సంజయుల వారి రాసలీలా విలాసాలు....

 కన్నవి కాదు... విన్నవే !!!

 


సంజయుల వారి రాసలీలా విలాసాలు....

 

  ‘‘సంజయ్  - ఇందిరాగాంధీ ముద్దుల కుమారుడు. దుందుడుకు స్వభావి. కానీ స్త్రీ లోలుడు(ప్లే బాయ్). ఆయనకు ఉన్న ఈ దుర్వ్యసనం గురించి 70వ దశకంలో కొన్ని పత్రికలు రకరకాల కథనాలు ప్రచురించాయి. మరి కొన్ని ఆంతరంగిక మందిరాలకే పరిమితమయ్యాయి. వాటిలో నాకు బాగా గుర్తున్న రెండు కథనాలు ప్రస్తావిస్తా. ఒకటి సంజయ్ గాంధీ వివాహానికి సంబంధించినది. మరొకటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినది.

ఈ రెండూ అందరికీ ఇంకా గుర్తుండకపోవచ్చు. కానీ అప్పటి పాత్రికేయులు, రాజకీయ నాయకులు మాత్రం మరిచిపోయి ఉండరు. ఈ కథనాలు ఎంతవరకు విశ్వసించదగినవి- అన్న విషయంలో నా సమాధానం లేదా సంజాయిషీ ఒక్కటే. ఇటువంటి వాటికి ఆధారాలు ఉండవు... తెరచాటు బాగోతాలు కాబట్టి. ఇది చదివిన వాళ్ళు వాళ్ళ విజ్ఞతనుబట్టి నమ్మాలో, చదివి వదిలేయాలో నిర్ణయించుకోవడం ఉత్తమం. అందుకే నేను ‘‘కన్నవి కాదు..’’ అన్న శీర్షిక పెట్టింది.


సంజయుడు – మేనక :


మనం తెలుగులో మేనకాగాంధీ అంటున్నాం. ఆమె తొలిసారిగా వార్తల్లోకి వచ్చినప్పుడు Maneka అని ఉండేది. ఎలా రాయాలో తెలియక తెలుగు పత్రికలు  మేనక అనీ, మనేకా అని రెండు రకాలుగా రాస్తున్నాయి. ఆమె అసలు పేరు – మనేకా ఆనంద్. తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ తర్లోచన్ సింగ్ ఆనంద్.


ముందే చెప్పానుగా సంజయ్ స్ర్తీలోలుడని... 1973లో ఒక పెళ్ళిలో మనేకా తారసపడినప్పుడు ఆమె మీద కన్నుపడింది. వీరిద్దరూ తరచూ కలుసుకోవడాన్ని ఆమె తండ్రి నియంత్రించే ప్రయత్నం చేసాడు. అయినా దూకుడుమీదున్న సంజయ్ పట్టించుకోలేదు. ఒకసారి వీరిద్దరూ డేటింగ్ లో ఉండగా – తండ్రి గది బయటినుంచి తాళం పెట్టాడు. ఇందిరాగాంధీకి ఫోన్ కలిపాడు. వెంటనే వచ్చి వీరి వివాహం సెటిల్ చేయకపోతే తుపాకీతో కాల్చేస్తానని హెచ్చరించాడు. రాజకీయంగా జరిగే ప్రమాదాన్ని ఊహించి భయపడిన ఇందిరాగాంధీ వెళ్ళి వివాహానికి అంగీకరించారు. అయితే అమ్మాయికి 17 ఏళ్ళే. మైనర్. ఏడాది తరువాత పెళ్ళి చేస్తానని హామీ పత్రం రాసిచ్చి బయటపడ్డారు. తనకు నచ్చిన ఆడపిల్లలను వాసన చూసి వదిలేయడానికి అలవాటు పడిన సంజయ్ కు కథ అడ్డం తిరిగింది. (అప్పటికే సంజయ్ కు ఒక విదేశీ మహిళతో రెగ్యులర్ సంబంధం ఉండేదట) కొడుకుకు పెళ్ళి ఇష్టం లేకపోయినా తల్లి నచ్చచెప్పి ఒప్పించింది. అత్తకూ ఇష్టం లేదు, భర్తకు అసలే ఇష్టం లేదు... ఇక ఆమె కాపురం ఎలా సాగిందో బహిరంగ రహస్యమే.

 


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో...


స్త్రీ వ్యామోహంలో కూడా సంజయ్ అభిరుచులు వింతగా ఉండేవి... ఎలాగంటే...


ఓ సారి... సంజయ్ గాంధీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ప్రధాని కుమారుడన్న హోదా తప్ప మరే పదవి లేదు... అప్పట్లో అతని ఆగడాలు చూసి ప్రతిపక్షాలు, పత్రికలు అతన్ని ‘రాజ్యాంగేతర శక్తి’ (Extra Constitutional Authority  ) అని విమర్శిస్తుండేవి. ఆ విమర్శ కూడా సహేతుకమే. ఆయన ప్రాపకం సంపాదించడానికి  అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి పెద్దలు .. ఇలా పార్టీలో, ప్రభుత్వంలోని  ముఖ్యులంతా అక్కడ  స్వాగతం పలకడానికి క్యూ కట్టారు. ఆయన కరుణాకటాక్షాలకు తహతహలాడేవారు. అప్పట్లో దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువచేసే ఒక వజ్రపుటుంగరాన్ని ఆయనకు బహూకరించి, వేలుకి తొడిగి మరీ తన్మయత్వంలో మునిగితేలారు.


అలా అక్కడికి చేరుకున్న వివిఐపిల దండులో ఓ మంత్రిగారి కుమార్తె కూడా ఉంది. అందంగా ఉంది. సంజయ్ కన్ను పడింది. పక్కనే  ఉన్న తన ఆత్మీయ బ్యాచ్ చెవిలో ఊదాడు. వాళ్ళు స్థానిక నాయకులకు అయ్యగారి అభిరుచిని చేరవేస్తే... వారొక్కసారి ఖంగుతిన్నారు. అయినా... ‘నో’.. అనే ధైర్యంలేక.. ప్రయత్నిస్తాం అని చెప్పి   సరాసరి వెళ్ళి ముఖ్యమంత్రి చెవి కొరికేసారు. ఇంకేముంది.. పెద్ద అలజడి. అయినా ఇలాంటి సంక్షోభాలను చిటికెలో పరిష్కరించే మేధావులు ప్రతి పార్టీలో సిద్ధంగా ఉంటారు. కాసేపు ఒకరికేసి మరొకరు తలలు బద్దలు కొట్టుకుని ఓ అద్భుత, అనైతిక పరిష్కారం తవ్వితీసారు. ... మంత్రిగారి కుమార్తె అచ్చం ఫలానా వర్ధమాన నటి (ఇప్పుడామె స్టార్ నటిగా రిటైరయింది) లాగా ఉంటుంది కాబట్టి ఆమెను పిలిపిద్దాం, మంత్రిగారి కూతురే అని పంపిద్దాం-అని తీర్మానం, నిర్ణయం జరిగిపోయాయి.


అంతే... రాజు తలుచుకున్నాడు... ఆగమేఘాలమీద ఓ టీమ్ మద్రాస్ వెళ్ళి ఆ నటికి విషయం చెప్పి బేరం కుదుర్చుకుని అడ్వాన్స్ కూడా చెల్లించి తీసుకొచ్చి మంత్రిగారి కుమార్తేనని నమ్మించి యువరాజా వారికి హారతి పళ్ళెంలో పెట్టి సమర్పించుకుని మురిసిపోయారు. సారు వారు కూడా తాదాత్మ్యం చెందారు.


పక్కరోజు యువరాజావారికి వీడ్కోలు చెప్పడానికి వివిఐపిలంతా విమానాశ్రయానికి చేరుకున్నారు. సారుతో సరదాగా, హుషారుగా మాట్లాడుతున్న సమయంలో... ఓ కుర్ర నాయకుడు  పక్కనే ఉన్న సీనియర్ మెడపట్టి వంచి ‘‘అన్నా ! సారుగారి వేలికి నిన్న తొడిగిన ఉంగరం ... లేదన్నా..’’ అంటూ చెవిలో ఊదాడు. ఆ గుసగుసలు ముఖ్యమంత్రిని తాకాయి. ఆయన మెలికలు తిరిగిపోతూ సాహసం చేసి..  సదరు డౌటనుమానాన్ని  భయంభయంగా పంచె తడుస్తున్నా చూసుకోకుండా  బయటికి కక్కేసాడు.  దాన్ని ఈజీగా తీసుకున్న యువరాజావారు మాత్రం  చిద్విలాసంగా  నవ్వుతూ..‘‘ అదా ! ఆ మంత్రిగారి అమ్మాయి నిజంగా వండర్ ఫుల్ ! అది ఆ అమ్మాయికి కానుకగా ఇచ్చేసా‘‘ అంటూ విమానం ఎక్కేసాడు.


కిం కర్తవ్యమ్ !!!

పారితోషికం ఎలాగూ పోయింది... ఇంత ఖరీదైన ఉంగరాన్ని ఎలా వదులుకోవడం ? వాకబు చేస్తే .. ఆ నటి పొద్దునే విమానం లో మద్రాస్ చెక్కేసిందని తెలిసింది. వెంటనే ఆపరేషన్ పోలో లాగా ఓ బ్యాచ్ మద్రాసులో దిగి ఆ నటిని నిలదీస్తే...‘‘నేను నచ్చి, నా పెర్ఫార్మెన్స్ కు మెచ్చి శ్రీవారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు’’ అని కుండబద్దలు కొట్టి ఇవ్వను గాక ఇవ్వనని భీష్మించింది. అయినా వెళ్ళిన బ్యాచ్ మామూలోళ్ళు కాదు కదా ! పూర్వాశ్రమంలోని వారి అవతారాన్ని శాంపుల్ గా చూపేసరికి... తత్త్వం బోధపడి ఆ వజ్రపుటుంగరాన్ని వారి చేతిలో పెట్టి లబోదిబోమంది.

.....

ఇది కథ కాదు. మరి వాస్తవమా ? అది చెప్పగల ఆ నాటి నటి, సంజయ్ గాంధీ నమ్మినబంట్లయిన రాజకీయ నాయకులు ఇప్పటికీ హైదరాబాదులో చురుగ్గానే ఉన్నారు. ఆసక్తి ఉన్నవారు అసలు కథేమిటో వారినడిగి తెలుసుకోవచ్చు.

-ములుగు రాజేశ్వర రావు, జర్నలిస్టు




1 కామెంట్‌:

  1. కన్నవాళ్ళు ఏమి చేయలేదు చేయలేరు కూడా... ఇక విన్న మీరు చదివిన మేము ఏం చేస్తాం. అయినా ఇది ఆయన వ్యక్తిగత బలహీనత కాబట్టి మనం చేసేది కూడా ఏమీ లేదు. ఇక మన రాజకీయ నాయకుల బాగోతాలంటారా, పదవి కోసం ఎంతకైనా దిగజారుతారు కదా. ఈ సంజయ్ గాంధీ గారి కొన్ని నిర్ణయాలు దేశానికి ఎంత అపకారం చేశాయో కూడా ఆ నోటా ఈ నోటా విని వదిలేయటం తప్పు మనమేం చేయలేకపోయాం .

    రిప్లయితొలగించండి

      ఏమిటీ పుస్తకం !!! ఎందుకక్కడ పడేసారు !!!     సోనియా గాంధీ రాసిన బి లాంగింగ్... ఎ జర్నీ ఆఫ్ లవ్ .... పుస్తకం చదవడానికి ముందు, దానిపై...