తారల తొలి రోజులు.....‘కోట’తో ఓ జ్ఞాపకం
నటులు లేదా కళాకారులకు ఒక గుర్తింపు, ఒక స్థాయి రానంతవరకు సినీ
పరిశ్రమలో వారు పడిన కష్టాలు, ఎదుర్కొనే అవమానాల తాలూకు అనుభవాలన్నీ ...
కొత్తవారికి పాఠాలే అయినా.... దీపపు పురుగుల్లా ఆ పరిశ్రమ చుట్టూ పరిభ్రమించక మానరు..
అటువంటి కష్టాల కొలిమిలో గడపకుండా వైతరణిని దాటలేరు.... అక్కినేనికయినా... ఆ కోవలో వందలు, వేల
నటులకయినా తీరు వేరయినా... కష్టాల గుండాలు, గండాలు దాదాపు ఒక్కటే... ఆ
కోవలో నేను అంతకుముందు తెలుసుకున్న కొందరి అనుభవాలకంటే కోట శ్రీనివాస రావుది ఒకింత
బెటరే అయినా... ఆయన మనసును మాత్రం అది బాగా గాయపరిచింది.
‘ప్రతిఘటన’ విడుదల తరువాత... ఒక ఇంటర్వ్యూ అడిగా. అప్పుడు
ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నా. నేను సినిమా జర్నలిస్టును కాకపోయినా, సీనియర్ సబ్
ఎడిటర్‌గా నా బాధ్యతలకు అదనంగా సినిమా పేజీల బాధ్యత నామీదుండేది. నారాయణగూడ తాజ్‌లో
కలుద్దామన్నాడు... (వివరాల్లోకి పోకుండా క్లుప్తంగా చెబుతా).
‘‘ప్రతిఘటన షూటింగ్ టైంలో
నాకు సికిందరాబాద్‌నుండి షూటింగ్ లోకేషన్(పేరు గుర్తురావడం లేదు)కు టికెట్టును
ఆర్డినరీ క్లాసులో నిర్మాణ సంస్థ (ఉషాకిరణ్
మూవీస్)కొనిచ్చింది. నన్ను స్టేషన్ దగ్గర దింపడానికి వచ్చిన రామారావుగారు (సితార
ఇంచార్జి) దారి బత్తెంకింద రు.5లు చేతిలో పెట్టారు. అదీ నాకు నిర్మాణ సంస్థ ఇచ్చిన
గౌరవం(వ్యంగ్యంగా). ఇటువంటివి చాలా ఉన్నా ఈ సినిమా విజయం తాలూకు సంబరాల్లో అవన్నీ ఇప్పుడు
వద్దులే ..’’ అని ఆ సందర్భంలో వాపోయారు.
నిజానికి కోట ఒక అద్భుత ప్రతిభావంతుడని మేం కాలేజీ రోజుల్లోనే (1970 ప్రాంతంలో)
గుర్తించాం. నెల్లురులో నెఫ్జా, నెఫ్కా పోటీలు రాష్ట్రస్థాయిలో ఏటా చాలా ఘనంగా
జరిగేవి. అవి ఎంత గొప్పగా ఉండేవంటే... తెలుగు నాటకరంగంలోని నటులు, దర్శకులు,
కళాకారులు... వాటిలో పాల్గొనడమే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు. అవి
జరిగినన్ని రోజులు టౌన్ హాల్ ఎప్పుడూ... చివరకు అర్ధరాత్రి అయినా
కిటకిటలాడిపోయేది. ఆ ప్రదర్శనల్లో ఏటా ఎదురు చూసే వాటిలో ఒకటి కోట చెప్పే ‘తెలంగాణ
రామాయణం’. అంతటి ప్రతిభావంతుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూనే... నెఫ్జా, నెఫ్కాలు ఏటా నిర్వహించే పోటీల్లో బహుమతులు హోల్‌సేల్లో ఎగరేసుకుపోయేవాడు. నెల్లూరు యాసలో కూడా కొన్ని
ప్రదర్శనలిచ్చాడు.
కోట శ్రీనివాసరావుకు సినిమాల్లోకి వెళ్లాలని ఎంత తపన ఉన్నా... అతిథులుగా
వచ్చిన సినిమా పెద్దలు ఆ యా ఫంక్షన్లలో హామీలు గుప్పించినా... అవకాశాలు చాలా
ఏళ్ళపాటూ అందని ద్రాక్షగానే మిగిలాయి. చివరకు అవి వచ్చి తన ప్రతిభను తెలుగు వారు,
సినిమా పరిశ్రమ గుర్తించినా.. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసేంత సాహసం
చాలాకాలంవరకు చేయలేకపోయాడు. ఉద్యోగం మధ్యలో సెలవులు పెట్టి కొంతకాలం మేనేజ్ చేసాడు.
కాల్షీట్ల డిమాండ్ తట్టుకోలేక.. రాజీనామాకు సిద్ధపడినా... అభద్రతాభావంతో తొందరపడలేదు. ఆఖరి ప్రయత్నంగా...
ఒకటిరెండేళ్ళు సెలవుపెడతాననీ, బ్యాంకు యూనియన్ సహకరించాలని కోరాడు... అది వర్కవుట్ కాలేదు. (అజారుద్దీన్ వంటి
క్రికెటర్లకు అధికారికంగానే డ్యూటీలో వెసులుబాటు ఇస్తున్నప్పుడు .. వెసులుబాటు
కాదు కనీసం సెలవుగా నాకెందుకు ఇవ్వరనేది అతని వాదనగా ఉండేది ఆ సమయంలో). చివరకు
తెగించి రాజీనామా చేయక తప్పలేదు. అయితే ఆయన ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. తన నిర్ణయం ఆలస్యమయినందుకు బాధపడ్డాడేమో కానీ,
చింతించాల్సిన పరిస్థితిమటుకు రాలేదు.
కోట శ్రీనివాసరావు కేవలం నటుడే కాదు... సమకాలీన సమాజంపట్ల ఒక అవగాహనతో
లోతుగా అధ్యయనం చేసిన వాడు. అటువంటివాడు చరమాంకంలో వ్యక్తిగతంగా కొన్ని దెబ్బలు
తిన్నా... కొన్ని సందర్భాలలో అనవసరంగా వివాదాస్పదుడయ్యాడు... ఏదేమయినా ప్రతిభావంతుడయిన
ఒక నటుడిని మనం కోల్పోయాం.
-ములుగు రాజేశ్వర
రావు.
..............
Shri Sarma garu, renowned leader of State Bank of India Staff Union Hyderabad Circle (at that time) responded with the following details...
శ్రీ కోట శ్రీనివాస రావు గారు, బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో నటించే రోజుల్లో ఆయనను మొదటిసారి త్యాగరాయ గానసభలో కల్చరల్ మీట్ సందర్భంగా కలవటం జరిగింది.
సినిమాల్లో మంచి పేరు, అవకాశాలు వస్తున్న సందర్భంలో దీర్ఘకాల శెలవులో (జీతం లేకుండా) వెళ్ళాలనుకుంటే బ్యాంకు శాంక్షన్ చేయలేదు. అప్పటికే ఆయన వరుసగా మూడుసార్లు సర్కిల్ బెస్ట్ యాక్టర్. అప్పుడు నేను యూనియన్ లో సికింద్రాబాద్ జోనల్ సెక్రటరీని. శెలవు శాంక్షన్ గురించి యూనియన్ హెల్ప్ చేయటంలేదని ఆయన భావన. ఆరోజుల్లోనే అజారుద్దీన్ వరుసగా మూడు సెంచరీలు కొడితే బ్యాంకు అతనికి ఆఫీసర్ గా ప్రమోషన్ ఇచ్చింది.
దాన్ని ఉదాహరణగా చూపి, ప్రమోషన్ అవసరంలేదు కనీసం లాస్ ఆఫ్ పే లీవు కూడా ఇవ్వటంలేదు, యూనియన్ సహాయం అవసరముందని చెపుతూ, ఆయన స్టైల్లో నాతో మాట్లాడారు. ఈ సందర్భాన్ని, తరువాత కాలంలో ఆయనను కలిసినప్పుడుకూడా గుర్తుచేశేవాణ్ణి.
తరువాత ఆయన బ్యాంకుకు రిజైన్ చేసి ఒక విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందడం, లీవు శాంక్షన్ చేయని బ్యాంక్ నుండే సన్మానాలు అందుకోవడం, యంఎల్ఏ అవటం, పద్మశ్రీ తో గౌరవింపబడటం అందరికీ తెలిసిందే.
ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి