ఏమిటీ పుస్తకం !!! ఎందుకక్కడ పడేసారు !!!

  

 ఏమిటీ పుస్తకం !!! ఎందుకక్కడ పడేసారు !!!



  సోనియా గాంధీ రాసిన బి లాంగింగ్... ఎ జర్నీ ఆఫ్ లవ్ .... పుస్తకం చదవడానికి ముందు, దానిపై తీర్పు ఇవ్వడానికి ముందు కొన్ని విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి.

 

ఇది పుస్తక సమీక్ష కాదు, పుస్తకాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ అభిమానులయినా, బిజేపివారయినా, కమ్యూనిస్టులయినా, సంఘ్ పరివార్ వారయినా, నక్సలైట్లయినా... ఇవన్నీ కాకుండా.. కేవలం ఒక పాఠకుడిగా, చదువరిగా ఆసక్తి కొద్దీ చదవాలన్నా...

 

అసలు ఏమిటీ పుస్తకం? ఇది చరిత్రనా ! రాజకీయ ఎత్తుగడా ! ఆత్మకథనా ! విమర్శకుల నోరు మూయించడానికి పన్నిన పన్నాగమా !...వంటి చాలా సందేహాలు ముసురుకొస్తున్న నేపథ్యంలో...

 

ఈ పుస్తకాన్ని చేతిలోకి తీసుకోవడానికి ముందు... ఇది ఒకసారి పరిశీలించండి

 

నాగులకోనలో....

 

రాజీవ్ గాంధీని పెళ్ళి చేసుకునే సమయానికి సోనియా వయస్సు కేవలం 21 ఏళ్ళు. ప్రేమకోసం గడపదాటింది. దేశ సరిహద్దులు దాటింది. జాతి, మతంవంటి రేఖలను కూడా కళ్ళు మూసుకుని దాటేసింది. ప్రధానమంత్రి కుమారుడని తెలిసి ప్రేమించలేదు. పెళ్ళాడి...  అత్తవారింట... ఆ రాజకుటుంబంలో కాలుమోపింది. మన భాషలో అయితే ఎంతటి అదృష్టవంతురాలో...అనిపించే పరిణామం. కానీ జరిగిందేమిటి ?

 

ఎమర్జన్సీ కాలాన్ని ఈదింది. అత్తగారు అధికారాన్ని పోగొట్టుకోవడం చూసింది. ఆమె జైలుకెళ్ళడం చూసింది. తరువాత రాజకీయంగా అఖండ విజయం పొందడం చూసింది. ఆమె రక్తపు మడుగులో ఉండడాన్ని, తన ఒళ్ళో తలవాలిపోవడాన్ని చూసింది.

 

అనూహ్యమైన అపూర్వమైన బలంతో భర్త అధికారంలోకి రావడాన్ని చూసింది. ఆయన ఎన్నికల్లో ఓడిపోవడాన్ని కూడా చూసింది. భర్త శరీరం తునాతునాకలయిపోవడాన్ని కూడా భరించింది. కాంగ్రెస్ పార్టీ చీలికలు చూసింది. అభీష్టానికి విరుద్ధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. దాన్ని గాడిలో పెట్టి అధికారంలోకి తీసుకొచ్చింది. సహజంగా వరించి వచ్చిన ప్రధాని పదవిని స్వహస్తాలతో మన్ మోహన్ సింగ్ కు అప్పగించింది. అధికారాన్ని స్వప్రయోజనాలకోసం అనుభవించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నా... తను తెరవెనుక ఉండి... జాతీయ సలహా మండలి ద్వారా...  అధికార పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే  ప్రమాదం ముందని తెలిసి కూడా సమాచార హక్కు చట్టాన్ని తెచ్చే సాహసం చేసింది.  అలాగే ఆహార భద్రత చట్టం వంటి మరో నాలుగు అమోఘమైన చట్టాలను తెచ్చింది. రెండు రాష్ట్రాలుగా విడిపోతే... ఒకచోట పార్టీకి ఘోర పరాభవం తప్పదని తెలిసీ రాష్ట్ర విభజనను తన చేతులమీదుగా జరిపించింది. తదుపరి కాంగ్రెస్ అధికారం కోల్పోవడాన్ని కూడా చూసింది... ఆ పిమ్మట మోదీ, షాలు అధికారంలోకి రావడం చూసింది.

 

దేశంలో అధికార కేంద్రం...  బలంగాఉన్న కుటుంబంలో కీలకంగా ఉంటూ, అధికార వ్యామోహానికి ఆమడదూరంలో  మౌనంగా సాగుతూ పోతున్న....

ఈ మొత్తం ప్రయాణంలో ప్రశంసలు, పన్నీటి జల్లులకంటే అడుగడుగునా ఘోరాతిఘోరమైన అవమానాలు, అడ్డంకులను ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నది.ఆమె కుటుంబాన్ని, ఆమె రాజకీయ జీవితాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా,  ఎక్కడికక్కడ సుడిగుండాలు సృష్టిస్తున్నా... భూదేవికున్నంత ఓర్పుతో అడుగు ముందుకు వేస్తూ పోతున్నదే తప్ప ఎక్కడా తన ప్రత్యర్ధులమీద రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత ద్వేషం వెళ్ళగక్కకుండా తన పరిమితుల్లో తాను ఉంటూ తన పిల్లలను కూడా అదే విలువలతో నడుపుకుంటూ పోతున్నది.

 

ఇది ఒక కాంగ్రెస్ నాయకురాలిగా ఆమెను ప్రశంసిస్తూనో ..ఆమెపై అభిమానం పొంగిపొర్లి చెబుతున్న మాటలు కావివి. సోనియా గాంధీ విమర్శలకు అతీతురాలేం కాదు. అలాగే ఆమె పార్టీ కూడా దైవదత్తం కానే కాదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి తప్పుకూ నిలదీయాల్సిందే. చీల్చి చెండాడాల్సిందే. కానీ విమర్శలో క్రూరత్వం ఉండకూడదు, అమానవీయంగా ఉండకూడదు, శాడిజం అసలే పనికిరాదు.

 

మిడిమిడి జ్ఞానంతో....

 

వేదాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలవంటివేవీ  క్షుణ్ణంగా చదవకుండా,  అసలు వాటిలో ఏమి ఉన్నాయనే కనీస స్పృహ కూడా లేకుండా   చందమామ కథలతో సమకూర్చుకున్న అత్తెసరు పాండిత్యంతో మతాన్ని మోస్తున్న వారికి.. ఈ పుస్తకాన్ని (ఏ పుస్తకాన్ని కూడా) చదివేంత విశాల హృదయం ఉండదు. అందుకే నిన్న  ఒకరు కేరళలో ఈ పుస్తకాన్ని చెత్త డబ్బాలో పడేసి, దాన్ని మరీ ఫొటో తీసి ప్రాచుర్యం కల్పిస్తూ... పైశాచిక ఆనందం పొందుతూ ఉంటే... దీనికి గుడ్డిగా వత్తాసు పలుకుతూ, మతి స్థిమితం లేని వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో  వాంతి చేసుకుంటూ  ఉంటే...ముందు ముందు మన దేశంలో పుస్తకాలకు, స్వేచ్ఛగా ఆలోచించేవారికి ఎటువంటి దుర్గతి పడుతుందో ననే బాధ కలచివేస్తున్నది.

 

సంవత్సరాల తరబడి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నవారు... ముఖ్యంగా రాజకీయ నాయకులు  ఆత్మకథలు రాసుకుంటే.. దానిలో వారి గొప్పతనం చాటుకునే ప్రయత్నాలు, తప్పులను మరొకరిమీదకు నెట్టేసే కాల్పినిక కథనాలు, లేదా నిజాలను పూడ్చిపెట్టే తంతు ఎక్కువగా కనిపిస్తుంటుంది. పేజీనిండా, ప్రతి పేరా నిండా ఆ ద్వేషాన్ని  లేదా అక్కసును కక్కడం సహజంగా జరుగుతుంది. ఇప్పటిదాకా వచ్చిన పుస్తకాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపించింది. కానీ అంత తీవ్రంగా గాయపడి, ఇప్పటికీ నెత్తురోడుతున్న ఒక ఆడ మనిషి  గుండె ఆ వైఖరిని ఎక్కడా కలికానికి కూడా కనిపించనీయడంలేదు. . అందుకే  ఆమే చెప్పుకున్నట్లు...  ఇది ప్రేమ ప్రయాణం.

 

దేవభూమిలో....

 

ఇటలీలో పుట్టిందని పదేపదే అపహాస్యం కొన్ని దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాం. మనది దేవభూమి అనీ, పుణ్య భూమి అని మురిసిపోయేముందు...  ఇప్పటికీ  గజానికో గాంధారి కొడుకు తారసపడుతుంటే... గాడ్సేలకు వీరపూజ చేస్తుంటే...  ఇంకా ... మా తాతల నేతుల కథలు ఎంతకాలమని చాటింపు వేసుకుందాం ?

 

తను చేసిన తప్పులే కాదు, తన భర్త చేసిన తప్పులు, తోడికోడలు చేసిన తప్పులు, అత్తగారు చేసిన తప్పులను తప్పులుగా అంగీకరించింది. ఇలా ఒప్పుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వాణీ  వంటి మహానాయకులే తమ తప్పులు బహిరంగంగా ఒప్పుకున్నారు. కాబట్టే వారికి ఆ గౌరవ మర్యాదలు. బాబ్రీ మసీదు కూల్చివేత ఒక తప్పిదం – అనీ, సంఘ్ పరివార్ మాటవిని పొరబాటు చేసామని అద్వాణీ స్వయం గా ఎన్డీటివి ప్రణయ్ రాయ్ కిచ్చిన ఇంటర్వ్యూలో (వీడియో ఇప్పటికీ నెట్ లో ఉంది) మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇప్పటి తరం నాయకులు ఇంత నిర్భయంగా, నిజాయితీగా వారు చేసిన తప్పులు ఒప్పుకోగలరా ?

 

బిలాంగింగ్ అంటే....

 

బిలాంగింగ్ అన్న ఇంగ్లీష్ పదానికి అర్థం.. ‘సంబంధం ఉన్న.. ’ అని.

ఎవరితో !!!

 

ఈ నేలపై కాలు మోపే ముందు... ఈ దేశాన్ని గురించి చాలా గొప్పగా విన్నది.  భారత దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమనీ, విభిన్న మతాలు, జాతులు, కులాలు, విభిన్న భాషలు, వివిధ సంస్కృతులు, వేర్వేరు ఆచారాలవంటి పలురంగుల పూలను, పరిమళాలను భారతీయత అనే దారానికి గుచ్చిన పూలదండ అనీ, ప్రపంచమంతా అందుకే ఆ దేశాన్ని ప్రత్యేకంగా చూస్తుందనీ..... ఇలా .. ఊహల్లో తేలిపోయింది.

 

ఇక్కడ పుట్టకపోయినా ఇక్కడి మట్టిని మెట్టినింటి గౌరవంగా నుదుట ధరించి, ఇక్కడి సంప్రదాయాలనూ, ఆచారాలనూ మనస్ఫూర్తిగా పాటిస్తూ తనకూ,... తన కుటుంబానికి ఎప్పుడూ పక్కలో పాములుంటాయని తెలిసినా... ఈ దేశ ప్రజలకు  నిబద్ధతతో సేవ చేస్తున్న  ఆమెను ఇకమీదట కూడా...  నీకు ఈ మట్టితో సంబంధం లేదు.. అన్న రోజున మన భారతీయతకు, మన సనాతన ధర్మానికి మన స్వహస్తాలతో సమాధి కట్టినట్లే కాదా !!!

 

 ‘‘మనిషి మంచివాడు, మనుషులు క్రూరులు’’..  అని సామెత. మానవ మృగాలు  వెంటపడి ఎంతగా వేధించకపోతే .. మనసు ఎంత కకావికలం అయి ఉండకపోతే....  

ఇంతకూ నేనెవర్ని... నా   చిరునామా ఏది..అని పరోక్షంగా ఈ జాతిని ఎందుకు ప్రశ్నిస్తున్నదో  చెప్పండి !!! 

నేనింకా ఈ దేశం దాన్నే ననీ, బిలాంగింగ్ నే ననీ, అంగీకరంచమనీ ప్రాధేయపడుతూ వేడుకుంటుంది చెప్పండి !!!  

 

ఆమె నెమరు వేసుకున్న జ్ఞాపకాలను ఎందుకు చదవాలి ? అసలు సిసలు నిజాలతో ఆమె చరిత్రను రాస్తున్నారని కాదు, రాజకీయంగా గతం తాలూకు సందేహాలను తీరుస్తారని కాదు, ఇక ఆమెను విమర్శించడం కుదరదన్న స్థాయిలో ఆమె రాతలు ఉంటాయని కాదు...

 

మానవత్వ పరిమళాలతో ప్రేమను పంచుతూ ఒక ఆడపడుచు చేసిన వీరోచిత పోరాటం గురించి తెలుసుకోవడానికి ఇది చదవాలి.

 

ఒక రాజకీయ నాయకుడిగా, ఒక దేశాధినేతగానే కాదు, ఒక మనిషిగా గౌరవమర్యాదలతో బతకడానికి ధైర్యం కావాలి, ఓర్పు కావాలి, ద్వేషించే వాడిని కూడా ప్రేమించగలిగేంత సున్నితమైన మనసు ఉండాలి.  

ఎవరికి ?

 

ఈ దేశాన్ని ఏలే పాలకులనుంచి మొదలుపెట్టీ...సాధారణ పౌరులమయిన మనదాకా అందరికీ ఉండాలి.. అందుకే  ఈ పుస్తకాన్ని రాజకీయ కోణంలో కాక, ద్వేషాగ్నులతో కాక, ప్రేమతో, అనురక్తితో చదవాలి. ఇదే కాదు.. ఏ పుస్తకాన్నయినా.... 

అది లేనప్పుడు...

 కనీసం చదివే వాళ్ళ, చదువుదామనుకుని ఉబలాటపడేవాళ్ళ  మనసులను కలుషితం చేయకండి.

ఇన్నాళ్ళూ మన మాటలను విన్నది, ఇప్పుడు ఆమె మొదటిసారిగా నోరు విప్పింది, 

ఇప్పటికయినా ఆమె గోడు ఏదో వినాలి కదా !!!

 

-ములుగు రాజేశ్వర రావు, జర్నలిస్టు

 

(కొందరు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ, రాజ్యాంగ పండితుల అభిప్రాయాల నుండి ప్రేరణ పొంది రాసినది)

 

....

 



సంజయుల వారి రాసలీలా విలాసాలు....

 కన్నవి కాదు... విన్నవే !!!

 


సంజయుల వారి రాసలీలా విలాసాలు....

 

  ‘‘సంజయ్  - ఇందిరాగాంధీ ముద్దుల కుమారుడు. దుందుడుకు స్వభావి. కానీ స్త్రీ లోలుడు(ప్లే బాయ్). ఆయనకు ఉన్న ఈ దుర్వ్యసనం గురించి 70వ దశకంలో కొన్ని పత్రికలు రకరకాల కథనాలు ప్రచురించాయి. మరి కొన్ని ఆంతరంగిక మందిరాలకే పరిమితమయ్యాయి. వాటిలో నాకు బాగా గుర్తున్న రెండు కథనాలు ప్రస్తావిస్తా. ఒకటి సంజయ్ గాంధీ వివాహానికి సంబంధించినది. మరొకటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినది.

ఈ రెండూ అందరికీ ఇంకా గుర్తుండకపోవచ్చు. కానీ అప్పటి పాత్రికేయులు, రాజకీయ నాయకులు మాత్రం మరిచిపోయి ఉండరు. ఈ కథనాలు ఎంతవరకు విశ్వసించదగినవి- అన్న విషయంలో నా సమాధానం లేదా సంజాయిషీ ఒక్కటే. ఇటువంటి వాటికి ఆధారాలు ఉండవు... తెరచాటు బాగోతాలు కాబట్టి. ఇది చదివిన వాళ్ళు వాళ్ళ విజ్ఞతనుబట్టి నమ్మాలో, చదివి వదిలేయాలో నిర్ణయించుకోవడం ఉత్తమం. అందుకే నేను ‘‘కన్నవి కాదు..’’ అన్న శీర్షిక పెట్టింది.


సంజయుడు – మేనక :


మనం తెలుగులో మేనకాగాంధీ అంటున్నాం. ఆమె తొలిసారిగా వార్తల్లోకి వచ్చినప్పుడు Maneka అని ఉండేది. ఎలా రాయాలో తెలియక తెలుగు పత్రికలు  మేనక అనీ, మనేకా అని రెండు రకాలుగా రాస్తున్నాయి. ఆమె అసలు పేరు – మనేకా ఆనంద్. తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ తర్లోచన్ సింగ్ ఆనంద్.


ముందే చెప్పానుగా సంజయ్ స్ర్తీలోలుడని... 1973లో ఒక పెళ్ళిలో మనేకా తారసపడినప్పుడు ఆమె మీద కన్నుపడింది. వీరిద్దరూ తరచూ కలుసుకోవడాన్ని ఆమె తండ్రి నియంత్రించే ప్రయత్నం చేసాడు. అయినా దూకుడుమీదున్న సంజయ్ పట్టించుకోలేదు. ఒకసారి వీరిద్దరూ డేటింగ్ లో ఉండగా – తండ్రి గది బయటినుంచి తాళం పెట్టాడు. ఇందిరాగాంధీకి ఫోన్ కలిపాడు. వెంటనే వచ్చి వీరి వివాహం సెటిల్ చేయకపోతే తుపాకీతో కాల్చేస్తానని హెచ్చరించాడు. రాజకీయంగా జరిగే ప్రమాదాన్ని ఊహించి భయపడిన ఇందిరాగాంధీ వెళ్ళి వివాహానికి అంగీకరించారు. అయితే అమ్మాయికి 17 ఏళ్ళే. మైనర్. ఏడాది తరువాత పెళ్ళి చేస్తానని హామీ పత్రం రాసిచ్చి బయటపడ్డారు. తనకు నచ్చిన ఆడపిల్లలను వాసన చూసి వదిలేయడానికి అలవాటు పడిన సంజయ్ కు కథ అడ్డం తిరిగింది. (అప్పటికే సంజయ్ కు ఒక విదేశీ మహిళతో రెగ్యులర్ సంబంధం ఉండేదట) కొడుకుకు పెళ్ళి ఇష్టం లేకపోయినా తల్లి నచ్చచెప్పి ఒప్పించింది. అత్తకూ ఇష్టం లేదు, భర్తకు అసలే ఇష్టం లేదు... ఇక ఆమె కాపురం ఎలా సాగిందో బహిరంగ రహస్యమే.

 


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో...


స్త్రీ వ్యామోహంలో కూడా సంజయ్ అభిరుచులు వింతగా ఉండేవి... ఎలాగంటే...


ఓ సారి... సంజయ్ గాంధీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ప్రధాని కుమారుడన్న హోదా తప్ప మరే పదవి లేదు... అప్పట్లో అతని ఆగడాలు చూసి ప్రతిపక్షాలు, పత్రికలు అతన్ని ‘రాజ్యాంగేతర శక్తి’ (Extra Constitutional Authority  ) అని విమర్శిస్తుండేవి. ఆ విమర్శ కూడా సహేతుకమే. ఆయన ప్రాపకం సంపాదించడానికి  అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి పెద్దలు .. ఇలా పార్టీలో, ప్రభుత్వంలోని  ముఖ్యులంతా అక్కడ  స్వాగతం పలకడానికి క్యూ కట్టారు. ఆయన కరుణాకటాక్షాలకు తహతహలాడేవారు. అప్పట్లో దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువచేసే ఒక వజ్రపుటుంగరాన్ని ఆయనకు బహూకరించి, వేలుకి తొడిగి మరీ తన్మయత్వంలో మునిగితేలారు.


అలా అక్కడికి చేరుకున్న వివిఐపిల దండులో ఓ మంత్రిగారి కుమార్తె కూడా ఉంది. అందంగా ఉంది. సంజయ్ కన్ను పడింది. పక్కనే  ఉన్న తన ఆత్మీయ బ్యాచ్ చెవిలో ఊదాడు. వాళ్ళు స్థానిక నాయకులకు అయ్యగారి అభిరుచిని చేరవేస్తే... వారొక్కసారి ఖంగుతిన్నారు. అయినా... ‘నో’.. అనే ధైర్యంలేక.. ప్రయత్నిస్తాం అని చెప్పి   సరాసరి వెళ్ళి ముఖ్యమంత్రి చెవి కొరికేసారు. ఇంకేముంది.. పెద్ద అలజడి. అయినా ఇలాంటి సంక్షోభాలను చిటికెలో పరిష్కరించే మేధావులు ప్రతి పార్టీలో సిద్ధంగా ఉంటారు. కాసేపు ఒకరికేసి మరొకరు తలలు బద్దలు కొట్టుకుని ఓ అద్భుత, అనైతిక పరిష్కారం తవ్వితీసారు. ... మంత్రిగారి కుమార్తె అచ్చం ఫలానా వర్ధమాన నటి (ఇప్పుడామె స్టార్ నటిగా రిటైరయింది) లాగా ఉంటుంది కాబట్టి ఆమెను పిలిపిద్దాం, మంత్రిగారి కూతురే అని పంపిద్దాం-అని తీర్మానం, నిర్ణయం జరిగిపోయాయి.


అంతే... రాజు తలుచుకున్నాడు... ఆగమేఘాలమీద ఓ టీమ్ మద్రాస్ వెళ్ళి ఆ నటికి విషయం చెప్పి బేరం కుదుర్చుకుని అడ్వాన్స్ కూడా చెల్లించి తీసుకొచ్చి మంత్రిగారి కుమార్తేనని నమ్మించి యువరాజా వారికి హారతి పళ్ళెంలో పెట్టి సమర్పించుకుని మురిసిపోయారు. సారు వారు కూడా తాదాత్మ్యం చెందారు.


పక్కరోజు యువరాజావారికి వీడ్కోలు చెప్పడానికి వివిఐపిలంతా విమానాశ్రయానికి చేరుకున్నారు. సారుతో సరదాగా, హుషారుగా మాట్లాడుతున్న సమయంలో... ఓ కుర్ర నాయకుడు  పక్కనే ఉన్న సీనియర్ మెడపట్టి వంచి ‘‘అన్నా ! సారుగారి వేలికి నిన్న తొడిగిన ఉంగరం ... లేదన్నా..’’ అంటూ చెవిలో ఊదాడు. ఆ గుసగుసలు ముఖ్యమంత్రిని తాకాయి. ఆయన మెలికలు తిరిగిపోతూ సాహసం చేసి..  సదరు డౌటనుమానాన్ని  భయంభయంగా పంచె తడుస్తున్నా చూసుకోకుండా  బయటికి కక్కేసాడు.  దాన్ని ఈజీగా తీసుకున్న యువరాజావారు మాత్రం  చిద్విలాసంగా  నవ్వుతూ..‘‘ అదా ! ఆ మంత్రిగారి అమ్మాయి నిజంగా వండర్ ఫుల్ ! అది ఆ అమ్మాయికి కానుకగా ఇచ్చేసా‘‘ అంటూ విమానం ఎక్కేసాడు.


కిం కర్తవ్యమ్ !!!

పారితోషికం ఎలాగూ పోయింది... ఇంత ఖరీదైన ఉంగరాన్ని ఎలా వదులుకోవడం ? వాకబు చేస్తే .. ఆ నటి పొద్దునే విమానం లో మద్రాస్ చెక్కేసిందని తెలిసింది. వెంటనే ఆపరేషన్ పోలో లాగా ఓ బ్యాచ్ మద్రాసులో దిగి ఆ నటిని నిలదీస్తే...‘‘నేను నచ్చి, నా పెర్ఫార్మెన్స్ కు మెచ్చి శ్రీవారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు’’ అని కుండబద్దలు కొట్టి ఇవ్వను గాక ఇవ్వనని భీష్మించింది. అయినా వెళ్ళిన బ్యాచ్ మామూలోళ్ళు కాదు కదా ! పూర్వాశ్రమంలోని వారి అవతారాన్ని శాంపుల్ గా చూపేసరికి... తత్త్వం బోధపడి ఆ వజ్రపుటుంగరాన్ని వారి చేతిలో పెట్టి లబోదిబోమంది.

.....

ఇది కథ కాదు. మరి వాస్తవమా ? అది చెప్పగల ఆ నాటి నటి, సంజయ్ గాంధీ నమ్మినబంట్లయిన రాజకీయ నాయకులు ఇప్పటికీ హైదరాబాదులో చురుగ్గానే ఉన్నారు. ఆసక్తి ఉన్నవారు అసలు కథేమిటో వారినడిగి తెలుసుకోవచ్చు.

-ములుగు రాజేశ్వర రావు, జర్నలిస్టు




      ఏమిటీ పుస్తకం !!! ఎందుకక్కడ పడేసారు !!!     సోనియా గాంధీ రాసిన బి లాంగింగ్... ఎ జర్నీ ఆఫ్ లవ్ .... పుస్తకం చదవడానికి ముందు, దానిపై...