వాటీజ్ దిస్ పంచకట్టు వెంకయ్యాజీ !!! అండ్ వెంకీ మామాశ్రీ !!!




తెలుగు భాష
సంస్కృతులకు సంబంధించి ... అసిధారావ్రతంలాగా అనునిత్యం ప్రవచించే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి తెలుగు ఐకాన్గా ముద్ర పడినా... ఆయన వస్త్ర ధారణ మాత్రం దానికి భిన్నంగా ఉంటున్నదని చెప్పడానికి  కించిత్ బాధగా ఉంది. ఆయన ధరించే అడ్డపంచ దానికి ప్రధాన కారణం



ఇదే మన తెలుగు సంప్రదాయం అంటూ రామరాజ్  ద్వారా అన్ని ప్రచార మాధ్యమాల్లో కోడై కూస్తున్నారు మన  హీరో వెంకటేశ్. వీరు కట్టే పద్దతిలో దీనిని అక్షరాలా అడ్డపంచ... అనే అంటారు. తమిళనాడు సమీప ఆంధ్ర జిల్లాలయిన చిత్తూరు, కడప, నెల్లూరుల్లో దీని ప్రభావం ఎక్కువ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదటినుంచీ మద్రాసులో పాతుకుపోయి, తరువాతి కాలంలో అక్కడినుండి తరలినందువల్ల వారు, వారి కుటుంబాల్లో అత్యధిక భాగం తమిళ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు. తమిళనాడు, కేరళ, కొంతమేర కర్ణాటకను మినహాయిస్తే... దాదాపు భారతదేశం అంతటా, మరికొన్ని పొరుగు దేశాల్లో కూడా(శ్రీలంక తప్ప) ధోతీలాగా పంచకట్టే పద్ధతే వాడుకలో ఉంది. కట్టడంలో కొద్దిపాటి తేడాలుండొచ్చేమో కానీ... పద్ధతి మాత్రం ధోతీదే.

సంస్కృత పదం ‘ధౌత’ నుండి ధోతి, ధోవతి అయింది. ఇదే తెలుగులో మనం చెప్పుకునే పంచె... పంచ.. అంటే ఐదు గజాల ఏకవస్త్రం. . దీనిలో రెండు ధోవతులు కలిసి ఒకటిగా ఉంటాయి.  కత్తిరింపులు, కుట్లు ఆచార విరుద్ధం కాబట్టి... దీనిని వైదిక కార్యక్రమాల్లో సంప్రదాయవాదులు ఏకవస్త్రంగానే ఉపయోగిస్తారు. దీనిని మనం దానాలప్పుడు, దక్షిణలప్పుడు ‘పంచెలచాపు’ అని వ్యవహరిస్తుంటాం. ఖర్చుకు భయపడి ఇప్పుడు ఒక ధోవతితోపాటూ పైపంచె లేదా తుండు(టవల్) కలిపి పెడుతున్నారు.

నడుము దగ్గరనుంచీ పాదాలదాకా కాళ్ళను చుట్టి కట్టేది – అడ్డపంచె. మలయాళంలో ‘ముండు’ అనీ, తమిళనాడులో ‘వేష్ఠి’/వేట్టి అని అంటారు. అలాకాక ఒక అంచును కాళ్ళ మధ్యలోనుంచీ వెనకకు తీసుకుని గోచీలాగా ధరించేది ..ధోతీ. ఇదే శాస్త్ర సమ్మతం. అన్ని శుభ, అశుభ కార్యాల్లో నిక్కచ్చిగా పాటించే పద్ధతి. దీనితోపాటూ ఎడమ భుజంపై కండువా లేదా ఉత్తరీయం కూడా ఉండాలి. భారతీయ సంప్రదాయంలో.. ముఖ్యంగా మన తెలుగునాట  పురుషుల సంప్రదాయ వస్త్రధారణ అంటే ఇదే.



మన తాతలుముత్తాతలుతండ్రులు ఇలాగే కనిపించినా.... మన ఆచార వ్యవహారాలుసంస్కృతుల గురించి పట్టణాలునగరాల్లో మనం ఎక్కువ మాట్లాడతాంసుద్దులు కూడా చెబుతాం. కానీ మనం ఛస్తే పాటించం. నోరు తెరవకపోయినాతెలుగునాట...ఆచరించి చూపేదితరాల తరబడి మన సంస్కృతులను మోసుకు తిరుగుతున్నది మాత్రం  పల్లె ప్రజలు. ..జానపదులు... ఆదివాసులు... గిరిజనులే. గ్రామాల్లో గంగిరెద్దుల వారినుంచీ ఊరిపెద్దల వరకూ  అన్ని కులాల్లోవృత్తుల్లో మగవాళ్లు  విధిగా రోజూ ధోతీనే ధరిస్తారు. తెలంగాణలో ఇది ఆదిలాబాదు నుండి హైదరాబాదు శివార్లవరకూ ప్రస్ఫుటంగా కనపడుతుంది.



అచ్చ తెలుగు వస్త్రధారణకు అద్దం పట్టేవిధంగా ..... ధోవతి  కడితే ఇదిగో ఇలా కట్టాలి అని ఒక అక్కినేని ఒక యస్వీఆర్ఒక రాజశేఖర్ రెడ్డిఒక చాగంటి... వంటి ప్రముఖులు ఆచరణలో...  ప్రజల మధ్యలో తిరుగాడుతూ  చూపి యువతరం వారికి స్ఫూర్తిని కలిగిస్తుంటారు. దీనిని మతంతో ముడిపెట్టడంకన్నా. తెలుగు జాతికిమన దేశ వాసులకు గుర్తింపు తెచ్చే పెట్టే పద్ధతి అనడం సమంజసం. (గాంధీతాత  కొల్లాయిగుడ్డతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాడు మనకు). ఆంధ్రాకట్టు పేర మనం పాటించే  పద్ధతి ఇటీవల కొన్ని ఫ్యాషన్ షోలలో కూడా (ఇటలీ) పలువురి ప్రశంసలను అందుకుంటున్నది. ఆశ్చర్యకరంగా ఈ మధ్య పెళ్ళిళ్ళలో యువత... స్పెషల్ అట్రాక్షన్‌గా... మూకుమ్మడిగా పంచలు ధరించివచ్చి హడావుడి చేస్తున్నారు. తెలియక, చెప్పేవారు లేక వారు అడ్డ పంచలే మన సంప్రదాయం అనుకుంటున్నారు.  

అడ్డపంచ కట్టుకోవడానికి ఎక్కువ శ్రమక్కరలేదు. కానీ ధోవతి కట్టుకోవడానికి  మాత్రం కొద్దిగా సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇప్పటి తరానికి లేకపోవడంతో రెడీమేడ్ ధోవతులు వచ్చేసాయి... పెళ్ళికొడుకులు కూడా...  పాంట్లల్లోలాగా కాళ్లు దూర్చేసి  ధోవతుల్లో తేలుతున్నారు. మరింత సౌలభ్యంకోసం ధోతీ ధారణను యుట్యూబ్ లో కూడా నేర్పిస్తున్నారు.

రాజకీయ నాయకులు, సినిమా హీరోలు,  ఇతరత్రా జనసామాన్యాన్ని ప్రభావితం చేయగల వారికి ఒక విన్నపం... అయ్యా ! మీరు ధోవతులు కట్టకపోయినా ఫరవాలేదు గానీ, అడ్డపంచెలు కట్టుకుని, చుట్టుకుని తిరుగుతూ.. వేదికలెక్కుతూ... ఇదే తెలుగు సంస్కృతి ...అని మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించకండి.

కొసమెరుపు : జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.... తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఒక కార్యక్రమానికి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులో లేదా న్యాయవాదులో వెళ్ళారు.. ఎలా వెళ్ళారు !!! .. వారి పద్ధతి ప్రకారం అడ్డ పంచెలు కట్టుకుని మరీ వెళ్ళారు. అక్కడి క్లబ్ డ్రెస్ కోడ్ ప్రకారం ... అది నిషిద్ధం.. కాబట్టి  వారిని వెనక్కి తిప్పి పంపేసారు.

తమిళ సంస్కృతి మీద, భాష మీద ఇటువంటివి  సూక్ష్మాతిసూక్ష్మంగా జరిగినా... ఎప్పటిలాగే... వారి మానంమీద దాడి జరిగినట్టు... రెప్పపాటులో మొత్తం సమాజం తిరగబడింది. అంతే వెంటనే ... తమిళ పంచెకట్టుపై వారి రాష్ట్రంలో ఎక్కడ నిషేధం ఉన్నా... వాటిని తొలగించడమే కాదు, అభ్యంతరం చెప్పినా, ఆక్షేపించినా... ఏడాదిపాటు జైలుశిక్ష, రు.25 వేలు జరిమానా, సదరు సంస్థల లైసెన్సుల జప్తు వంటి పలు చర్యలకు అవకాశం కల్పిస్తూ.... జయలలిత శాసనసభలో ఆగమేఘాలమీద బిల్లు పెట్టి ఆమోదింప చేసింది.

సంక్రాంతి శుభాకాంక్షలతో.... మీ

-ములుగు రాజేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్


..........

(మీ అభిప్రాయాలు/వ్యాఖ్యలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో  పెట్టండి.  అందరూ చూస్తారు...

ఈ బ్లాగులో కూడ శాశ్వతంగా ఉండి... తెరిచిన ప్రతిసారీ అలరిస్తుంటాయి.)




తెలుగు టీవీ ఛానళ్ళ రిపోర్టర్లకు .....

  


‘‘ఒక నదికి గానీ, ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో దీనిని పరీవాహక ప్రాంతంఅంటున్నాం. నదిలోకి అలా వచ్చి చేరిన నీరు దిగువకు ప్రవహిస్తూ పోయి ఎక్కడో మరో నదిలోనో, సముద్రంలోనో కలుస్తుంటుంది.  అలా ప్రవహిస్తూ పోతున్న నదికి, దాని మార్గంలోవచ్చే ప్రాంతాలను పరీవాహక ప్రాంతాలు అనం.’’

 

‘‘వికారాబాద్, తాండూర్ ప్రాంతాలు... ఉస్మాన్ సాగర్(గండిపేట్), హిమాయత్ సాగర్, మూసీలకు పరీవాహక ప్రాంతాలు. మూసీనది దిగువకు ప్రవహిస్తూ... ఆ క్రమంలో పురానాపుల్, ఇమ్లీబన్, చాదర్ ఘాట్, ఉప్పల్...’’ అలా సాగుతూ పోతున్నప్పుడు ఈ మార్గంలోని  ప్రాంతాలను పరీవాహక ప్రాంతాలని అనం. అలాగే ప్రతి నదికీ, ప్రతి చెరువుకీ కూడా.’’

 

ఈ విషయం పరిశీలించి, విషయ పరిజ్ఞానం ఉన్న వారితో నిర్ధారించుకుని...  ఒప్పయితే సరిదిద్దుకోండి, ఇతర సహచరులు తప్పు చేసినా వారించండి... ఒకవేళ నేను చెప్పినది తప్పయితే తెలియచేయండి. నేను కూడా దిద్దుకోవడమేగాక మరోసారి ఇటువంటి ప్రవచనాలు చేసే ముందు జాగ్రత్తపడతా.

 

కుర్రాళ్లోయ్ కుర్రాళ్ళు.....

ఎడిటోరియల్ డెస్క్ లోపనిచేసే సీనియర్ జర్నలిస్టులతో పోలిస్తే... క్షేత్రస్థాయిలో రిపోర్టర్లుగా పనిచేసే మీకు సాధారణంగా వయసు, అనుభవం చాలా తక్కువ. కానీ అతి తక్కువ సమయంలో, అత్యంత ఎక్కువ సమాచారాన్ని, వీలయినంత తాజాగా అందించడంలో మీరు నిష్ణాతులు. ఎండనకా, వాననకా, సరైన తిండీ, సమయానికి నిద్ర లేక...గంటలతరబడి ఫీల్డులో గడుపుతూ మీ వంతు రాగానే ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా ... వీక్షకులకు సులభంగా అర్థమయ్యేవిధంగా  వార్తా కథనాలను అందించడంలో మీరు రాటుదేలి ఉంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని మెచ్చుకోవలసింది... ఆశువుగా, అనర్గళంగా, ఎక్కడా తడబడకుండా, తడుముకోకుండా ఎంత సేపయినా అలాగే మాట్లాడగలిగే...ఆ నైపుణ్యానికి నిజాయితీగా జోహార్లు.

 

ఆశ్చర్యం ఏమిటంటే దాదాపు మీరందరూ(అన్ని ఛానళ్ళ వాళ్ళు) ఇదే లక్షణాన్ని అతి తక్కువ సమయంలో పుణికిపుచ్చుకుంటూ ఉండడం... చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగే సందర్భాల్లో... స్టూడియో నుంచి  దశాబ్దాల అనుభవం ఉన్న మీ సీనియర్లు దిగుతూ ఉంటారు, రంగంలోకి. కానీ మీలాగా ఆ వార్తల తాలూకు నేపథ్యం, పొల్లుపోకుండా వార్తా కథనం, జరగబోయే పరిణామాలు... వీటిని గుక్కదిప్పుకోకుండా ప్రజంట్ చేయడంలో. ...వారి అనుభవాలు, ఇతరత్రా విషయ పరిజ్ఞానం మీ   కుర్రకారు ముందు దిగదుడుపే.


 (అంతెందుకు... ముందుగా రాసుకున్న వార్తలను చాలా సార్లు రిహార్సల్స్ చేసుకుని, టెలిప్రాంప్టర్ ముందు చూసుకుంటూ ... ఏసి రికార్డింగ్ స్టూడియోల్లో నింపాదిగా కూర్చుని వార్తలు తప్పులు చదువుతూ, తడబడుతూ ఉండే  న్యూస్ రీడర్లను గమనిస్తే....తగిన గుర్తింపుకు నోచుకోని మీ వంటి  సిసింద్రీల ప్రతిభ స్థాయి ఏమిటో అర్థమవుతుంది).

 

నాదోసూచన. పని ఒత్తిడికొద్దీ కానీ, సమయాభావంవల్ల కానీ, లేదా సంబంధిత అంశాన్ని మీరు సరిగా అధ్యయనం చేయకపోవడంవల్ల కానీ, తప్పులు దొర్లుతున్నాయి. ఒక్కోసారి అతి విశ్వాసంవల్ల, చాలా సార్లు, మీకు అది తప్పని తెలియకపోవడం వల్ల, మీకు వాటిని వెంటనే సరిదిద్దేవారు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.డెస్క్ లో అయితే తప్పులను సరిదిద్దే వ్యవస్థ ఉంటుంది.(అలా ఉండి కూడా స్క్రోలిం  గుల్లో బొచ్చెడు అక్షర దోషాలు, వాక్య నిర్మాణ దోషాలు నిరాటంకంగా ప్రసారమవుతూ పోతున్నాయి). మీరు మాట్లాడింది ఎటువంటి అడ్డంకులు లేకుండా... నేరుగా వీక్షకుల చెవుల్లోకి, వారి మెదళ్ళల్లోకి చేరిపోతుంటాయి.

 

ఈ తప్పులకు  మీపైన ఉండే సీనియర్లు చెక్ పెట్టాలి. సమయానికి వారు గమనించకపోవడంవల్ల, లేదా వారికి కూడా సరైన అవగాహన, పడికట్టుపదాలు తెలియకపోవడంవల్ల- అవే తప్పులు... ఒప్పులయిపోయి అంటువ్యాథిలాగా ఇతర ఛానళ్లకూ, యూట్యూబ్ వార్తావీరులకూ సోకి... గుర్రపుడెక్క ఆకులాగా... విస్తరించిపోతున్నాయి.

 

ఒక క్లాసిక్ ఉదాహరణ : ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో...

 

ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మద్రాసులో చనిపోయి...భౌతిక కాయాన్ని వారి ఫాంహౌసుకు తరలించిన సమయంలో... అక్కడకు ముందుగా చేరుకున్న ఒక పెద్ద తెలుగు టివీ ఛానల్ రిపోర్టర్...కథనం మొదలు పెట్టాడు...‘‘మామూలుగా అయితే హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేస్తారు. కానీ ఎస్. పి.బాలుగారు జంగమలు కావడం మూలాన వారి ఆచారం ప్రకారం సమాధి చేస్తున్నారు...’’ అంటూ అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నంతసేపూ  అదేపనిగా రిపీట్ చేస్తూ పోతున్నాడు... కాసేపటికి మరో ఛానల్ కూడా ఈ పాట అందుకున్నది...

 

వారి కుటుంబం గురించి కాస్తోకూస్తో తెలిసున్న వారికి ఇదో పెద్ద షాక్. తెలియని కోట్లాదిమంది...‘‘ ఇన్నాళ్ళూ మేమేదో అనుకున్నాం..ఓహ్! ఇదా...’’ అని అనుకుంటున్న సమయం..

 

హైదరాబాద్ లో ఉండి...అందరిలాగే... ఆస్పత్రితో మొదలుపెట్టి అంతా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న నాకు .. సీన్ అర్థమయిపోయింది. వెంటనే ఇక్కడ ఆ ఛానల్ స్టూడియో వారికి ఫోన్ చేస్తే, వారు మద్రాస్ ఆఫీసుకు విషయం తెలపాలనుకునేటప్పటికి... అక్కడ ముఖ్యులందరూ బయటకు వెళ్ళిపోయారని చెప్పారు.  మద్రాసులో ఉన్న ఇతర జర్నలిస్టు మిత్రులందరినీ కదిపి, కుదిపితే... ఓ గంట తరువాత (పరిస్థితి విషమించక ముందే) అసలు రిపోర్టర్ దాన్ని కరెక్ట్ చేసుకున్నాడు. మిగిలిన వారిని కూడా అలర్ట్ చేసాడు...

 

సో...బి అలర్ట్... ఆల్ ది బెస్ట్...

 

-ములుగు రాజేశ్వర రావు.

.......................

 నేపథ్య గాయకుడి నేపథ్యం 

https://chinavyasudu.blogspot.com/2021/10/blog-post.html?spref=tw



ఓట్ల దొంగతనమా ! ! ! - 1

 

ఓట్ల దొంగతనమా ! ! !  - 1

ఇప్పుడు దేశమంతటా ఓట్ల దొంగతనం మీద చర్చ రాజుకున్నది... ఇంకా కొంతకాలం ఈ మంటలు చెలరేగుతుంటాయి... ఇప్పుడే మొదలయింది కాబట్టి... దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకుని ఉంటే... ఆ చర్చమీద మనకు ఒక అవగాహన ఏర్పడి ఉంటే... మనం కూడా సరైన వాదనలు వినిపించవచ్చు... అటు కానీ .. ఇటు కానీ...

నేను 2018లో, 2023లో జరిగిన ఎన్నికల సమయంలో...  భారత ఎన్నికల సంఘం తాలూకు రాష్ట్ర కార్యాలయంలో మీడియా విభాగంలో పనిచేసా...  దానికి ముందు- జర్నలిజానికి తోడు, ఎన్నికల సంఘం తాలూకు  పుస్తకాలను తెలుగులోకి అనువదించిన అనుభవం ఉంది. మరీ లోతుగా కాకపోయినా,  నా అవగాహన మేరకు నేను తెలుసుకున్న విషయాలను ఇక్కడ మీ ముందుంచుతున్నా... సమగ్రంగా ఒకే వ్యాసంగా అయితే పెద్దదయి  మీకు చదవడం ఇబ్బంది. కాబట్టి... చిన్నచిన్నవిగా వీలయినన్ని ఇస్తూ పోతా... వాటిలో ఓటరు జాబితా వంటి అంశాలే  కాకుండా, ఇవిఎంల ద్వారా ఓటింగ్ జరిగేటప్పుడు దొంగ ఓట్లు ఎలా పడే అవకాశం ఉంది ? అధికార పార్టీతో ఎన్నికల కమిషన్‌కు ఉండే అక్రమ, సక్రమ సంబంధాలు, ఎన్నికల కమిషన్ లో జరిగే అవినీతి కథలు... ఇలా చాలా చెప్పాలనుకుంటున్నా... అదీ నాకు తెలిసినంత వరకు...

నేను మిస్సయిన సమాచారం మీరూ తెలుపవచ్చు... నా తప్పులేవయినా ఉంటే సరిదిద్దవచ్చు... అంతే తప్ప... దీనిలో అర్థంపర్థంలేని వితండ వాదనలు, ఏదో ఒక పార్టీని నెత్తినెత్తుకుని అవాకులు చెవాకులు పేలడాలూ వంటివి మాత్రం చేయకండి...

 

పాత చింతకాయ పచ్చడి :

ఆగస్టు 7, 2025న ‘ఓట్ల దొంగతనం’ అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నాయి.. ప్రతి ఎన్నికలో... ఇవి అందరికీ అనుభవైకవేద్యమే...చాలా మంది బాధితులు కూడా. అసెంబ్లీ ఎన్నికలో ఉపయోగించుకున్న  ఓటు, మరో కొద్దినెలల్లోనే జరిగిన పార్లమెంటు  ఎన్నికలకు మాయమయి పోవడాలు, చచ్చిన వాళ్ళు బతికినట్లు, బతికిన వాళ్ళవి చచ్చిన(డిలీట్) జాబితాలో చోటు చేసుకోవడాలూ, ఒక వ్యక్తికి చాలా చోట్ల ఓట్లు ఉండడాలు, ఒక కుటుంబంలో అందరికీ ఓటర్ కార్డులున్నా...  పోలింగ్ సమయంలో కొందరివి గల్లంతు కావడాలు, ఒకే ఇంటి నంబరుతో చాలా ఓట్లు, ఓటరు కార్డుమీద ఇతరుల ఫొటోలు... ఇలా...

రాహుల్ గాంధీ చేసిన 5 ఆరోపణలు కూడా ఇవే. డూప్లికేట్ ఓట్లు, నకిలీ లేదా దొంగ చిరునామాలు, ఒకే ఇంటి నంబరు మీద చాలా ఓట్లు(50, 100, 150..) ఉండడం, తప్పుడు ఫొటోలు, ఫారం-6 దుర్వినియోగం.  తన ఆరోపణలకు బలం చేకూర్చడానికి ఒక నియోజకవర్గాన్ని శాంపుల్ గా తీసుకుని శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ధారించుకున్న సాక్ష్యాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. బెంబేలెత్తిన ఎన్నికల సంఘం... ఒక స్వతంత్ర, రాజ్యాంగ వ్యవస్థగా దాని మీద ఆరోపణలు, అనుమానాలు వస్తున్నప్పుడు..ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం... ఫిర్యాదులను వాటి ఫార్మాట్ లలో ఇవ్వాలని  రాహుల్ గాంధీని పదేపదే డిమాండ్ చేయకుండా,  తప్పయితే జైలుశిక్ష ఉంటుందనీ హెచ్చరించకుండా... వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే  హుందాగా ఉంటుంది. ఇదే ఫిర్యాదు ప్రధానో లేక ఏ కేంద్రమంత్రో, ఏ అధికార పార్టీ ప్రతినిధో  చేస్తే అప్పుడు కూడా ఎన్నికల సంఘం ఇలానే అంటుందా ?...

2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తన నియోజకవర్గంలో 15 వేల ఓట్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో 950 ఓట్లుంటే, ఓటర్ల జాబితాలో అవి1650 ఓట్లకు  ఎలా పెరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అప్పుడే ఫిర్యాదు చేసాననీ, ఇప్పటి సిఇఓకు కూడా కంప్లయింట్  చేసానని బిజెపి పార్లమెంటు సభ్యుడు ఎం.రఘునందన్ రావు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం చివరి దశలో ... కొత్త రాష్ట్రం ఆవిర్భావ సమయంలో ఎన్నికలకు ముందు...  ఆంధ్రావాళ్ళ ఓట్లు, సమైక్యవాదులుగా గుర్తించిన తెలంగాణావాసుల ఓట్లు ... ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున గల్లంతయినట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఇక మర్రి శశిధర్ రెడ్డి అయితే ఓటర్ల జాబితామీద చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రతిసారీ చాలా ఫిర్యాదులు చేస్తుంటారు.

 

ఈ ఓట్ల దొంగతనం నిజమేనా !!!

నిజమే అయితే ఎందుకు జరుగు తున్నది ?

ఎలా జరుగుతున్నది !!!


ఓటర్ల జాబితాలో అవకతవకలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజింవచ్చు

1.     కాకతాళీయంగా లేదా నిర్లక్ష్యంతో జరిగేవి

2.     ఉద్దేశ పూర్వకంగా జరిగేవి.

రెండోదే ఎక్కువ అభ్యంతరకరం, నేరం కూడా. అయినా దాని బీజాలు మొదటి దానిలో ఉంటాయి. అందువల్ల దానిని క్లుప్తంగా చూద్దాం...


ఓటర్ల జాబితా : ఇదే తొలి దశ. ఎన్నికలకు ఇదే కీలక, మౌలిక డాక్యుమెంట్. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి జరిపే ప్రతి ఎన్నికకూ ఇదే ఆధారం.  ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ తరఫున ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుని  పంపాలంటే... ఈ జాబితా ఆధారం మీదే మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా ఆధారపడి ఉంది... అటువంటి ఆధారశిల మాత్రం- అట్టడుగున పనిచేసే బిఎల్‌ఓ స్థాయినుండి కేంద్ర ఎన్నికల సంఘంలోని ఉన్నత స్థాయి అధికారి వరకు నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. ఎన్నికల ప్రక్రియ మొదలయిన దగ్గరి నుండీ అందరూ దీనిని గురించే మాట్లాడుతుంటారు...అంతే తప్ప దాని కచ్చితత్వాన్ని గురించి పట్టించుకోరు....

సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందామో చూపడానికి...  ఆధార్ కార్డ్, మొబైల్ బ్యాంకింగే సాక్ష్యం. అయినా  ఓటర్ల జాబితా రూపకల్పన  పద్ధతి70 ఏళ్ళ కింద ఎలా ఉందో ఇప్పటికీ  దాదాపు అలాగే ఉంది.            ‘మీ ఓటు మీ హక్కు’ అంటూ ఊదరగొట్టడానికి... కోట్ల రూపాయలు రకరకాల ప్రచారం మీద, కొత్త కొత్త యాప్ ల మీద ఎన్నికల సంఘం ఖర్చు పెడుతుంది తప్ప ఎన్నికలు త్వరలో లేదా ఐదేళ్ళకు ఒకసారి రావడం ఖాయం అని తెలిసినా... చివరి నిమిషం వరకూ ఓటరు జాబితా ప్రక్షాళన గురించి పట్టించుకోరు. (చేర్పులు, మార్పుల గురించి మాట్లాడడం లేదు. జాబితాలో వివరాలు వాస్తవాలేనా, ఏదయినా తప్పు సమాచారం ఉందా...వంటివి)

ఎన్నికల సంఘంలో అత్యంత తక్కువ స్థాయి అధికారి బిఎల్ ఓ (బూత్ లెవల్ ఆఫీసర్). ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో గరిష్ఠంగా 1500 ఓట్లుంటాయి.  ఆ పరిధిలో పనిచేసే బిఎల్ ఓ స్వయంగా ఇంటింటికీ వెళ్ళి కొత్త ఓటర్ల నమోదు, అప్పటికే ఉన్న ఓటర్ల సమాచారం స్వయంగా పరిశీలించి వాస్తవాలతో నివేదికలు పంపితే...  పైన సూపర్‌వైజర్, ఎఇఆర్ఓ, ఇఆర్‌ఓ, డిఇఓల తనిఖీలన్నీ పూర్తి చేసుకుని తుది జాబితా  రాష్ట్ర సిఇఓకు చేరుకుంటుంది.

అయితే అస్త్యవస్తాలకు బీజాలు బిఎల్‌ఓ స్థాయిలోనే పడతాయి. స్వయంగా గడపగడపకూ పోరు,  పోయినట్లు రికార్డులు చూపుతారు. చాలా చోట్ల ఔట్ సోర్సింగ్ సిబ్బందిని లేదా తాత్కాలికంగా అందుబాటులో ఉండే వారిని పంపి మమ అనిపిస్తారు.  ఒక కుటుంబంలో వీరు వెళ్ళినప్పుడు ఒకరో ఇద్దరో ఉంటారు... మిగతా వారి గురించి ఆ కుటుంబ సభ్యులు ఏది చెబితే అది రాసుకుపోతారు. వెరిఫై చేసుకోరు.  ఇంట్లో ఆ సమయంలో లేని వారి లేదా ఇతర దేశాల్లో సెటిలయిన వారి వివరాల గురించి  రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేదా ఇతరత్రా డాక్యుమెంట్లు అడిగి తెప్పించుకుని తనిఖీ చేయవచ్చు. అవి చేయరు. ఆ ఇంటి నంబరు మీద నమోదయిన ఓటర్లలో -చనిపోయినవారు, ఇల్లు మారినవారు, నకిలీ ఓటర్ల  వాస్తవ సమాచారాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోరు. (ఫిర్యాదులు అందినప్పుడుకూడా పైనుంచి కింది దాకా అందరూ బిఎల్‌ఓ నే అడుగుతారు. అతను ఎంత చెబితే అంత... సిఇఓ కు నేరుగా ఫిర్యాదులు అంది గొడవ జరిగేటట్లుంది అన్నప్పుడు పైఅధికారులు స్వయంగా వెళ్లి చూసి నివేదికలు పంపుతారు. ఎన్నికల సమయంలో అధికార పక్షం వారు తప్ప, సెలబ్రిటీలు తప్ప మరే నాయకుడు ఫిర్యాదు చేసినా అందరూ తేలిగ్గా తీసుకుంటారు. (మీ ఓటు చెక్ చేసుకోండి అంటూ ఇంకా చాలా హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఇచ్చినా అవి కంటితుడుపే).

-ములుగు రాజేశ్వర రావు

 

(ఉద్దేశపూర్వకంగా ఓట్ల దొంగతనం ఎలా జరుగుతుందో తదుపరి వ్యాసంలో చూద్దాం)


భారత ఎన్నికల సంఘం ప్రధాన నినాదం ఏమిటంటే....

“No Voter to be left behind”

అర్హుడైన ఏ ఒక్క పౌరుడూ తన ఓటు హక్కు కోల్పోవకూడదు’’

భారత పౌరుడయి ఉండి, 18 ఏళ్ళు నిండి సదరు పోలింగ్ కేంద్రం పరిధిలోశాశ్వతంగా లేదా తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారు ఓటరుగా నమోదుకు అర్హులు.. అన్నది మౌలిక సూత్రం.

ఆచరణలో ఇది ఎంత ఉదాత్తంగా ఉంటుందో చూడాలంటే...

ఇల్లే ఉండాల్సిన అవసరం లేదు, ఫుట్‌పాత్‌ల మీద, షెడ్లలో ఉంటూ జీవనం గడుపుతున్న వారు కూడా నివాసంతాలూకు రుజువు లేకపోయినా  ఓటరు జాబితాలో చేర్చడానికి అర్హులే. వారున్న ప్రాంతాన్ని బిఎల్‌ఓ సందర్శించి (రెండు మూడు సార్లు) వారు అక్కడే ఉంటున్నట్లు నిర్ధారిస్తే చాలు.. అలా ఫారం – 6 ద్వారా వారిని ఓటరుజాబితాలో చేరుస్తారు.

 క్రమం తప్పకుండా నిద్రకు  బసకు వచ్చిపోయేవారు కూడా అర్హులే... వారు అక్కడే ఉండి వంట చేసుకుంటున్నట్లు లేదా  తింటున్నట్లు కూడా రుజువులు పనిలేదు. మధ్య మధ్యలో అక్కడ నిద్రించకపోయినా... ఆ వ్యక్తి సదరు ప్రదేశంలోనే ఎక్కువ సార్లు నిద్రిస్తున్నాడని రూఢి అయితే చాలు... వారూ అర్హులే.

నివాస ధృవీకరణ లేకపోయినా సెక్స్ వర్కర్లు కూడా అర్హులే... బిఎల్‌ఓ వ్యక్తిగతంగా సందర్శించి నిర్ధారిస్తే చాలు. వారూ ఓటర్లవుతారు.



 

గుడిని నమ్ముతాం.. మరి పార్లమెంటునో !!!

 

S-400 Game Changer

 

వార్త: ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ కు చెందిన ఆరు విమానాలను ధ్వంసం చేసాం-అని మన ఎయిర్ ఛీప్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ బెంగళూర్ లో శనివారం(ఆగస్టు 9న) ప్రకటిస్తూ...దాని తాలూకు శాటిలైట్ ఛాయా చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ కు జరిగిన నష్టంపై భారత్ సైనికాధికారి బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.

* * *

కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.. అంటూ ఆపరేషన్ సిందూర్ ను అర్థంతరంగా ఆపివేసిన తరువాత ... చాలా అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరచి దీనిపై దేశ ప్రజలకు పూర్తిగా వివరణ ఇవ్వాలని  ప్రతిపక్షాలు కోరాయి. అయితే ప్రత్యేకంగా సమావేశపరచలేదు కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా  దీనిపై రెండు రోజుల చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. అప్పటిదాకా ప్రభుత్వం బయట చెబుతూ వచ్చినవే సభలో కూడా చెప్పిందితప్ప అదనంగా మరే సమాచారం ఇవ్వలేదు, అనుమానాలు తీర్చలేదు. సభలో చర్చ ముగిసింది....

ఇప్పుడు..ఉన్నట్టుండి  అత్యున్నత సైనిక అధికారి ఎయిర్ ఛీప్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్  కొత్త విషయం ప్రకటించారు. మున్ముందు ఇంకా ఎవరు ఎప్పుడు కొత్త విషయాలు ప్రకటిస్తారో తెలియని పరిస్థితిలో... ఒక మౌలికమైన ప్రశ్న

పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న సందర్భంలోనే అత్యున్నత సైనికాధికారి సభ వెలుపల ఒక ప్రకటన చేసి..అది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించకుండా దాచిన విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పటివరకు సభ ముందుంచనప్పుడు ఇది పార్లమెంటును అవమానించడం కాదా..??? ఔననే ఎందుకు అనుకోవాల్సింది వస్తుందంటే...

 

సర్వోన్నత సభ !!!

మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటు సర్వోన్నత  చట్ట సభ. జాతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ఈ సభలో ప్రజా ప్రతినిధులు పరిశీలించి, చర్చించి నిర్ణయిస్తారు. వాటినే ప్రభుత్వం అమలు చేస్తుంది. ముందు కాకపోయినా తరువాత అయినా ప్రభుత్వం సభ ముందుంచి ఆమోదం తీసుకుంటుంది.   ప్రభుత్వం అధికారం అనుభవిస్తున్నా... అలా పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. అలా ఉండి తీరాలి. ఈ సభల్లో దాపరికం ఉండకూడదు. (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప... అదిక్కడ మనకు ప్రస్తుత చర్చనీయాంశంలో వర్తించదు). ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా  ఈ సభల సమాచారం అంతా ప్రజలకు చేరుతుంటుంది. 

మరటువంటప్పుడు జాతీయ భద్రతకు  సంబంధించి  ఒక సీనియర్ సైనికాధికారి బయట చెప్పిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు సభలో చెప్పకుండా దాచింది.... 

అంటే ప్రభుత్వం పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవడం లేదని భావించాల్సి వస్తుంది కదా...!!!.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇది వాంఛనీయం కాదు...ఇవ్వాళ అధికారపక్షం రేపు ప్రతిపక్షం అయినప్పుడు... వారికి ఇలా ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా !!!  50ఏళ్ళ నాటి ఎమర్జన్సీని  ఇప్పుడు కూడా తిట్టగలిగేంత నైతికత, ఉన్నత విలువలు తమకు ఉన్నాయని ప్రకటించుకుంటున్నప్పుడు... జరుగుతున్నదేమిటి ???

ఆపరేషన్ సిందూర్ పై కొన్ని అనుమానాలు చూద్దాం...

1.     మన దెబ్బకు తట్టుకోలేక పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది, కాల్పుల విరమణ ప్రతిపాదన అదే చేసింది. మనం అంగీకరించాం. అంతవరకు ఓకే... మరి మనం పాకిస్థాన్ కేమయినా  షరతులు విధించామా ? ఒకవేళ విధిస్తే ఆ షరతులుఏమిటి ?

2.     ఏ షరతులు లేకుండానే మనం అకస్మాత్తుగా కాల్పుల విరమణ పాటించేసామా ...?

3.      ఒకవేళ అదే నిజమయితే ఎవరి ఒత్తిడికి తలఒగ్గి అలా అంగీకరించాం ..???

4.     భారత్-పాక్ వ్యవహారాల్లో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించకూడదనేది మనం నిక్కచ్చిగా పాటిస్తున్న విధానం... మరి కాల్పుల విరమణ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు మొదట ఎలా ప్రకటించారు ? అది కూడా ... తన ప్రభావం/ప్రమేయంతోనే, వాణిజ్య  సంబంధాల బూచితో సాధ్యమయిందని ఎలా ప్రకటించారు ? ఒకసారి కాదు.. ఇప్పటికీ అలా ప్రకటిస్తూ పోతున్నా... నేరుగా ఆయన ప్రకటనలను ప్రభుత్వం ఎందుకు ఖండించి వాటిని నిలుపుదల చేయించడం లేదు ?

5.     ఒకవేళ పాకిస్థాన్ తో మనకు అవగాహన లేదా అంగీకారం కుదిరి ఉంటే ... మనకు కలిగిన ప్రయోజనం (లాభం)ఏమిటి ?

(మళ్ళీ మనవైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయకుండా చావుదెబ్బ తీసాం.. అని మనం పదేపదే ప్రకటిస్తున్నప్పుడు... ఇంకా సీమాంతర ఉగ్రవాదం ఎలా కొనసాగుతున్నది ? పాకిస్థాన్ కూడా మునుపటిలాగానే ప్రేలాపనలు ఎలా చేయగలుగుతున్నది ?)

6.     రాజకీయంగా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే మేం అతి తక్కువ కాలంలో శత్రువుని కాళ్ళబేరానికి తీసుకురాగలిగాం..అని సైనిక దళాలు ప్రకటిస్తున్నాయి.. అది ప్రశంసనీయం. మరి అంతటి ఘన విజయాన్ని వారు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినప్పుడు... శత్రువు అడిగీ అడగక ముందే ఎటువంటి లాభసాటి షరతులతో ఒప్పందం చేసుకోకుండానే  సైనికదళాల చర్యలను ఎందుకు ఆపేసారు ? ఇక్కడ రాజకీయం ఎలా చొరబడింది ?


ఈ అనుమానాలన్నింటినీ తీర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది.

 ప్రభుత్వం ప్రజల ముందు ఉంచని ముఖ్యమైన సమాచారాన్ని  సంబంధిత అధికారులు

ఎక్కడో కాకతాళీయంగా బయటపెడుతున్నప్పుడు...

దానిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ?

 

ఆధ్యాత్మికంగా మందిరాన్ని నమ్మినప్పుడు

రాజకీయంగా పార్లమెంటును  కూడా నమ్మాలి కదా !!!

 

-ములుగు రాజేశ్వర రావు

........

 (అధికార పార్టీ భక్తులు జుట్టు పీక్కోకండి... 

నేనిక్కడ ప్రస్తావిస్తున్నది నైతిక, సాంకేతిక అంశాలను మాత్రమే...

దీనిని రాజకీయం చేయకండి... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది వర్తిస్తుంది.)


తెలుగు భాష ,  సంస్కృతులకు సంబంధించి ... అసిధారావ్రతంలాగా అనునిత్యం ప్రవచించే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి  ‘ తెలుగు ఐకాన్ ’ గా ము...