మై హూఁ నా....


పాపా నిన్న చనిపోయాడు....అంతకుముందు 45 రోజులు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుకున్నాడు...  పోలేక పోయా... నాలుగు దశాబ్దాల అనుబంధం... ఆత్మీయ బాంధవ్యం... ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. మై హూఁ నా.. అని వాలిపోయేవాడు...మన ఇంట్లో  మనం కూడా తీసుకోనంత చొరవతో కలియదిరిగేవాడు... రోమీ లాగా... ఎన్ని సార్లిలా...అంటే లెక్క దొరకదు... నాకే కాదు చుట్టుపక్కల పదిపదిహేను కాలనీల వాళ్లకీ ఇదే అనుభవం... అక్కడ ఎక్కువ బ్రామ్మల ఇళ్లే... అసమదీయ కులం వారిని కూడా ఒక హద్దు దాటి లోనికి రానివ్వని మడీఆచారపు ఇళ్ళల్లో  పాపా కు మాత్రం ఓ మినహాయింపు... అందుకే ఆమ్మ(పెదనాన్న భార్య)... వాడికీ ఓ జంథ్యం, లింగం మెళ్ళో వేస్తే పోలా... మహేశ్వరుడిగా కూడా పనికొస్తాడు’ అనేది....పాపా.. అలా చాలా మందికి ‘కంటిపాప’.

 

ఇవ్వాళ మధ్యాహ్నం అంత్యక్రియలని పాపా కూతురు భావన చెప్పింది...అయితే ఏం.. కరోనా సాకొకటి ఈ మధ్య దొరికింది కదా తద్దినాలు కూడా ఎగ్గొట్టడానికి... దానికి తోడు సరోజ పొద్దున్నే అల్టిమేటం ఇచ్చింది... వెంకటేశర సామికి పిండిదీపం పెట్టుకుంటున్నా... వద్దు.. అన్నది.. మరీ ఈ కారణంతో వద్దనే సాహసం నేరుగా చేయలేక... అసలే కరోనాతో కదా... అయినా అక్కడంత సేఫ్ కూడా కాదన్నది... చివరగా బ్రహ్మాస్త్రం వదిలింది... కరోనాతో పోతే ఎవ్వరినీ రానీయరుకదా అంది... యస్.. ఇవన్నీ మంచి కారణాలే... అందుకే కాదనలేకపోయా...

 

అయినా మనసు మెలి పెడుతున్నది... రాజీ పడలేకపోతున్నా... రోజులాగే వేణ్ణీళ్ళతో తలస్నానం చేస్తున్నా.... మాలిని పెళ్ళి గుర్తొచ్చింది... నా చేతుల మీదుగా జరుగుతున్న పెద్ద కార్యక్రమం, మొదటి కార్యక్రమం... చేతులే కాదు, కాళ్ళుకూడా ఆడని స్థితి...  నా అన్నవాళ్లు వెనకాముందూ ఎవరూ కనబళ్ళా... అయినా పెళ్ళి మాత్రం సూపర్ సక్సెస్ అని పెళ్ళికి వచ్చిన అందరూ అన్నారు... ఎవరంటే ఏమిటి... మాలిని అత్తగారింటి కామెంట్లు ముఖ్యం కదా... ఆ రాత్రి అప్పగింతల తరువాత... తీరిగ్గా వారేమన్నారు, వీరేమన్నారంటూ తిరగేసుకుంటూంటే... ఏర్పాట్ల విషయంలోనూ  ఇతరత్రా అన్నింటా వారు ఫుల్లీ సాటిస్ఫైడ్....అని సుబ్బులు బావ చెబుతుంటే మెలికలు తిరిగిపోయా....   టెంపరేచర్ నార్మల్ కి వచ్చిన తరువాత ఒకే ఒక ప్రశ్న... ఇదంతా నీ ప్రతిభేనా.... పొరలుపొరలుగా  తెరలు తొలిగాయి... అప్పుడు నా చేతులు, నా కాళ్లు, ఒళ్ళు  అన్నీ తానే అయి నీడలా వేలుపట్టి కథ నడిపించిన పాపా... నెత్తిన వేణ్ణీళ్ళు కుమ్మరించుకోంగానే మరోసారి నవ్వుతూ కనిపించాడు...

 

అంతేనా...  అమ్మపోయి చీకట్లో దేవులాడుకుంటున్న మాకందరికీ తలలో ఒకే నాలుకయిపోయాడు... అని చెబితే పాపా సేవను అవమానించినట్లవుతుంది....  నెలల తరబడి మంచంమీద పడుకుని వీపంతా చివికిపోయి... నానిన రొట్టె మీద వేలు పెడితే లొత్తలు పడినట్లుగా ఉన్న స్థితిలో, అక్కడున్న అందరూ ముక్కులను బట్టలతో   గట్టిగా అదిమి పెట్టుకుంటుండగా, చిన్న పిల్లను రెండు చేతుల్లో పడుకోబెట్టి ఎత్తుకొచ్చినట్లుగా... అమ్మను అంత సునాయాసంగా, ఎటువంటి చీదరింపు లేకుండా, చిర్నవ్వుతో మంచం మీది నుంచి బయటకు తీసుకొన్తున్న పాపా ముఖం .... బక్కెట్లో కనిపించి నా నగ్న స్వరూపాన్ని చూసి ఫకాల్న నవ్వుతున్నట్లనిపించింది...

 

తెలియని పాశం వెంట తరిమింది, భుజం మార్చుకోవడానికి, రుణం తీర్చుకోవడానికి నీ చూపుకు పాపా రూపు మళ్ళీ దొరకదని ఛర్నాకోలతో ఒక్కటిచ్చుకుంది.

 

అంతే... ఒళ్లు తుడుచుకుని బయటికొచ్చి పూజ కూడా అరనిమిషంలో ముగించేసి సరోజ మూడ్ ఈస్టమన్ రంగుల్లో మారిపోతున్నా, నా మూడ్ కూడా సాకులు వెతుక్కోకముందే  ప్యాంటు వేసుకుని అంతే స్పీడుతో వెళ్ళి పాపా ముందు ముద్దాయినయి నిలబడ్డా... ఆస్పత్రికి రాలేకపోయాను పాపా అంటూ.... అయినా అదేమిటో.... క్యా అకేలే ఆయే...భాభీ కహాఁ హై.....అని పాపా నవ్వుతూ అడుగుతున్నట్టనిపిస్తే.... అక్కడే ఉండిపోయా... పాపా నవ్వులు గులాబీ పువ్వులయి నేలరాలేదాకా....వాటి పరిమళాలు పొగలు పొగలయి నింగికెగసేదాకా...

 

ఇప్పడే వచ్చి మళ్ళీ వేణ్ణీళ్ళ స్నానం చేస్తుంటే.... చన్నీళ్ళతో చేస్తున్నంత హాయిగా అనిపించింది.

 

హైదరాబాద్(28.8.21)

................................................


2 కామెంట్‌లు:

    ‘‘ ఒక నదికి గానీ , ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో   దీనిని ‘ ప...