అన్ని ద్రోహములలో కెల్లా....
అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున దేశంలో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో, ఆర్థిక రాజధాని ముంబాయిలో రాజకీయంగా,
సామాజికంగా విశేష ప్రాధాన్యమున్న సంఘటనలు
చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన ఎన్నికల కమిషన్, ఓటర్
జాబితాలకు సంబంధించి జరిగిన ఆందోళనలు అవి. అంటే... మీతో, నాతోసహా యావత్ భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుకు సంబంధించినవి.
ఇక్కడ రాజకీయంగా ఫలానా పక్షానికి అనుకూలంగా, లేదా
ప్రతికూలంగా అని చూడాల్సిన ఆందోళనలు కావివి. వీటిని పట్టించుకోకుండా వదిలేస్తే.... ఎవరు అధికారంలోఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా...
అందరినీ, అన్ని వేళలా ప్రభావితం చేయగల సమస్య పై జరిగిన, జరుగుతున్న ఆందోళనలు ఇవి...
ఇంత ముఖ్యమైన సంఘటనలకు మన హైదరాబాద్(ఎడిషన్) పత్రికలు ఇచ్చిన ప్రాధాన్యత చూడండి. రోజంతా సోషల్ మీడియా నిమిషనిమిషానికీ అక్కడి
ఆందోళనలను కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఉంటే... కొన్ని తెలుగు పత్రికలు, కొన్ని
ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు వార్తా
ఛానెళ్ళు మాత్రం వారి రాజకీయ దేవుళ్ల అనుగ్రహం పొందడానికి ఎటువంటి తింగిరి
చేష్ఠలకు పాల్పడ్డాయో ఇక్కడ ఇచ్చిన ప్రధాన జాతీయ పత్రికల మొదటి పేజీలు చూడండి... వారి
ప్రాధాన్యతలను చూడండి... వాటి ప్రాధాన్యతలను ఎంతగా తొక్కేయడానికి ప్రయత్నించారో, ఎంతగా నీరుకార్చడానికి ప్రయత్నించారో చూడండి.
ఇది ప్రతిరోజూ ఉండే తంతే అయినా... పాఠకులు, వీక్షకులు, సమాజం
మొత్తంగా జర్నలిజం, మీడియా రంగంలోని వింత పోకడలు చూస్తూ.. నిత్య నూతనంగా ముఖంమీద కాండ్రించి
ఉమ్మేస్తున్నా... నామమాత్రంగానయినా సిగ్గుపడకుండా బరి తెగిస్తున్నారు.
అన్ని ద్రోహములలోకెల్లా... వారి స్వార్థ ప్రయోజనాల కోసం... స్వచ్ఛ సమాచారం పంపిణీలో మాయామర్మం చేయడం ద్రోహమే కాదు... అత్యంత
దారుణమైనది. ఎన్నికల కమిషన్, ఓటర్ల జాబితాల అక్రమాలకంటే వెంట్రుకవాసి కూడా తేడా
లేని దేశద్రోహం ఇది.
-ములుగు రాజేశ్వర రావు
(మాగ్నెట్ ఫీచర్స్)
గమనిక : ఇక్కడ మీరు చూస్తున్నది ఇటీవల ఎన్నికల కమిషన్ కు సంబంధించి సంచలనాత్మక, పరిశోధనాత్మక వార్తలు ప్రచురించిన ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కాదు... గోయెంకా మరణానంతరం విడిపోయిన దక్షిణాది ముక్క ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పేరుతో ప్రచురితమవుతున్నది. ఉత్తర భారతంలో ప్రచురితమయ్యే ‘ది ఇండియన్ఎక్స్ ప్రెస్’ గోయెంకా దత్తపుత్రుడు వివేక్ (గోయెంకా) ఖన్నాది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి