* తెలంగాణకు కేంద్ర సాయం * బనకచర్ల * కాళేశ్వరం * ఫోన్ టాపింగ్ * వేశ్యల రాజధాని * కాంగ్రెస్-బిజెపి-బిఆర్‌ఎస్..
వీటిలో రెండు కలుస్తాయని మూడోది అనడం * కులగణన.... ఇలా చాలా
వాటిపై.....
ఆరోపణలు, ప్రత్యారోపణలు, అబద్ధాలు, తిట్లు,
పుకార్లు, విద్వేష ప్రసంగాలు... వీటన్నింటికీ కొద్దిగా ఎక్కడో నిజాలను కూడా జోడించి ప్రతిరోజూ ప్రజలను గందరగోళపరచడం ఆనవాయితీగా
మారింది. ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఎదగాల్సిన
సమాజాన్ని కలుషితం చేసి జనం మెదళ్ళను కుళ్ళబొడుస్తున్నారు. ఎవరి వాదన వినేటప్పుడు వారి వాదనే
సరైనదనిపించేత నమ్మకంగా చెబుతున్నారు. అత్యున్నత స్థాయి జాతీయ రాజకీయ నాయకుల
నుంచీ, రాష్ట్రస్థాయి... గల్లీ లీడర్ల
వరకు అందరిదీ ఇదే వరస. కొత్త విషయం ఉండదు, ప్రతి రోజూ, ప్రతి గంటా... ఇదే బాగోతంతో
ప్రజలను వెర్రివెంగళప్పలను చేస్తున్నారు. వారి చెవుల్లో వారికి తెలియకుండా పున్నాగ
పూలు, మందారాలతో సరిపెట్టకుండా ఏకంగా పారిజాత పుష్పాలనే తెచ్చి పెడుతున్నారు.
ఎందుకిలా జరుగుతున్నది ???
లోగడ న్యూస్ ఛానళ్ళు, సామాజిక మాథ్యమాలు లేని
రోజుల్లో పత్రికా విలేకరులు ... రాజకీయ నాయకులు ఏవి చెబితే వాటినన్నిటినీ విని...జాగ్రత్తగా రాసుకుని... వాటిలోని నిజానిజాలు బేరీజు వేసుకుని, పొట్టు
అంతా దులిపేసి... ఎడిటోరియల్ డెస్క్ కు పంపితే... అక్కడ ఇంకా తాలు ఏదయినా మిగిలుంటే
వడకట్టేసి... ఆ వార్త ప్రాధాన్యతను, అది మాట్లాడిన నాయకుడి స్థాయిని బట్టి...
పాఠకులకు ఎంతవరకు అవసరమో అంతే ఉంచి, మిగతా సొల్లంతా నిర్దాక్షిణ్యంగా తుడిచేసి...
ప్రచురించేవారు... నిజంగా ఆ వార్త ముఖ్యమయి, అక్కడ ఇచ్చిన సమాచారం తక్కువగా ఉంటే
సదరు రిపోర్టరునడిగి మరింత జోడించి ప్రింట్ కు పంపేవారు. దీనిలో అస్పష్టతకు కానీ,
గందరగోళానికి కానీ ఆస్కారం ఉండేది కాదు. అబద్ధమని తేలితే ముందే ఆపేసేవారు.
వివాదాస్పదమనుకుంటే... సంబంధిత వర్గాలనుండి వివరణలు సేకరించి ఇచ్చేవారు. కాబట్టి
పాఠకులు కూడా ఫిల్టర్ కాఫీలా సేవించేవారు తృప్తిగా. ఇప్పుడా ఫిల్టర్ పాయింట్లు
లేవు. మూసీనీటికి, గండిపేట నీటికి తేడాలేకుండా తెచ్చిన సీసాలు మన మూతులకు బిగించి తాగించేస్తున్నారు.
రెండో కారణం ... ప్రెస్ మీట్లు. ఒకప్పుడు
పత్రికావిలేకరుల సమావేశాలంటే రాజకీయ నాయకులకు పంచెలు తడుస్తుండేవి. బహిరంగ విచారణ జరుపుతున్నట్లుండేది.
స్వేచ్ఛ, సభ్యత, సంస్కారాలు, గౌరవమర్యాదలు పాటిస్తూనే నిర్భయంగా ప్రశ్నలు అడిగి
అన్ని సందేహాలను నివృత్తి చేసుకునే వారు. ఉత్తుత్తి ఆరోపణలు, పేరుకోసం ప్రచార యావతో
చేసినవి గుట్టుచప్పుడు కాకుండా చెత్తబుట్టల్లోకి వెళ్ళేవి. నాయకుడి స్థాయిని బట్టి
వేయాల్సి వచ్చినా... సింగిల్ కాలమ్... ఎక్కడో ఓ మూలన పడేసేవారు.
కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే...
ప్రవచనకారుడి ముందు బుద్ధిగా కూర్చుని చెప్పింది చెప్పినట్టు, విన్నది విన్నట్లు
రాసుకోవడం... డెస్క్ లో కూడా ప్రవచనకారుడి నెట్‌వర్క్ పనిచేస్తుంది కాబట్టి... అది
శ్రీవారు ఎలా మాట్లాడారో అలానే ప్రచురిస్తున్నారు.(తసమదీయుల పేపర్లో అయితే ఇదే వార్తను విస్మరించడమో లేదా
ఖండఖండాలుగా నరికి పోగులు పెట్టడమో చేస్తున్నారు.) కానీ ప్రశ్నలు అడిగే సాహసం ఎవరూ
చేయడం లేదు. ఒకవేళ తెలియక అడిగినా... మీడియా మేనేజ్మెంట్ వారు ... నొక్కేస్తారు.
అందువల్ల ఒకే సమాచారం ఒకే నాయకుడు రోజూ ఇచ్చినా.... అబద్ధాలు పదేపదే వల్లె
వేసినా, పొంతన లేకుండా ఇచ్చినా.... అది
అలా పోవలసిందే... ఆకర్షణీయమైన శీర్షికలతో...
మూడో కారణం... వేగం. న్యూస్ ఛానళ్ళు, సోషల్
మీడియా వేదికలు తామరతంపరగా విస్తరించడంతో.... ప్రెస్ మీట్ ముగియక ముందే... చాలా
సార్లు ... అక్కడి నుంచే ....స్క్రోలింగులు, ముక్కలు, ముక్కలుగా వార్తలు...
వైరలయిపోతుంటాయి. అసలు ముఖ్యమైన నాయకుల ప్రసంగాలయితే అన్నీ లైవే కదా... మైకుల
ముందు సర్దుకుని కూర్చోక ముందే వారు తెరలపై లక్షలాదిమందికి దర్శనమిచ్చేస్తున్నారు.
ఇది రాజకీయ నాయకులకు బాగా కలిసొచ్చే అంశం. వారి లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికి,
తప్పులకు కవరింగ్ ఇచ్చుకోవడానికి. ఒక
అబద్ధాన్నే అన్ని భాషల్లో పదేపదే చెబుతున్నా... లైవ్ కొనసాగుతూనే ఉంటుంది.
సో ... చెప్పదలచుకున్నదేమిటంటే...
ప్రజలకు అవసరమయిన ఒక సమాచారం, లేదా ప్రజలకు కొత్తగా తెలపాలనుకున్న సమాచారం ఒకటికి పదిసార్లు తనిఖీ చేసుకుని ప్రచురణ లేదా ప్రసారం చేసే యంత్రాంగం మాయమయిపోతున్నది. నిజం గడపదాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్నది. ఒక సమస్యపై కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ అధికార పార్టీ నాయకుడు రోజూ మాట్లాడుతున్నా, వివరణ ఇస్తున్నా... ‘‘ఈ సమస్యపై అధికార పార్టీ నోరు తెరవడంలేదు, ఫలానా నాయకుడి నోరు పడిపోయింది. మేం ఇన్ని సార్లు ఇన్ని ఆరోపణలు చేస్తున్నా... స్పందించడం లేదు’’ అని ప్రతిపక్షనాయకులు ఆరోపణ చేస్తూనే ఉంటారు... విధేయులైన మీడియా సిబ్బంది వాటిని మోస్తూనే ఉంటారు.దీనితో ప్రజలకు ఇది రోజువారీ తలనొప్పి అయింది. మొత్తం 24 గంటల వార్తా ప్రసారాల్లో.... కేవలం 10 నిమిషాల మేర కూడా ప్రజలకు ఉపయోగకరమైన వాస్తవిక సమాచారం ఉండడం లేదు.
ఎన్నికల సమయంలో సర్వే సంస్థలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. మిగతా రోజుల్లో సబ్బులు, చాక్లెట్లు, టాయిలెట్ల
శుభ్రతకు సంబంధించిన ప్రకటన తాలూకు సర్వేలు మాత్రం విరివిగా వస్తుంటాయి... జనాల
కొనుగోలు శక్తి, మారుతున్న అలవాట్లమీద... అంతే తప్ప... రాజకీయ నాయకులు, వారి పార్టీల నిర్వహణమీద, ఒక్కో నాయకుడికి మీడియాలో
ఇస్తున్న కవరేజ్ మీద, అన్నిటికీ మించి అవినీతి ఆరోపణల మీద ప్రజలు ఏమనుకుంటున్నారో... సర్వేలు జరగడం లేదు.
కాళేశ్వరం, కార్ రేసింగ్, ఫోన్ టాపింగ్...
విషయాలనే చూడండి, ముఖ్యంగా మీడియా బాధ్యులు... ప్రతిరోజూ అన్నన్ని గంటలు,
అన్నన్ని ఆరోపణలు... అంతంత ప్రచారమా... ఓ..కే... రాజకీయ నాయకులకు అవసరం కావచ్చు...
కానీ మీడియా ప్రజలకోసం ఉన్నదా !!! నాయకులకోసమా !!! అటువంటి విషయాల్లో ప్రజలకు
స్పష్టత ఇచ్చి... అనవసరమైన ఊకదంపుడును అరికట్టలేరా... ధరలపెరుగుదల, ప్రజా రవాణా తగ్గిపోవడం
వంటి ఎన్నో ప్రజా సమస్యలను గురించి ఎంత సేపయినా ... అంటే అవి పరిష్కారమయ్యేవరకు
ప్రసారం చేసుకోవచ్చు గదా !!!
ఇప్పుడు చేయాల్సిందేమిటంటే...
సమాచారం ఎంత స్వచ్ఛంగా, సక్రమంగా, సమగ్రంగా ఉంటే... ప్రజలు అంత తెలివిగా, అంత వివేకంతో, అంత బాధ్యతగా ఆలోచించుకోగలుగుతారు, దానికి తగ్గట్లు అంత పరిపక్వతతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు... ఇదే ప్రజాస్వామ్యంలో, స్వేచ్ఛాయుత రాజ్యంలో కీలకం. దీని తరువాతే ఏదయినా... ఇప్పుడా ఆ సమాచారం డ్రైనేజీ కాల్వగా మారి కంపుకొడుతున్నది... ఏదయినా సమాచారం అందిన వెంటనే మీడియా ప్రసారం చేయకుండా... తనిఖీలు చేసుకుని.... సందిగ్ధతలు తొలగించుకుని, అబద్ధాలను తొలగించి ప్రజలకు ఎంత అవసరమో అంతే చేరవేయాలి.... ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమా.... ఇంపాజిబుల్.... రాజకీయ పార్టీలు, మీడియా సంస్థల మధ్య అవగాహన, సమన్వయం ఉంటే సాధ్యమే కానీ... అతిగా ఊహించడం , ఎక్కువగా ఆశించడం అవుతుంది.
అత్యంత సులభమైన మార్గం... ప్రజలకు సుళువుగా
ప్రశాంతతను అందించే మార్గం ఒకటే....ఇది ఆచరణాత్మకం కూడా...
పొలిటికల్ (కాంపెయినింగ్) హాలిడే ప్రకటించడమే...
వారానికి నాలుగైదు రోజులు ప్రకటిస్తే చాలు...అంటే ఆ రోజుల్లో అత్యవసర ప్రభుత్వ ప్రకటనలు తప్ప, పత్రికల్లో, న్యూస్ చానళ్ళలో, ఇతర త్రా
రాజకీయ సంబంధమైన ప్రచారాలకు స్వస్తి పలకడం.
సొంత అజెండాతో తప్ప... నిజమైన ప్రజా సమస్యలపై ఏ రాజకీయ పార్టీ (కమ్యూనిస్టు పార్టీలతో సహా) ఆందోళనలు, నిరసనలు తెలపడంలేదు కాబట్టి... కింది స్థాయిలో ఉండే వారి నాయకులకు, కార్యకర్తలకు కూడా ఆటవిడుపుగా ఉంటుంది.
ముందు ఆ పని మీద ఉందాం...దానికి డిమాండ్
చేద్దాం. ఇట్నుంచీ సాధ్యం కానిది.. అట్నుంచీ నరుక్కుంటూ వస్తే సరి.....
-ములుగు
రాజేశ్వర రావు.
గమనిక
: పొలిటికల్(కాంపెయినింగ్)హాలిడే అనే సలహా.... వ్యంగ్యాత్మకం.
అది
సాధ్యం కాదని తెలుసు.
పోలింగ్ తేదీకి ముందు ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం ఉంటుంది...
అప్పుడు అంతా ప్రశాంతంగా
ఉంటుంది. దాని స్ఫూర్తితో చెప్పిన మాట...
రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రతి రోజూ మీడియా హోరెత్తిస్తున్నది.
( ఆ
హోరులో ప్రజల విషయంలో దాని ప్రాధాన్యతలను మీడియా మర్చిపోతున్నది).
జనం
భరించలేకపోతున్నారు... అని చెప్పడానికి- నా ఈ పోస్ట్ కు వస్తున్న సానుకూల స్పందనే దానికి నిదర్శనం.
నిజానికి...
రాజకీయ పార్టీలు తమ తప్పొప్పులను కప్పిపుచ్చుకోవడానికి,
జనం దృష్టిని మళ్ళించడానికి వారిని వీలయినంత గందరగోళ పరచడం అనేది
ప్రపంచవ్యాప్తంగా
సాగుతున్న ఒక రాజకీయ క్రీడ.
దీనిలో
మీడియా కూడా దానివంతు ఆట అది ఆడుతున్నది.
ఇప్పుడు
మన దగ్గర అది పరాకాష్ఠకు చేరుకున్నది.
....