నా వేలు నీ కంట్లో... నీ వేలు నా నోట్లో...

 


కర్ణాటకలో 2024లో జరిగిన సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వకంగా అక్రమాలు జరిగినట్లు తమ సర్వేలో తేలిందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై – భారత ఎన్నికల సంఘం, మూడు రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రధాన అధికారులు స్పందించిన తీరు చూస్తే... ‘‘నా వేలు నీ కంట్లో పెడతా.. నీ వేలు నా నోట్లో పెట్టు..’’ అన్న చందాన ఉన్నది కదూ !!!

‘‘ఒకవేళ రాహుల్ గాంధీ తన ఆరోపణలకు  చూపిన సాక్ష్యాధారాలు తప్పని తేలితే... భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 227/229 కింద ఆయనకు మూడేళ్ళ వరకు జైలు శిక్ష, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 31 కింద ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది’’ అని మూడు  సంబంధిత రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు ఆయనకు రాసిన లేఖలో హెచ్చరించారు.


తప్పేముంది... కరెక్టే. ఏ పేచీ లేదు దీనితో... 

కానీ తిరకాసు ఎక్కడుందీ...అంటే...

రాహుల్ గాంధీనే అయినా,  సామాన్య పౌరుడు  అయినా...వారి  ఆరోపణలు, దాని తాలూకు సాక్ష్యాధారాలను ఓటర్ల నమోదు నిబంధన 20(3)(బి) కింద నిర్ణీత ఫారంలో డిక్లరేషన్ ఇవ్వాలి. అలా ఇస్తూ...‘‘ నాకు తెలిసినంత వరకు, నేను నమ్మినంత వరకు ఇవి నిజాలు’’ అన రాసి సంతకం చేయాలి’’... అని వారు ఆయనను కోరుతూ లేఖలు రాసారు. ఆ ఆరోపణలు అబద్దమని తేలితే ఆయనకు జైలు శిక్ష తప్పదట.

మరి నిజమని తేలితేనో...???  నిబంధనల ప్రకారం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారట. అంతే తప్ప దురుద్దేశంతో జరిగిన ఆ అక్రమాలకు, దానివల్ల జరిగిన అపారమైన నష్టానికి బాధ్యులయిన వారిపై ఏం చర్యలుంటాయో ఎక్కడా మాట మాత్రం కూడా వాటిలో ప్రస్తావించలేదు.

రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే...‘‘నేను ఒక రాజకీయ నాయకుడిని. నా ఆరోపణలకు సాక్ష్యంగా ఈ ఆధారాలను  బహిరంగంగా ప్రజల ముందుంచా.. ఇదే ప్రమాణం చేసి నేను సమర్పిస్తునట్లు..’’

రాహుల్ గాంధీ ఈ దేశంలో ఒక సాధారణ పౌరుడే అయినా కేవలం సామాన్య పౌరుడి హోదా కాదు ఆయనది. కొన్ని అంశాలలో పార్లమెంటే సుప్రీం. అటువంటి పార్లమెంటులో సభ్యుడు, ప్రజా ప్రతినిధుల సభ అయిన లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు, ఒక జాతీయ పార్టీ అగ్రనేత...  ఆ హోదాలో ఆయన ఒక ఫిర్యాదును పత్రికా విలేకరుల సమావేశంలో బహిరంగంగానే చేసారు. దానికితన దగ్గరున్న  ఆధారాలు కూడా చూపుతున్నారు,

ఒక ప్రభుత్వ వ్యవస్థకు అది చాలు ఫిర్యాదులను పరిశీలించి నిజనిర్ధారణ చేసి నివేదిక ఇవ్వడానికి.  ఎవరూ ఫిర్యాదు చేయకుండానే... కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కోర్టులు, మానవ హక్కుల సంఘాలు వాటిని సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాయి కదా! అయినా ‘‘కాగితం రాసివ్వు, ఫలానా రూలు ప్రకారం ఫలానా ఫారం నింపు, ఫలానా ప్రమాణం చెయ్యి, ఫలానా చోట సంతకం పెట్టు...’’ అని అడగడం ఏమిటి ?

ఆ తరువాత కూడా అది నిజమని తేలితే..దానికి బాధ్యులైన వారిపై తీసుకునే చర్యలు చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించకుండా... ఫిర్యాదుదారుకు ‘జైలు శిక్షల’ బెదిరింపులేమిటి ?’

కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీ నాయకులు ఇటువంటి  హెచ్చరికలు చేయవచ్చు... అది రాజకీయంగా సమర్ధనీయం అవుతుంది. కానీ ఒక రాజ్యాంగ సంస్థఅయిన ఎన్నికల సంఘం అధికారులు ఇలా బ్లాక్ మెయిల్ ధోరణి చూపడమేమిటి ?

తమ దగ్గరికి వచ్చిన ప్రతి దావా విషయంలో దానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు  సుప్రీంకోర్టు కూడా ఇలాగే హెచ్చరించ వచ్చు కదా !

హెచ్చరించొచ్చు... అధికారంలోఉన్నవారు, వారికి తైనాతీలుగా ఉన్న వ్యవస్థలు ఇలాగే  ఫిర్యాదుదారులను బెదిరిస్తూపోతే... ‘ప్రజాస్వామ్య’ దుకాణానికే కాదు... ప్రజలందరూ కూడా  నవరంధ్రాలకు సీల్ వేసుకునే రోజు ఎంతో దూరంలో  ఉండదు !!!

- ములుగు రాజేశ్వర రావు

..............

2 కామెంట్‌లు:

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...