వార్త: ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ కు చెందిన ఆరు విమానాలను ధ్వంసం చేసాం-అని మన ఎయిర్ ఛీప్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ బెంగళూర్ లో శనివారం(ఆగస్టు 9న) ప్రకటిస్తూ...దాని తాలూకు శాటిలైట్ ఛాయా చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ కు జరిగిన నష్టంపై భారత్ సైనికాధికారి బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.
* * *
కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.. అంటూ ఆపరేషన్ సిందూర్ ను
అర్థంతరంగా
ఆపివేసిన తరువాత ... చాలా అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో
పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరచి దీనిపై దేశ ప్రజలకు పూర్తిగా వివరణ ఇవ్వాలని
ప్రతిపక్షాలు కోరాయి. అయితే ప్రత్యేకంగా
సమావేశపరచలేదు కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా దీనిపై రెండు రోజుల చర్చకు ప్రభుత్వం
అంగీకరించింది. అప్పటిదాకా ప్రభుత్వం బయట చెబుతూ వచ్చినవే సభలో కూడా చెప్పిందితప్ప
అదనంగా మరే సమాచారం ఇవ్వలేదు, అనుమానాలు తీర్చలేదు. సభలో చర్చ ముగిసింది....
ఇప్పుడు..ఉన్నట్టుండి అత్యున్నత సైనిక అధికారి ఎయిర్ ఛీప్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కొత్త విషయం ప్రకటించారు. మున్ముందు ఇంకా ఎవరు ఎప్పుడు కొత్త విషయాలు ప్రకటిస్తారో తెలియని పరిస్థితిలో... ఒక మౌలికమైన ప్రశ్న
పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న సందర్భంలోనే అత్యున్నత
సైనికాధికారి సభ వెలుపల ఒక ప్రకటన చేసి..అది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు
వెల్లడించకుండా దాచిన విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రభుత్వం
ఈ విషయాన్ని ఇప్పటివరకు సభ ముందుంచనప్పుడు ఇది పార్లమెంటును అవమానించడం కాదా..??? ఔననే ఎందుకు అనుకోవాల్సింది వస్తుందంటే...
సర్వోన్నత
సభ !!!
మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటు సర్వోన్నత చట్ట సభ. జాతీయ
ప్రాముఖ్యం ఉన్న విషయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ఈ సభలో ప్రజా
ప్రతినిధులు పరిశీలించి, చర్చించి నిర్ణయిస్తారు. వాటినే ప్రభుత్వం అమలు చేస్తుంది. ముందు కాకపోయినా తరువాత అయినా ప్రభుత్వం సభ ముందుంచి ఆమోదం తీసుకుంటుంది. ప్రభుత్వం అధికారం
అనుభవిస్తున్నా... అలా పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. అలా ఉండి తీరాలి. ఈ సభల్లో
దాపరికం ఉండకూడదు. (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప... అదిక్కడ మనకు ప్రస్తుత చర్చనీయాంశంలో
వర్తించదు). ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా ఈ సభల సమాచారం అంతా ప్రజలకు చేరుతుంటుంది.
మరటువంటప్పుడు జాతీయ భద్రతకు సంబంధించి ఒక సీనియర్ సైనికాధికారి బయట చెప్పిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు సభలో చెప్పకుండా దాచింది....
అంటే ప్రభుత్వం పార్లమెంటును విశ్వాసంలోకి
తీసుకోవడం లేదని భావించాల్సి వస్తుంది కదా...!!!.
అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇది వాంఛనీయం కాదు...ఇవ్వాళ అధికారపక్షం రేపు ప్రతిపక్షం అయినప్పుడు... వారికి ఇలా ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా !!! 50ఏళ్ళ నాటి ఎమర్జన్సీని ఇప్పుడు కూడా తిట్టగలిగేంత నైతికత, ఉన్నత విలువలు తమకు ఉన్నాయని ప్రకటించుకుంటున్నప్పుడు... జరుగుతున్నదేమిటి ???
ఆపరేషన్ సిందూర్ పై కొన్ని అనుమానాలు చూద్దాం...
1. మన దెబ్బకు తట్టుకోలేక పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది, కాల్పుల విరమణ ప్రతిపాదన అదే చేసింది. మనం అంగీకరించాం. అంతవరకు ఓకే... మరి మనం పాకిస్థాన్ కేమయినా షరతులు విధించామా ? ఒకవేళ విధిస్తే ఆ షరతులుఏమిటి ?
2.
ఏ షరతులు లేకుండానే మనం అకస్మాత్తుగా కాల్పుల విరమణ పాటించేసామా ...?
3.
ఒకవేళ అదే నిజమయితే ఎవరి
ఒత్తిడికి తలఒగ్గి అలా అంగీకరించాం ..???
4.
భారత్-పాక్ వ్యవహారాల్లో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించకూడదనేది మనం
నిక్కచ్చిగా పాటిస్తున్న విధానం... మరి కాల్పుల విరమణ విషయాన్ని అమెరికా
అధ్యక్షుడు మొదట ఎలా ప్రకటించారు ? అది కూడా ... తన ప్రభావం/ప్రమేయంతోనే,
వాణిజ్య సంబంధాల బూచితో సాధ్యమయిందని ఎలా
ప్రకటించారు ? ఒకసారి కాదు.. ఇప్పటికీ అలా ప్రకటిస్తూ పోతున్నా... నేరుగా ఆయన
ప్రకటనలను ప్రభుత్వం ఎందుకు ఖండించి వాటిని నిలుపుదల చేయించడం లేదు ?
5.
ఒకవేళ పాకిస్థాన్ తో మనకు అవగాహన లేదా అంగీకారం కుదిరి ఉంటే ... మనకు కలిగిన ప్రయోజనం
(లాభం)ఏమిటి ?
(మళ్ళీ మనవైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయకుండా
చావుదెబ్బ తీసాం.. అని మనం పదేపదే ప్రకటిస్తున్నప్పుడు... ఇంకా సీమాంతర ఉగ్రవాదం
ఎలా కొనసాగుతున్నది ? పాకిస్థాన్ కూడా మునుపటిలాగానే ప్రేలాపనలు ఎలా
చేయగలుగుతున్నది ?)
6.
రాజకీయంగా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే మేం అతి తక్కువ
కాలంలో శత్రువుని కాళ్ళబేరానికి తీసుకురాగలిగాం..అని సైనిక దళాలు
ప్రకటిస్తున్నాయి.. అది ప్రశంసనీయం. మరి అంతటి ఘన విజయాన్ని వారు బంగారు పళ్లెంలో
పెట్టి ఇచ్చినప్పుడు... శత్రువు అడిగీ అడగక ముందే ఎటువంటి లాభసాటి షరతులతో ఒప్పందం
చేసుకోకుండానే సైనికదళాల చర్యలను ఎందుకు
ఆపేసారు ? ఇక్కడ రాజకీయం ఎలా చొరబడింది ?
ఈ అనుమానాలన్నింటినీ తీర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం పై
ఉంటుంది.
ప్రభుత్వం ప్రజల
ముందు ఉంచని ముఖ్యమైన సమాచారాన్ని సంబంధిత
అధికారులు
ఎక్కడో కాకతాళీయంగా బయటపెడుతున్నప్పుడు...
దానిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ?
ఆధ్యాత్మికంగా మందిరాన్ని నమ్మినప్పుడు
రాజకీయంగా పార్లమెంటును కూడా నమ్మాలి కదా !!!
-ములుగు రాజేశ్వర రావు
........
(అధికార పార్టీ భక్తులు జుట్టు పీక్కోకండి...
నేనిక్కడ ప్రస్తావిస్తున్నది నైతిక, సాంకేతిక అంశాలను మాత్రమే...
దీనిని రాజకీయం
చేయకండి... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది వర్తిస్తుంది.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి