అందరి నాయకా ! అందుకో ఈ లేఖ

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరిది ? దాని హక్కుదారులెవరు ?

తెలంగాణ రాష్ట్రం ఎవరిది ? దాని హక్కుదారులెవరు ?


ఈ రెంటికీ ఒకటే సమాధానం...

ఇంకెవరు !!!  ప్రజలే.

భౌగోళికంగా విడిపోయినా ఏటికి అటున్నదీ, ఇటున్నదీ తెలుగు ప్రజలే. వారి మధ్య నైతిక, సామాజిక, వైవాహిక, వాణిజ్య, సాంస్కృతిక... తదితర సంబంధాలన్నీ దాదాపు సాధారణ స్థితికి చేరుకుని భవిష్యత్ జీవితాలను మరింత మెరుగు పరుచుకోవాలని వారు ఉవ్వీళ్ళూరుతున్న ప్రస్తుత తరుణంలో...

చిక్కుముళ్ళను...

రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన చిక్కుముళ్ళను, పీటముళ్ళను విప్పదీసే ప్రయత్నానికి ముఖ్యమంత్రులు పూనుకోవడం హర్షించదగిన పరిణామమే అయినా... 

శనివారం, జులై 6, 2024న మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి చర్చలు ప్రారంభించిన సన్నివేశం 

కొన్ని నైతిక, మౌలిక ప్రశ్నలను సంధిస్తున్నది.

·        ఈ ఆస్తుల పంపకాల చర్చలకు ప్రాతినిథ్యం ఎవరు వహించాలి ?

·        ఏ ఒక్క ప్రాంతమూ, ఏ ఒక్క వర్గమూ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది ?


ఈ రెంటికీ ఒకటే సమాధానం...

శాసనసభలకు, పార్లమెంటుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న  ప్రతి ఒక్కరితోపాటూ, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఉద్యమ సమయంలో రెండు పక్షాల్లో చురుకైన పాత్ర పోషించిన అన్ని రాజకీయపక్షాల నాయకులు, ప్రజాసంఘాలు, మేధావులు కూడా ప్రాతినిధ్యం వహించాలి, బాధ్యత తీసుకోవాలి కూడా.


ఏరీ ! వారేరీ !!!

నిన్నిటి చర్చల్లో ఏరీ... వారేరీ !!! ఎక్కడా కనిపించలేదేం !!! వినిపించలేదేం !!!

ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రతిపక్షసభ్యులు కానీ, నాయకులు కానీ వారి వారి గుహల్లోంచి తొంగిచూడకపోవడమేమిటి !! అధికారం చేతికి అప్పగిస్తేనే ప్రజల పక్షాన పోరాడతారా !!! రాజకీయంగా రచ్చ చేయడానికి ప్రతిరోజూ ఓ నలుగురిని పోగేసుకుని టివి కెమెరాలముందు ఊరేగడానికి, ఆక్రోశించడానికి ఉన్న తీరిక... ఈ చర్చల్లో తమ వంతు పాత్ర పోషించడానికి ఎందుకు లేకపోయింది !!!!

 

ఆ సోయి వారికి కూడా లేదేం !!!!

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వాటాలు, పంపకాలకు కూర్చుందామని నిర్ణయించుకున్న రెండు రాష్ట్రాల అధికార పక్షాలు ఇది వారి స్వంత పార్టీలకు, వారి ప్రభుత్వాలకు పరిమితం చేస్తే సరిపోతుందా !!!

ఈ చర్చల్లో ప్రత్యక్షంగా కూర్చోబెట్టాల్సిన అవసరం లేకపోయినా సలహాలు, సంప్రదింపులకు రెండు రాష్ట్రాల్లో ఎన్నికయిన ప్రజాప్రతినిధులను, మేధావులను, ప్రజా సంఘాలను కలుపుకుపోయే దిశగా అడుగులు పడిందెక్కడ ?


ఇకనయినా...

ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు. అధికారుల స్థాయిలో, ముఖ్యమంత్రులస్థాయిలో తీర్మానాలు మాత్రమే చేయండి. నిర్ణయాలు తీసుకోకండి. చట్ట సభలను ప్రత్యేకంగా సమావేశపరచండి. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి మేధావులనూ భాగస్వాములను చేయండి...


ఇది ఇప్పటికిప్పుడు ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే....


పునర్వవిభజన చట్టం తాలూకు పంపకాలు-చిక్కుముళ్ళు...

ఇక్కడి రాజకీయ పార్టీలకు సృష్టిస్తున్న అవకాశాలు అపారం


·        కాంగ్రెస్ పార్టీకి.... సోనియామీద కోపం కొద్దీ కాంగ్రెసును మట్టికరిపించిన  ఆ గట్టున కూడా మళ్ళీ కాంగ్రెస్ పంట పండించి అధిష్ఠానానికి మరింత చేరువ కావడానికి రేవంత్ రెడ్డికి ఇదొక అందివచ్చిన అవకాశం (కానీ గురుద్రోహం అవుతుందనే భయం)

·        తెలుగు దేశానికి... కేసిఆర్ కొట్టిన చావుదెబ్బతో కనుమరుగయిన తెలుగుదేశాన్ని తిరిగి తెలంగాణలో బతికించుకోవడానికి  చంద్రబాబుకు ఇదొక సువర్ణావకాశం (కానీ ప్రియ శిష్యుడిమీద కత్తిదూయడమెలాగా అని సందిగ్ధం)

·        భారతీయ రాష్ట్ర సమితికి... పంపకాలు ఎలాగూ ఉభయులనూ పూర్తిగా సంతృప్తిపరచలేవు గాబట్టి... గడ్డిపోచంత ఆధారం దొరికినా చాలు సెంటిమెంటు రగిల్చి  బతికి బట్టకట్టడానికి  కేసిఆర్ పార్టీకి   ఇది కలిసొచ్చిన అవకాశం...

·        వైఎస్సార్ సిపికి... తెలంగాణలో దూరే అవకాశం ఎలాగూ లేదు... ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నారనే నినాదంతో  తలెత్తుకుని తిరగడానికి జగన్ కు దేవుడిచ్చిన అవకాశం...

·        భారతీయ జనతాపార్టీకి... కాషాయానికి దక్షిణాదిన కషాయమే అనుకున్న చోట... కాలోవేలో మోపేంత స్థలం దొరికితే అరబ్బీ ఒంటెలాగా గుడారంలోకి పూర్తిగా దూరిపోవాలని చూస్తున్న సమయంలో... రెండు రాష్ట్రాలు పిలిచి అందిస్తున్న అవకాశం....

ఈ పరిస్థితుల్లో  రాజకీయ పార్టీల స్వార్థాలకు బలికాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూర్తి న్యాయం జరగాలంటే... మేధావులు, ప్రజా సంఘాలు సహా అని పక్షాల  అంగీకారంతోనే  నిర్ణయాలు జరగడం ఉత్తమం.


-ములుగు రాజేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టు.


1 కామెంట్‌:

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...