తెలుగు రాజ్యాల
ప్రభువులు
శ్రీ చంద్రబాబు
నాయుడు, శ్రీ రేవంత్ రెడ్డి గార్లకు
బహిరంగ లేఖ
అమ్మను పంచుకోకండి
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం.. జులై 6,
2024న సమావేశమై ఆస్తిపాస్తుల వాటాల వివాదాలను పరిష్కరించుకోవడానికి
నడుంబిగిస్తున్న శుభ ఘడియల్లో....
అనంతకోటి తెలుగు ప్రజల తరఫున సవినయంగా సమర్పించుకుంటున్న
విన్నపం...
అయ్యలారా !!!!!!!!!!
మీరు ఆస్తిపాస్తుల పంపకాల గురించి మాట్లాడుకునే ముందు మన తల్లిభాష ... తెలుగు ఆరోగ్యం గురించి వాకబు చేయండి. కాటికి కాళ్ళు చాపుకుంటున్న సమయంలో ఆమె ముంగిట వేరు కుంపట్లు వచ్చాయి. అది లోక సహజమే అయినా ఆస్తిపాస్తులన్నీ అనదమ్ములిద్దరూ మీమీ రాజకీయ చతురతతో ఏ పక్షాన్నీ నొప్పించక మీ ఇష్టం వచ్చినట్లు పంచండి.
కానీ అమ్మను ముక్కలు చేసి పంచకండి. అమ్మ కట్టుకున్న
బట్టలు, పెట్టుకున్న నగానట్రా ఇవి నేను పెట్టినవంటే నేను పెట్టినవని పంతాలకుపోయి
ఊడబెరుక్కుపోకండి.
ప్రాంతాలు, ఉప ప్రాంతాల్లో కొద్దిపాటి తేడాలున్నా తెలుగు
వారందరిదీ ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఆచార వ్యవహారం, ఒకే సంప్రదాయం. ఇవన్నీ తెలుగు
వారి ఉమ్మడి ఆస్తి అని భావించండి. పంపకాలకు పెట్టకండి. ఉమ్మడిగా కలిసి అనుభవించడం ద్వారా
మాత్రమే తెలుగు వెలుగుతుంది. సంస్కృతి మరింత ప్రభవిస్తుంది.
అందువల్ల దయచేసి వీటి తాలూకు వేదికలయిన విశ్వవిద్యాలయాలు,
గ్రంథాలయాలు, పురావస్తు భాండాగారాలు, అకాడమీలు, భాషా సంఘాలు, సాంస్కృతిక సంఘాలు...
తదితరాలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి ఏం చేయాలో చర్చించండి. అలాగే దీన్ని
చర్చకు పెట్టండి.
నిజానికి మాతృభూములు ఇవే అయినా ఈ రోజున ప్రపంచ దేశాలన్నింటా తెలుగువాళ్లు
జెండాలు ఎగరేస్తున్నారు. జన్మభూమినుంచి ఎటువంటి ప్రోత్సాహం అందకపోయినా.. తెలుగు
వాళ్లమని గర్విస్తూ ప్రవాసాంధ్రులు మాతృభూమికంటే
మిన్నగా భాషాసంస్కృతుల పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తూ వాటిని బతికించడానికి
నానాపాట్లు పడుతున్నారు.. వీరి సంఖ్య కోట్లల్లోనే ఉంది.(350 విదేశీ భాషలున్న ఒక్క
అమెరికాలోనే తెలుగువారు 11వ స్థానంలో, కేవలం భారతీయ భాషలనే తీసుకుంటే తెలుగువారు
3వ స్థానంలో వెలిగిపోతున్నారు అక్కడ )
అందువల్ల అందరి అభిప్రాయాలు సేకరించి, రెండు తెలుగు
రాష్ట్రాల భాషా నిపుణులకు, ప్రవాసాంధ్రులకు సముచిత ప్రాతినిధ్యం, ఇతర ప్రోత్సాహకాలతో
ఉమ్మడి వేదికల దిశగా అడుగులు వేయండి. తక్షణ పరిశీలనపట్ల ఆసక్తి ఉంటే దీనికి
సంబంధించిన విశ్లేషణలు, సూచనల లింక్ లు కింద ఇస్తున్నాను. తెలుగు భాషాభిమానులందరి
అభిప్రాయాలు అందేవరకు వీటిని పరిశీలించి ... చివరగా అందరికీ ఆమోదయోగ్యమైన
పరిష్కారాలను అందించి తెలుగు భాషాసంస్కృతులు
మరో వెయ్యేళ్ళు వర్దిల్లేలా శాశ్వత
పరిష్కారాలు చూపండి.
ఇట్లు
ములుగు రాజేశ్వర రావు,
సీనియర్ జర్నలిస్టు
................
మనవి :
సామాజిక మాధ్యమాలలోని మిత్రులకు, తెలుగు భాషాభిమానులకు, భాషా
నిపుణులకు ఒక మనవి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే వీలయినంత మందిని ఈ దిశగా కదిలించండి,
అధినాయకుల్లో, వారి ప్రభుత్వాల్లో కదలిక
వచ్చేవరకూ....
.....
తెలుగు భాషోద్ధరణకు సంబంధించిన కొన్ని సంస్కరణలు, పరిష్కారాలు,
సూచనలు....
1.
ఇది నా నూలుపోగు... మరి మీదో....
https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_30.html
2.
ఆచరణాత్మక సంస్కరణలు...కొన్ని సిఫార్సులు
https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post.html?spref=tw
3.
తెలుగు... గోదాట్లో
కొట్టుకుపోవడం తథ్యం ! ! !
https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_20.html?spref=tw
4.
ఆలిండియా రేడియోనా ...ఆకాశవాణా...!!!!
https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_24.html?spref=tw
5.
అమ్మ ఎలాఉంది? ...హలో !!! మిమ్మల్నే...అమ్మ ఎలా ఉంది !!!
https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_26.html?spref=tw
6.
అమ్మను వదిలేసి, సవతి తల్లి
చంకెక్కబట్టే....
https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_99.html?spref=tw
7.
ఉద్యమం అంటే... స్క్రిప్టురాసుకుని
సినిమా తీయడం కాదు కదా !
https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_1.html?spref=tw
8.
మీ ఇంటి నుంచి నేరుగా కబేళాకా....!!!
https://chinavyasudu.blogspot.com/2021/07/blog-post_31.html?spref=tw
9.
దీని ‘తల రాత’ను మీ రాతే మార్చగలదు... !!!
https://chinavyasudu.blogspot.com/2021/08/blog-post_2.html?spref=tw
......................................
చాలా చక్కగా వివరించారు, తప్పకుండా పరిశీలించాలి ఈ విషయాన్ని ఇద్దరు ముఖ్య మంత్రులు 🙏
రిప్లయితొలగించండిChalaa chakkaga chepparu
రిప్లయితొలగించండి