లేకపోయినా ఉన్నట్లే....
గత కొన్నేళ్ళలాగానే... ఇంటి పైకెక్కి కోడి కూయలేదు, వీథిలో భోగిమంటల్లేవు... ఇంటి ముందు కళ్ళాపి చల్లలేదు. ... రోజేసే ముగ్గులకే కాస్తంత రంగులద్దడం తప్ప గుమ్మడిపూలు నిండుగా తురుముకున్న గొబ్బిళ్ళ రంగవల్లులు లేవు... గంగిరెద్దు రాలేదు... హరిదాసు ఊసేలేదు... చెరుకు గడలు లేవు... వంటింట్లో సకినాల సందడి, అరిసెల పొగలు, సెగలు, వాసనలు లేవు...
కనుమనయినా చూసి తరిద్దామంటే అన్నీ కనుమరుగయిపోయాయి......దొడ్డీ లేదు, గడ్డీలేదు, గొడ్డూ లేదు... కనీసం పసుపు బొట్లు పెడదామనుకుంటే పెంపుడు కుక్క కూడా లేదు.
అయినా ప్లవ ఆగుతుందా.... సంక్రాంతినే కాదు, మూడుపండగలను గుంజుకొచ్చి ఇంట్లో పడేసింది. స్వగృహ నుంచి అరిసెలు, సకినాలు తెప్పించింది. మరీ నీరసపడిపోకుండా చుట్టుపక్కల పోరగాళ్ళ చేతికి పతంగులిచ్చి ఫట్ సినిమాల హిట్టు పాటలేసి కిక్కెక్కిచ్చేసింది.... పిల్లలు దూరంగా ఉన్నా పాత జ్ఞాపకాలను ఫ్రెష్ గా ఫ్రై చేసి ఫోన్లల్లోనే వడ్డించింది...
మద్యమధ్యలో వాట్సాప్ ఓపెన్ చేసి....మీ అందరి ఆకాంక్షల మూటలిప్పి మురిసిపొమ్మన్నది.... ఆ మురిపాలు మళ్ళీ ఫ్రిజ్ లో కుక్కకుండా మీకు వెంటనే చేరవేయకపోతే ...వచ్చే ఉగాదికి చేదుమందు తెచ్చిపోస్తానన్నది...
అందుకే చెబుతున్నా...
మీకు, మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ పండగ శుభాకాంక్షలు...ఇప్పటికే శుభాభినందనలు తెలిపిన వారికందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.....
ఇట్లు
మీ
ములుగు రాజేశ్వర రావు
సీనియర్ జర్నలిస్ట్
…………….