అగ్నిపథ్ – ఒక సూక్ష్మ పరిశీలన

 

అగ్నిపథ్ – ఒక సూక్ష్మ పరిశీలన

(ప్రతి ఒక్క పౌరుడూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జాతీయ పథకం)

 

 

జూన్ 14, 2022 న భారత ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పేరిట ఒక పథకాన్ని ప్రకటించింది. 

భారత సైనిక దళాలలోకి నియామకానికి సంబంధించిన ప్రకటన ఇది. ఏళ్ళతరబడి ఏడాదిపొడవునా ఎక్కడో ఒకచోట ఈ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వినడానికి అలవాటుపడిపోయిన 

జనం దీనిని కూడా చూసీ చూడనట్లు చూసి వదిలేస్తున్న క్షణంలో....

అకస్మాత్తుగా ఒక్కసారిగా ‘అగ్ని’ చెలరేగింది. రైళ్ళు, బస్సులు తగలబడుతున్నాయి. ఆసేతు హిమాచలం ఉలిక్కిపడింది. 

ఏం జరిగింది !!! ఏం జరుగుతున్నది !!! ఏం జరగబోతున్నది !!!  

తెలియదు. తెలియదు కాక తెలియదు. అప్పుడే కాదు ఇప్పటికీ తెలియదు. 

ఊళ్ళో ఎక్కడో అగ్ని ప్రమాదం జరుగుతుంది. కొందరు ప్రత్యక్షంగా చూస్తారు. పరోక్షంగా కొందరు వింటారు. ఊరుఊరంతా మాట్లాడుకుంటుంటారు. ఎవరి కథనం వారిదే ఉంటుంది తప్ప ... ఎప్పటికోగానీ అసలు కథనం బయటికి రాదు. అప్పటికి అంతా చల్లారిపోయి ఉంటుంది. బూడిద కూడా కనపడదు అక్కడ. 

ఇప్పుడూ కచ్చితంగా అదే పరిస్థితి.


రకరకాల అపోహలు :  ఇది దారితప్పిన యువత సృష్టించిన అరాచకమా ? అభివృద్ధిని చూసి ఓర్వలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న వారి నిర్వాకమా ? లక్షల పెట్టుబడి, నష్టాలతో కడుపుకాలిన కోచింగ్ సెంటర్ల కుట్రా ? కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ కొత్త రాజకీయాలకు తెర లేపుతున్న ప్రతిపక్షాల కుత్సిత బుద్ధా ? శత్రు దేశాల అదృశ్య హస్తమా ? మత కోణం  ఉందా ? .... వీటిలో ఏ ఒక్క కారణమైనా కావచ్చు. కాకపోవచ్చు. మరేదయినా కారణం కూడా ఉండవచ్చు.

కానీ ఈ దేశపౌరులమయిన ప్రతి ఒక్కరం ఓం ప్రథమంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఇది జాతీయ పథకం. ఇప్పుడు ఇది ఒక జాతీయ సమస్యగా మారుతున్నది. అంటే మనందరి సమస్య.మన కుటుంబ సమస్య, మన పిల్లల సమస్య, మన భవిష్యత్తు సమస్య. సమస్త భారతావనిలోని పౌరులందరి ప్రాణ రక్షణ సమస్య, దేశ సరిహద్దుల భద్రతా సమస్య. 

నాకు వీలయినంత మేర నేను సేకరించిన సమాచారాన్ని నిష్పాక్షిక దృష్టితో మీముందుంచుతున్నా. పాక్షిక దృష్టితో చదివే వారికి దీనిలో లోపాలు కనపడవచ్చు కూడా. అందుకే అందరం చైతన్యవంతులమై దురభిమానాలకు పోకుండా వాస్తవాలు మనకు నచ్చినా నచ్చకపోయినా  అవి వాస్తవాలేనని అర్థం చేసుకుంటూ ... ఒకవేళ నేనిచ్చిన సమాచారంలో లోపాలున్నట్లు భావిస్తే వాటిలోని  నిజానిజాలు తెలుసుకొనే ప్రయత్నాలు చేయగలరన్న నమ్మకంతో సవినయంగా పాఠకులకు నివేదించుకుంటున్నా....ఇక చదవండి.


అగ్నిపథ్...పథకం

భారత సైనిక దళాలలోకి ప్రవేశ స్థాయిలో నియామకాలకు సంబంధించి జూన్ 14, 2022న ప్రభుత్వం అగ్నిపథ్పథకాన్ని ప్రకటించింది. సైన్యం లో చేరి దేశసేవ చేయాలన్న ఆకాంక్షతో కలలుకనే వారిలో వీలయినంత ఎక్కువ మంది ఆకాంక్ష నేరవేర్చడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది... అని అత్యున్నత సైనికదళ అధికారులు  వివరించారు.  ఈ నియామకం పరిమితి నాలుగేళ్ళు. నియామకమయిన నాటినుండి వీరిని అగ్నివీరులుగా వ్యవహరిస్తారు.


కనిష్ఠ వయోపరిమితి పదిహేడున్నర సంవత్సరాలు కాగా గరిష్ఠ పరిమితి 21 ఏళ్ళు.  తరువాత దీనిని 23 ఏళ్ళకు పెంచారు. కనీస విద్యార్హత పదవ తరగతి. ఐటిఐ సర్టిఫికేట్ ఉన్నవారిని సాంకేతికపరమైన విభాగాల్లోకి తీసుకుంటారు. తొలివిడతగా 46 వేలమందిని నియమించుకోవడానికి పదాతిదళాల నోటిఫికేషన్ విడుదలయింది. సోల్జర్ (జనరల్), సోల్జర్(టెక్నికల్), సోల్జర్(క్లర్క్ / స్టోర్ కీపర్ /నర్శింగ్/అసిస్టెంట్ ట్రేడ్స్ మన్) స్థానాలను వీరితో భర్తీ చేస్తారు.


సెప్టెంబరు/అక్టోబరు, 22 లలో దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటిఐ ప్రాంగణాల్లో నియామక ప్రక్రియ సాగుతుంది. డిసెంబరు 30 నుంచి తొలి ఆరునెలలు సైనిక శిక్షణ ఉంటుంది. తరువాత వీరికి... వారు ఎంపికయిన విభాగాలకు సంబంధించిన నైపుణ్య శిక్షణ తరువాత నేరుగా విధులు అప్పగిస్తారు.  నాలుగేళ్ళ గడువు ముగిసాక వీరికి సర్టిఫికేట్, నైపుణ్యాలు, ఇతరత్రా ప్రతిభాప్రదర్శనల ఆధారంగా అదనపు సర్టిఫికేట్లు ఇచ్చి పంపుతారు. ఆ తరువాత వీరికి సైనిక దళాలతో ఎటువంటి సంబంధం ఉండదు. అయితే వీరిలో ఎవరికయినా మళ్లీ సైనిక దళాల రెగ్యులర్(శాశ్వత) సర్వీసులోకి చేరాలన్న ఉత్సుకత ఉంటే వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకొన్న అభ్యర్ధులను       25 % కి మించకుండా  తీసుకుంటారు.


అగ్నివీరులుగా ఎంపికయిన వారికి తొలి ఏడాది రు.4.76 లక్షలతో జీతం మొదలవుతుంది. చివరి ఏడాది రు.6.92 లక్షలు చెల్లిస్తారు. అయితే దీనిలో 70% మాత్రమే నెలానెలా జీతం కింద చెల్లిస్తారు.(అంటే రు.40 వేలకు గాను రు.21 వేలు అందుతుంది). మిగిలిన 30% మొత్తానికి సమానమైన మొత్తాన్ని కలిపి సేవానిధి కింద జమచేస్తారు. ఉద్యోగ విరమణ అనంతరం ఎటువంటి పింఛను ఉండదు. సేవానిధికింద జమయిన మొత్తాన్ని వడ్డీతో సహా  (దాదాపు రు.11-12 లక్షల మధ్య) ఏకమొత్తంగా చెల్లిస్తారు. పదవీకాలంలోనే కంట్రిబ్యూటరీ జీవిత బీమా రు.40 లక్షలు ఉంటుంది. విధినిర్వహణలో మరణిస్తే దాదాపు కోటిరూపాయల మేర పరిహారం చెల్లిస్తారు.


నాలుగేళ్ళ తరువాత సర్టిఫికేట్ తోపాటూ, సేవానిధినుండి అందిన పెద్ద పొదుపు మొత్తంతో  పదవీ విరమణ పొందిన వారు స్వేచ్ఛా జీవులు. వారి ఇష్టమైన రీతిలో పౌరజీవనం గడపవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు వారి ఇష్టం. బ్యాంకు రుణాలు సులభంగా అందే ఏర్పాటు చేస్తారు. యూనిఫాం ఉద్యోగాలపట్ల మక్కువ చూపే అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీస్ దళం (సిఏపిఎఫ్), అస్సాం రైఫిల్స్ వంటి దళాల నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు (ఉత్తర ప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి) తమ  రాష్ట్ర పోలీస్ విభాగాల్లో నియమించుకొంటామని ఇప్పటికే ప్రకటించాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా అవకాశం ఇస్తామని తెలిపాయి.

 

అగ్నిపథ్ఎందుకు ?

ప్రపంచవ్యాప్తంగా కాలానుగుణంగా అన్నీ మారుతున్నట్లే దేశరక్షణ వ్యూహాలు కూడా మారుతున్నాయి. సాంకేతికంగా మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నప్పుడు యుద్ధవ్యూహాలు కూడా మారిపోతుంటాయి. మానవ వనరుల ప్రాధాన్యత తగ్గి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్నది. సైబర్, ఆర్టిఫియల్ ఇంటలిజన్స్,హైపర్ సోనిక్ ల పరిజ్ఞానం ఉన్నవారికి సైనిక దళాలు నియామకాల్లో ప్రాధాన్యతనిస్తున్నాయి. చైనా 23 లక్షల మంది ఉన్న ఒక సైనిక విభాగంలో 3 లక్షల మందిని తొలగించింది. అమెరికా గత రెండు దశాబ్దాల్లో 10 లక్షలమంది సైనికులను ఇంటికి పంపింది.


మనదేశంలో కూడా సైనిక దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకురావాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1990లో ఒకసారి, 2003లో ఒకసారి ఇలానే జరిగింది. అరుణ్ సింగ్ కమిటీ, కార్గిల్ కమిటీ, షెకావత్ కమిటీ వంటి దాదాపు అగ్నిపథ్ లాంటివే కొన్ని సిఫార్సులు చేసాయి. కానీ సైనికపరంగా కానీ, రాజకీయపరంగా కానీ, నిర్ణయాలు తీసుకోవడానికి అప్పటి ప్రభుత్వాలు, సైనిక విభాగాలు సాహసించలేకపోయాయి.


2022-23 రక్షణ బడ్జెట్ నే తీసుకుంటే అది రు.5,25,166 కోట్లమేర ఉంది. దీనిలో కేవలం పింఛన్లకు రు.1,19,696 కోట్లు ఖర్చవుతాయి.  జీతాలు, నిర్వహణ లతో కలిపి రెవిస్యూ వ్యయం రు.2,33,000 కోట్లు. దీనికితోడు ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో 15.88 % ఉండగా రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో సైనికదళాల ఆధునీకరణకు ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు ఉండడం లేదు. అగ్నిపథ్పథకం ద్వారా తాత్కాలిక పద్ధతిలో నాలుగేళ్లవరకు సైనిక సేవలు ఉపయోగించుకొని వారిని పంపివేసినందువల్ల పింఛను ఇతరత్రా పదవీవిరమణ చెల్లింపుల్లో భారీగా పొదుపు చేయవచ్చు.


అదీగాక ఇప్పటివరకు పూర్తిస్ధాయి శిక్షణ పొంది పోరాట పటిమతో యుద్ధక్షేత్రం లోకి దిగేనాటికి సైనికుల వయసు 30-35 దాటిపోతున్నది. దానివల్ల సైనిక దళాల్లో నవయవ్వన కాంతి లోపిస్తున్నది. శత్రుదేశాలతో ఉన్న మన సరిహద్దు చాలా ఎక్కువగా ఉండడం, అన్నిరకాల వాతావరణాన్ని  తట్టుకొని నిలబడగల సామర్ధ్యం అవసరం కావడం, వీటికితోడు చైనా సరిహద్దుల వద్ద నిరాటంకంగా, నిత్యనూతనంగా సైనిక కార్యకలాపాలు చేపడుతూ రెచ్చగొట్టే ధోరణులను అవలంబిస్తున్నందువల్ల దేహదారుఢ్యం బాగా ఉన్న సైనికులను హిమాలయాలవంటి చలిప్రదేశాల్లో కూడా దాదాపు శాశ్వతంగా నిలిపి ఉంచాల్సి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో శారీరక దారుఢ్యం ఉన్న నవ యవ్వనులను సైన్యంలోకి ఎక్కువగా ఆకర్షించడం అనివార్యమవుతున్నది.


అంటే ఖర్చు ఎక్కువ లేకుండా, ఆధునికీకరణను ఆహ్వానిస్తూ, సైనిక దళాల సామర్ధ్యాన్ని పెంచాలంటే అగ్నిపథ్వంటి పథకం అవసరమని కేంద్రప్రభుత్వం, సైనిక దళాల ఉన్నతాధికారులు  భావించి ఆ దిశగా కార్యాచరణకు పూనుకొన్నారు.

 

అగ్నిపథ్ కు వ్యతిరేకత ఎందుకు ?

పలువురు సైనిక నిపుణులు, సైనికదళాల తాజా మాజీ ఉన్నతాధికారులు,  ప్రతిపక్ష పార్టీలు, సైనికదళాల్లో చేరాలన్న ఆకాంక్ష బలంగా ఉన్న యువతీయువకులు, మేధావులు పెద్దసంఖ్యలోనే  దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు చెబుతున్న కారణాలు...


·        సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కంటూ ఆకాంక్షలు బలంగా పెంచుకున్న యువతరం ఆశలపై ఇది నీళ్లు చల్లుతున్నది. భావోద్వేగాలు పట్టించుకోకుండా కేవలం దీనిని ఉపాధి అవకాశంగా మార్చివేయడాన్ని వీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ అగ్నిపథ్ కు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్లు ఎంతసేపటికీ దీనిని పౌరసమాజంలోఉన్న జాబ్ మార్కెట్తో పోలుస్తున్నారు, అలాగే భావిస్తున్నారు. జాతీయ పతాకాన్ని నాలుగు గజాల గుడ్డ ముక్కకింద పరిగణించి మాట్లాడగలమా !!! అనేది ప్రతికూలుర వాదన.


·        ఉపాధి పొందాలన్న లక్ష్యంతోనో, డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతోనో ఎవరూ సైన్యంలో చేరరు.  అయితే వారి లక్ష్య సాధనలో ఉపాధి, సంపాదనల ప్రాధాన్యత  నామమాత్రమే.


·        సైనిక నియామక ప్రక్రియ రూపురేఖలను, తత్త్వాన్ని  అగ్నిపథ్ పూర్తిగా మార్చివేస్తున్నది. ఈ మార్పు ఇప్పటిదాకా ఉన్న మొత్తం సైనికదళాల కూర్పులో కూడా ఉంటుంది.


·        ఇప్పటివరకు ఏడెనిమిది ఏళ్ల కఠిన శిక్షణ తరువాత గానీ, కొత్త అభ్యర్థులను యుద్ధక్షేత్రంలోకి దింపడానికి పై అధికారులకు నమ్మకం కుదిరేది కాదు. అటువంటిది నాలుగేళ్ళ సర్వీసులో కేవలం 6 నెలలు మాత్రమే సైనిక శిక్షణతో  అగ్నివీరులకు క్షేత్రస్థాయిలో పోరాటపటిమ, సామర్ధ్యం, అంకితభావం ఎలా వస్తాయి ?


·        అగ్నిపథ్ ద్వారా సైన్యంలో చేరిన వారికి సంప్రదాయబద్ధంగా ఇచ్చే ర్యాంకులు ఇవ్వరు. వీరిని అగ్నివీరులుఅనే పిలుస్తారు. వీరికి యూనిఫాం, హోదా తెలిపే బ్యాడ్జీలు వేరుగా ఉంటాయి. అంటే సరిహద్దుల వద్ద శత్రువులతో ముఖాముఖి ఢీకొనే వారిలో రెండు రకాల యూనిఫాంలు కనిపిస్తుంటాయి.


·        మానసికంగా, అంకితభావంతో త్యాగం, తెగువ వంటి వాటిలో శాశ్వత సైనికులకు, కాంట్రాక్ట్ సైనికులకు  మధ్య నైతికంగా కూడా ప్రతి స్థాయిలో  తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది.


·        ఇప్పటివరకు ‘‘నేను ఈ దేశ సైనికుడిని’’...అని అనిపించుకోవడం గర్వంగా ఉంటున్నది. గౌరవం అపారంగా ఉంటున్నది. దేశ ప్రజల అపార ప్రేమాభిమానాల రుచిని ఆస్వాదించడంతో దేశంకోసం ప్రాణాలకు కూడా లెక్కచేయని తెగువ వస్తున్నది. అది ఈవేళ ఉండి రేపు వెళ్లిపోయే తాత్కాలిక సైనికులయిన అగ్నివీరులకు ఉండదు.


·        నాలుగేళ్ల గడువు తరువాత బయట పౌర సమాజంలో గడపడానికి వచ్చిన తరువాత వారు అగ్నివీరులుగానే గుర్తింపబడతారు.  మాజీ సైనికోద్యోగులకు చెందిన నిబంధనల ప్రకారం అగ్నివీరులు ఎట్టి పరిస్థితులలోనూ మాజీ సైనికోద్యోగులు’(ఎక్స్ సర్వీస్ మెన్) అనిపించుకోరు. పింఛన్ సౌకర్యం, ఇతరత్రా ప్రయోజనాలు ఎలాగూ ఉండవు.


·        ప్రతిష్ఠాత్మకమైన భారత సైనిక శిక్షణ పొందిసైన్యంలో గడువు ముగిసిన తరువాత అగ్నివీరులకు బయట అపార ఉపాధి అవకాశాలు ఉన్నాయి...అని ఎంతగా ఊదరగొట్టే  ప్రకటనలు చేస్తున్నా... ఏటా దాదాపు 17 వేల మంది చొప్పున పదవీ విరమణ పొంది మాజీ సైనికోద్యోగులుగా  ఇప్పటివరకు బయటికి వచ్చిన వారిలోనే ఇప్పటికీ చాలా మందికి సరైన ఉపాధి లభించడం లేదు. అటువంటిది నాలుగేళ్ళ అగ్నివీరులకు అద్భుత భవిష్యత్తుఅనేది కేవలం అతిశయోక్తి మాత్రమే.


·        నా ఉద్యోగం ఇక్కడ నాలుగేళ్ళే  అన్న మైండ్ సెట్ తో సైన్యంలో చేరిన అగ్నివీరులకు... చేరిన పక్క రోజునుండే రెండో ఉపాధిని గురించే గుబులుంటుంది. సొంత ఇంట్లో ఉన్న భావన వేరు, అద్దింట్లో ఉన్న భావన వేరు.


·        పథకం నుండి బయటపడిన అగ్నివీరులకు ప్రాధాన్యతఅని ప్రభుత్వం అంటున్నది తప్పితే  జాబ్ గ్యారంటీఅని ప్రకటించడం లేదు.


·        కేవలం నాలుగేళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం సైనిక దళాల్లో చేరాలని ఎవరూ ఉబలాటపడరు....


·        అనుభవం సంపాదించుకున్న సైనికులు ప్రతి నాలుగేళ్ళకు వేలసంఖ్యలో వెళ్ళిపోతుంటే ఫ్రంట్ లైన్ పోరాట సామర్ధ్యం ఎప్పుడూ ఆశించినంత నమ్మకంగా ముందుకు అడుగువేయలేదు.


·        సుశిక్షితులైన అగ్నివీరులవల్ల దేశ సరిహద్దుల భద్రతే కాక దేశం లోపల (తిరుగుబాట్లు, ఆందోళనలు, అల్లర్లవంటివి) భద్రత కూడా  భేషుగ్గా ఉంటుంది... అని ప్రభుత్వం చెబుతున్నది. కానీ ప్రతి సంవత్సరం బయటికి వచ్చే ప్రతి వేయిమంది  అగ్నివీరుల్లో  750 మంది(మిగిలిన 250 మందిని రెగ్యులర్  సర్వీస్ లోకి తీసుకుంటే) దేశం లోని  నిరుద్యోగుల సంఖ్యకు అదనంగా చేరుతుంటారు. వీరిలో మంచి ఉపాధి అవకాశాలు దొరికిన వారి భవిష్యత్తు భద్రంగా కొనసాగుతుంది.  సాయుధ శిక్షణ పొంది వచ్చిన ఈ అగ్నివీరుల్లో ఉపాథి దొరకక నిరాశానిస్పృహలు పెరిగిన నాడు....  తీవ్రవాదం, ఉగ్రవాదం పైపు సులభంగా ఆకర్షితులవుతారు. అది ప్రశాంత సమాజానికి శాపంగా మారితే ... దాని నుంచి సమీప భవిష్యత్తులో దేశం కోలుకోలేదు.

 

పొరబాటు ఎక్కడ!!! తడబాటు ఎక్కడ !!!

దేశ త్రివిధ సైనిక దళాల నియామక ప్రక్రియలో ఇంత పెద్ద సంస్కరణ తీసుకువస్తున్నప్పుడు దీనిపై అన్ని వ్రజావేదికల మీద ప్రజా బాహుళ్యంలో కూడా విస్తృతంగా చర్చ జరగాల్సింది. కనీసం పార్లమెంటుకయినా తగినంత ముందుగా తెలియపరచాల్సింది. లేదా దీనిని ప్రయోగాత్మకంగా కేవలం పరిమితంగా కొన్ని చోట్ల మాత్రం ప్రవేశపెట్టాల్సింది. ఇవేవీ చేయలేదు.  అపారమైన అనుభవం గడించిన తాజా మాజీ దళాధిపతులకు కూడా ఇదేమిటో ఇప్పటికీ పూర్తిగా తెలియదని వారే వాపోతున్నారు బహిరంగంగా. నిజం చెప్పాలంటే ఇప్పుడు అత్యున్నత పదవుల్లో ఉన్న దళాధిపతులకు కూడా దీనిపై పూర్తిగా అవగాహన లేదని చెప్పడానికి వారు రోజుకో రకంగా చేస్నున్న మార్పులు, మాట్లాడుతున్న మాటలే దానికి రుజువు.

·        జూన్ 14న అగ్నిపథ్ప్రకటించిన మరుసటి రోజే ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకత గమనించి.... నాలుగేళ్ళ తరువాత అగ్నివీరులకు ఉపాధికి సంబంధించి హామీలు గుప్పించడం మొదలుపెట్టారు. అంతకుముందు ఆ ఊసే లేదు.

·        ఆ వెనువెంటనే గరిష్ఠ వయోపరిమితిని సడలించి 21 నుంచి 23 ఏళ్ళకు పెంచారు.

·        రెజిమెంట్లు(గూర్ఞా, మద్రాస్ రెజిమెంట్ల వంటివి) బ్రిటీష్ కాలం నాటివి ఇప్పుడు చెల్లవు...అని ఒకరంటే లేదు, లేదు రెజిమెంట్ సంస్కృతి సైన్యంలో కొనసాగుతుంది..దానిజోలికి మేం వెళ్లడం లేదని మరో అధికారి ప్రకటిస్తారు.

·        అగ్నివీరులుసైన్యంలో ఒక భాగం అని కొందరు అధికారులు అంటూంటే... వారు సైన్యంలో ఎప్పటికీ భాగం కాలేరు...అని మరి కొందరు సైనికాధికారులు అంటున్నారు.

·        సైనికదళాల్లో అగ్నివీరుల పాత్ర ఏమిటి ? వీరు సిపాయిలుగా (జనరల్ డ్యూటీ సోల్జర్) గా ఉంటారా లేక టెక్నీషియన్లుగా, క్లర్కులుగా, అకౌంటెంట్లగా, మేల్ నర్సులుగా, ఇతరత్రా పలు కేటగిరీ ఉద్యోగులుగా ఉంటారా ... స్పష్టత లేదు. నోటిఫికేషన్లలో క్లర్కులు తదితర పోస్టుల ప్రస్తావన కూడా ఉంది.

 

నేరం నాది కాదు...

జూన్ 14 న చేసిన అగ్నిపథ్ ప్రకటన తరువాత ఉప్పెనలా ఉప్పొంగిన వ్యతిరేకత విధ్వంసానికి దారితీసింది.. అదెలా జరిగిందో తెలిసే లోపే ప్రతిపక్షాల కుట్ర, దేశద్రోహుల అఘాయిత్యం వంటి ఆరోపణలు పుంఖానుపుంఖంగా వదిలారు. వాటి నుండి తెప్పరిల్లుతున్న సమయంలో తేలిందేమిటంటే... ఈ హింసాకాండకు పూనుకున్నది సాక్షాత్తూ సైనికదళాల్లో చేరాలని కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకుని ఆ శుభఘడియలకోసం చూస్తూ కాచుకుకూచున్న వేలాది మంది అభ్యర్థులు...అని.


మూడేళ్ళక్రితం సైనిక దళాల నియామకాల ప్రక్రియ ఎప్పటిలాగానే  అప్పటి నిబంధనల ప్రకారం మొదలయింది. ఇది(పరీక్ష) చాలా కఠినంగా ఉంటుంది. ఇది మొదలు కాకముందే నియామకాలు ఆశించిన  అభ్యర్థులు కనీసం దానికి ఒకటి రెండేళ్ళముందునుంచే శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి విపరీతంగా చెమటోడుస్తారు. ప్రక్రియ ప్రారంభంకాగానే వీరిలో పలువురు శారీరక యోగ్యతా పరీక్షలకు ఎంపికయ్యారు. తరువాత వైద్యపరీక్షలు... వాటిలో కూడా పలువురు ఉత్తీర్ణులయ్యారు. ఇలా ఉత్తీర్ణులయ్యే వారికి తదుపరి  ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆ క్రమంలో చివరి పరీక్ష. ఇది జరగాలి. మూడేళ్ల కిందటి ముచ్చట ఇది. ఆ పరీక్ష వాయిదా పడింది. కోవిడ్ కారణం అన్నారు. త్వరలో జరుగుతుందని ఎప్పటికప్పుడు దాటేస్తూ వచ్చారు. కోవిడ్ నుంచి కోలుకుని అన్నిరంగాల్లో  సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా... ఈ పరీక్ష ఊసు లేదు. శారీరక దారుఢ్యం సడలకుండా నిత్యం చెమటోడుస్తూ,  కళ్ళుకాయలు కాచేలా ఆ తేదీకోసం చూస్తున్న అభ్యర్థులనెత్తిన సర్జికల్ స్ట్రయిక్ జరిగింది. ఉరుములు, మెరుపులు లేకుండా జూన్ 14, 2022న  ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారినెత్తిన పిడుగుపడింది. ఆ పిడుగు పేరు అగ్నిపథ్


వ్రవేశపరీక్ష రద్దుకాలేదు... అప్పటివరకు వాయిదా అని భ్రమపెడుతూ వచ్చి అకస్మాత్తుగా దాని స్థానంలో అగ్నిపథ్ను దింపేసారు. సైనిక దళాల్లో నియామకాలు ఆశించేవారెవరయినా, ఈ అభ్యర్థులతో సహా మళ్ళీ తాజాగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. క్యూలో రావాలన్నారు. ఒకవేళ దానికి సిద్దపడినా ఆ ఉద్యోగం తాత్కాలికమే, కాంట్రాక్ట్ పద్ధతిలోనే ...అని కత్తులు దింపి కారం కూడా చల్లడంతో ... వారి గుండెళ్ళో రైళ్ళు పరిగెట్టాయి. మండేగుండెల్లో దూసుకుపోతున్న రైళ్ళకు నిప్పంటుకున్నది.


విచిత్రమైన దృశ్యం ఏమిటంటే.... మండే గుండెల్లో అగ్నివీర్ సృష్టికర్తలకూ, వారి మద్దతుదారులకూ గుండాలు కనిపిస్తే.... సైన్యంలో చేరాలని గుండెలనిండా ఆకాంక్షలు నింపుకున్న వేలాది యువకులకు వారి ఆశలు చితికి... రాజుకున్న చితిమంటలు కనిపించాయి.

 

నేరము-శిక్ష-లాభమూ, నష్టమూ...

కాలుతున్న కట్టెల మీద నీళ్ళు చల్లి...  అవి మీరు తగలెట్టుకోవడం కాదు, రైల్వే ఆస్తుల రక్షణ చట్టాలు కఠినాతి కఠినం, ఉరిశిక్షలు, యావజ్జీవాలతో మేం తగలబెడతాం.. అని ఆ కట్టెలను తీసుకెళ్ళి జైళ్ళల్లో, కోర్టుల్లో పడేసారు.


ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు..అని నేరం నాదికాదు , ఆకలిది..అన్న చరణాలు గుర్తుకు రావడం అనుచితమేమీ కాదు... సందర్భానుచితం.


ఈ హింసాకాండలో గూండాలను చూసినవారికి, కుట్రలు కనుగొన్నవారికి....

ఒక ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న....

 

ఈ విధ్వంసకాండలో నేరం ఎవరిది ???

ఈ ప్రశ్నలకు సూటిగా జవాబిచ్చేముందు... చిన్న తర్కం అవసరం. ఏ నేరం జరిగినా ..మున్ముందు తెలుసుకోవడానికి ప్రయత్నించేది.. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి ? అని, ఆ తరువాత దానికి ప్రేరేపించిన వారెవరు ? అని. ఆ పైన నిందితుల నేర చరిత్ర. వీటి ఆధారంగానే నిందితులపై విచారణ జరుగుతుంది, జరగాలి కూడా.

 

నేరానికి ప్రేరేపించిన ఉద్దేశం.... సైన్యంలో చేరడానికి చివరి అవకాశం చేజారిపోయింది, వయసు కూడా  మీరడంతో తరువాత అవకాశాలు మృగ్యం. ప్రవేశ పరీక్ష లేకుండా చేయడంతో (అది రద్దయిందని ఇప్పటివరకూ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు) రెండు స్థాయిల్లో ఉత్తీర్ణులయినవారికి మూడోది, చివరిది అయిన ప్రవేశపరీక్ష చేజార్చడం...నిందితుల తప్పయితే కాదు. చేతికి అందిన ముద్ద నోటికి అందకుండా లాగేసింది ఎవరు ? ఆఖరి అవకాశం కోల్పోవడంతో నాలుగైదేళ్ళ శ్రమ నేలపాలు కావడం, భవిష్యత్తు అంధకారం కావడంతో కళ్ళు బైర్లు కమ్మి నేరానికి పాల్పడ్డారు. అయితే నేరం నేరమే. దానికి చట్టం కింద శిక్ష కూడా అవసరమే. అయితే  ఆ ఆస్తుల రక్షణ చట్టాన్ని... అలాగే కడుపు కాలి గుండె మండి కాలు జారిన మనిషి చేసిన నేరాన్ని న్యాయస్థానాలు తూకానికి పెట్టినప్పుడు ...

చట్ట ప్రకారం అయితే త్రాసు  ఎటు మొగ్గుతుంది ? ధర్మం ప్రకారం అయితే  ఎటు మొగ్గుతుంది ?

 

నేరానికి ప్రేరేపించినది ఎవరు ?

మూడేళ్ళక్రితం నాటి సైనిక నిబంధనల ప్రకారం నిర్వాహకులు నియామక ప్రక్రియ చేపట్టి, రెండు స్థాయిలు పూర్తి చేసి, మూడో స్థాయిని నిలిపి ఉంచారు. మూడోస్థాయి పరీక్షకు హాజరవడానికి మొదటి రెండు పరీక్షలు ఉత్తీర్ణం కావడం నిబంధనల ప్రకారం తప్పనిసరి. దానికి యోగ్యత పొందిన అభ్యర్థులు మూడో పరీక్ష కోసం నిరీక్షిస్తున్నారు. కోవిడ్ కారణంగా వాయిదాపడిందని చెప్పిన నిర్వాహకులు దాని తదుపరి తేదీ తెలియచేయకుండా అగ్నిపథ్ను ప్రకటించడం వల్ల జీవితంలో అభ్యర్థులకున్న ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకునే హక్కును కాలరాయడం నిర్వాహకులు చేసిన మొదటి తప్పు. 


మూడు, నాలుగేళ్ళ క్రితం అప్పటికి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ నిర్వహించి ... ముందు సమాచారం ఇవ్వకుండా  చివరన ఏకపక్షంగా రద్దు చేసి కొత్త ప్రక్రియలో తాజాగా నమోదు చేసుకోవాలని చెప్పడం అక్షరాలా రెండవ తప్పు.  


ఈ రెండింటితో సైనిక నియామక ప్రక్రియ నిర్వాహకులు నిందితుల సహనాన్ని  రెచ్చగొట్టినట్లుగా పరిగణించాలి.  ఆ తరువాత నిందితులు నేరానికి పాల్పడ్డారు కాబట్టి వారికి భవిష్యత్తులో సైన్యంలోనే కాదు, మరే ప్రభుత్వ ఉద్యోగానికి కూడా పనికి రారని ప్రకటించడం నిర్వాహకులు చేసిన మూడో తప్పు


విధ్వసం కాండపై కేసులు నమోదు చేసే ప్రక్రియలో  ఇప్పటికే చేర్చబడిన నిందితులతోపాటూ ఆ  నేరానికి వారిని ప్రేరేపించిన సైనిక నియామక ప్రక్రియ నిర్వాహకులను కూడా భాగస్వాములను చేసి  కేసులు పెట్టాలి. నిందితుల నేర చరిత్ర, నేరం వెనుక వారి ఉద్దేశాలను కూడా న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలి.  ఈ సంఘటనల తాలూకు అన్ని నేరాల విషయంలో  న్యాయస్థానాలు రైల్వే చట్టాల కోణంలోనే కాక, మానవతా దృక్పథంతో విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి అవసరమయితే ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి.

 

చివరగా సభ్యసమాజానికి మరో మాట :

సైన్యంలో చేరడానికి సిద్ధమయ్యే అభ్యర్థుల ప్రవర్తన ఇప్పడే ఇలా ఉంటే ...వీరు సైన్యంలో చేరితే ఇంకేమన్నా ఉందా ??? అని ప్రశ్నిస్తున్న సమాజానికి ఒక ప్రశ్న...

అత్యంత క్రమశిక్షణకు మారుపేరయిన సైనిక దళాల్లో, అలాగే రాష్ట్ర స్థాయిలోని పోలీసు విభాగాల్లో కూడా (యూనిఫామ్డ్ ఫోర్సెస్) .....అయిదారు నెలలు జీత భత్యాలు ఇవ్వకుండా, ప్రైవేటు రంగంలో లాగా... అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి ఊడబెరికి రేపటినుంచి రావాల్సిన పనిలేదు...అని గెంటేస్తే....

అంతే క్రమశిక్షణతో సుశిక్షితులైన ఆ సైనికులు శుభంఅని తలవంచుకొని నోరెత్తకుండా పెట్టేబేడా సర్దుకొని ఇంటి ముఖం పడతారా !!! ఆలోచించండి. నాలుగు గోడల మధ్య ఉంచి బయటి కెళ్ళే అన్ని మార్గాలనూ(అవకాశాలనూ) మూసేసి ... కొట్టాల్సిన పనిలేదు... కర్రెత్తి కన్నెర్ర చేస్తే చాలు... పిల్లి కూడా...అంతే.... ఆ పిల్లిని కూడా రైల్వే ఆస్తుల పరిరక్షణ చట్టం కింద ఉరితీయడానికి ఒక సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

-ములుగు రాజేశ్వర రావు,

సీనియర్ జర్నలిస్ట్




1 కామెంట్‌:

  1. నిష్పాక్షిక విశ్లేషణ. జయ ప్రకాష్ నారాయణ గారు కూడా ఈ మధ్య ప్రభుత్వ భజన లో మునిగి పోయి విశ్లేషణ మర్చి పోతున్నారు. హింస కాండ వెనుక శిక్షణ సంస్థ లు ఉన్నా తీవ్ర వేదన ఉండ బట్టే యువకులు ఆవేశ పడ్డారు. వారిని మానవ త దృక్పథం తో, నేర చరిత్ర నేపథ్యంలో విచారణ జరపాలి. కానీ heart less government కి ప్రతి దీ వ్యాపార మే

    రిప్లయితొలగించండి

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...