‘‘ఒక నదికి
గానీ, ఒక చెరువుకుగానీ నీరు ఎక్కడినుంచి వచ్చి చేరుతూ
ఉంటుందో ... దానిని క్యాచ్‌మెంట్ ఏరియా.. అంటారు. తెలుగులో దీనిని ‘పరీవాహక ప్రాంతం’ అంటున్నాం.
నదిలోకి అలా వచ్చి చేరిన నీరు దిగువకు ప్రవహిస్తూ పోయి ఎక్కడో మరో
నదిలోనో, సముద్రంలోనో కలుస్తుంటుంది. అలా ప్రవహిస్తూ పోతున్న
నదికి, దాని
మార్గంలోవచ్చే ప్రాంతాలను పరీవాహక ప్రాంతాలు అనం.’’
‘‘వికారాబాద్, తాండూర్ ప్రాంతాలు... ఉస్మాన్
సాగర్(గండిపేట్), హిమాయత్ సాగర్, మూసీలకు
పరీవాహక ప్రాంతాలు. మూసీనది దిగువకు ప్రవహిస్తూ... ఆ క్రమంలో పురానాపుల్, ఇమ్లీబన్, చాదర్ ఘాట్, ఉప్పల్...’’
అలా సాగుతూ పోతున్నప్పుడు ఈ మార్గంలోని ప్రాంతాలను పరీవాహక ప్రాంతాలని
అనం. అలాగే ప్రతి నదికీ, ప్రతి చెరువుకీ కూడా.’’
ఈ విషయం పరిశీలించి,
విషయ పరిజ్ఞానం ఉన్న వారితో నిర్ధారించుకుని... ఒప్పయితే
సరిదిద్దుకోండి, ఇతర సహచరులు తప్పు చేసినా వారించండి...
ఒకవేళ నేను చెప్పినది తప్పయితే తెలియచేయండి. నేను కూడా దిద్దుకోవడమేగాక మరోసారి
ఇటువంటి ప్రవచనాలు చేసే ముందు జాగ్రత్తపడతా.
కుర్రాళ్లోయ్
కుర్రాళ్ళు.....
ఎడిటోరియల్ డెస్క్ లోపనిచేసే సీనియర్ జర్నలిస్టులతో పోలిస్తే... క్షేత్రస్థాయిలో
రిపోర్టర్లుగా పనిచేసే మీకు సాధారణంగా వయసు, అనుభవం చాలా తక్కువ. కానీ అతి తక్కువ సమయంలో,
అత్యంత ఎక్కువ సమాచారాన్ని, వీలయినంత తాజాగా
అందించడంలో మీరు నిష్ణాతులు. ఎండనకా, వాననకా, సరైన తిండీ, సమయానికి నిద్ర లేక...గంటలతరబడి
ఫీల్డులో గడుపుతూ మీ వంతు రాగానే ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా ... వీక్షకులకు
సులభంగా అర్థమయ్యేవిధంగా వార్తా కథనాలను అందించడంలో మీరు రాటుదేలి ఉంటున్నారు. అన్నిటికంటే
ముఖ్యంగా మిమ్మల్ని మెచ్చుకోవలసింది... ఆశువుగా, అనర్గళంగా, ఎక్కడా తడబడకుండా,
తడుముకోకుండా ఎంత సేపయినా అలాగే మాట్లాడగలిగే...ఆ నైపుణ్యానికి
నిజాయితీగా జోహార్లు.
ఆశ్చర్యం ఏమిటంటే –
దాదాపు మీరందరూ(అన్ని ఛానళ్ళ వాళ్ళు) ఇదే లక్షణాన్ని అతి తక్కువ
సమయంలో పుణికిపుచ్చుకుంటూ ఉండడం... చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగే సందర్భాల్లో...
స్టూడియో నుంచి దశాబ్దాల అనుభవం ఉన్న మీ సీనియర్లు దిగుతూ ఉంటారు, రంగంలోకి. కానీ మీలాగా ఆ వార్తల
తాలూకు నేపథ్యం, పొల్లుపోకుండా వార్తా కథనం, జరగబోయే పరిణామాలు... వీటిని గుక్కదిప్పుకోకుండా ప్రజంట్ చేయడంలో. ...వారి
అనుభవాలు, ఇతరత్రా విషయ పరిజ్ఞానం మీ కుర్రకారు ముందు
దిగదుడుపే.
(అంతెందుకు...
ముందుగా రాసుకున్న వార్తలను చాలా సార్లు రిహార్సల్స్ చేసుకుని, టెలిప్రాంప్టర్ ముందు చూసుకుంటూ
... ఏసి రికార్డింగ్ స్టూడియోల్లో నింపాదిగా కూర్చుని వార్తలు తప్పులు చదువుతూ,
తడబడుతూ ఉండే న్యూస్ రీడర్లను గమనిస్తే....తగిన గుర్తింపుకు
నోచుకోని మీ వంటి సిసింద్రీల ప్రతిభ స్థాయి ఏమిటో అర్థమవుతుంది).
నాదోసూచన. పని ఒత్తిడికొద్దీ కానీ, సమయాభావంవల్ల కానీ, లేదా
సంబంధిత అంశాన్ని మీరు సరిగా అధ్యయనం చేయకపోవడంవల్ల కానీ, తప్పులు
దొర్లుతున్నాయి. ఒక్కోసారి అతి విశ్వాసంవల్ల, చాలా సార్లు,
మీకు అది తప్పని తెలియకపోవడం వల్ల, మీకు
వాటిని వెంటనే సరిదిద్దేవారు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.డెస్క్ లో
అయితే తప్పులను సరిదిద్దే వ్యవస్థ ఉంటుంది.(అలా ఉండి కూడా స్క్రోలిం గుల్లో బొచ్చెడు
అక్షర దోషాలు, వాక్య నిర్మాణ దోషాలు నిరాటంకంగా ప్రసారమవుతూ
పోతున్నాయి). మీరు మాట్లాడింది ఎటువంటి అడ్డంకులు లేకుండా... నేరుగా వీక్షకుల
చెవుల్లోకి, వారి మెదళ్ళల్లోకి చేరిపోతుంటాయి.
ఈ తప్పులకు మీపైన ఉండే సీనియర్లు చెక్ పెట్టాలి. సమయానికి వారు గమనించకపోవడంవల్ల, లేదా వారికి కూడా సరైన అవగాహన,
పడికట్టుపదాలు తెలియకపోవడంవల్ల- అవే తప్పులు... ఒప్పులయిపోయి
అంటువ్యాథిలాగా ఇతర ఛానళ్లకూ, యూట్యూబ్ వార్తావీరులకూ
సోకి... గుర్రపుడెక్క ఆకులాగా... విస్తరించిపోతున్నాయి.
ఒక
క్లాసిక్ ఉదాహరణ : ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో...
ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మద్రాసులో చనిపోయి...భౌతిక
కాయాన్ని వారి ఫాంహౌసుకు తరలించిన సమయంలో... అక్కడకు ముందుగా చేరుకున్న ఒక పెద్ద
తెలుగు టివీ ఛానల్ రిపోర్టర్...కథనం మొదలు పెట్టాడు...‘‘మామూలుగా అయితే హిందూ సంప్రదాయం
ప్రకారం దహనం చేస్తారు. కానీ ఎస్. పి.బాలుగారు జంగమలు కావడం మూలాన వారి ఆచారం
ప్రకారం సమాధి చేస్తున్నారు...’’ అంటూ అక్కడ ఏర్పాట్లు
జరుగుతున్నంతసేపూ అదేపనిగా రిపీట్ చేస్తూ పోతున్నాడు... కాసేపటికి మరో ఛానల్ కూడా ఈ
పాట అందుకున్నది...
వారి కుటుంబం గురించి కాస్తోకూస్తో తెలిసున్న వారికి ఇదో పెద్ద షాక్.
తెలియని కోట్లాదిమంది...‘‘ ఇన్నాళ్ళూ మేమేదో అనుకున్నాం..ఓహ్! ఇదా...’’ అని
అనుకుంటున్న సమయం..
హైదరాబాద్ లో ఉండి...అందరిలాగే... ఆస్పత్రితో మొదలుపెట్టి అంతా
ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న నాకు .. సీన్ అర్థమయిపోయింది. వెంటనే ఇక్కడ ఆ ఛానల్
స్టూడియో వారికి ఫోన్ చేస్తే,
వారు మద్రాస్ ఆఫీసుకు విషయం తెలపాలనుకునేటప్పటికి... అక్కడ
ముఖ్యులందరూ బయటకు వెళ్ళిపోయారని చెప్పారు. మద్రాసులో ఉన్న ఇతర
జర్నలిస్టు మిత్రులందరినీ కదిపి,
కుదిపితే... ఓ గంట తరువాత (పరిస్థితి విషమించక ముందే) అసలు
రిపోర్టర్ దాన్ని కరెక్ట్ చేసుకున్నాడు. మిగిలిన వారిని కూడా అలర్ట్ చేసాడు...
సో...బి అలర్ట్... ఆల్ ది బెస్ట్...
-ములుగు రాజేశ్వర రావు.
.......................
https://chinavyasudu.blogspot.com/2021/10/blog-post.html?spref=tw