కేసీఆర్ సార్ ! మీరు మళ్ళీ రావాలి సార్...

 

 

‘‘ఔను సార్.. మీరు మళ్ళీ రావాలి ... మీ అభిమానులం చాలా మందిమి మీకోసం ఎదురుచూస్తున్నాం సార్... మీరు మా అభిమాన నాయకుడు సార్..  ఉద్యమ కథానాయకుడిగానే కాదు, ప్రజానాయకుడిగా మీరంటే మాకు పిచ్చి అభిమానం సార్...’’

 

...దాదాపుగా సగం తెలంగాణ సమాజం అంతటా మనసు పొరల్లో గుసగుసలాడుతున్న భావన ఇది.

 

మరి నిన్నమొన్న ఎలక్షన్లో అంత తుక్కుగా ఓడించినా...

ఇంకా ఆయనను జనం అభిమానిస్తున్నారంటారా ???

* * *

ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే ముందు ఒక విషయంలో మనం స్పష్టత తెచ్చుకోవాలి. కథానాయకులు వేరు, రాజకీయ నాయకులు వేరు, ప్రజానాయకులు వేరు... ఇలా చాలామంది ఉన్నా...  ప్రజానాయకుల తరగతికి చెందిన వారు చాలా చాలా అరుదుగా ఉంటారు.

ప్రజానాయకులంటే నా దృష్టిలో... ప్రజలతో సులభంగా కనెక్ట్ అయిపోవడం,  తన ప్రసంగ ధాటితో ప్రజలను సమ్మోహన పరచడం,  చెరువులో చేపలా జనంలో దూసుకుపోవడం, ఎంత నియంతగా ఉన్నా సమయ సందర్భాలను బట్టీ మానవత్వాన్ని ప్రశంసనీయంగా ప్రదర్శించడం, కళాత్మక హృదయం కలిగి ఉండడం, వారి మాట వినాలనీ, చూడాలని జనం తహతహలాడిపోవడం..అలా... ప్రజలకు నచ్చడం, వారు మెచ్చడం.... ఎన్టీఆర్, ఇందిరాగాంధీలు ఈ కోవకు చెందినవారే. వీరిద్దరిదీ కేసిఆర్ కంటే ఎక్కువ రేంజ్... వారు కూడా వ్యక్తిగతంగా ఏ సంక్షోభం ఎదురయినా... మరెక్కడా చెప్పుకోకుండా నేరుగా జనం లోకి దూకేసి వారితోనే చెప్పుకోవడానికి ఇష్టపడేవారు... ఈ చివరి అంశం ఒక్కటే కేసీఆర్ బలహీనత... విజయోన్మాదంలో ఉన్న హుషారు... ఆయన వైఫల్యంలో చూపడు.  చేతులెత్తేస్తాడు. కాళ్లుబారజాపేస్తాడు. శ్రీఆంజనేయం, వీరాంజనేయం అంటూ  స్తుతించాలి. అప్పుడు తన శక్తి తాను తెలుసుకుని విజృంభిస్తాడు. అటువంటి సందర్భాల్లో...  ధూపం వేయగల జయశంకర్ సారులాంటి వారు లేకపోవడం ఇప్పుడు ఆయనకు  మైనస్ అయింది.

చంద్రబాబు నాయుడు, పి.వి.నరసింహారావు లాంటి వాళ్లు... రాజకీయ నాయకులు, వ్యూహకర్తలు, మ్యానిపులేటర్లే గానీ ప్రజానాయకులకోవలోకి రారు. మోదీ - సమ్మోహన పరిచే ప్రజానాయకుడేగానీ, ఆయన మాటలు వింటూంటే... కొత్త సిటీలో ఆటో ఎక్కి... డ్రయివర్ను అనుమానిస్తూ దిక్కులు చూస్తూ పోతున్నట్లు ఉంటుంది. ఎక్కడో నరాలు భయంతో మెలికలుపడుతుంటాయి, ఎక్కడికి చేరుకుంటామో అర్థంకాక గుండె లయతప్పుతున్నట్లు ఉంటుంది.

 

కేసీఆర్ సార్ ! 

మిమ్మల్ని ప్రజలు మొన్న ఓడించిది మీమీది ద్వేషంతో కాదు.. మీరు చాలా వర్గాల ప్రజల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసినందువల్ల, ... దానికంటే కూడా మీరు ఎవరికీ  అందుబాటులో లేకపోవడంవల్ల... మీనుంచి రూపాయి ఆశించినవాడికి ఐదురూపాయలు అప్పనంగా ప్రకటిస్తూ ... మీమీద ఆయా వర్గాలవారి అంచనాలు పెంచి వారిని నిరాశపరచడం వల్ల... అన్నిటికీ మించి మీ కంటే మీ పార్టీ నాయకులకు మమ్మల్ని, మా సమస్యల్ని పట్టించుకునేంత తీరిక లేకపోవడం వల్ల.... అది ధర్మాగ్రహమేకానీ ద్వేషం మాత్రం కాదు సార్...

మీరు కూడా మనకెదురులేదన్న ధీమాలో... తిక్కగా వ్యవహరించినా జనం మిమ్మల్ని గుడ్డిగా అభిమానించారు...  అనడానికి ఆర్టీసి సమ్మె ఒక మంచి ఉదాహరణ. అన్నిరోజులు సమ్మె చేసి అంతమంది కార్మికులు చనిపోతున్నా... మీరు సంస్థను నిర్వీర్యం చేస్తూ వారిని మరింత కుంగుబాటుకు గురి చేసినా... ముగింపు దశలో  ఒక్కసారిగా వారిని మీరు దగ్గరకు తీసుకుని ఓదార్చి, వరాల జల్లు కురిపించిన మరుక్షణం వారు అంత పెద్ద క్షోభను ఒక్కసారిగా మర్చిపోయి మిమ్మల్ని ఆకాశానికెత్తారు కదా... అప్పుడు మీరూ మురిసిపోయారు కదా !!!

ఇప్పుడు మీకు కొరుకుడు పడనిది రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు. తిరుగులేకుండా దూసుకుపోతున్న మీకు ఇన్నాళ్టికి మీ వ్యూహాలను, మాటలను పుణికిపుచ్చుకుని అచ్చం మీలాగే పోతుండడంతో...  మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమే. అయినా...ఇది కాంగ్రెస్ పార్టీ మీది అభిమానంతో  జనం తెచ్చుకున్న ప్రభుత్వం కాదు కదా సారూ.... తండ్రి కొడితే తల్లి ఒళ్ళో తలదాచుకున్నట్టు అక్కడికి పోయారు.

వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద ప్రేమ, అభిమానం ఉందో లేదో తెలియదు కానీ ప్రజలకు ఆయన మీద ద్వేషం మాత్రం లేదు.  సానుభూతి ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. కారణం ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాకుండా తికమకపెడుతున్న విషయం... కాంగ్రెస్ పార్టీ  నాయకుల వ్యవహారం. అసలిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా ? అని జనం రోజూ ఆశ్చర్యపోతున్నారు. నిజ్జంగా కాం గ్రెస్సే అయితే సిఎం సీటు కింద పొద్దున లేచిన దగ్గరనుంచీ ఎవడి కుంపటి వాడు  రాజేస్తుండాలి కదా... అది లేకపోగా ఆ సఖ్యత, ఐక్యత చూసి అవాక్కవుతున్నారు. అందరూ అనుమానిస్తున్నదేమిటంటే... రేవంత్ పక్కలో పాములు పెట్టుకుని పడుకుంటున్నాడు.. పాపం.. అని సానుభూతి...

సారూ... దాని సంగతి పక్కనబెట్టండి.. గుళ్ళల్లో, యాగాల్లో పూజలు చేసేటప్పుడు మీరు సతీసమేతంగా అమితమైన భక్తిప్రపత్తులతో కార్యక్రమాలను జరిపిస్తుంటే... జనం రెప్ప వాల్చకుండా వారి చుట్టాలను చూసినట్లు చూస్తుండేవాళ్ళు. ఇక మీ మాటలు.. ఒకసారి తూటాల్లా, ఒకపరి సుగంధ పుష్పాల్లా... మధ్యమధ్యలో నవ్వులజల్లులు చిలకరిస్తూ, మీ పార్టీ నాయకుల మీదా, ప్రత్యర్థుల మీద మీరు చెణుకులు విసురుతూ... అది ప్రెస్ మీట్ కావచ్చు, బహిరంగ సభ కావచ్చు..  చిన్నా పెద్దా అందరూ పనులు మానుకుని టీవీల ముందు చేరి  మాయాబజార్ సినిమా చూస్తున్నట్లు మీ వాక్చాతుర్యానికి ఆనందంతో మెలికలు తిరిగిపోతూ వాళ్ళల్లో వాళ్లే తలచుకుని తలచుకుని నవ్వుకుంటూండేవాళ్ళు. ఆంధ్రావాలా భాగోఅన్నా, తోటి ప్రత్యర్థి రాజకీయ నాయకులను సన్నాసులన్నా, ‘పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోచమ్మ కొడతదిఅని సామెతలు గుప్పించినా.. మీ శత్రువులతో సహా అందరూ తేలిగ్గా తీసుకుని ఆనందిస్తూండేవారు.

తెలంగాణ పునర్నిర్మాణంఅని మీరు రోజుకోరకంగా చిటికెల పందిరి వేసి చూపుతున్నా, అరచేతిలో స్వర్గాన్ని అలవోకగా దించేస్తున్నా... రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సమస్యలపట్ల మీకున్న అవగాహన, తపన తలచుకుని పొంగిపోతుండేవారు.

మీ తరువాత వారసులుగా ఎదుగుతున్న మీ కుటుంబ సభ్యులను కూడా ఆదరించారు కదా సారూ. ఒక రాజకీయ కుటుంబం అంటే.. ‘‘ చూడండి.. ఆ ప్రేమ, ఆ అనురాగాలు, ఆ ప్రతిభ .. పులి కడుపున పులులే పుడతాయి’’ అని ముచ్చటపడిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పోల్చుకుని పిసరంత మార్కులు మీకే ఎక్కువ వేస్తుండేవాళ్ళు. మీమీద మీకు కూడా ఎంతగా నమ్మకం ఎక్కువయిపోయిందంటే... ‘‘సోనియా సరైన సమయంలో రాహుల్‌కు పట్టాభిషేకం చేయలేదు’’ అని కామెంట్లు కూడా వదిలారు. కానీ మీరు పెట్టుకున్న పట్టాభిషేక ముహూర్తానికి  ప్చ్..ఎదురుగాలి తగిలింది. మన చేతుల్లో ఉండదు కదా సారూ....

ఎప్పుడో చిన్న జంప్చేయబోయి వెంటనే కాలు వెనక్కి తీసుకున్న మీ మేనల్లుడు ... మీరు పెట్టిన అన్ని అగ్నిపరీక్షల్లో అత్యంత సమర్ధుడిగా గోల్డ్ మెడల్ తెచ్చుకుంటున్నా.. మీరింకా అనుమానిస్తూనే ఉన్నారు. ఆ మేనల్లుడుకూడా చంద్రబాబంత ఓపికగా ఉంటూ పార్టీమీద పట్టు సడలకుండా చూసుకుంటున్నాడు.

మిమ్మల్ని చూడాలనీ, మీ మాట వినాలని అందరూ తహతహలాడుతున్నారు. మీరేమో బయటికి రాకుండా ప్రజానీకాన్ని నిరాశపరుస్తూ... జనం ముందుకు మీ కుటుంబ సభ్యులను వదులుతున్నారు. మీరు లేకుండా వారిని చూస్తుంటే...  పులివేషాలు, వీథిబాగోతాలు చూస్తున్నట్లుంది. పక్కన చేరిన జనం కూడా  తప్పనిసరి తద్దినానికి వచ్చిన భోక్తల్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళే ఒకప్పుడు మీవెంట నడిచినప్పుడు పోటీలుపడి  గొంతుచించుకునే వాళ్ళు. ఇప్పుడు సంతాపసభల్లో కూర్చున్నట్లు కూర్చుంటున్నారు.

కేసీఆర్ సార్ !!!

తెలంగాణ సమాజానికి పుట్టుకతో వచ్చిన ఒక ప్రత్యేక గుణం ఉంది. వారు ఒకపట్టాన ఎవర్నీ నమ్మరు. నమ్మితే గుడ్డిగా నమ్ముతారు... అవసరమయితే ప్రాణం కూడా తృణప్రాయంగా వదిలేస్తారు. ఈ విషయం మాకంటే మీకే ఎక్కువగా తెలుసు. కానీ మీకు తెలియనిదేమిటంటే...

వాళ్ళు మిమ్మల్ని ఇంకా అభిమానిస్తున్నారు సార్, నమ్ముతున్నారు కూడా. ఆ అభిమానం, నమ్మకం పోయిననాడు .. వారి స్పందన మీకు... ఊహకు అందనంత తీవ్రంగా ఉంటుంది.  చెన్నారెడ్డిని నమ్మారు కదా.. ఆ తరువాత ఏమయింది... రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా... ఇంకా ఏవేవో చేసినా... తెలంగాణ ద్రోహిగానే చరిత్రలో శిలాక్షరాలతో రాసిపెట్టుకున్నారు.

చావునోట్లో తలపెట్టిన’...  అని మీఅంతట మీరే ఈ మధ్య పదేపదే చెప్పుకుంటున్నారు.జనం ఎక్కడ మర్చిపోతారోనని మీ వారసులు కూడా మళ్ళీమళ్ళీ గుర్తు చేస్తుంటారు. సారూ... ఆరోజు మీరు జ్యూస్ తాగడం, ఆ వీడియో లీక్ కావడం, అది చూసి ఉస్మానియాలో పిల్లలు తిరగబడడం, తర్వాత మీరు నిమ్స్ లో చేరి కథ నడపడం ... అన్నీ జనానికి గుర్తున్నా.... అదేదో ఒక ఎత్తుగడ అని సరిపుచ్చుకున్నారు తప్ప ఎప్పుడూ ఎకసక్కెం చేసి మిమ్మల్ని  బాధపెట్టలేదు. ఒకసారి నమ్మితే ... ఇటువంటి వాటిని మన జనం పట్టించుకోరు సారూ.. అలా నమ్మారు కదా !

కాళేశ్వరం అంత పెద్ద వ్యవహారమే అయినా మీరు దాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నా... అదేకాదు,  మీ గత పాలన తాలూకు ఇతరత్రా అవినీతిని ప్రజలు ఇప్పుడు కొత్తగా చూస్తున్నా.... బాధను మింగుకుని కడుపులో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే... మీ మీద గుడ్డి ప్రేమ ఉన్నట్లే  కదా !  ఇక...  మీరే మళ్లీ  వారిని ముందుండి నడపాలని కూడా వారు కోరుకుంటున్నట్లు  ఇప్పటివరకు అయితే ఎక్కడా దాఖలాలు లేవు. కానీ, మీరు వారి మధ్యఉండాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.  మీరు మారాలి. మీ ధోరణి మారాలి. ‘‘అధికారం ముఖ్యం కాదు. ప్రజాసేవే మా అంతిమ లక్ష్యం’’ అనే పద్ధతిలో రండి. ద్వేష రాజకీయాలు పూర్తిగా పక్కనబెట్టండి. మీ స్వంత మీడియాను వదిలించుకోండి. దానివల్ల... ఏం లాభం చెప్పండి.. స్వకుచమర్ధనం తాలూకు సంతృప్తితప్ప.  దాన్ని  ఉంచుకున్నా ... మీకు డప్పుగా మార్చుకోకండి. చీటికిమాటికీ ప్రత్యర్థుల మీద మీ అక్కసు తీర్చుకోవడానికి దాన్ని వాడుకోకండి.

తెలంగాణ వచ్చిన తరువాత, అదీ ఏకంగా పదేళ్ళు.. రెండు సార్లు వరుసగా వారు మీకు అధికారం అప్పగించిన తరువాత కూడా ఇంకా చీప్‌గా భావోద్వేగాల మీద ఆధారపడకండి .. రివర్స్ కొడుతుంది. . మీ మాటల్లోనే  చెప్పాలంటే.. మీకు రిటర్న్ గిఫ్ట్ ... ఇస్తారు...చూసి తట్టుకోలేనంతగా...

మీ ప్రసంగాల్లో, మీ వారసుల ప్రసంగాల్లో... చంద్రబాబు ముఖంలో కనపడినట్లు...  అధికారం కోల్పోయిన ఆక్రోశం, అక్కసు రోజూ కనబడుతున్నది. దానిని లైజాల్ పెట్టి తుడిచేయండి.  ఎన్నికల లక్ష్యంతోనో, వారసులకు పట్టాభిషేకం కోసమో వస్తున్నట్లు ఎక్కడా ఆవగింజంత అనుమానం రాకుండా జాగ్రత్త పడండి. మీ ప్రతిభ, మీ సామర్ధ్యం, మీ వాక్చాతుర్యం, మీ ప్రసంగధాటి, మీ అనుభవం మీద ప్రజలకున్న  అభిమానం మరింత పెంచే ప్రయత్నం చేయండి. పాజిటివ్ ఆలోచనలతో, పాజిటివ్ ప్రణాళికలతో సరికొత్త కేసిఆర్ సారును మా మధ్యలో చూడాలన్నదే మా ఆకాంక్ష.

రండి కేసీఆర్...

 

అప్పుడు మీ అవసరం కొద్దీ మీరొచ్చారు.

మా అవసరం కొద్దీ  అప్పుడు స్వాగతించాం.

 

ఇప్పుడు మాకు అవసరం లేకపోయినా...

తెలంగాణ  రావడంలో సహాయపడినందుకు  కృతజ్ఞతగా

మిమ్మల్ని దూరం పెట్టలేక రమ్మంటున్నాం. ...

మాతో కలిసి ఉండండి, మాతో కలిసి నడవండి అంటున్నాం....

 

మీకు సాదర స్వాగతం...

పునః స్వాగతం..

-       ములుగు రాజేశ్వర రావు

......

 

ఈ దిగజారుడు రాజకీయం ఆగేదెన్నడు ?

 


 తెలంగాణలో కవిత-మల్లన్న ఎపిసోడ్, 

ఆంధ్రలో పేర్ని నాని-రవీంద్రనాథ్ ఎపిసోడ్... 

దిగజారుడు రాజకీయాలలో ఇవే చివరివా..?

...చివరివే... అని గుండెమీద చెయ్యేసుకుని చెప్పగలిగిన తెలుగువాడు ఒక్కడూ కనిపించడు. ఇవే చివరివయినా కాకపోయినా- ఇంతకంటే నికృష్టస్థాయి రాజకీయం ముందున్నదని చెప్పడానికి కూడా ఏ ఒక్క తెలుగువాడూ వెనకాడడు.

మరి ఈ జీడిపాకం సీరియల్‌ను చూస్తూ ఎంజాయ్  చేస్తూ పోతుంటే... రేపు ఆ పాత్రల్లో మన పిల్లలు, వారి పిల్లలు కూడా కనిపిస్తారు కదూ !!!

అమ్మో, మన పిల్లలా ??? ఆ బురదలోనా... ఆ పెంటకుప్పల్లోనా ???

అలా జరగకూడదనుకుంటే... దీనిని పూర్తిగా చదవండి. కొత్త విషయాలేవీ చెప్పడం లేదు. మీరు మరిచిపోయినవి, మరుగునపడినవే... మరో మారు గుర్తు చేస్తున్నా... భయపడకండి. పైపైనే .. అదీ వీలయినంతగా కుదిస్తా....

 

మూలాల్లోకి ఒక్కసారి తొంగి చూద్దామా !

25  ఏళ్ళ వెనక్కి... ఫ్లాష్ బ్యాక్.... తెలుగు నాట... ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాల తరహా గూండాగిరీ, తిట్లు  అప్పుడు లేవు. కానీ అంతకుముందు సీన్ మరోరకంగా ఉండేది. ఫ్యాక్షన్ రాజకీయాలు.. అవి ఎక్కడో ఎప్పుడో జరుగుతుండేవి. ఎక్కడ జరిగినా... దాని మూలాలు ఒకటి రెండు జిల్లాల్లో కనిపించేవి. తరువాత వెన్నుపోటు రాజకీయాలతో నైతికంగా కిందకు జారడం మొదలయింది.  మీడియాలో విలువలు(తిరోగమనంలోఉన్నవి) చాలా స్పీడ్‌గా పతనం కావడం కూడా అప్పటినుంచే అనుకోవచ్చు.

ఇలా సాగిపోతున్న రాజకీయాన్ని ఒక కీలకమలుపు తిప్పింది తెలంగాణ ఉద్యమం. ఇక్కడ రాజకీయాలకు, ఉద్యమానికీ మధ్య ఉన్న సన్నటి రేఖను జాగ్రత్తగా గమనించండి. 1969లో ఉద్యమం ఒక ఆకాంక్షతో, ఒక  లక్ష్యంతో మొదలయింది. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పెట్టి ఉద్యమానికి రాజకీయ సారథ్యం వహించిన తరువాత ఉద్యమం ఆయన చెప్పుచేతల్లోకి పోయింది... దాని తీవ్రతను కోల్పోయింది. 2000 తరువాత ఉద్ధృతం అయిన రెండోదశ ఉద్యమం  కూడా అదే లక్ష్యంతో, అదే ఆకాంక్షతో మొదలయి... ఫక్తు ఉద్యమ లక్షణాలతోనే సాగింది. అయితే 1969 నాటి పీడకల దృష్ట్యా...  రాజకీయ సారథ్యం పట్ల ఉద్యమకారుల్లో భయాందోళనలు, అనుమానాలు  నెలకొనకుండా ఉండడానికి కాసింత మార్పు జరిగింది.

2000 తరువాత -  తెలంగాణ రాష్ట్ర సమితి అని రాజకీయపార్టీగా పెట్టినా...కేసిఆర్ తనది ఉద్యమపార్టీ అని ప్రకటించుకుని... ఉద్యమానికి సమాంతరంగా నడుపుతూ వచ్చాడు. అంటే ఉద్యమ సారథ్యం ఉద్యమకారుల చేతుల్లోనే ఉంచి.. దానికి మద్దతుగా ఉంటూ రాజకీయంగా కెసిఆర్ తన బలం పెంచుకుంటూ పోయాడు. చివరకు క్లయిమాక్స్ లో (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం అవుతున్న సమయంలో) అంతా కలగాపులగం చేసి లక్ష్యం సాధించేసాం కాబట్టి ఉద్యమ పార్టీ ఇక రాజకీయ పార్టీ అని ప్రకటించేసి... సమాంతరంగా నడిచిన ఉద్యమానికి, దాని సారథులకు మరో ఉనికి లేకుండా కనికట్టు చేసేసాడు.

మరి ఈ విషయం ఉద్యమ సారథులకు తెలియదా ?

వారు అలా అకస్మాత్తుగా ఎలా తప్పుకున్నారు ?

ఎందుకు మౌనం దాల్చారు ?

ఇవేమీ బేతాళ ప్రశ్నలు కావు.  అయితే కాస్త లోతుల్లోకెళ్ళి  చూడాల్సి ఉంటుంది....

అంత వీజీ కాదు:  ఒక బహిరంగ సభ పెట్టాలంటేనే ఒక రాజకీయ పార్టీకి ఖర్చు లక్షల్లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే కదా ! మరి అటువంటిది ఒక ఉద్యమాన్ని అన్ని రోజులు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు బతికించాలంటే దానికెన్ని నిధులు కావాలి !  ఉద్యమం అంటేనే ప్రాణాలకు తెగించి పోరాడే వందలు, వేల కార్యకర్తలు, గొడవలు, అల్లర్లు, అరెస్టులు, కోర్టులు, హింస, దౌర్జన్యం, ఆస్పత్రులు...  కనీసంలో కనీసం అరెస్టయిన కార్యకర్తల్ని బెయిలిచ్చి విడిపించడం కూడా చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం, పొద్దున లేచిన దగ్గరనుండీ అంతా ఖర్చే... నిధులొక్కటే కాదు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఆస్పత్రుల చుట్టూ తిరగడాలూ... చాలా శ్రమతోకూడిన వ్యవహారం కదా ! ... అని చెప్పి మధ్యమధ్యలో  విరామం ఇస్తూ ఆడుతూ, పాడుతూ సాగదీసేది కూడా  కాదు... పైగా బలంగా ఉండే ప్రభుత్వం, పాతుకుపోయిన రాజకీయ పార్టీలతో పోరాటం..  నిత్యాగ్నిహోత్రంలాగా సాగాల్సిందే...


దారి మళ్ళింపు : ఈ విషయంలో పూర్తి అవగాహన ఉన్నవాడు కేసిఆర్. అదీగాక అప్పటివరకు చరిత్రలో జరిగిన చాలా ఉద్యమాలను కాచివడబోసి వాటిలో మెళకువలన్నిటినీ ఆకళింపు చేసుకున్నవాడు. అందుకే ఉద్యమానికున్న ఈ  బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకోవడంమీద దృష్టి పెట్టాడు, స్వచ్ఛందంగా వచ్చే విరాళాలతోపాటూ, ఉద్యమాన్ని సాకుగా చూపి వ్యాపారులను, పెట్టుబడిదారులను బెదిరించి వసూలు చేసిన నిధులను తన రాజకీయపార్టీకి మళ్లించాడు. నిజానికి ఉద్యమం తాలూకు జెఏసీల ఖాతాల్లోకి వెళ్ళాల్సినవి ఇవి.

అయినా ఉద్యమకారులకు అనుమానం రాకుండా...తనను వేలెత్తి చూపడానికి అవకాశం ఇవ్వకుండా... ఉద్యమం ఖర్చు భరిస్తూనే, ఉద్యమకారుల ఆస్పత్రి, కోర్టు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, జరిమానాలు, జామీనులు తదితరాలు చూడడానికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగం ఏర్పాటు చేసాడు ఈ నిధులతో.. దీనితో ఉద్యమకారులకు కార్యాచరణలో వెసులుబాటుతో పాటూ మరింత భరోసా దొరికింది. కానీ వాళ్ళు అప్పుడు గుర్తించనిది... వసూళ్ళు ఏ స్థాయిలో... ఖర్చు ఏ స్థాయిలో ఉన్నాయి..అన్న విషయం .. అసలు అడిగే ధైర్యం వారికి నైతికంగా లేకుండా చేసాడు. ఉద్యమ సారథుల సంగతి తెలియదు కానీ గంపగుత్తగా ఉద్యమకారులంతా...  కేసిఆరే ఉదారంగా తమ ఖర్చులన్నీ భరిస్తున్నాడనుకుని... విపరీతమైన కృతజ్ఞతా భావంతో పిచ్చి అభిమానం పెంచుకున్నారు. అందుకే క్లయిమాక్స్ లో ... అదీ కూడా అందరూ విజయం తాలూకు మత్తులో, జోష్ లో ఉన్నప్పుడు ఇక ఉద్యమ పార్టీ అవసరం లేదంటూ ఉద్యమాన్ని హూష్ కాకీ చేసి, కీలకంగా పనిచేసిన ఉద్యమ సారథులను.. వాడేసిన నిరోథ్ ల్లాగా ముక్కు మూసుకుని దూరంగా విసిరేసి,   తన రాజకీయ పార్టీకే అన్ని రకాల క్రెడిట్ అధికారికంగా దక్కేట్లు చూసుకున్నాడు. (గమనిక – తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసిఆర్ శ్రమను, చొరవను, వ్యూహాల్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఆయన లేకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాకారమయ్యేది కాదు. అది వేరేగా ప్రస్తావించుకోవాల్సిన విషయం)

 

బులెట్ దిగిందా ? లేదా ?

జబ్బు దేనితో తగ్గిందనేది ఎవడికి కావాలి ? మూలికలతోనా, మంత్రాలతోనా, మందులతోనా... దేనితోనయినే ఏం...దేనితో తగ్గిందో అదే మందు.  పోరాటం చేస్తున్నప్పుడు... ఏ వ్యూహం అయితే ఏం ... లక్ష్యం నెరవేరిందా లేదా ... అన్నంతవరకే... అది  నైతికమా, అనైతికమా అని ఆలోచించి ఎవరూ మార్కులేస్తూ కూర్చోరు కదా...  ఇది కేసిఆర్ తన వ్యూహాల అమలులో పాటించిన సిద్దాంతం. బహిరంగంగానే మీడియాకు, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మెడలో పలుపుతాడు వేసి దొడ్లో కట్టేసుకున్నాడు. దానితోపాటూ,  తెలంగాణ రక్తం  వారిలో ప్రవహిస్తూన్నప్పటికీ సమైక్యవాదం వినిపిస్తున్న తెలంగాణ ప్రముఖులను వ్యక్తిగతంగా బెదిరించి నోరు మూయించడం(దాశరథి రంగాచార్యలాంటి వారే లబోదిబోమన్నారు) వంటి వ్యవహారాల వరకూ ఒక ఎత్తయితే...

కాంగ్రెస్, బిజెపి లాంటి జాతీయ రాజకీయపార్టీలకు చెందిన  రాష్ట్ర నాయకుల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న సమైక్యవాదులను దారికి తెచ్చుకోవడం మరో ఎత్తు.  ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి అది అంత సులభం కాదు. దానికి కెసిఆర్ అనుసరించిన అద్భుత వ్యూహం ఒకటి ఉంది... ఏ ఇతర రాజకీయ పార్టీలుకానీ, నాయకులు కానీ పెట్టే బహిరంగ సభలను, ప్రెస్ మీట్లను ఉద్యమకారులతో అడ్డుకునేటట్లు చేసాడు. ఆ నాయకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ‘జైతెలంగాణ’ అనిపించేటట్లు చేసాడు.  ఈ వ్యూహం ఎంతగా సక్సెస్ అయిందంటే వారు బహిరంగ సభలు, ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితి సృష్టించాడు.

ఇవిగాక ఆంధ్ర దోపిడీ, తెలంగాణ నష్టాలకు సంబంధించి ఏవి నిజాలో, ఏవి అబద్ధాలో తెలియనంతగా ఉద్యమకారుల చేత ఏవో గణాంకాలతో, ఏవో ఫొటోలు, ఛార్టులు, చారిత్రక సమాచారం జోడించి పత్రికా ప్రకటనలు, ఇంటర్వ్యూలు, పదేపదే ఇప్పించేవాడు. తనూ అలాగే మాట్లాడేవాడు.  ఏ ఆంధ్ర నాయకుడయినా, ఏ ఆంధ్ర మేధావి అయినా ఆ గణాంకాలు తప్పు అని చెబుతూ ఒక్క ప్రకటన ఇస్తే చాలు... దానిని ఖండిస్తూ తన పార్టీ నాయకులు, ఉద్యమ సారథులు పలువురి చేత ప్రతి రోజూ పదేపదే వందల  ప్రకటనలు గుప్పించేవాడు. (అలాగే ఓటర్ల జాబితానుంచి పేర్లను పెద్ద సంఖ్యలో గల్లంతు చేసే వ్యూహం కూడా.)

అంటే  ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించే భావన ఎక్కడా కలికానికి కూడా కనబడకుండా కట్టుదిట్టం చేసిన వ్యూహం ఇది. అంతవరకు ఓకే. 

అయితే అప్పుడు ఉద్యమం అవసరాల రీత్యా సృష్టించి విజయవంతంగా అమలుచేసిన ఆ వ్యూహాలు... ఉద్యమం లేనప్పుడు కూడా అవే ... అలాగే చెల్లుబాటు అవుతాయా...???

 

తడిగుడ్డలో రాళ్ళు పెట్టి కొడితే...

... రాళ్ళు కనిపించవు.  పైకి కనిపించేది గుడ్డ మాత్రమే...కానీ కనిపించని రాళ్ల దెబ్బ మాత్రం  గట్టిగా తగులుతుంది.

ఈ వ్యూహాలన్నీ విజయవంతం ఎలా అయ్యాయి !!!

 కేవలం పైకి కనిపించిన  కేసిఆర్ వ్యూహరచనతో కాదు. వీటిలో అనైతికమైనవి కూడా చాలా ఉన్నప్పటికీ... అన్ని వ్యూహాల విజయం వెనుక తెలంగాణ ఉద్యమ బలం ఉంది. కానీ ఈ  విషయం క్రమేణా అందరూ మర్చిపోయారు...  చివరకు కేసిఆర్, ఆయన పార్టీ కూడా.  అధికారంలో ఉన్నా, లేకపోయినా .. ఆ బలం తమ బలమే అనుకున్నారు. ఇప్పటికీ అలాగే అనుకుంటున్నారు. అహం బ్రహ్మస్మి లాగా... నేనే తెలంగాణ, నన్ను తిడితే, నా వాళ్లను తిడితే తెలంగాణను తిట్టినట్టే ...అంటుా తెలంగాణ సమాజం తాలూకు హక్కు మాకే భుక్తం అనే భ్రమల్లో ఉంటూ ఆ మేరకు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు.

భ్రమల్లో ఉన్నారని ఎలా చెప్పొచ్చు... ఆ పార్టీ నాయకుల ప్రసంగాల్లో- ప్రతి  10 మాటల్లో 8మాటలు ఈ వైఖరిని చూపుతుంటాయి.  వీరి హక్కు భుక్తం మాట దేముడెరుగు... అప్పుడు ఉద్యమ సందర్భంలో  విజయవంత మయిన  వ్యూహాలన్నీ ...  ఇప్పుడు జాతికి అంకితమయి పోయాయి.  అంటే ఎవరికి వారు తమ స్వంతం చేసేసుకున్నారు.  ఆ గట్టున ఉన్న తెలుగుదేశం, వైఎస్ ఆర్ సిపి, ఇతర పార్టీలు కూడా ఇప్పటికీ  ప్రత్యర్థులమీద ఈ  వ్యూహాలనే కాస్త అటూఇటూగా మార్చి అమలు పరుస్తుండడంతో  పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది.

 

రాజకీయ జాడ్యం

చివరకు ఇది రాజకీయ జాడ్యంగా మారింది.  ప్రాంతీయ పార్టీలద్వారా మరింతగా వ్యాపిస్తున్నది. సర్వసాధారణంగా అయితే  జాతీయ పార్టీల ఆర్ధిక స్తోమతు, పార్టీ నెట్‌వర్క్ ముందు ప్రాంతీయ పార్టీలు నిలవలేవు. కానీ ప్రాంతీయ పార్టీల బలం అంతా  ప్రాంతీయ భావోద్వేగాలే. వాటి ముందు ఎంత బలమున్న జాతీయ రాజకీయ పార్టీలు కూడా నిలబడి నెగ్గుకు రావడం కష్టం. అందుకే ప్రాంతీయ పార్టీల బాధ భరించలేక, మరో విధంగా గట్టెక్కలేని కొన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారి పోరాడుతూ వాటి ఉనికిని అవి కాపాడుకుంటున్నాయి. అలా దిగజారలేని జాతీయ పార్టీలు  మనుగడకోసం గిలగిలాకొట్టుకుంటున్నాయి.

ప్రాంతీయ పార్టీలవల్ల ప్రయోజనం పావుశాతం అయితే ప్రమాదం ముప్పావుశాతం అని చెప్పొచ్చు. (తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్రల్లో ఏం జరుగుతున్నదో ఒక్కసారి చూడండి).  సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే... ప్రాంతీయ పార్టీలకు  ‘ఇంటి విషయం’ మొదటి ప్రాధాన్యత, అంటే ఊరు ఎలా పోయినా ఫరవాలేదు, ‘‘ఊరి సంగతి’’ తరువాత చూసుకోవచ్చు‌-అనుకుంటాయి. అదే జాతీయ పార్టీలకయితే ‘‘ఊరి సంగతి’’ మొదటి ప్రాధాన్యత, తరువాతే ‘ఇంటి విషయం’ అంటాయి. ఊరు బాగుపడితే మన ఇల్లు బాగుపడినట్టేననేది వాటి  సిద్ధాంతం.

ఓ సినీ కవి చెప్పినట్లు.. . అందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలంటే జాతీయ పార్టీల ప్రాధాన్యత పెరగాలి. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ... ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి, జాతీయ పార్టీలు వీటితో నెగ్గుకురాలేక కిందామీదా పడుతున్నాయి.

 

ఈ పరిస్థితి మారాలంటే...???

మరో తుఫాన్, లేదా మరో భయంకరమైన వరద వస్తేగానీ ఈ మురికి కొట్టుకుపోదు. అప్పటివరకు  మూసీ రివర్ ఫ్రంట్ అనే కోడిని...  ముందున్న కొక్కానికి వేలాడదీసి, దానిని  మానస సరోవరం అనుకుని మురిసిపోతూ-( కోట శ్రీనివాసరావు పాత్రలాగా)- ముక్కు మూసుకుని మూసీ కాల్వల్లోనే మునకలేస్తూ తరిద్దాం.

అలా జరగకూడదనుకుంటే... విస్తృత దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే.... జాతీయ పార్టీలను బలపరచడమే మార్గం.

ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిందే... కానీ  జిల్లా స్థాయి వరకే వాటిని పరిమితం చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది.

 

-ములుగు రాజేశ్వర రావు

....

 

 

 


....‘కోట’తో ఓ జ్ఞాపకం


తారల తొలి రోజులు.....‘కోట’తో ఓ జ్ఞాపకం 

నటులు లేదా కళాకారులకు ఒక గుర్తింపు, ఒక స్థాయి రానంతవరకు సినీ పరిశ్రమలో వారు పడిన కష్టాలు, ఎదుర్కొనే అవమానాల తాలూకు అనుభవాలన్నీ ... కొత్తవారికి పాఠాలే అయినా.... దీపపు పురుగుల్లా ఆ పరిశ్రమ చుట్టూ పరిభ్రమించక మానరు.. అటువంటి కష్టాల కొలిమిలో గడపకుండా వైతరణిని దాటలేరు....  అక్కినేనికయినా... ఆ కోవలో వందలు, వేల నటులకయినా  తీరు వేరయినా...  కష్టాల గుండాలు, గండాలు దాదాపు ఒక్కటే... ఆ కోవలో నేను అంతకుముందు తెలుసుకున్న కొందరి అనుభవాలకంటే కోట శ్రీనివాస రావుది ఒకింత బెటరే అయినా... ఆయన మనసును మాత్రం అది బాగా  గాయపరిచింది.

 ‘ప్రతిఘటన’ విడుదల తరువాత... ఒక ఇంటర్వ్యూ అడిగా. అప్పుడు ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నా. నేను సినిమా జర్నలిస్టును కాకపోయినా, సీనియర్ సబ్ ఎడిటర్‌గా నా బాధ్యతలకు అదనంగా సినిమా పేజీల బాధ్యత నామీదుండేది. నారాయణగూడ తాజ్‌లో కలుద్దామన్నాడు... (వివరాల్లోకి పోకుండా క్లుప్తంగా చెబుతా).

 ‘‘ప్రతిఘటన  షూటింగ్ టైంలో నాకు సికిందరాబాద్‌నుండి షూటింగ్ లోకేషన్(పేరు గుర్తురావడం లేదు)కు టికెట్టును ఆర్డినరీ క్లాసులో  నిర్మాణ సంస్థ (ఉషాకిరణ్ మూవీస్)కొనిచ్చింది. నన్ను స్టేషన్ దగ్గర దింపడానికి వచ్చిన రామారావుగారు (సితార ఇంచార్జి) దారి బత్తెంకింద రు.5లు చేతిలో పెట్టారు. అదీ నాకు నిర్మాణ సంస్థ ఇచ్చిన గౌరవం(వ్యంగ్యంగా). ఇటువంటివి చాలా ఉన్నా ఈ సినిమా విజయం తాలూకు సంబరాల్లో అవన్నీ ఇప్పుడు వద్దులే ..’’ అని ఆ సందర్భంలో వాపోయారు.

 నిజానికి కోట ఒక అద్భుత ప్రతిభావంతుడని  మేం కాలేజీ రోజుల్లోనే (1970 ప్రాంతంలో) గుర్తించాం. నెల్లురులో నెఫ్జా, నెఫ్కా పోటీలు రాష్ట్రస్థాయిలో  ఏటా చాలా ఘనంగా జరిగేవి. అవి ఎంత గొప్పగా ఉండేవంటే... తెలుగు నాటకరంగంలోని నటులు, దర్శకులు, కళాకారులు... వాటిలో పాల్గొనడమే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు. అవి జరిగినన్ని రోజులు టౌన్ హాల్ ఎప్పుడూ... చివరకు అర్ధరాత్రి అయినా కిటకిటలాడిపోయేది. ఆ ప్రదర్శనల్లో ఏటా ఎదురు చూసే వాటిలో ఒకటి కోట చెప్పే ‘తెలంగాణ రామాయణం’. అంతటి ప్రతిభావంతుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూనే...  నెఫ్జా, నెఫ్కాలు ఏటా నిర్వహించే పోటీల్లో  బహుమతులు హోల్‌సేల్లో ఎగరేసుకుపోయేవాడు. నెల్లూరు యాసలో కూడా కొన్ని ప్రదర్శనలిచ్చాడు.

 కోట శ్రీనివాసరావుకు సినిమాల్లోకి వెళ్లాలని ఎంత తపన ఉన్నా... అతిథులుగా వచ్చిన సినిమా పెద్దలు ఆ యా ఫంక్షన్లలో హామీలు గుప్పించినా... అవకాశాలు చాలా ఏళ్ళపాటూ అందని ద్రాక్షగానే మిగిలాయి. చివరకు అవి వచ్చి తన ప్రతిభను తెలుగు వారు, సినిమా పరిశ్రమ గుర్తించినా.. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసేంత సాహసం చాలాకాలంవరకు చేయలేకపోయాడు. ఉద్యోగం మధ్యలో సెలవులు పెట్టి కొంతకాలం మేనేజ్ చేసాడు. కాల్షీట్ల డిమాండ్ తట్టుకోలేక.. రాజీనామాకు సిద్ధపడినా...  అభద్రతాభావంతో తొందరపడలేదు. ఆఖరి ప్రయత్నంగా... ఒకటిరెండేళ్ళు సెలవుపెడతాననీ, బ్యాంకు యూనియన్ సహకరించాలని కోరాడు...  అది వర్కవుట్ కాలేదు. (అజారుద్దీన్ వంటి క్రికెటర్లకు అధికారికంగానే డ్యూటీలో వెసులుబాటు ఇస్తున్నప్పుడు .. వెసులుబాటు కాదు కనీసం సెలవుగా నాకెందుకు ఇవ్వరనేది అతని వాదనగా ఉండేది ఆ సమయంలో). చివరకు తెగించి రాజీనామా చేయక తప్పలేదు. అయితే ఆయన ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే  పరిస్థితి రాలేదు.  తన నిర్ణయం ఆలస్యమయినందుకు బాధపడ్డాడేమో కానీ, చింతించాల్సిన పరిస్థితిమటుకు  రాలేదు.

 కోట శ్రీనివాసరావు కేవలం నటుడే కాదు... సమకాలీన సమాజంపట్ల ఒక అవగాహనతో లోతుగా అధ్యయనం చేసిన వాడు. అటువంటివాడు చరమాంకంలో వ్యక్తిగతంగా కొన్ని దెబ్బలు తిన్నా... కొన్ని సందర్భాలలో అనవసరంగా  వివాదాస్పదుడయ్యాడు... ఏదేమయినా ప్రతిభావంతుడయిన ఒక నటుడిని మనం కోల్పోయాం.

-ములుగు రాజేశ్వర రావు.

..............

Shri Sarma garu, renowned leader of State Bank of India Staff Union Hyderabad Circle (at that time) responded with the following details...

శ్రీ కోట శ్రీనివాస రావు గారు, బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో నటించే రోజుల్లో ఆయనను మొదటిసారి త్యాగరాయ గానసభలో కల్చరల్ మీట్ సందర్భంగా కలవటం జరిగింది.
సినిమాల్లో మంచి పేరు, అవకాశాలు వస్తున్న సందర్భంలో దీర్ఘకాల శెలవులో (జీతం లేకుండా) వెళ్ళాలనుకుంటే బ్యాంకు శాంక్షన్ చేయలేదు. అప్పటికే ఆయన వరుసగా మూడుసార్లు సర్కిల్ బెస్ట్ యాక్టర్. అప్పుడు నేను యూనియన్ లో సికింద్రాబాద్ జోనల్ సెక్రటరీని. శెలవు శాంక్షన్ గురించి యూనియన్ హెల్ప్ చేయటంలేదని ఆయన భావన. ఆరోజుల్లోనే అజారుద్దీన్ వరుసగా మూడు సెంచరీలు కొడితే బ్యాంకు అతనికి ఆఫీసర్ గా ప్రమోషన్ ఇచ్చింది.
దాన్ని ఉదాహరణగా చూపి, ప్రమోషన్ అవసరంలేదు కనీసం లాస్ ఆఫ్ పే లీవు కూడా ఇవ్వటంలేదు, యూనియన్ సహాయం అవసరముందని చెపుతూ, ఆయన స్టైల్లో నాతో మాట్లాడారు. ఈ సందర్భాన్ని, తరువాత కాలంలో ఆయనను కలిసినప్పుడుకూడా గుర్తుచేశేవాణ్ణి.
తరువాత ఆయన బ్యాంకుకు రిజైన్ చేసి ఒక విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందడం, లీవు శాంక్షన్ చేయని బ్యాంక్ నుండే సన్మానాలు అందుకోవడం, యంఎల్ఏ అవటం, పద్మశ్రీ తో గౌరవింపబడటం అందరికీ తెలిసిందే.

ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

 


    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...