కాయ్ రాజా కాయ్ !!!
(కాలం : 1963-65 : తీర ప్రాంతం - ఊళ్ళపాలెం ... విజయవాడ – మద్రాసు జాతీయ రహదారిపై సింగరాయకొండ
నుంచి తూర్పున 4 మైళ్ళలో ఉండే ఊరు. నాలుగైదు గ్రామాలకు జంక్షన్. ప్రధాన వ్యాపారం :
ఉప్పు తయారీ, అమ్మకం: అప్పడు నా వయస్సు :
11-13 సంవత్సరాలు, చదువు : 7-9 తరగతులు, జిల్లా పరిషత్ హైస్కూలు )
.....
‘రాజా ! మీ నాన్న పిలుస్తున్నాడు’...(చిన్నా -కాంపౌండర్ సందేశం)
‘.. .......................’
‘రాజా ! నిన్నే... నాన్న పిలుస్తున్నాడు’
‘ఎహెఫో..వస్తాన్లే ఫో..’
* * *
‘రాజా ! మీ నాన్న రమ్మంటున్నాడు’ (సుబ్బయ్య-జూనియర్ కాంపౌండర్ సమన్లు)
‘వస్తున్నానని చెప్పు..నువ్వు పో...నే..వస్తున్నా నీ వెనకాలే...’
* * *
‘అన్నయ్యా ! నాన్నే వచ్చాడు.
అక్కడున్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు’
‘‘నాన్ననా..!!! నాన్నెందుకు వచ్చాడు...ఎక్కడికి వచ్చాడు...
ఇప్పుడెక్కడున్నాడు... నన్ను పిలిచింది నాన్ననా....నా కట్టా ఎందుకు చెప్పలేదు...
ఏమంటున్నాడు...కోపంగా ఉన్నాడా....అసలెందుకు రమ్మన్నాడు .....ఇక్కడున్నట్లు
మీకెట్టా తెలుసు..????’
‘‘నువ్విక్కడ ఉన్నట్లు నాన్నకు తెలిసింది...’’
‘నాన్నకు తెలిసిందా..ఎట్లా..??’
‘ఏమో..చాలా కోపంగా ఉన్నాడు...’
‘అమ్మో ! పా...వస్తున్నా...బాగా కోపంగా ఉన్నాడా...నిజం చెప్పు...బాగా కోపంగా
ఉన్నాడా...నాన్నకెవరు చెప్పారు నేనిక్కడున్నానని...?????’
‘.. .......................’
* * *
‘‘ఇదుగోరాజా ! ఇప్పుడే వస్తా....
వచ్చేదాకా చూస్తుండు...జాగర్త...’’
‘పో..నువ్వు పోయిరా... నేను
చూసుకుంటాలే... తొందరగా వచ్చేయ్..’
ఆఁ రండి బాబూ....రండి.... కాయ్
రాజా కాయ్... అణాకు అణా... బేడాకు బేడా.... రాజా రాణీ ఆటీన్ ఇస్పేట్... కళావర్
డైమన్ .... రండి రండి... ఒక్క ఏనుగుకు .... పావలాకు పావలా... మూడేనుగలు... పావలాకు
ముక్కాల్ రూపా...అణా కు అణా....మూడు గుర్రాలు పడితే ముప్పావలా...’
డమకు డమ టమకు టమా....రండి బాబూ
రండి....
* * *
స్కూలునించి వచ్చి స్నానం చేసి...
ఉతికి ఆరేసి రెడీగా ఉంచిన బట్టలు మార్చుకుంటున్నా... అమ్మ అన్నం ప్లేటుతో
వచ్చింది.
‘మల్లయ్య నీకోసం చూస్తున్నాడు. తొందరగా
తెములు.... అక్కడ నీళ్ళు నువ్వే పట్టు. చాలా దూరం పోవాలిగా...’’ అంటూ అమ్మ తొందర
పెడుతున్నది.
గబగబా తినేసా... మల్లయ్య కావిడెత్తుకుని ముందుపోతుంటే... నేను పక్కన నడిచి వెడుతున్నా.
......
మా ఊరంతా చవిటినేల. నీళ్ళ ఎద్దడున్న
ప్రాంతం. తాగడానికి, వంటకు నీళ్లు కావాలంటే ఊరికి 2 మైళ్ళ దూరంలో ఒక మంచినీళ్ళ బావి ఉంది. ఊరంతా అక్కడినుంచే
మోసుకొచ్చుకుంటారు. మోయలేని వాళ్లకోసం కావిళ్ళతో నీళ్లు మోసుకొచ్చే వాళ్ళుంటారు.
బిందెకు పావలా. అలా మాకు మల్లయ్య రెగ్యులర్ గా వచ్చేవాడు. మడి ఆచారం పాటించే రెండు
మూడు కుటుంబాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అందులో మాదొకటి. ఆచారం- అవసరం- వ్యవహారం ...
ఈ మూడూ కలిపి ఆచరణలో చూడాలంటే...
రెండు ఇత్తడి బిందెలు బాగా బూడిదా
చింతపండేసి తోమి కడిగి అమ్మ కావిట్లో పెట్టి మూతలు పెట్టేది. పక్కన నేను తడి
తువ్వాలు, చాంతాడు బొక్కెన్లో వేసుకుని మల్లయ్య
పక్కన పోతా.
బావి దగ్గరకు పోయిన తరువాత నేను
చాంతాడు గిలక్కి వేసి బొక్కెన్ను బావిలోకి వదిలేసే వాణ్ణి. చాంతాడు రెండో కొస
మల్లయ్య పట్టుకుని నీళ్ళ బొక్కెనను పైకి లాగితే... దాన్ని నేను అందుకుని బిందెల్లో
పోసేవాణ్ణి. అవి నిండిన తరువాత మూతలు పెడతా... బిందెలు ముట్టుకోకుండా మల్లయ్య కాడిని భుజానికెత్తుకుంటే...
నేను చాంతాడు చుట్టి బొక్కెన్లో
పెట్టుకుని ఇంటి ముఖం పట్టేవాళ్ళం. ఒకవేళ నేను
మైలపడితే... నీళ్లు నింపడానికి తడి
తువ్వాలు కట్టుకోవాల్సి వచ్చేది.
పోను రెండు మైళ్ళు, రాను రెండు మైళ్లు... నేను స్కూలు సంగతులు, మా ఫ్రెండ్స్
విషయాలు చెబుతుంటే... మల్లయ్య చాలా కబుర్లు చెప్పేవాడు... ఆ వయసుకి నాకు థ్రిల్లింగా ఉండేవి. వాళ్ల
వాడలోవి, వాళ్ళ ఫ్యామిలీవి, వాళ్ళ జీవితాలు, వ్యాపకాలు.... బోల్డు టైంపాస్...
చెప్పడానికి మల్లయ్య జంకేవాడు కానీ... నాకు మాత్రం తెగ ఆసక్తిగా ఉండేది...
మరిన్నింటి కోసం గుచ్చిగుచ్చి అడిగేవాణ్ణి. ఆ సమయంలో నాకు పరిచయం అయిన మల్లయ్య
ప్రధాన జీవన వ్యాపకం – డైమన్ డబ్బా కమ్ లాటరీ చక్రం.
* * *
సింగరాయకొండ ( ప్రస్తుతం ప్రకాశం జిల్లా – కథాకాలానికి అది నెల్లూరు
జిల్లాలో ఉండేది) నుంచి రోడ్డు ఊళ్ళపాలెం ఊరి మధ్యలోగుండా బకింగ్ హాం
కాల్వదాకా వెడుతుంది. అది దాటితే కొద్ది
దూరంలోనే సముద్రం. దాటడానికి వంతెనకూడా ఉండేది కాదు. అక్కడక్కడా ఒడ్డుకు ఒక వైపున
గుంజపాతి దానికి ఒక పడవను కట్టి ఉంచేవారు. దానిలో చివరగా కూర్చునే వాడు దాన్ని
గట్టిగా నెట్టి కూర్చుంటే అవతలి ఒడ్డుకు చేరుకునేది. అటు ఎక్కిన వాళ్ళు తాడు పట్టుకుని
లాక్కుంటే ఇవతలి ఒడ్డుకు చేరుకునే వారు.) ఊరిలో ప్రధాన వ్యాపారం ఉప్పు. ఉప్పు
కొటార్లు ఉండేవి. లారీల్లో రవాణా సాగేది.
జనం తిరగాలంటే నడకే ఎక్కువ. లేదంటే
... సైకిళ్ళు, జట్కా బళ్ళే. తారు రోడ్డు కూడా లేదు, కంకర రోడ్డే, కరెంటు కూడా
లేదు... రాత్రయితే కిరసనాయిల్ తో వెలిగే పెట్రోమాక్స్ లైట్లు, లాంతర్లు, బుడ్లే.
ఊరి మధ్యగుండా పోయే ఆ రహదారిలోనే పెద్ద
మలుపు దగ్గర ఒక జంక్షన్ ఉంది. అదే... ఊరికి పెద్ద మార్కెట్. అంగళ్ళన్నీ అక్కడే. కూరగాయలు,
చేపలు, టైలర్లు, హోటళ్ళు, ఫుట్ పాత్ వ్యాపారాలు... సాయంత్రం నుంచీ రాత్రి దాకా
బాగా రద్దీగా ఉంటుంది. ఉప్పు, దాని అనుబంధ వ్యాపారాలు జోరుగా సాగేవి కాబట్టి...
వ్యాపారులు, ముఖ్యంగా వారి పిల్లల జేబులు కూడా ఓవర్ ఫ్లో అవుతుండేవి. ఆ జంక్షన్
లోనే ఒక ఓరగా మా మల్లయ్య నడిపే డైమన్ డబ్బా లాటరీ.
ఒక పట్టా పరిచి ఉంటుంది దానిమీద పేక ముక్కల్లోని
ఆటీన్, కళావర్, డైమన్(డైమండ్), ఇస్పేట్( స్పేడ్) ల చిహ్నాలు పెద్దవిగా రెండు
వరసల్లో ముద్రితమై ఉంటాయి. ఆ పట్టా పక్కనే మరో పట్టా. దానిమీద ఒంటె, గుర్రం,
ఏనుగుల బొమ్మలు రెండు అడ్డ వరుసల్లోముద్రితమై
ఉంటాయి. నిర్వాహకుడి ముందు పట్టాపై ఒక చక్రం ఉంటుంది. దానికి ఒక సూచీ. ఆ చక్రంమీద
కూడా వీటి బొమ్మలు ముద్రితమై ఉంటాయి. ఏ బొమ్మ మీద అయినా డబ్బు పందెం కాయవచ్చు.
అన్ని బొమ్మల మీద డబ్బులు బాగా పడే దాకా జూదగాళ్ళను ఆకర్షించడం, ఆ తరవాత చక్రాన్ని
నిర్వాహకుడు గట్టిగా తిప్పితే....అది తిరిగి తిరిగి పూర్తిగా ఆగే సమయానికి దాని
సూచీ ఏ బొమ్మ మీద ఆగితే ఆ బొమ్మమీద పందెం
కాసిన వారికి డబ్బులు... చక్రంలో మూడు
బొమ్మలుంటే మూడింతలు, రెండుంటే రెండింతలు, ఒకటే ఉంటే దానికి సమానమైన డబ్బు
నిర్వాహకుడు చెల్లిస్తాడు. డైమను డబ్బా
కయితే ఒక డబ్బాలో చతురస్రాకారపు పాచికలు(క్యూబులు), వాటి మీద డైమన్, ఆటీన్,
ఇస్పేట్, కళావర్ చిహ్నాలు ఉంటాయి. వాటిని ఒక డబ్బాలో వేసి బాగా గిలకొట్టి కింద
వేయంగానే పాచికల్లో పైన కనిపించిన చిహ్నాలను బట్టి జూదగాళ్ళకు చెల్లిస్తారు. పాచికల
మీద కనిపించని బొమ్మల మీద కాసిన డబ్బంతా నిర్వాహకుడిదే.
* * *
మా నాన్న డాక్టరు. ఆర్.ఎం.పి
డాక్టరయినా, హోమియో, ఆయుర్వేదం, అల్లోపతి... మూడింట్లో వైద్యం చేసేవారు. మెయిన్
రోడ్డుకు కొద్దిమీటర్ల లోపలికి ఓ సందులో
మా ఇల్లు ఉండేది. దాని అద్దె రు.10 లు. అది ఇల్లులా కనిపించదు... బయటినుంచి
చూస్తే. ఇప్పటి భాషలో చెప్పాలంటే..
నర్శింగ్ హోం. పెద్ద ఇల్లు. ముందు పెద్ద వసారా గ్రిల్స్ తో .. దాని ముందు విశాలమైన
ఒక వేదికలాంటి... ఎత్తు అరుగు. ఇంటి వెనుక దొడ్డి (పెరడు) కూడా పెద్దది. అదే
వెయ్యి గజాలదాకా ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్. అరుగు మీద ఔట్
పేషంట్లు కిక్కిరిసి ఉండేవారు. వసారాలో బెడ్స్ (మంచాలు), ఇద్దరు కాంపౌండర్లు
బిజీబిజీగా... చుట్టుపక్కల సోమరాజుపల్లె, బింగినపల్లి, పాకాల, పట్టప్పాలెం,
పల్లెపాలెం(ఇంకా ఇతర గ్రామాలున్నా..వాటి పేర్లు గుర్తు లేదు) నుంచి రోగులు బండ్లు
కట్టుకుని వచ్చేవారు. ఒకటీ అరా బండ్లు
ఎప్పుడూ ఇంటి బయట వీథిలో ఉండేవి. మా నాన్నకు కొరుకుడు పడని కేసులు, ఎమర్జన్సీ కేసులు, సర్జరీ అవసరమయినవి.... సింగరాయకొండకు పంపేవారు. డా. హనుమంత రావుగారని రాష్ట్రస్థాయిలో
పేరున్నాయన అని చెప్పుకునే వారు. ఆయనది కందుకూరు. మా ఇంట్లో ముందు రోగుల మంచాలున్న
చోట ఆస్పత్రి భాగంలో రెండు పెట్రోమాక్స్ లైట్లుండేవి. వెనక ఇల్లు. మాకు లాంతర్లు,
బుడ్లే. మా ఇంట్లోకి వెళ్లాలంటే...
వసారాలోని రోగులను .. అది పగలు కిటకిటలాడుతుండేది. ..లోపల మంచాలను, రోగికి సహాయంగా
వచ్చి అక్కడున్న వారిని దాటుకుంటూ లోపలికి వెళ్లాలి.. కొద్దిగా ప్రయాసతో కూడుకున్న
పనే. వానాకాలం అయితే వీరి తాకిడి ఇంకా ఎక్కువ.
ఆస్పత్రికి రాలేని రోగులను చూడడానికి మా నాన్నకు జట్కా పంపేవారు. ... అలా
మా నాన్న ఓ రోగిని చూడడానికి మార్కెట్ లో గుండా జట్కాలో వెడుతుంటే...
ఆఁ రండి బాబూ....రండి.... కాయ్ రాజా కాయ్... అణాకు అణా...
బేడాకు బేడా.... రాజా రాణీ ఆటీన్ ఇస్పేట్... కళావర్ .... రండి రండి... ఒక్క
ఏనుగుకు .... పావలాకు పావలా... మూడేనుగలు... పావలాకు ముక్కాల్ రూపా...అణా కు
అణా....మూడు గుర్రాలు పడితే ముప్పావలా...’
డమకు డమ టమకు టమా....రండి బాబూ రండి....
......అని వినిపించింది.
ఇది మా రాజా గొంతులాగా ఉందే... అయినా
వాడికిక్కడేం పని... అనుకుంటూ.. కొద్దిగా ముందుకు పోయిన తరువాత జట్కా ఆపించి
బండతన్ని చూసి రమ్మనమని పంపాడు. వాడు నన్ను గుర్తుపట్టి ... నిజాయితీగా వెళ్ళి ఉన్నమాట చెప్పేసాడు. అసలు మా
నాన్న కోపానికి... అక్కడే జంక్షన్ జామ్ అయ్యుండేది... కానీ మెడికల్ ఎమర్జన్సీవల్ల.. అప్పటికి.. నాకు, మల్లయ్యకు, మార్కెట్టుకు...
కొంత ఉపశమనం దొరికినట్టయింది.
* * *
‘నువ్వక్కడ ఉన్నట్లు నాన్నకు
తెలిసింది’
‘అమ్మో పా వస్తున్నా... బాగా
కోపంగా ఉన్నాడా...?... నిన్నే... బాగా కోపంగా ఉన్నాడా..?’
‘ఊఁ...’
చీకటి.. అంతా చీకటి... బయటా లోపలా... ముందు చెల్లెలు చేతిలో
టార్చితో... వెనక.. బాగా వెనకగా ... రోడ్డువారగా
చిమ్మ చీకట్లో.. నక్కినక్కి పోతూ నేను... మా ఇంటికి వెళ్లే సందు మలుపును ఓ 30 మీటర్ల
దూరం నుంచే చూసా... మసక చీకట్లో కూడా ఆ
ఆకారం చిక్కగా కనిపించింది... నాన్న అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ నాన్నలా
కనబడలేదు. ఒక కాగడా మండుతున్నట్లు కనిపిస్తున్నది. అడుగులు ముందుకు పడడం లేదు... తడబడుతున్నాయి... అరిచేతులు అప్రయత్నంగా
ముడుచుకుపోతున్నాయి. నా వేళ్ళను నేనే గట్టిగా పిసికేసుకుంటున్నా... నాకు తెలియకుండానే....
కచ్చితంగా ఆ క్షణంలో ఊహించని ఘటన.... నవగ్రహాలు కూడబలుక్కుని కత్తిని శనీశ్వరుడి చేతికిచ్చి నాముందు ఠపీమని దించాయి.
....
హారన్ కొట్టుకుంటూ ఓ పోలీసు వ్యాను
సింగరాయకొండనుంచి మమ్మల్ని దాటుతూ దూసుకెళ్ళింది... చూస్తుండగానే జంక్షన్ లో దాడి చేయడం, మా మల్లయ్య
డబ్బాతో సహా అన్ని జూదపు దుకాణాలను పీకేసి
వాళ్ళను వ్యాన్ ఎక్కించుకుని అంతే స్పీడుగా మా ముందు నుంచి ... కాదు, కాదు.. మా
నాన్న ముందునుంచి విసురుగా వెళ్లిపోతూ...కాగడా మీద కిరసనాయిలు చల్లి...నో..నో...
కుమ్మరించి పోయింది.
* * *
సముద్రంతో నాకు గాఢానుబంధం. పుట్టి
పెరిగిందంతా.. పదో తరగతి దాకా... అంతా సముద్రపు ఒడ్డునే. ఊహ వచ్చిన తర్వాత... ఊళ్ళపాలెంలో ఎక్కువగా ఆడుకున్నది సముద్రంతోనే.
కాని మొదటిసారి చూస్తున్నా... సముద్రం ఎప్పుడూ కూడా అంత ప్రశాంతంగా కనిపించలేదు, ఒక
మోస్తరు అలలు ఎప్పుడూ ఉండేవే... దాటిపోతున్నా...
చిన్న శబ్దం... వెనక్కి తిరిగి చూసా... తలుపుకు లోపల గడియ పడింది.
తలతిప్పేలోపే ‘జాస్’ (jaws) సినిమలో లాగా ‘షార్క్’ చివ్వున లేచింది. పోతురాజుల
చేతిలో కొరడా కూడా ఎప్పుడూ స్లో మోషన్ లోనే ఆడుతుంటుంది. చివరన టప్పుమన్న శబ్దం
మాత్రమే మన ఒళ్లు మనకు దగ్గరగా చేరుస్తుంది. మా నాన్న చేతిలో బెల్టు మాత్రం చాలా
ఉత్సాహంగా ఊరేగుతున్నది, ఊగిపోతున్నది... లేత ఆకులంటే ఇష్టమేమో... మధ్యలో ఏ కొమ్మకూ తగులుకోకుండా నేరుగా వచ్చి
నన్ను చుట్టేసుకుంటున్నది.
అంతగా పూనకంలో ఉన్న మా నాన్నను పట్టగలిగే
ధైర్యం ఆ దేవుడికి కూడా ఆ క్షణంలో లేకపోయింది. ఇక మా అమ్మ ఎంత !!! గుండె నోట్లోంచి జారి కిందపడకుండా కొంగు అడ్డంగా
కుక్కేసుకుంది. అయినా అది మాత్రం.. సందు
చూసుకుని ముక్కుల నుంచి కరిగి కాల్వలు కడుతున్నది. పర్వతాలు పేలుతున్న శబ్దం... చెవి కాదు, నా శరీరం వింటూనే ఉంది. కానీ నోరు
తెరవలేని, కనురెప్ప ఎత్తి అమ్మ ముఖాన్ని
చూడలేని దైన్యం. కారకుడు మా నాన్న కాదు, నేనే కనుక. నాలో ఆ పేలుళ్ల ప్రకంపనలు... లేత
చర్మం పొరలు పొరలుగా పొంగుతున్నందుకు కాదు,
ఒక్కగా నొక్క కొడుకు (అప్పటికి తమ్ముడు పుట్టలేదు) మీద పెట్టుకున్న ఆమె ఆశలను ఒక్కసారిగా కుప్ప కూల్చివేసినందుకు.
... ... నమ్మకాన్ని నిట్టనిలువుగా చీల్చివేసినందుకు....
మా నాన్న కంటే వయసులో కొద్ది తక్కువే
అయినా బలిష్ఠులయిన ఇద్దరు కాంపౌండర్లకు కాళ్ళుచేతులు చచ్చుబడ్డాయి. శక్తంతా
కూడదీసుకుని ఒకడు ముందుకొచ్చి బెల్టుకు, నాకు అడ్డంగా నిలబడేలోపే ఖాళీగా ఉన్న మా
నాన్న రెండోచేతి విసురుకు వెళ్లి ఒక గోడకు కొట్టుకున్నాడు. రోషం వచ్చిన రెండో
కాంపౌండరు (పిల్లల్ని పిచ్చిగా ప్రేమించేవాడు) లేచి అడ్డంగా వెళ్ళినా.... బెల్టుకు నా వీపుకు రెండు నిమిషాలకు మించి ఎక్కు
వ విరామం ఇవ్వలేకపోయాడు.
తప్పు ఏ స్థాయిలో చేసానో నాకు తెలిసి
వస్తున్నది కనుక.. నా లోపలి నుంచి ప్రతిఘటన లేదు,
మానసికంగా కూడా. శిక్ష పడాల్సిందే...
అన్న మైండ్ సెట్ తోనే ఉన్నా ... అయితే ... అంతటి శిక్షని ఆ కొద్దిపాటి జీవితంలో
రుచి చూడడం అదే మొదటిసారి గనుక శరీరం కొంత ఇబ్బందిపడుతున్నది. అంత గంభీరమైన
సన్నివేశంలో ... ఎక్కడో పాతాళంలోంచి పైకి చేదుకొచ్చిన స్వరంతో నేను మా నాన్నను అర్థించిందొక్కటే –
‘మీ ఫ్లానల్ చొక్కా ఇవ్వండి, వేసుకుంటా’..అని (చలి ప్రదేశాల్లో మా నాన్న మిలిటరీ సర్వీసు నాటి యూనిఫాం
అది...బాగా మందంగా ఉండేది. మా నాన్న లేనప్పడు ఆయనకు తెలియకుండా వేసుకుంటుండే
వాణ్ణి,)
* * *
వాన వెలిసింది. మా అమ్మ కడుపులో
దాచుకునే ప్రయత్నం చేసింది. తడిసి ముద్దయిన చీర నాకు చల్లగా తగులుతున్నా, నాగటి
చాళ్ళలా వీపుమీద తేలిన చారికలు సలుపుతూ
మంటలను రేపుతున్నాయి. వదిలించుకుని దూరంగా ఓ మూలన చుట్టచుట్టుకుని
పడుకున్నా... తినను, తినలేను, తినబోను అని తెలిసి కూడా అమ్మ విఫల ప్రయత్నాలు
చేస్తూనే ఉంది మౌనంగా. తనూ తినదని తెలిసినా, అసలు ఆకలి, అన్నం మీద ధ్యాస పోకముందే...
అంత పెద్ద తప్పు అని తెలియకుండా చేసిన ఒక
మహాపరాధం తాలూకు కుంగుబాటులో ఏ అపరాత్రో మా అమ్మే నిద్రాదేవతగా వచ్చి నన్ను
ఒళ్లోకి తీసుకుంది.
అంతటి నిశిరాత్తిరిలో ... లోయల్లో పడిపోతున్నా... పట్టుకోసం చూడకుండా పల్టీలు కొట్టుకుంటూ
పోతున్న ఆ మైకంలాంటి నిద్రలో..... నెగడులా మండుతున్న నా వీపుమీద....ఓ మంచు స్పర్శ.
మంచు కాదు, భ్రాంతి.... భ్రమ... కాదు... నిజంగా మంచునే ... అంతా అడుగంటి పోయినా .... ఎక్కడో మిగిలిన
కొద్దిపాటి ఓపికను కూడదీసుకుని ఒక కనురెప్ప ఓరగా తెరిచి చూసా... సన్నటి వెలుతురు
కిరణం ఒకటి... ఇంకిన నా కంటితడిలో కరిగి ఇంద్రధనుస్సులా
రంగులు చిమ్ముతుంటే... లీలగా ఓ చిత్రం..... లాంతరు పట్టుకుని అమ్మ నిలబడి ఉంది...
ఏదో లేపనం తమలపాకుమీద వేసి అద్దుతూ మా నాన్న....
(25 వేల పై చిలుకు పగళ్ళు, 25 వేల
పైచిలుకు రాత్రుళ్ళలో అదే తొలి జూదం, అదే
ఆఖరుది కూడా...)
సాక్షి - ఫన్‌డే (31.10.21)
................