకం పోయిననాడు .. వారి స్పందన మీకు... ఊహకు అందనంత తీవ్రంగా ఉంటుంది. చెన్నారెడ్డిని నమ్మారు కదా.. ఆ తరువాత ఏమయింది... రెండుసార్లు
ముఖ్యమంత్రిగా చేసినా... ఇంకా ఏవేవో చేసినా... తెలంగాణ ద్రోహిగానే చరిత్రలో
శిలాక్షరాలతో రాసిపెట్టుకున్నారు.
‘చావునోట్లో తలపెట్టిన’... అని మీఅంతట మీరే ఈ మధ్య పదేపదే
చెప్పుకుంటున్నారు.జనం ఎక్కడ మర్చిపోతారోనని మీ వారసులు కూడా మళ్ళీమళ్ళీ గుర్తు
చేస్తుంటారు. సారూ... ఆరోజు మీరు జ్యూస్ తాగడం, ఆ వీడియో
లీక్ కావడం, అది చూసి ఉస్మానియాలో పిల్లలు తిరగబడడం, తర్వాత మీరు నిమ్స్ లో చేరి కథ నడపడం ... అన్నీ జనానికి గుర్తున్నా....
అదేదో ఒక ఎత్తుగడ అని సరిపుచ్చుకున్నారు తప్ప ఎప్పుడూ ఎకసక్కెం చేసి మిమ్మల్ని బాధపెట్టలేదు. ఒకసారి నమ్మితే ... ఇటువంటి వాటిని మన జనం
పట్టించుకోరు సారూ.. అలా నమ్మారు కదా !
కాళేశ్వరం అంత పెద్ద వ్యవహారమే అయినా మీరు దాన్ని తక్కువ చేసి చూపే
ప్రయత్నం చేస్తున్నా... అదేకాదు, మీ గత పాలన తాలూకు ఇతరత్రా అవినీతిని ప్రజలు ఇప్పుడు కొత్తగా
చూస్తున్నా.... బాధను మింగుకుని కడుపులో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే... మీ
మీద గుడ్డి ప్రేమ ఉన్నట్లే కదా ! ఇక... మీరే మళ్లీ వారిని
ముందుండి నడపాలని కూడా వారు కోరుకుంటున్నట్లు ఇప్పటివరకు
అయితే ఎక్కడా దాఖలాలు లేవు. కానీ, మీరు
వారి మధ్యఉండాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు.
ఒక్కటి మాత్రం నిజం. మీరు
మారాలి. మీ ధోరణి మారాలి. ‘‘అధికారం
ముఖ్యం కాదు. ప్రజాసేవే మా అంతిమ లక్ష్యం’’ అనే పద్ధతిలో
రండి. ద్వేష రాజకీయాలు పూర్తిగా పక్కనబెట్టండి. మీ స్వంత మీడియాను వదిలించుకోండి.
దానివల్ల... ఏం లాభం చెప్పండి.. స్వకుచమర్ధనం తాలూకు సంతృప్తితప్ప. దాన్ని ఉంచుకున్నా ... మీకు డప్పుగా మార్చుకోకండి. చీటికిమాటికీ ప్రత్యర్థుల
మీద మీ అక్కసు తీర్చుకోవడానికి దాన్ని వాడుకోకండి.
తెలంగాణ వచ్చిన తరువాత, అదీ ఏకంగా పదేళ్ళు.. రెండు సార్లు వరుసగా వారు మీకు అధికారం అప్పగించిన
తరువాత కూడా ఇంకా చీప్‌గా భావోద్వేగాల మీద ఆధారపడకండి .. రివర్స్ కొడుతుంది. . మీ
మాటల్లోనే చెప్పాలంటే.. ‘మీకు రిటర్న్
గిఫ్ట్ ... ఇస్తారు...చూసి తట్టుకోలేనంతగా...’
మీ ప్రసంగాల్లో, మీ
వారసుల ప్రసంగాల్లో... చంద్రబాబు ముఖంలో కనపడినట్లు... అధికారం కోల్పోయిన ఆక్రోశం, అక్కసు రోజూ కనబడుతున్నది. దానిని లైజాల్ పెట్టి తుడిచేయండి. ఎన్నికల లక్ష్యంతోనో, వారసులకు పట్టాభిషేకం కోసమో వస్తున్నట్లు ఎక్కడా ఆవగింజంత అనుమానం రాకుండా
జాగ్రత్త పడండి. మీ ప్రతిభ, మీ సామర్ధ్యం, మీ వాక్చాతుర్యం, మీ ప్రసంగధాటి, మీ అనుభవం మీద ప్రజలకున్న అభిమానం
మరింత పెంచే ప్రయత్నం చేయండి. పాజిటివ్ ఆలోచనలతో, పాజిటివ్ ప్రణాళికలతో సరికొత్త కేసిఆర్ సారును మా
మధ్యలో చూడాలన్నదే మా ఆకాంక్ష.
రండి కేసీఆర్...
అప్పుడు మీ అవసరం కొద్దీ మీరొచ్చారు.
మా అవసరం కొద్దీ అప్పుడు స్వాగతించాం.
ఇప్పుడు మాకు అవసరం లేకపోయినా...
తెలంగాణ రావడంలో సహాయపడినందుకు కృతజ్ఞతగా
మిమ్మల్ని దూరం పెట్టలేక రమ్మంటున్నాం. ...
మాతో కలిసి ఉండండి, మాతో కలిసి నడవండి అంటున్నాం....
మీకు సాదర స్వాగతం...
పునః స్వాగతం..
- ములుగు రాజేశ్వర రావు
......
సార్, చాలా బాగా రాసారు కానీ కేసీఆర్ గారి అవసరం ఈ తెలంగాణ ప్రజలకు వద్దు సార్, పదేళ్ల పాపాలు ఇంకా కళ్ల ముందే కనబడుతున్నయి... సాలు దొర
రిప్లయితొలగించండి-ఉద్యమంలో, గత ప్రభుత్వంలో చురుగ్గా పనిచేసిన ఒక అధికారి స్పందన
Excellent analysis on kcr, in toto covered all the points. But I think he is taking rest, and he may come back with full force.
రిప్లయితొలగించండి- Srikantha Sarma, Warangal
అద్భుతంగా ఉంది సర్! ముఖ్యంగా రెండవ పేరాలో మీరు విశ్లేషించిన కె సి ఆర్ బలహీనత, ఆ తరువాత హరీశ్ రావు విషయం నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. మీరు చెప్పినది అక్షర సత్యం. కేసిఆర్ కి తిక్కుంది... దానికి సరైన లెక్క లేదు... అదీ సమస్య
రిప్లయితొలగించండి- ఫణిహారం వల్లభాచార్య