వాటీజ్ దిస్ పంచకట్టు వెంకయ్యాజీ !!! అండ్ వెంకీ మామాశ్రీ !!!




తెలుగు భాష
సంస్కృతులకు సంబంధించి ... అసిధారావ్రతంలాగా అనునిత్యం ప్రవచించే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి తెలుగు ఐకాన్గా ముద్ర పడినా... ఆయన వస్త్ర ధారణ మాత్రం దానికి భిన్నంగా ఉంటున్నదని చెప్పడానికి  కించిత్ బాధగా ఉంది. ఆయన ధరించే అడ్డపంచ దానికి ప్రధాన కారణం



ఇదే మన తెలుగు సంప్రదాయం అంటూ రామరాజ్  ద్వారా అన్ని ప్రచార మాధ్యమాల్లో కోడై కూస్తున్నారు మన  హీరో వెంకటేశ్. వీరు కట్టే పద్దతిలో దీనిని అక్షరాలా అడ్డపంచ... అనే అంటారు. తమిళనాడు సమీప ఆంధ్ర జిల్లాలయిన చిత్తూరు, కడప, నెల్లూరుల్లో దీని ప్రభావం ఎక్కువ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదటినుంచీ మద్రాసులో పాతుకుపోయి, తరువాతి కాలంలో అక్కడినుండి తరలినందువల్ల వారు, వారి కుటుంబాల్లో అత్యధిక భాగం తమిళ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు. తమిళనాడు, కేరళ, కొంతమేర కర్ణాటకను మినహాయిస్తే... దాదాపు భారతదేశం అంతటా, మరికొన్ని పొరుగు దేశాల్లో కూడా(శ్రీలంక తప్ప) ధోతీలాగా పంచకట్టే పద్ధతే వాడుకలో ఉంది. కట్టడంలో కొద్దిపాటి తేడాలుండొచ్చేమో కానీ... పద్ధతి మాత్రం ధోతీదే.

సంస్కృత పదం ‘ధౌత’ నుండి ధోతి, ధోవతి అయింది. ఇదే తెలుగులో మనం చెప్పుకునే పంచె... పంచ.. అంటే ఐదు గజాల ఏకవస్త్రం. . దీనిలో రెండు ధోవతులు కలిసి ఒకటిగా ఉంటాయి.  కత్తిరింపులు, కుట్లు ఆచార విరుద్ధం కాబట్టి... దీనిని వైదిక కార్యక్రమాల్లో సంప్రదాయవాదులు ఏకవస్త్రంగానే ఉపయోగిస్తారు. దీనిని మనం దానాలప్పుడు, దక్షిణలప్పుడు ‘పంచెలచాపు’ అని వ్యవహరిస్తుంటాం. ఖర్చుకు భయపడి ఇప్పుడు ఒక ధోవతితోపాటూ పైపంచె లేదా తుండు(టవల్) కలిపి పెడుతున్నారు.

నడుము దగ్గరనుంచీ పాదాలదాకా కాళ్ళను చుట్టి కట్టేది – అడ్డపంచె. మలయాళంలో ‘ముండు’ అనీ, తమిళనాడులో ‘వేష్ఠి’/వేట్టి అని అంటారు. అలాకాక ఒక అంచును కాళ్ళ మధ్యలోనుంచీ వెనకకు తీసుకుని గోచీలాగా ధరించేది ..ధోతీ. ఇదే శాస్త్ర సమ్మతం. అన్ని శుభ, అశుభ కార్యాల్లో నిక్కచ్చిగా పాటించే పద్ధతి. దీనితోపాటూ ఎడమ భుజంపై కండువా లేదా ఉత్తరీయం కూడా ఉండాలి. భారతీయ సంప్రదాయంలో.. ముఖ్యంగా మన తెలుగునాట  పురుషుల సంప్రదాయ వస్త్రధారణ అంటే ఇదే.



మన తాతలుముత్తాతలుతండ్రులు ఇలాగే కనిపించినా.... మన ఆచార వ్యవహారాలుసంస్కృతుల గురించి పట్టణాలునగరాల్లో మనం ఎక్కువ మాట్లాడతాంసుద్దులు కూడా చెబుతాం. కానీ మనం ఛస్తే పాటించం. నోరు తెరవకపోయినాతెలుగునాట...ఆచరించి చూపేదితరాల తరబడి మన సంస్కృతులను మోసుకు తిరుగుతున్నది మాత్రం  పల్లె ప్రజలు. ..జానపదులు... ఆదివాసులు... గిరిజనులే. గ్రామాల్లో గంగిరెద్దుల వారినుంచీ ఊరిపెద్దల వరకూ  అన్ని కులాల్లోవృత్తుల్లో మగవాళ్లు  విధిగా రోజూ ధోతీనే ధరిస్తారు. తెలంగాణలో ఇది ఆదిలాబాదు నుండి హైదరాబాదు శివార్లవరకూ ప్రస్ఫుటంగా కనపడుతుంది.



అచ్చ తెలుగు వస్త్రధారణకు అద్దం పట్టేవిధంగా ..... ధోవతి  కడితే ఇదిగో ఇలా కట్టాలి అని ఒక అక్కినేని ఒక యస్వీఆర్ఒక రాజశేఖర్ రెడ్డిఒక చాగంటి... వంటి ప్రముఖులు ఆచరణలో...  ప్రజల మధ్యలో తిరుగాడుతూ  చూపి యువతరం వారికి స్ఫూర్తిని కలిగిస్తుంటారు. దీనిని మతంతో ముడిపెట్టడంకన్నా. తెలుగు జాతికిమన దేశ వాసులకు గుర్తింపు తెచ్చే పెట్టే పద్ధతి అనడం సమంజసం. (గాంధీతాత  కొల్లాయిగుడ్డతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాడు మనకు). ఆంధ్రాకట్టు పేర మనం పాటించే  పద్ధతి ఇటీవల కొన్ని ఫ్యాషన్ షోలలో కూడా (ఇటలీ) పలువురి ప్రశంసలను అందుకుంటున్నది. ఆశ్చర్యకరంగా ఈ మధ్య పెళ్ళిళ్ళలో యువత... స్పెషల్ అట్రాక్షన్‌గా... మూకుమ్మడిగా పంచలు ధరించివచ్చి హడావుడి చేస్తున్నారు. తెలియక, చెప్పేవారు లేక వారు అడ్డ పంచలే మన సంప్రదాయం అనుకుంటున్నారు.  

అడ్డపంచ కట్టుకోవడానికి ఎక్కువ శ్రమక్కరలేదు. కానీ ధోవతి కట్టుకోవడానికి  మాత్రం కొద్దిగా సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇప్పటి తరానికి లేకపోవడంతో రెడీమేడ్ ధోవతులు వచ్చేసాయి... పెళ్ళికొడుకులు కూడా...  పాంట్లల్లోలాగా కాళ్లు దూర్చేసి  ధోవతుల్లో తేలుతున్నారు. మరింత సౌలభ్యంకోసం ధోతీ ధారణను యుట్యూబ్ లో కూడా నేర్పిస్తున్నారు.

రాజకీయ నాయకులు, సినిమా హీరోలు,  ఇతరత్రా జనసామాన్యాన్ని ప్రభావితం చేయగల వారికి ఒక విన్నపం... అయ్యా ! మీరు ధోవతులు కట్టకపోయినా ఫరవాలేదు గానీ, అడ్డపంచెలు కట్టుకుని, చుట్టుకుని తిరుగుతూ.. వేదికలెక్కుతూ... ఇదే తెలుగు సంస్కృతి ...అని మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించకండి.

కొసమెరుపు : జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.... తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఒక కార్యక్రమానికి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులో లేదా న్యాయవాదులో వెళ్ళారు.. ఎలా వెళ్ళారు !!! .. వారి పద్ధతి ప్రకారం అడ్డ పంచెలు కట్టుకుని మరీ వెళ్ళారు. అక్కడి క్లబ్ డ్రెస్ కోడ్ ప్రకారం ... అది నిషిద్ధం.. కాబట్టి  వారిని వెనక్కి తిప్పి పంపేసారు.

తమిళ సంస్కృతి మీద, భాష మీద ఇటువంటివి  సూక్ష్మాతిసూక్ష్మంగా జరిగినా... ఎప్పటిలాగే... వారి మానంమీద దాడి జరిగినట్టు... రెప్పపాటులో మొత్తం సమాజం తిరగబడింది. అంతే వెంటనే ... తమిళ పంచెకట్టుపై వారి రాష్ట్రంలో ఎక్కడ నిషేధం ఉన్నా... వాటిని తొలగించడమే కాదు, అభ్యంతరం చెప్పినా, ఆక్షేపించినా... ఏడాదిపాటు జైలుశిక్ష, రు.25 వేలు జరిమానా, సదరు సంస్థల లైసెన్సుల జప్తు వంటి పలు చర్యలకు అవకాశం కల్పిస్తూ.... జయలలిత శాసనసభలో ఆగమేఘాలమీద బిల్లు పెట్టి ఆమోదింప చేసింది.

సంక్రాంతి శుభాకాంక్షలతో.... మీ

-ములుగు రాజేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్


..........

(మీ అభిప్రాయాలు/వ్యాఖ్యలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో  పెట్టండి.  అందరూ చూస్తారు...

ఈ బ్లాగులో కూడ శాశ్వతంగా ఉండి... తెరిచిన ప్రతిసారీ అలరిస్తుంటాయి.)




తెలుగు భాష ,  సంస్కృతులకు సంబంధించి ... అసిధారావ్రతంలాగా అనునిత్యం ప్రవచించే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి  ‘ తెలుగు ఐకాన్ ’ గా ము...